ధీరేంద్ర బ్రహ్మచారి: ఇందిరా గాంధీ గదిలోకి ఒంటరిగా వెళ్ళగలిగిన ఏకైక బ్రహ్మచారి ఆయనే, ఆమెకు ఎలా దగ్గరయ్యారంటే....

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, DHIRENDRA MEMORIAL FOUNDATION

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో శక్తిమంతమైన ప్రధానుల్లో ఒకరైన ఇందిరా గాంధీకి యోగా గురువుగా ధీరేంద్ర బ్రహ్మచారి పనిచేశారు. ఆయన్ను కలవటానికి కేంద్ర మంత్రులు, ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు లైనులో నిలబడుతుండేవారు.

ఆయన నీలి రంగు టొయోటా కారుని నడిపేవారు. ఆయన దగ్గర ప్రైవేటు విమానాలు కూడా ఉండేవి. అందులో నాలుగు సీట్ల సేసానా విమానంతోపాటు పంతొమ్మిది సీట్ల డార్నియర్ విమానం, మాల్-5 విమానం కూడా ఉండేవి. వీటిని ధీరేంద్ర స్వయంగా నడిపేవారు.

ఆయన రాజకీయ పలుకుబడి ఎంతగా ఉండేది అంటే.. ఏ అధికారి మీదైనా కోపం వస్తే వాళ్ళని తక్షణం బదిలీ చేయించేయగలిగేవారు, అదే మంత్రులైతే వాళ్ళ శాఖలే మార్పించేయగలిగేవారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, DHIRENDRA MEMORIAL FOUNDATION

భారత మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ తన ఆత్మకథ ‘మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రీషన్: ఏన్ ఆటోబయోగ్రఫీ’ లో ధీరేంద్ర బ్రహ్మచారి గురించి విస్తృతంగా రాసారు.

“నేను కేంద్ర గృహ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోల్ తపాలా కార్యాలయం దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని తన ఆశ్రమం పేరు మీదకి బదిలీ చెయ్యమని నా మీద ఒత్తిడి చేశారు. అయితే ఖరీదైన ప్రభుత్వ భూమిని ఆయనకి ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి నేను ఆ భూమికి సంబంధించిన ఫైలును ముందుకు కదలనివ్వలేదు. చివరికి ఒక రోజు సాయంత్రం ఆయన సహనం కోల్పోయి ఆ పని కనుక నేను చేసిపెట్టకపోతే నన్ను డిమోట్ చేపిస్తాను అని బెదిరించారు”అని గుజ్రాల్ తన ఆత్మకథలో రాశారు

ఒక వారం తరువాత మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు గృహ శాఖ మంత్రిగా ఇందర్ కుమార్ గుజ్రాల్ స్థానంలో ఉమాశంకర్ దీక్షిత్ వచ్చారు.

“ఆ యోగా గురువు నన్ను ఏ విధంగా బెదిరించారు అనేది మరుసటి రోజు ఇందిరా గాంధీకి పూర్తిగా వివరించాను. ఆమె మౌనంగా ఉండిపోయారు. అలాగే నాకు ఎటువంటి జవాబు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఉమాశంకర్ దీక్షిత్ కూడా ఆ భూమిని ధీరేంద్ర బ్రహ్మచారికి ఇవ్వటానికి నిరాకరించారు. దీని ఫలితం కొద్ది రోజుల తరువాత ఉమాశంకర్ దీక్షిత్ కూడా తన శాఖని కోల్పోయారు. మా స్థానంలో ధీరేంద్ర మాట వినే మంత్రి చేరారు”అని గుజ్రాల్ తన ఆత్మకథలో రాశారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, HAY HOUSE

యోగాను మించిన పాత్ర

1963లో తన యోగా కేంద్రానికి ఇస్తున్న గ్రాంట్‌ని కొనసాగించమని నాటి కేంద్ర విద్యా శాఖ మంత్రి కె.ఎల్. శ్రీమాలిని కోరారు. అయితే దానికి బదులుగా శ్రీమాలి గత సంవత్సరం ఆ యోగా కేంద్రానికి ఇచ్చిన గ్రాంట్ ఆడిట్ నివేదిక అడిగారు. ఇందిరా గాంధీ ఈ విషయాన్ని నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దృష్టికి తీసుకువచ్చారు.

