టైటానిక్: 25 ఏళ్లు గడచినా హీరో జాక్ మరణంపై ఆగని చర్చ

ఫొటో సోర్స్, Wikipedia
టైటానిక్.. ఒక భయంకరమైన ఓడ ప్రమాదం మధ్యలో ఓ యువ ప్రేమ కథను హృద్యంగా చిత్రించిన సినిమా. ఈ విషాదాంత సినిమాలో తన ప్రియురాలిని రక్షించడం కోసం ప్రియుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఆ ప్రియురాలు చివరి దాకా ఆయన ప్రేమలోనే మునిగితేలుతూ జీవితం గడిపేస్తుంది.
ఈ సినిమా ఆర్ఎంఎస్ టైటానిక్ అనే పేరున్న ఓ పెద్ద ఓడకు సంబంధించిన కథ. ఇంగ్లాండ్ లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు తన మొదటి యాత్రపై బయలుదేరిన ఈ నౌక 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ భారీ మంచు శకలంతో ఢీకొని మునిగిపోతుంది.
ఈ ప్రమాదంలో 1500కి పైగా స్త్రీలు, పురుషులు, పిల్లలు మృతి చెందారు. టైటానిక్ మునిగిపోవడానికి ముందు కొద్ది గంటల్లో ఏమేం జరిగిందన్న విషయంపై అనేక అపోహలు, కథలు నేటికీ ప్రచారంలో ఉన్నాయి. అయితే 1997లో జేమ్స్ కేమరాన్ దీనిపై తీసిన 'టైటానిక్' సినిమా చాలా బాగా నడిచింది.
ఆస్కార్ సహా అనేక అవార్డులు గెల్చుకున్న ఈ సినిమా విడుదలై ఇప్పటికి రెండు దశాబ్దాలు దాటిపోయాయి.
తాజాగా అట్లాంటిక్ మహా సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ షిప్ శకలాలను చూడడానికి ఓ జలాంతర్గామిలో వెళ్లిన బృందం గల్లంతవడంతో ‘టైటానిక్’ షిప్ మరోసారి చర్చలోకి వచ్చింది.. దాంతో పాటు టైటానిక్ సినిమా కూడా చర్చలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సినిమాలో ఏం జరిగింది?
ఈ సినిమా నిర్మాణానికి చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు చేశారు. అలాగే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కూడా చాలా ఎక్కువే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషయంపై చాలా మందికి విభేదాలున్నాయి. సినిమా చివరలో హీరో జాక్ తన ప్రాణాలర్పించి హీరోయిన్ రోజ్‌ను రక్షించడం కొందరికి మింగుడు పడలేదు.
ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓడ మునిగిపోయాక అనుకోకుండా జాక్, రోజ్‌లకు ఒక బల్లచెక్క లభిస్తుంది. ఇద్దరూ దానిపై కూర్చొని తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే సముద్రంలో మంచునీటిలో ఎక్కువ సేపు ఉండడం చాలా ప్రమాదకరం.
కానీ ఇద్దరూ దానిపైకి ఎక్కితే అది మునిగిపోతుంది. ఆ బల్ల పెద్దదిగా, ఇద్దరు ఎక్కడానికి అనువుగానే ఉంటుంది. కానీ అది ఇద్దరి బరువును ఆపలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే చాలా ఏళ్లుగా అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్నేమిటంటే రోజ్‌తో పాటు జాక్ కూడా నిజంగానే ప్రాణాలతో బయటపడలేకపోయేవాడా? నిజంగానే ఆ చెక్కబల్ల (తలుపు) ఇద్దరి ప్రాణాల్ని కాపాడేందుకు అనువుగా లేదా?
ఈ సినిమాను నిర్మించిన జేమ్స్ కేమెరాన్ ఈ ప్రశ్నను ఎన్నో సార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దానికి సమాధానం ఇప్పుడు వెల్లడైంది.
'వానిటీ ఫేర్' అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా జేమ్స్‌ను 'టైటానిక్'లో జాక్ కోసం రోజ్ ఆ చెక్క బల్లపై కాస్తంత స్థలం ఎందుకు ఇవ్వలేకపోయిందని అడిగారు.

