హరగోవింద్ ఖురానా, సుబ్రమణ్యం చంద్రశేఖర్.. ఈ నోబెల్ గ్రహీతలకూ పాకిస్తాన్‌కు ఉన్న కనెక్షన్ ఏంటి?

గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ, లాహోర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ, లాహోర్
    • రచయిత, అకీల్ అబ్బాస్ జాఫ్రీ
    • హోదా, కరాచీ పరిశోధకుడు, చరిత్రకారుడు

మలాలా యూసుఫ్‌జాయ్‌ నోబెల్ పురస్కారం అందుకోకముందు, పాకిస్తాన్ ఖాతాలో కేవలం ఒకే ఒక నోబెల్ పురస్కారం ఉండేది.

గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ (లాహోర్) చివరి ప్రిన్సిపల్, తొలి వైస్ చాన్స్‌లర్ అయిన ఖాలిబ్ అఫ్తాబ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ... 'పాకిస్తాన్‌ వద్ద ఒకే నోబెల్ బహుమతి ఉంది. కానీ గవర్నమెంట్ కాలేజ్‌ (జీసీ) విశ్వవిద్యాలయం వద్ద రెండు నోబెల్ పురస్కారాలు ఉన్నాయి'' అని అన్నారు.

1968లో వైద్య విభాగంలో డాక్టర్ హరగోవింద్ ఖురానాకు నోబెల్ బహుమతి లభించింది. ఖురానాను దృష్టిలో పెట్టుకొనే అఫ్తాబ్ జీసీ యూనివర్సిటీకి రెండు పురస్కారాలు వచ్చాయని అన్నారు.

ఈ ఆర్టికల్‌లో లాహోర్‌కు చెందిన ఐదుగురు నోబెల్ పురస్కార విజేతల గురించి చెప్పబోతున్నాం. వీరిలో ఇద్దరు గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ (లాహోర్)లో చదివారు. శనివారం నాటికి ఈ యూనివర్సిటీ స్థాపించి 158 ఏళ్లు పూర్తయ్యాయి.

హరగోవింద్ ఖురానా

ఫొటో సోర్స్, APIC

ఫొటో క్యాప్షన్, 1968లొ హరగోవింద్ ఖురానా వైద్య రంగంలో నోబెల్ అవార్డును అందుకున్నారు

డాక్టర్ హరగోవింద్ ఖురానా

ముల్తాన్‌కు సమీపంలోని రాయ్‌పూర్‌కు చెందిన ఒక పేద కుటుంబంలో 1922 జనవరి 9న డాక్టర్ హరగోవింద్ ఖురానా జన్మించారు.

ఆయన గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో ఇంగ్లండ్ వెళ్లారు. 1948లో లివర్‌పూల్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

1960ల్లో డీఎన్‌ఏపై చేసిన పరిశోధనలకు గానూ, 1968లో వైద్యరంగం కేటగిరీలో ఆయనకు నోబెల్ బహుమతి దక్కింది. డాక్టర్ హరగోవింద్ ఖురానా 2011లో మరణించారు.

2020 జనవరి 9న, ఆయన 98వ జయంతిని పురస్కరించుకొని ఖురానా పేరు మీద ఒక పరిశోధనా పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నమెంట్ కాలేజ్ విశ్వవిద్యాలయం (లాహోర్) ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పుట్టినరోజు కేక్‌ను కూడా కట్ చేశారు.

సుబ్రమణ్యం చంద్రశేఖర్

ఫొటో సోర్స్, BETTMANN

ఫొటో క్యాప్షన్, సుబ్రమణ్యం చంద్రశేఖర్

సుబ్రమణ్యం చంద్రశేఖర్

లాహోర్ నుంచి నోబెల్ అందుకున్న మరో వ్యక్తి సుబ్రమణ్యం చంద్రశేఖర్. ఆయన 1910 అక్టోబర్ 19న లాహోర్‌లో జన్మించారు.

మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. 1933లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.

ఖగోళ శాస్త్రంలో చంద్రశేఖర్ పరిశోధనలు చేశారు. నక్షత్రం పుట్టుక, అభివృద్ధి, వినాశనం అయ్యే క్రమాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ పరిశోధన వివరాలు, 1939లో ఆయన రాసిన 'యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ స్టెల్లార్ స్ల్రక్చర్' అనే పుస్తకంలో ప్రచురించారు.