నెహ్రు కూడా శ్రీమాలితో మాట్లాడారు. అయితే శ్రీమాలి ఆ గ్రాంట్‌ని కొనసాగించడానికి ఒప్పుకోలేదు. ఆగస్ట్, 1963లో శ్రీమాలి కామరాజ్ ప్రణాళికలో భాగంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన్ని కావాలని మంత్రి పదవి నుంచి తొలగించారు అనేది కొంత మంది అభిప్రాయం.

భూమి ఇప్పించటానికి నిరాకరించడంతో తన తండ్రి టి.కె. సింగ్‌ను పదవి నుంచి తొలగించానని ధీరేంద్ర అందరి దగ్గరా ప్రగల్భాలు పలుకుతుండేవారని టి.కె. సింగ్ కొడుకు, ఫైనాన్స్ కమిషన్ మాజీ అధ్యక్షుడు ఎన్.కె. సింగ్ ఒకసారి వెల్లడించారు.

అప్పట్లో టి.కె. సింగ్ కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు ఎన్.కె. సింగ్ కూడా పలు ఉన్నత పదవులలో పనిచేశారు.

ధీరేంద్ర బ్రహ్మచారి ఫిబ్రవరి 12, 1924 నాడు బిహార్‌లోని మధుబని జిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు ధీరేంద్ర చౌధరీ. పదమూడు సంవత్సరాల వయసులో ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. లఖ్‌నవూకు సమీపంలోని గోపాల ఖేడాలో మహర్షి కార్తికేయ దగ్గర యోగా నేర్చుకున్నారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, DHIRENDRA MEMORIAL FOUNDATION

నెహ్రూ, ఇందిరా ఇద్దరికీ యోగా నేర్పించారు

ధీరేంద్ర 1958లో దిల్లీకి వచ్చారు. ఇందిరా గాంధీతో ధీరేంద్ర తొలి పరిచయం కశ్మీర్‌లో జరిగిందని ఇండియా టుడే పత్రికకి యశ్ పాల్ కపూర్ తెలిపారు.

“ధీరేంద్ర బ్రహ్మచారి మొదట నెహ్రూకి యోగా నేర్పటం మొదలుపెట్టారు. కొద్ది రోజులలోనే లాల్ బహదూర్ శాస్త్రి, జయ ప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లాంటి రాజకీయ నాయకులు ఆయనికి శిష్యులు అయిపోయారు. 1959లో ధీరేంద్ర విశ్వయతన్ యోగా కేంద్రాన్ని స్థాపించారు. దానిని స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు” అని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర పుస్తకంలో కేథరీన్ ఫ్రాంక్ రాశారు.

కేథరీన్ ఫ్రాంక్ పుస్తకం ప్రకారం ధీరేంద్రకి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నుంచి భారీ మొత్తంలో గ్రాంట్ లభించేది. జంతర్ మంతర్ రోడ్డులో ఒక ప్రభుత్వ భవనాన్ని కూడా ఆయనకి కేటాయించారు.

“17 ఏప్రిల్ 1958 నాడు ఇందిరా రాసిన ఉత్తరంలో తను యోగాని సీరియస్‌గా తీసుకోవటం ప్రారభించానని, చాలా అందమైన ఒక యోగి తనకి యోగా నేర్పుతున్నారు అని రాశారు” అని ఇందిరా గాంధీకి చాలా దగ్గరి స్నేహితురాలైన డొరోతీ నార్మన్ తన ‘ఇందిరా గాంధీ: లెటర్స్ టు యాన్ అమెరికన్ ఫ్రెండ్’ అనే పుస్తకంలో రాశారు.

