అమెరికాలో యోగా ఎందుకంత పాపులర్ అయింది? అమెరికా ప్రెసిడెంట్లు, పాప్‌స్టార్లు కూడా యోగాకు ఎలా ఆకర్షితులయ్యారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యశ్వంత్ రాజ్
- హోదా, వాషింగ్టన్, బీబీసీ న్యూస్
అది శుక్రవారం రాత్రి. రెండు రోజుల వీకెండ్‌కు ఆరంభం. మసక వెలుతురు ఉన్న ఒక గదిలో డయాన కాంగ్ నిల్చున్నారు. ఆ గదిలో గోడలకు అద్దాలు అమర్చి ఉన్నాయి.
అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న తన హాట్ యోగా స్టూడియోలో ఆ రోజుకు అదే చివరి క్లాస్.
ఆమె వద్ద శిక్షణ పొందుతున్న వారిలో స్టీవ్ ఎక్స్ ఒకరు. ఆయన మాజీ ప్రొఫెషనల్ ఫైటర్. రిసెప్షన్‌లోని బెంచ్‌పై కూర్చొని ఆయన శరీరానికి పట్టిన చెమటను తుడుచుకుంటున్నారు. ఆయన చెమటతో నిండిపోయారు. కానీ, సంతోషంగా కనిపించారు.
క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి తనకు ఇలాంటి సెషన్లు చాలా ముఖ్యమని స్టీవ్ ఎక్స్ అన్నారు. ఇది మీకు పనికొస్తుందా? అని అడిగితే, ‘‘నేను ఈ హాట్ యోగాను వరంలా భావిస్తున్నా’’ అని ఆయన చెప్పారు.
యోగాలోని ఇతర రకాలను కూడా స్టీవ్ ఎక్స్ ప్రయత్నించారు. కానీ, హాట్ యోగా తనకు అత్యుత్తమమైనదని ఆయన గుర్తించారు.
వాషింగ్టన్ డీసీ శివారులో సందడిగా ఉండే ప్రాంతంలో కాంగ్‌కు చెందిన విక్రమ్ హాట్ యోగా స్టూడియోను ఒకప్పుడు కోల్‌కతాకు చెందిన విక్రమ్ చౌధురి ఏర్పాటు చేశారు.
మూడు ఖండాలకు ఆయన ఈ యోగాను వ్యాప్తి చేశారు. మడోనా, లేడీ గాగా వంటి వారు తన క్లయింట్‌లుగా ఆయన పేర్కొన్నారు.
వీరితో పాటు అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్‌లకు కూడా యోగా పాఠాలు చెప్పినట్లు ఆయన చెప్పుకున్నారు.
2017లో ఆయన అమెరికా నుంచి పారిపోయారు. నెట్‌ఫ్లిక్స్ ఆయనపై 2019లో ‘‘బిక్రమ్: యోగి, గురు, ప్రిడేటర్’’ పేరిట ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

ఫొటో సోర్స్, Yashwant Raj/ Bikram Hot Yoga studio
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ‘యోగా డే’ను సందర్భంగా కాంగ్ ఒకరోజు అందరికీ ఉచితంగా యోగా పాఠాలను చెప్పనున్నారు.
యోగాను 130 ఏళ్ల క్రితం అమెరికన్లకు భారతీయుడు, హిందూ సన్యాసి అయిన స్వామి వివేకానంద పరిచయం చేశారని నమ్ముతారు.
1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన స్వామి వివేకానంద ఆ సమావేశంలో ‘‘ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా’’ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
కానీ, ఆయన పరిచయం చేసిన యోగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆచరణలో ఉన్న యోగాకు భిన్నమైనది.
‘‘ఇప్పుడు అందరికీ తెలిసిన చాలా రకాల యోగా ప్రక్రియల కంటే అది చాలా భిన్నమైనది’’ అని యోగా నిపుణుడు ఫిలిప్ డెస్లిపి ఒక ఆర్టికల్‌లో రాశారు.
వివేకానంద యోగాను ఒక తత్వం, మానసిక శాస్త్రం, స్వీయ పురోగతికి సంబంధించినదిగా మాట్లాడారని ఫిలిప్ తన ఆర్టికల్‌లో పేర్కొన్నారు.
1920-30ల నాటి తొలి యోగ గురువులు ఒక మాయలాంటి, రహస్యమైన యోగ ప్రక్రియను బోధించారు. ఈ ప్రక్రియ ఏ శాస్త్రీయ సంప్రదాయంలోనూ ఇమడదు.
ఈ గురువుల్లో చాలామంది అమెరికాలోని ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నావారే. కానీ, పరిస్థితుల రీత్యా వారు బలవంతంగా యోగాను ఎంచుకోవాల్సి వచ్చింది.