అదే సమయంలో ఆయన పేరు, నోబెల్ పురస్కారం చర్చల్లో నిలిచింది. కానీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సర్ ఆర్థర్ ఎడిన్‌బర్గ్ ఆయన పరిశోధనపై అభ్యంతరం తెలిపారు.

ఎడిన్‌బర్గ్ కారణంగా చంద్రశేఖర్ సరైన సమయంలో నోబెల్ పురస్కారాన్ని అందుకోలేకపోయారు. కానీ 1983లో ఆయన పరిశోధన సరైనదేనని నిరూపితం కావడంతో భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్‌ అవార్డును గెలుచుకున్నారు.

భౌతిక శాస్త్ర విభాగంలో 1930లో నోబెల్ అవార్డు అందుకున్న సర్ సీవీ రామన్ మేనల్లుడే సుబ్రమణ్యం చంద్రశేఖర్.

ఉపఖండం నుంచి భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డును గెలుచుకున్న మూడో శాస్త్రవేత్తగా చంద్రశేఖర్ నిలిచారు. 1995 ఆగస్టు 21న అమెరికాలోని చికాగోలో ఆయన మరణించారు.

పాకిస్తాన్ నుంచి నోబెల్ అవార్డు పొందిన తొలి వ్యక్తి డాక్టర్ అబ్దుస్ సలామ్

ఫొటో సోర్స్, KEYSTONE

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ నుంచి నోబెల్ అవార్డు పొందిన తొలి వ్యక్తి డాక్టర్ అబ్దుస్ సలామ్

డాక్టర్ అబ్దుస్ సలామ్

డాక్టర్ హరగోవింద్ ఖురానా తర్వాత, గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ (లాహోర్) నుంచి నోబెల్ ప్రైజ్ అందుకున్న మరో శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుస్ సలామ్.

డాక్టర్ అబ్దుస్ సలామ్, 1926 జనవరి 29న సాహివాల్ జిల్లాలోని సంతోక్ దాస్ గ్రామంలో జన్మించారు. జాంగ్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నాక, లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీని పూర్తి చేశారు.

ఎమ్మెస్సీలో మొదటి శ్రేణిలో పాస్ అవ్వడంతో ఆయనకు పైచదువుల కోసం స్కాలర్‌షిప్ లభించింది. 1946లో బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరి 'ఆప్టికల్ ఫిజిక్స్'లో పీహెచ్‌డీ చేశారు.

1951లో స్వదేశానికి తిరిగి వచ్చిన సలామ్, తొలుత గవర్నమెంట్ కాలేజ్‌ యూనివర్సిటీలో ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో బోధన ప్రారంభించారు. 1954లో ఆయన మళ్లీ ఇంగ్లండ్‌కు వెళ్లారు. అక్కడ కూడా ఆయన బోధనారంగంలోనే కొనసాగారు.

వీడియో క్యాప్షన్, ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఎవరు? ‘ప్రజల చావుల’తో ఆయన చేసిన వ్యాపారం ఏంటి?

1964లో ఇటలీలోని ట్రాయిస్టే నగరంలో 'ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆప్టికల్ ఫిజిక్స్' కేంద్రాన్ని నెలకొల్పారు. 1979లో భౌతిక శాస్త్రంలో ఆయనను నోబెల్ పురస్కారం వరించింది. నోబెల్ అవార్డును గెలుచుకున్న తొలి పాకిస్తాన్ పౌరునిగా ఆయన ఘనతకెక్కారు.

ఆయన మేధస్సుకు గానూ పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రతిష్టాత్మక 'సితార-ఎ-ఇంతియాజ్', 'నిషాన్-ఎ-ఇంతియాజ్' పురస్కారాలతో సత్కరించింది.

ప్రపంచంలోని 36 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను అందజేశాయి. ఇవే కాకుండా, 22 దేశాలు ఆయనను ప్రముఖ పురస్కారాలతో గౌరవించాయి. ఇందులో జోర్డాన్‌కు చెందిన 'నిషాన్-ఎ-ఇస్తిక్‌లాల్', వెనిజులాకు చెందిన 'ఆంద్రే బెలో', ఇటలీ నుంచి మెరిట్ అవార్డులు ఉన్నాయి. వీటితో పాటు హాప్కిన్స్ ప్రైజ్, ఆడమ్స్ ప్రైజ్, మ్యాక్స్‌వెల్ మెడల్, ఆటమ్ ప్రైజ్ ఫర్ పీస్, గుథేరి మెడల్ వంటి అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి.