“వాస్తవానికి తన (ధీరేంద్ర బ్రహ్మచారి) చూపులు, శరీరాకృతి అందరిని తనవైపుకి ఆకర్షించేవి. అయితే ఆయనతో మాట్లాడటం మాత్రం ఒక పెద్ద శిక్ష లాంటిది. ఆయన మూఢ విశ్వాసాలను నమ్మేవారు” అని డొరోతీ తన పుస్తకంలో రాశారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, Harper Perennial

ధీరేంద్ర ఏనాడు వెచ్చని వస్త్రాలు ధరించలేదు

ప్రముఖ పాత్రికేయులు దిలీప్ బాబ్, నవంబర్ 30, 1980న ఇండియా టుడేలో ప్రచురితమైన 'స్వామి ధీరేంద్ర బ్రహ్మచారి, వివాదాస్పద గురువు' అనే వ్యాసంలో స్వామిని ఆరడుగుల ఒక అంగుళం పొడవుతో నాజూకైన వ్యక్తిగా అభివర్ణించారు. శరీరంపై పలచటి వస్త్రాలు మాత్రమే ధరిస్తారు అని రాశారు.

ఆయన చేతిలో ఎప్పుడూ మహిళల హ్యాండ్ బ్యాగ్‌ని తలపించే తెల్లటి తోలు బ్యాగు ఉండేది అని ఆ వ్యాసంలో దిలీప్ బాబ్ రాశారు.

వీడియో క్యాప్షన్, ఏనుగుపై యోగా చేస్తూ కిందపడ్డ బాబా రామ్‌దేవ్

“ఆయన అనేక వైరుధ్యాలు కలిగన మనిషి. ఆయన ఏ ప్రభుత్వ పదవిలో ఉండేవారు కాదు. అయినా కూడా ఎంతో శక్తిమంతులు. ఆయన ఎంతో విలాసవంతంగా జీవించే సాధువు. ప్రధాన మంత్రితో ప్రత్యక్ష సంబంధాలు కలిగన యోగా గురువు. ప్రజలకు ఆయనంటే భయం. అదే సమయంలో చాలా గౌరవం కూడా” అని దిలీప్ తన వ్యాసంలో రాశారు.

ధీరేంద్ర బ్రహ్మచారి ఏనాడు వెచ్చదనం ఇచ్చే వస్త్రాలు ధరించలేదు. శ్రీనగర్ చలిలో కానీ, మాస్కోలో సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో కూడా ధీరేంద్ర మస్లిన్‌తో చేసిన వస్త్రాలే ధరించేవారు.

“ఆయనకి ఇప్పుడు అరవై సంవత్సరాలు. అయినా కూడా నలభై ఐదు సంవత్సరాలకి ఒక్క రోజు కూడా ఎక్కువ వయసు ఉన్నవారిలా కనపడరు” అని దిలీప్ బాబ్ తన వ్యాసంలో రాశారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, DHIRENDRA MEMORIAL FOUNDATION

‘రస్పుతిన్’ గా ప్రసిద్ధి

“స్వామీజీ నాకు యోగా నేర్పారు. యోగాలో ఆయన నిష్ణాతులు. ఆయన నాలుగైదు నెలలలో నా ఆస్థమా సమస్యని పరిష్కరించారు” అని ఇందిరా గాంధీకి సన్నిహితులైన నట్వర్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

దూరదర్శన్‌లో ప్రతి బుధవారం ఆయన యోగా కార్యక్రమం ప్రసారం అయ్యేది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా యోగా ప్రాచుర్యం పొందటానికి ఎంతో దోహదం చేసింది. 70లలో ధీరేంద్ర సంజయ్ గాంధీకి బాగా దగ్గరయ్యారు. ఒక రకంగా గాంధీ కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరిపోయారు.

“ఇందిరా గాంధీ గదిలోకి ఒంటరిగా వెళ్ళగలిగిన ఏకైక బ్రహ్మచారి ఆయనే. యోగా నేర్పించే కారణం మీద ఆయన వెళ్ళేవారు. నెమ్మది నెమ్మదిగా ఆయన ఇందిరా గాంధీకి ఎంత దగ్గరయ్యారంటే.. ఆయనను భారతదేశపు ‘రస్పుతిన్’ గా పిలవడం మొదలుపెట్టారు” అని కేథరీన్ ఫ్రాంక్ ఇందిరా గాంధీ గురించి రాసిన పుస్తకంలో రాశారు.