1923 నాటి సుప్రీం కోర్టు ఒక తీర్పులో తెల్లజాతీయులు కానీ వారెవరూ అమెరికా పౌరసత్వానికి అర్హులు కాబోరని చెప్పడంతో కొంతమందికి ఇది పౌరసత్వానికి సంబంధించినదిగా మారింది.
అలాంటి వారిలో యోగి హరి రామ్ కూడా ఒకరు. 1910లో ఆయన పంజాబ్ నుంచి అమెరికాకు వచ్చారు. ఆయన అసలు పేరు మోహన్ సింగ్. అత్యంత ధైర్య సాహసాలు గల పైలట్ ఆయన.
కానీ, అమెరికా పౌరసత్వాన్ని కోల్పోవడం, పెట్టుబడుల్లో డబ్బు పోగొట్టుకున్న తర్వాత ఆయన సన్యాసిగా మారారు. యోగాను నేర్చుకొని దేశవ్యాప్తంగా పర్యటించడం మొదలుపెట్టారు. పర్యటనల్లో ‘‘సూపర్ యోగా సైన్స్’’ను బోధించడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Yashwant Raj/ Bikram Hot Yoga studio
హఠ యోగా పునరుజ్జీవం తర్వాత అమెరికాలో పరిస్థితులు మారడం మొదలైందని ఫిలిప్ అన్నారు.
భారత్‌లో స్వామి కువలయానంద వంటి సంస్కరణకర్తల సారథ్యంలో యోగా అనేది మాయ, ఇంద్రజాల ప్రక్రియలను మించిపోయి శాస్త్రీయతను సంతరించుకుంది.
హఠ యోగా అనే ప్రక్రియ శ్వాస, శరీర భంగిమలపై దృష్టి సారిస్తుంది.
‘‘ప్రస్తుతం ఆచరణలో ఉన్న యోగాకు హఠ యోగా అనేది ఆధారంగా మారింది’’ అని ఫిలిప్ అన్నారు.
తొలి తరం యోగా టీచర్లను ప్రస్తుత టీచర్లు భర్తీ చేస్తున్నారు. శరీర భంగిమలు, వ్యాయామాల్లో వీరు మరింత శాస్త్రీయతను, తార్కికతను చొప్పిస్తున్నారు.
1930ల చివర్లో అమెరికాలో తీవ్ర మార్పు వచ్చింది.
ఈ రోజు యోగా అనేది ఒక గ్లోబల్ ట్రెండ్‌గా మారింది. ‘‘సెలెబ్రిటీలే యోగా టీచర్లుగా మారి దీనికి ప్రచారం కల్పిస్తున్నారు. టీవీల్లో అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తున్నాయి. టీవీల్లో యోగాను బోధించేవారు కూడా ఉన్నారు. యోగా పుస్తకాలను కూడా ముద్రిస్తున్నారు. ఇవన్నీ యోగా స్థాయిని పెంచాయి’’ అని ఫిలిప్ అన్నారు.
యోగాలో ఉండే వివిధ ప్రక్రియలు కూడా దీన్ని ప్రాముఖ్యాన్ని పెంచాయి. భారత్‌లోని ముగ్గురు వ్యక్తులు మూడు యోగా శైలులకు ప్రాచుర్యాన్ని కల్పించారు.
యోగాలోని పురాతన ప్రక్రియ అయిన అష్టాంగ యోగను కె. పట్టాభి జోయిస్, అయ్యంగార్ యోగాను బీకేఎస్ అయ్యంగార్, విక్రమ్ చౌధురీలు యోగాకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించారు.
పట్టాభి జోయిస్, అయ్యంగార్‌లు ఇద్దరూ భారత్‌నే తమ యోగా స్థావరంగా చేసుకున్నారు. కానీ, తరచుగా అమెరికాలో పర్యటిస్తూ యోగా పాఠాలు, బోధనలు చేసేవారు. అక్కడ కూడా యోగా సెంటర్లను స్థాపించారు.
కానీ, విక్రమ్ చౌధురీ అమెరికానే తన యోగా స్థావరంగా మార్చుకున్నారు. 1990లలో విక్రమ్ యోగాకు ఆయనే ముఖచిత్రంగా మారిపోయారు.

ఫొటో సోర్స్, Yashwant Raj/ Bikram Hot Yoga studio
ఇతర అమెరికన్ ఆవిష్కరణలు దీన్ని అనుసరించాయి. ‘అనుసర’ అనే యోగా శైలి మానవుల్లో మంచితనాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినది.
బ్రోగా అనేది పురుషులకు సంబంధించిన యోగా.
బీర్ యోగా అనేది బ్రూవరీస్, ట్యాప్‌రూమ్స్‌లలో నిర్వహిస్తారు.