డాక్టర్ అబ్దుస్ సలామ్ ఆప్టికల్ ఫిజిక్స్, థర్డ్ వరల్డ్ అకడమిక్, సైంటిఫిక్ అంశాలపై 300లకు పైగా పేపర్లను సమర్పించారు. వీటిలో కొన్నింటిని పుస్తకాలుగా ప్రచురించారు.

1996 నవంబర్‌లో ఆయన లండన్‌లో మరణించారు. రబ్వాలో ఆయనను ఖననం చేశారు.

ఖురానా, సలామ్‌తో పాటు మరో ముగ్గురు నోబెల్ విజేతలకు కూడా లాహోర్‌తో సంబంధం ఉంది. భౌతిక శాస్త్రవేత్తలైన సుబ్రమణ్యం, ఆర్థర్ హోలీ కాంప్టన్, సాహిత్యంలో రూడ్‌యార్డ్ కిప్లింగ్ కూడా లాహోర్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

1907లో 42 ఏళ్ల వయస్సులో కిప్లింగ్, సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1907లో 42 ఏళ్ల వయస్సులో కిప్లింగ్, సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు

రూడ్‌యార్డ్ కిప్లింగ్

సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి రూడ్‌యార్డ్ కిప్లింగ్. ఆయన 1907లో ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు.

1865 బొంబైలో రూడ్‌యార్డ్ కిప్లింగ్ జన్మించారు. ఇంగ్లండ్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 16 ఏళ్ల వయస్సులో భారత్‌కు వచ్చారు. ఆయన జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. సివిల్ అండ్ మిలిటరీ గెజిట్ (లాహోర్)‌ వార్తా పత్రికకు సబ్ ఎడిటర్‌గా పని చేశారు.

ఆయన పనిచేసిన కాలంలో వార్త పత్రికకు ప్రజల ఆదరణ గణనీయంగా పెరిగింది. ఆయన లాహోర్ గురించి ఎన్నో రచనలు చేశారు.

1889లో ఇంగ్లండ్‌కు వెళ్లిపోయారు. అక్కడ అనేక లఘు కథలను, నవలలను రాశారు. కిప్లింగ్ రాసే రచనల్లో పాత్రదారులు ఆంగ్లేయులు, కానీ ఆయన రచనలన్నీ భారతీయ వాతావరణానికి అద్దం పట్టేవి. ఈ వైవిధ్యం కారణంగానే ఆయన రచనలు చాలా ఆదరణ పొందాయి.

1907లో 42 ఏళ్ల వయస్సులో కిప్లింగ్, సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్యంలో అతి తక్కువ వయస్సులో నోబెల్ అందుకున్న వ్యక్తిగా ఇప్పటికీ ఆయన రికార్డు చెరిగిపోలేదు. 1936 జనవరి 18న రూడ్‌యార్డ్ కిప్లింగ్ మరణించారు.

ఆర్థర్ హోలీ కాంప్టన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్థర్ హోలీ కాంప్టన్

ఆర్థర్ హోలీ కాంప్టన్

లాహోర్‌కు చెందిన మరో వ్యక్తి ఆర్థర్ హోలీ కాంప్టన్. పంజాబ్ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ప్రయోగశాలలో ఈయన పరిశోధనలు నిర్వహించారు.

ఎలక్ట్రాన్, ఫొటాన్లు ఢీకొనడం వల్ల ఉత్పన్నమయ్యే ప్రభావంపై ఆయన చేసిన పరిశోధనలకు 1927లో భౌతికశాస్త్ర విభాగంలో ఆయనకు నోబెల్ అవార్డు లభించింది.

ఆయన పేరు కారణంగానే ఈ ప్రభావాన్ని కాంప్టన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఆర్థర్ హోలీ కాంప్టన్ 1962లో మరణించారు.

వీడియో క్యాప్షన్, అభిజిత్ బెనర్జీ: చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)