ఫొటో సోర్స్, Getty Images
జాక్‌ను ఎందుకు కాపాడలేదు?
ఈ ప్రశ్నకు ఆయన చాలా నింపాదిగా జవాబిచ్చారు. "దీనికి సూటిగా జవాబు చెప్పాలంటే.. స్క్రిప్ట్‌లో 147వ పేజీలో జాక్ చనిపోతాడు అని ముందే రాసేశాం. ఇది కళా దృష్టితో తీసుకున్న నిర్ణయం" అని కేమెరాన్ చెప్పారు.
"ఆ తలుపు ఒక్క రోజ్ బరువును మాత్రమే ఆపేంత పెద్దది. ఇద్దరి బరువును ఆపలేదు. 20 ఏళ్ల తర్వాత కూడా ఇదే విషయంపై చర్చించుకోవడం నాకు చిన్నపిల్లల పోట్లాటలా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా చాలా ప్రభావితం చేసిందనడానికీ, జనాలకు జాక్ ఎంతగా నచ్చేశాడంటే అతని మరణాన్ని తట్టుకోలేకపోయారనడానికీ ఇది నిదర్శనం" అని కేమెరాన్ చెప్పారు.
సముద్రగర్భంలో అందమైన రహస్యం
కేమెరాన్ తన జవాబును ఇలా కొనసాగించారు: "ఒకవేళ జాక్ ప్రాణాలతో మిగిలిపోతే ఈ సినిమా అర్థరహితంగా తయారయ్యేది.. ఈ సినిమా మరణానికీ, వియోగానికీ సంబంధించినది.
కాబట్టి జాక్ చనిపోవాల్సిందే. ఈ సినిమాలో చూపినట్టయినా చనిపోవాలి లేదంటే ఓడ శకలం ఏదైనా అతని మీద పడడం వల్లనైనా అతడు మరణించాలి. దీనికే కళ అని పేరు.
కొన్ని అంశాల్ని కళా దృష్టితో మాత్రమే రాస్తుంటాం. భౌతిక కారణాల వల్ల కాదు."

ఫొటో సోర్స్, ALDRICH AND SON PA
'ఫిజిక్స్ కాదు, కళనే కారణం'
జేమ్స్ కేమరాన్‌ను అడిగిన తదుపరి ప్రశ్న - సాధారణంగా మీరు భౌతికశాస్త్రపరమైన అంశాల విషయంలో చాలా కచ్చితంగా ఉంటారని చెబుతారు కదా...
దీనికి ఆయన ఈ విధంగా జవాబిచ్చారు, "నిజమే, ఉంటాను. అందుకే దాదాపు రెండు రోజుల పాటు నేను ఆ నీళ్లలో ఆ చెక్క బల్లపై చాలా మందిని కూర్చోబెడుతూ అనేక ట్రయల్స్ వేశాను. అలా దానిని కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే మోసేంతగా, రోజ్ కూర్చోవడానికి అనువుగా ఉండేలా చేశాను. ఆ చల్లటి నీటిలో రోజ్ మరో మూడు గంటల కూర్చోవాలి. అదే సమయంలో అది మునిగిపోవద్దు."
"మరో గంట తర్వాత తనను రక్షించడానికి లైఫ్ బోట్ వస్తుందనే విషయం జాక్‌కు తెలియదు. అతడు చనిపోతాడు. ఈ సినిమాలో మీరు చూసిన ముగింపు ఇదే. అయితే ఈ కథలో ఒక్కరే ప్రాణాలతో బయటపడాలనే విషయంలో మాత్రం నేను అప్పుడూ ఇదే నమ్మాను. ఇప్పటికీ అదే నమ్ముతున్నాను" అని కేమరాన్ అన్నారు.
మా ఇతర కథనాలు:
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఆంధ్ర మెడికల్ కాలేజీ-కి వందేళ్లు- వైద్యరంగంలో కాకలు తీరిన డాక్టర్లు చదివింది విశాఖపట్నంలోని ఈ కాలేజ్-లోనే
- అమెరికాలో యోగా ఎందుకంత పాపులర్ అయింది- అమెరికా ప్రెసిడెంట్లు, పాప్-స్టార్లు కూడా యోగాకు ఎలా ఆకర్షితులయ్యారు
- కోతి పిల్లలను చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీసి అమ్ముకుంటున్నారు.. బీబీసీ ఇన్వెస్టిగేషన్-లో బయపడిన దారుణమైన ఇంటర్నేషనల్ బిజినె
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