భారీ మ్యూజిక్ మధ్య హెవీ మెటల్ యోగా, యోగాలోని అత్యంత శక్తిమంతమైన ‘పవర్ యోగా’, మేకల మధ్య సరదాగా చేసే ‘గోట్ యోగా’లు కూడా వచ్చాయి.
2016 నాటి యోగా అలియన్స్ అండ్ యోగా జర్నల్ సర్వే ప్రకారం, అమెరికాలో 3.60 కోట్ల మంది యోగాను చేస్తారు. అందుబాటులో ఉన్న అత్యంత తాజా గణాంకాలు ఇవే.
యోగా తరగతులు, యోగా చేసే సమయంలో ధరించే దుస్తులు, యోగా మ్యాట్లు, మోకాలికి ధరించే ప్యాడ్ల కోసం అమెరికన్లు రూ. 13,13,088 కోట్లు ఖర్చు చేశారు.
అమెరికన్లు యోగాను ప్రారంభించడానికి అగ్రస్థానంలో నిలిచిన అయిదు కారణాలను కూడా ఈ సర్వే తెలిపింది.
శరీరాన్ని సౌకర్యంగా మార్చుకోవడం కోసం 61 శాతం మంది, ఒత్తిడి ఉపశమనానికి 56 శాతం మంది, సాధారణ ఫిట్‌నెస్ కోసం 49 శాతం మంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం 49 శాతం మంది, శారీరక దృఢత్వం కోసం 44 శాతం మంది యోగాను ఎంచుకున్నట్లు సర్వేలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
సుసాన్ న్యూబార్ అనే మహిళ మేరీల్యాండ్‌లో ఒక యోగా కేంద్రాన్ని నడుపుతున్నారు.
‘‘శస్త్రచికిత్స లేకుండా మందులు వాడకుండా వెన్ను నొప్పి, హెర్నియాలను తగ్గించుకోవడంలో యోగా నాకు ఉపయోగపడింది’’ అని సుసాన్ చెప్పారు.
యోగాను తరచుగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
‘‘యోగాను తరచుగా చేసేవారు శారీరకంగా, ఉద్వేగపరంగా మరింత దృఢంగా మారతారు’’ అని సుసాన్ చెప్పారు.
భారత్‌లో ఆచరించే యోగా గురించి తెలుసుకోవడానికి, పరిశీలించడానికి ఆమె భారత్ వచ్చారు. భారత్‌లో చేసే యోగా చాలా భిన్నంగా ఉందంటూ ఆమె ఆశ్చర్యపోయారు.
‘‘నేను పెద్ద ఆశ్రమాలకు వెళ్లి చూడలేదు. ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటా’’ అని ఆమె చెప్పారు.
అమెరికాలో ఆచరించే యోగా, అమెరికన్ సంస్కృతిని ఆపాదించుకుందని కొంతమంది వాదించారు. ఉదాహరణకు పిజ్జా రూపాంతరం చెందినట్లు. అమెరికాకు పిజ్జా బయట నుంచి అంటే ఇటలీ నుంచి వచ్చింది. ఇటలీలో పిజ్జా అంటే ఒక బ్రెడ్‌మీద కొన్ని రకాల ఆహారపదార్థాలను పేర్చుతారు. ఇటలీ వలసదారులు పిజ్జాను అమెరికాకు పరిచయం చేశారు. అమెరికా తనదైన రీతిలో పిజ్జాలో మార్పు చేర్పులుచేసింది. ఇప్పుడు ప్రపంచం అంతటికీ ఈ పిజ్జా గురించే తెలుసు. పిజ్జాలో అనేక రకాలు ఉన్నట్లే యోగాలో కూడా అనేక రకాలు ఉన్నాయి.
‘‘నేటి యోగా చాలా ఆధునికమైనది, అంతర్జాతీయమైనది. దీనిలో నిరంతరం మార్పులు వస్తున్నాయి. దీనికి మెరుగులు దిద్దుతున్నారు’’ అని ఫిలిప్ అన్నారు.
యోగా వ్యాపారం అభివృద్ధి చెందుతున్నందున, ఇది వాణిజ్య ప్రయోజకంగా మారడం పట్ల యోగా బోధకులు ఆందోళన చెందుతున్నారు.
యోగాలో తగిన శిక్షణ లేని వారు బోధకులుగా, ప్రమోటర్లుగా మారుతున్నారంటూ వారు చెబుతున్నారు.
‘‘కరోనా వచ్చినప్పటి నుంచి యోగా బోధనా వృత్తి ఎలా చౌకగా మారిందో చూడటం చాలా బాధగా ఉంది’’ అని సుసాన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఫ్రాన్స్: తప్పుడు ప్రకటనలతో ఫాలోయర్లను నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, ఎలా అడ్డుకట్ట వేశారంటే....
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