అయితే ఇందిరా గాంధీ మిత్రులైన పి.డి. టాండన్ ఈ విషయాన్ని ఒక పుకారుగా కొట్టిపారేశారు. “జవహర్ లాల్ నెహ్రూ తన కూతురికి యోగా నేర్పమని బ్రహ్మచారిని స్వయంగా కోరారు. కొన్ని సార్లు ఆయన కూడా బ్రహ్మచారి దగ్గర యోగా నేర్చుకునేవారు” అని పి.డి. టాండన్ తెలిపారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, DHIRENDRA MEMORIAL FOUNDATION

ఎమర్జెన్సీలో సానిహిత్యం మరింత బలపడింది

ఎమర్జెన్సీ సమయంలో ఇతరుల పట్ల ఇందిరా గాంధీ అపనమ్మకం పెరుగుతూ పోయిన కొద్ది ఆమె మీద బ్రహ్మచారి ప్రభావం పెరుగుతూ పోయింది.

“ఫలానా ఫలానా వ్యక్తులు ఇందిరా గాంధీకి, సంజయ్ గాంధీకి హాని చెయ్యాలని చూస్తున్నారని చెబుతూ అనేక మంది మీద ఇందిరా గాంధీకి భయం పెంచారు ధీరేంద్ర. మొదట్లో ఆమె శత్రువులు వివిధ పూజలు, అతీంద్ర శక్తుల ద్వారా ఆమెకు హానీ చెయ్యాలని కుట్ర పన్నుతున్నారు అని చెప్పేవారు. ఆ తరువాత ఈ హానికి వివిధ పూజల ద్వారా విరుగుడు ఉందని చెప్పేవారు” అని ఇందిరా గాంధీ జీవితం గురించి రాసిన పుస్తకంలో పుపుల్ జయకర్ రాశారు.

“ఇలా చెప్పటంలో ఆయనకు స్వార్థం ఉండవచ్చు అనే ఆలోచన లేకుండా ఇందిరా గాంధీ ఈ విషయాలలోనే కాకుండా రాజకీయ విషయాలలో కూడా ఆయన సలహాలు తీసుకునేవారు” అని పుపుల్ జయకర్ ఆ పుస్తకంలో రాశారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, DHIRENDRA MEMORIAL FOUNDATION

కస్టమ్స్ సుంకాన్ని చెల్లించకుండానే విమానం

ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీల మీద తన ప్రభావాన్ని వాడుకుని ధీరేంద్ర ఏ విధంగా తన ఆస్తిపాస్తులని పెంచుకున్నారో షా కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

“సంజయ్ శక్తి పెరిగే కొద్దీ ఇందిరపై స్వామి ప్రభావం కూడా పెరిగింది. 1976లో ఎమర్జెన్సీ సమయంలో ఆయన అమెరికా విమానయాన సంస్థ నుంచి ఎం-5 విమానం కొనేందుకు అనుమతి కోరగా.. అనుమతి లభించింది కూడా” అని కేథరీన్ ఫ్రాంక్ తన పుస్తకంలో రాశారు.

“ఈ విమానం మీద ఎటువంటి దిగుమతి సుంకం విధించలేదు. ఇదే కాకుండా కశ్మీర్‌లో ఒక ప్రైవేటు ఎయిర్ స్ట్రిప్ నిర్మించడానికి కూడా ఆయనకి అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి అనేక భద్రతా నియమాలని ఉల్లంఘించి ఇచ్చారు. ఎందుకంటే ఈ ప్రాంతం పాకిస్తాన్‌కి చాలా సమీపంలో ఉంది”అని కేథరీన్ రాసుకొచ్చారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, DHIRENDRA MEMORIAL FOUNDATION

అన్ని అభియోగాలను వెనక్కి తీసుకున్నారు

1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ ఓటమి తరువాత ఆదాయపు పన్ను అధికారులు కశ్మీర్‌లోని అపర్ణ ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. ఈ ఆశ్రమం పాలరాతితో రాజభవనం స్థాయిలో నిర్మించిన విషయాన్ని వారు తెలుసుకున్నారు. ఈ భవనంలో నాలుగు బాత్రూంలు, రెండు టెలిఫోనులు ఉండేవి.

