సినిమాహాళ్లలో జాతీయగీతాలాపనను సవాల్ చేసిన సినీ ప్రేమికులు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ఇండియా ప్రతినిధి
గతవారం కేరళలోని ఓ షాపింగ్ సెంటర్‌పైన ఉన్న చిన్న థియేటర్‌లో, రొమేనియాలో కమ్యూనిస్ట్ పాలన చివరి రోజులపై 2007లో నిర్మించిన '4 నెలలు, 3 వారాలు, 2 రోజులు' అనే సినిమాను చూసేందుకు సుమారు 200 మంది గుమికూడారు.
"మా చాలా సినిమాలకు వచ్చినట్లుగానే, ఈ సినిమాకూ మంచి ప్రతిస్పందన వచ్చింది" అని కొడుంగళ్లూర్ ఫిల్మ్ సొసైటీకి చెందిన అనూప్ కుమరన్ అన్నారు. ఆ క్లబ్ కేరళలో ఉన్న 60 సినిమా క్లబ్బుల్లో ఒకటని ఆయన చెప్పారు.
భారత్‌లో మొదటి మసీదు కలిగిన చారిత్రక పట్టణంగా పేరున్న కొడుంగళ్లూర్‌లో గత ఆరేళ్లుగా ప్రతి శుక్రవారం సాయంత్రం సినీ ప్రేమికుల కోసం రూఫ్‌టాప్‌పై సినిమాలను ప్రదర్శిస్తున్నారు.
ఇక్కడ సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల్లో - విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, రచయితలు, న్యాయవాదులు, ఇంజినీర్లు, రోజువారీ వేతన కార్మికులు - ఇలా భిన్నరకాల ప్రజలుంటారు. వారిలో ఎక్కువ మంది ఈ సినిమా క్లబ్‌లో సభ్యత్వం తీసుకున్నవారే. ఇది 47 ఏళ్ల నుంచి కొనసాగుతున్న క్లబ్.
ఈ సినిమా ప్రదర్శనకు ప్రవేశం ఉచితమే కానీ సీట్ కావాలంటే మాత్రం కాస్త త్వరగా రావాలి. ఇక్కడ భారతీయ, అంతర్జాతీయ సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ సినిమా క్లబ్ ఒక్కో ప్రదర్శనకు రూ.500 అద్దె చెల్లిస్తుంది.
ఇక్కడ హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు ప్రదర్శించరు. ఈ క్లబ్ ఏటా ఫిలిం ఫెస్టివల్, స్థానిక ఔత్సాహికుల కోసం కోర్సులు, థియేటర్ ప్రదర్శనలు, పలు పోటీలు నిర్వహిస్తుంది.
ఏటా ఎవరైనా ఒక స్థానిక మలయాళ 'లెజెండ్'కు దాదాపు రూ.25,000 నగదు బహుమతి కూడా అందిస్తుంది.
అయితే ప్రస్తుతం కొడుంగళ్లూర్ ఫిల్మ్ సొసైటీ వేరే కారణంతో వార్తల్లోకెక్కింది. ఈ చిన్న పట్టణానికి చెందిన సినిమా ప్రేమికులు సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడాలనే సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేశారు.
మా ఇతర కథనాలు:

ఫొటో సోర్స్, Getty Images

భారతీయులు తమ దేశభక్తిని చాటుకోవాలంటూ డిమాండ్లు వస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న హిందూ జాతీయవాద బీజేపీ దీనిపై హర్షం వ్యక్తం చేసింది.
కొన్నిచోట్ల ఈ తీర్పు ఫలితంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
గోవాలోని ఓ సినిమా థియేటర్‌లో వీల్ చైర్‌లో కూర్చున్న ఓ వికలాంగుడు జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడలేదనే కారణంతో అతనిపై దాడి చేశారు. అదే కారణంతో ఎంతోమందిని అరెస్టు కూడా చేశారు.
దీన్నే అవకాశంగా తీసుకొని దేశవ్యాప్తంగా మితవాద మూకలు సినిమా చూసేందుకు వచ్చిన వారిపై దాడి చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Faris EM
ఇదే సమయంలో కొడుంగళ్లూర్ ఫిల్మ్ సొసైటీ కి చెందిన కొందరు సభ్యులు కేరళ రాజధాని త్రివేండ్రంలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లారు.
"ఫిలిం ఫెస్టివల్‌లో రోజూ అరడజను సినిమాలు ప్రదర్శించేవారు. సినిమా ముందు జాతీయ గీతం వచ్చినపుడంతా అందరూ నిలబడాల్సి వచ్చేది. ఇది కూడా హాస్యాస్పదంగా అనిపించింది" అని పీవీ దినేష్ తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఆ ఆదేశాలను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
ఆ వివాదాస్పద ఆదేశాలను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌లో జాతీయ గీతం వచ్చే సందర్భంలో బలవంతంగా నిలబడమని చెప్పడం 'ప్రాథమిక హక్కుల ఉల్లంఘన' అని పేర్కొన్నారు. నిజమైన గౌరవ భావానికి, దానిని ప్రదర్శించడానికి మధ్య తేడా ఉంటుందని తెలిపారు.
'జాతీయ గీతాలాపనకు తగిన గంభీరమైన వాతావరణం సినిమా హాళ్లలో ఉండదు' అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
"ప్రేక్షకులు అనేక కారణాలతో సినిమా హాళ్లకు వెళతారు. అందులో ముఖ్యమైన కారణం వినోదం. సినిమాలో చూపించే కథాంశాలు ఒక్కోసారి జాతీయ గౌరవ భావాలకు భిన్నంగా కూడా ఉంటాయి" అని పిటిషన్‌లో తెలిపారు.

ఫొటో సోర్స్, BS PRASANNAN
సోమవారం సుప్రీంకోర్టు ఈ 'జాతీయ గీతం' పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
ఏదో ఓ రోజు - రైల్వే వెయిటింగ్ రూములలో, విమానాశ్రయాలలో ఉండే టీవీల్లో జాతీయగీతం ప్రదర్శిస్తే, అక్కడుండే వందలాది మంది లేచి నిలబడాల్సి వస్తుందని విచారణ సమయంలో ఓ న్యాయవాది సరదాగా వ్యాఖ్యానించారు.
సినిమా ప్రేమికులతో అంగీకరించిన జస్టిస్ చంద్రచూడ్, ''రానున్న రోజుల్లో జాతీయగీతాన్ని అగౌరవపరిచేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు థియేటర్లకు టీ షర్టులు, నిక్కర్లు వేసుకురాకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేయాలన్న డిమాండ్ రావచ్చు'' అని వ్యాఖ్యానించారు.
''మోరల్ పోలీసింగ్‌కు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుంది? జాతీయగీతాలాపన సమయంలో లేచి నిలబడకుంటే దేశభక్తి లేదని ఎందుకు అనుకోవాలి?''అని ఆయన ప్రశ్నించారు.
చాలా మంది భారతీయులు అదే ప్రశ్నను అడుగుతున్నారు.
గత ఏడాది తీర్పుతో ప్రభావితం కాకుండా, జాతీయ గీతానికి సంబంధించి నిబంధనల సవరణ అంశాన్ని పరిశీలించాలంటూ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్రాన్ని ఆదేశించారు.
తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 9న జరగనుంది.
''అప్పటిలోగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఏవైనా నిబంధనలు రూపొందిస్తుందో, లేదో చూడాలి" అని దిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్ భాటియా అన్నారు.
మళ్లీ కొడుంగళ్లూర్‌కే వస్తే... సినిమా ప్రేమికులు మరో రూఫ్‌టాప్ సినిమా షో కోసం ఎదురుచూస్తున్నారు. ఈ శుక్రవారం 2013లో విడుదలైన 'వాజిదా' సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా కథ సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉండే ఓ యువతికి చెందింది. ఈ సినిమాను పూర్తిగా సౌదీ అరేబియాలోనే చిత్రీకరించారు.
'ఈ సినిమా హౌస్ ఫుల్ అవుతుందనుకుంటున్నాం' అని కుమరన్ అన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