“ఈ ఆశ్రమ సముదాయం విలాసవంతమైన జీవనం సాగించడానికి అనువుగా ఉండేది” అని షా కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

అయితే 1980 ఎన్నికలలో ఇందిరా గాంధీ విజయం సాధించాక ధీరేంద్ర మీద మోపిన అభియోగాలన్నిటినీ వెనక్కి తీసేసుకున్నారు.

వీడియో క్యాప్షన్, 125 ఏళ్ల వయసులోనూ పద్మశ్రీ స్వామి శివానంద అంత దృఢంగా ఎలా ఉన్నారు?

“ఆయన మళ్లీ గాంధీ కుటుంబంలో భాగం అయ్యారు. ఆయన తరుచుగా గాంధీ కుటుంబ సభ్యుల డైనింగ్ టేబుల్ దగ్గర కనపడేవారు. అయితే ఆయనకీ తిండి తినే పద్ధతి తెలియదు. చాలా ఎక్కువ తింటూ ఉండేవారు. ఆయనకిప్పుడు అరవై సంవత్సరాలు. అయినా కూడా చాలా ఆకర్షణీయంగా, సన్నగా ఉండేవారు” అని కేథరీన్ ఫ్రాంక్ రాశారు.

“జనతా పార్టీ ప్రభుత్వం ఇందిరా, సంజయ్ గాంధీల మీద చర్యలు తీసుకుంటున్న సమయంలో ధీరేంద్ర వారికి గట్టి మద్దతుగా నిలబడ్డారు. అందుకే సంజయ్ గాంధీ ధీరేంద్రని చాలా మెచ్చుకునేవారు. ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక ధీరేంద్రకి తగిన ప్రతిఫలం లభించింది. ఆయన మీద ఉన్న అభియోగాలని వెనక్కి తీసుకోవటమే కాక ఆయన విమానాన్ని కూడా తిరిగి ఇచ్చారు” అని ‘గురు’ పుస్తకాన్ని రచించిన భవదీప్ కంగ్ రాశారు.

“సంజయ్ చాలా మంచి పైలట్. అయితే తను గాలిలో మరీ ఎక్కువ విన్యాసాలు చెయ్యడానికి నేను ఒప్పుకోలేదు” అని సంజయ్ గాంధీ మరణించిన మరుసటి రోజు ధీరేంద్ర అన్నారు.

ఆ తరువాత ధీరేంద్ర బ్రహ్మచారి ఆధ్వర్యంలో సంజయ్ గాంధీ అంత్యక్రియలు జరిగాయి.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, DHIRENDRA MEMORIAL FOUNDATION

సంజయ్ గాంధీతో సాన్నిహిత్యం

సఫ్దర్ జంగ్ రోడ్డులోని ఇందిరా గాంధీ నివాసానికి ధీరేంద్ర బ్రహ్మచారి తరచూ వెళ్లడంలో సంజయ్ గాంధీ పాత్ర చాలా ఉంది.

“పొడవాటి జుట్టు గల ధీరేంద్ర బ్రహ్మచారి మొదట్లో ఇందిరా గాంధీ యోగా శిక్షకుడిగా ఇంట్లో ప్రవేశించారు. అయితే ఆ తరువాత ఆమె అభిమాన కుమారుడైన సంజయ్ గాంధీ సహాయంతో ఆ ఇంట్లో చాలా కాలం ధీరేంద్ర మకాం వేశారు” అని రామచంద్ర గుహ తన ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ పుస్తకంలో రాశారు.

సంజయ్ గాంధీ బృందంలో ధీరేంద్ర చాలా ముఖ్యమైన వారని నిఖిల్ చక్రవర్తి ‘మెయిన్ స్ట్రీం’ పత్రికలో 1979లో రాశారు. 1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ ఓటమి తరువాత ఆమెని అందరికన్నా ముందు ఓదార్చింది ఒకప్పటి ఆమె సన్నిహితుడు, మాజీ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి డి.పి. మిశ్రా.

“ఇందిరా గాంధీతో ఏకాంతంగా మాట్లాడటం ఏ మాత్రం కుదరలేదు. ఎందుకంటే సంజయ్ గాంధీ, ధీరేంద్ర అనేక సార్లు ఆ గదిలోకి వస్తూనే ఉన్నారు అని డి.పి. మిశ్రా తనతో స్వయంగా చెప్పారు” అని ఇందర్ మల్హోత్రా ఇందిరా గాంధీ జీవితం గురించి రాసిన పుస్తకంలో రాశారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, DHIRENDRA MEMORIAL FOUNDATION

మేనకా గాంధీని ఇంటి నుంచి వెళ్లగొట్టినప్పుడు అక్కడే ఉన్నారు

తన కొడుకు చనిపోయాక ఇందిరా గాంధీ.. ధీరేంద్ర మీద మరింతగా ఆధారపడటం ప్రారంభించారు. ఆమె వ్యక్తిగత విషయాలలో కూడా ధీరేంద్ర చాలా సన్నిహితుడుగా, విశ్వాసపాత్రుడిగా మారారు.

“ఒక పెద్ద గొడవ తరువాత ఇందిరా గాంధీ మేనకాని ఇంటి నుండి పంపించేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు దానికి సాక్షిగా ఉండాలని ఇందిరా ధీరేంద్రని కోరారు. మేనకా, ఆమె సోదరితో గొడవ చేతులు దాటిపోయిన సందర్భంలో ఇందిర బిగ్గర ఏడవటం ప్రారంభించినప్పుడు ఆమెను ధీరేంద్ర బ్రహ్మచారి గది నుంచి బయటకి తీసుకువచ్చారు” అని తమ ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మెలీస్’లో కుశ్వంత్ సింగ్ రాశారు.

“బ్రహ్మచారికి ఒక పెద్ద భవనం ఉండేది. అందులో ఆయన నల్ల ఆవుల్ని పెంచేవారు. నల్ల ఆవుల పాలలో ఔషధ గుణాలు ఉంటాయని ఆయన నమ్మేవారు”అని సింగ్ రాశారు.

ప్రధాన మంత్రి నివాసానికి సమీపంలో ఉన్న విశ్వయతన్ యోగా ఆశ్రమంలో కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలు, వ్యాపారవేత్తలు ఆయన దర్శనం కోసం వరుస క్రమంలో నిలబడేవారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, VAKILSS, FEFFER & SIMON LTD

రాజీవ్ గాంధీ దూరం చేశారు

ఇందిరా గాంధీ జీవిత చరమాంకంలో కూడా ధీరేంద్ర బ్రహ్మచారి హవా కొనసాగింది. అయితే రాజేవ్ గాంధీ రాజకీయ ఎదుగుదలతో బ్రహ్మచారీ పతనం మొదలయ్యింది.

‘‘రాజీవ్ గాంధీ, బ్రహ్మచారి ఇద్దరూ పూర్తి వ్యతిరేక స్వభావం కలిగిన మనుషులు. బ్రహ్మచారి జిమ్మిక్కుల మనిషి. పైగా ఏ మాత్రం పారదర్శకత ఉండేది కాదు. అలాగే పాశ్చాత్య జీవనంతో ఏ మాత్రం సంబంధం లేని మనిషి. ఇందిరా ఇంట్లో స్వామి తిష్ట వెయ్యటం రాజీవ్‌కి ఎప్పుడూ నచ్చలేదు. ఇప్పుడు రాజీవ్‌కి ధీరేంద్రని అక్కడ నుండి బయటకి సాగనంపే అవకాశం లభించింది. ఆయన ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు” అని కేథరీన్ ఫ్రాంక్ రాసుకొచ్చారు.

సంజయ్ గాంధీ మరణాంతరం ఆయన సన్నిహితులు చాలా మంది బ్రహ్మచారిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు.

దూరదర్శన్‌లో ధీరేంద్ర యోగా కార్యక్రమాన్ని ఏ కారణం తెలపకుండా నిలిపేయడం ఆయన ప్రభావం బీటలు వారుతున్నది అనేదానికి సంకేతంగా చెప్పుకోవచ్చు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, Hay House

ప్రధానమంత్రి నివాసంలోకి ప్రవేశం లేదు

“మరుసటి రోజు బ్రహ్మచారిని ప్రధాన మంత్రి నివాసంలోకి రానివ్వలేదు. రాజీవ్ గాంధీ ఇక బ్రహ్మచారిని సాగానంపబోతున్నారు అన్న వార్తలు అన్నిచోట్లా వ్యాప్తి చెందాయి. బ్రహ్మచారి కారణంగా ఇందిరా గాంధీ ప్రతిష్ట దెబ్బతినకూడదు అనేది రాజీవ్ గాంధీ ఆలోచన” అని ఇందిరా గాంధీ జీవిత కథ ‘ఇందిరా ఏ పర్సనల్ అండ్ పొలిటికల్ బయోగ్రఫీ’ లో ఇందర్ మల్హోత్రా రాశారు.

ఇందిరా గాంధీ చనిపోయాక ఆమె దగ్గరకు రావడానికి బ్రహ్మచారి చివరి ప్రయత్నం చేశారు. ఇందిరా గాంధీ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, ఆమె మృతదేహాన్ని ఉంచిన వేదికపైకి చేరుకున్నారు.

రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకు ధీరేంద్ర బ్రహ్మచారిని అక్కడ నుండి నిశబ్దంగా దించివేశారని, అంత్యక్రియలు జరుగుతున్న చోటికి ఆయన్ని మళ్ళీ రానివ్వలేదని చెబుతుంటారు.

వీడియో క్యాప్షన్, నిజాం నవాబులు ఈ దూద్ బాయి నీళ్ళే తెప్పించుకుని తాగేవారట...

విదేశి అయుధాలు ఉన్నాయని, వాటిని అమ్ముతున్నారని ధీరేంద్ర బ్రహ్మచారిపై ఒక కేసు కూడా నమోదు అయ్యింది.

దాని తరువాత దిల్లీలోని సఫ్దర్ జంగ్ విమానశ్రయాన్ని ఉచితంగా వాడుకునే ధీరేంద్రను ఆ విమానాశ్రయాన్ని వాడుకోవటానికి తగిన రుసుము చెల్లించాలి అని డిమాండ్ చేశారు.

ఆయన కస్టాలు పెరుగుతూ పోయాయి. ఆయన ఆశ్రమంలో పని చేసే కార్మికులు ధర్నా చేశారు. తమ జీతాలు పెంచాలని ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చెయ్యటం కూడా మొదలు పెట్టారు.

ధీరేంద్ర బ్రహ్మచారి

ఫొటో సోర్స్, penguin books

విమాన ప్రమాదంలో మరణించారు

సంజయ్ గాంధీ లాగానే ధీరేంద్ర బ్రహ్మచారి కూడా జూన్ నెలలో విమాన ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో ఆయన తన ఆశ్రమం విస్తరణ కోసం కొనుగోలు చేసిన వంద ఎకరాలను ఏరియల్ సర్వే చేస్తున్నారు.

వాతావరణం ప్రతికూలంగా ఉంది, టేకాఫ్ చెయ్యవద్దు అని ఆయన పైలట్ సలహా ఇచ్చారు. అయితే బ్రహ్మచారి ఆయన సలహాని పట్టించుకోలేదు. మాన్ టలాయ్‌లో దించుతున్నప్పుడు విమానం పొదల్లో కుప్పకూలింది.

ఆయన మరణానంతరం, న్యూయార్క్ టైమ్స్ మూడు పేరాల కథనాన్ని ప్రచురించింది. ధీరేంద్ర బ్రహ్మచారి ఆధ్యాత్మికత పేరు మీద అధికార బలంతో లాభాలు పొందిన మొదటి వ్యక్తేమీ కాదు. అయితే ఇంతకుముందు ఏ సన్యాసి కూడా ఇంత కాలం పాటు ఇంత నమ్మకం, విశ్వాసంతో రాజకీయ రంగంలో ఆధిపత్యం అయితే చలాయించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)