నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న జర్నలిస్టులు మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్

ఫొటో సోర్స్, Reuters/Getty
జర్నలిస్టులు మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్ సంయుక్తంగా ఈ ఏడాది (2021) నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.
ఫిలిప్పీన్స్, రష్యాలలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటానికి వారు చేసిన పోరాటాలకుగానూ ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
"ఈ ఆదర్శం కోసం నిలబడే జర్నలిస్టులందరి ప్రతినిధులు"గా వీరిద్దరినీ నోబెల్ కమిటీ పేర్కొంది.
విజేతల పేర్లను ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్‌లో ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం విలువ 10 మిలియన్ స్వీడిష్ క్రోనాలు (సుమారు రూ. 8.5 కోట్లు)
మొత్తం 329 మంది అభ్యర్థులలో వీరిద్దరినీ విజేతలుగా ఎంపిక చేశారు.

ఫొటో సోర్స్, EPA
భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించి "అధికార దుర్వినియోగం, హింస, స్వదేశం (పిలిప్పీన్స్)లో పెరుగుతున్న నిరంకుశత్వాన్ని బట్టబయలు చేసినందుకు" న్యూస్ సైట్ 'రాప్లర్'కు సహ వ్యవస్థాపకురాలైన మరియా రెస్సాను ప్రశంసించారు.
విజేతగా తన పేరు ప్రకటించగానే "షాక్" అయ్యానని రెస్సా తెలిపారు.
"వాస్తవాలు లేకుండా ఏదీ సాధ్యం కాదు. వాస్తవాలు లేని ప్రపంచం అంటే సత్యం, విశ్వాసం లేని ప్రపంచమని" తన గెలుపు నిరూపించిందని రాప్లర్‌కి ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.
తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌కు ఈ బహుమతి లభించడం " గౌరవప్రదం, అభినందనీయం" అని రాప్లర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
"జర్నలిస్టులు, వాస్తవాలు దాడికి గురవుతున్న, అణచివేయబడుతున్న ఈ సమయంలో రెస్సాకు ఈ బహుమతి లభించడం ముదావహం" అని రాప్లర్ వ్యాఖ్యానించింది.
స్వతంత్ర వార్తాపత్రిక 'నోవాయ గెజిటా' సహ వ్యవస్థాపకుడు, సంపాదకుడు అయిన మురటోవ్ కొన్ని దశాబ్దాలుగా రష్యాలో భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారని నోబెల్ కమిటీ తెలిపింది.
"నన్ను చాలా నవ్వొస్తోంది. ఇది నేను అస్సలు ఊహించలేదు" అని మురటోవ్, ప్రముఖ టెలిగ్రామ్ ఛానల్ పోడియోమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
"అణచివేయబడుతున్న రష్యన్ జర్నలిజానికి ఈ బహుమతి గొడ్డలిపెట్టు" అని ఆయన అన్నారు.
"దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంచేందుకు అత్యుత్తమంగా కృషి చేసిన" వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతిని అందిస్తారు.
"స్వేఛ్చాయుతమైన, స్వతంత్ర, వాస్తవ ఆధారిత జర్నలిజం ప్రజలను అధికార దుర్వినియోగం, అసత్యాలు, యుద్ధ ప్రచారాల నుంచి కాపాడుతుందని" నోబెల్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
"భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ లేకుండా దేశాల మధ్య సహృద్భావాన్ని పెంపొందించడం, ప్రపంచ ప్రగతిని సాధించడం సాధ్యం కాదని" వెల్లడించింది.
మరియా రెస్సా
మరియా రెస్సా 2021లో రాప్లర్ న్యూస్ సైట్‌ను స్థాపించారు. ఈ సైట్‌కు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో 45 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
తెలివైన విశ్లేషణ, కష్టతరమైన పరిశోధనలకు వీరి కథనాలు ప్రసిద్ధి చెందాయి.
ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డ్యూటెర్టేను బహిరంగంగా విమర్శించే అతి కొద్ది మీడియా సంస్థల్లో రాప్లర్ ఒకటి.
డ్రగ్స్‌పై యుద్ధం, పురుషహంకారం, మానవ హక్కుల ఉల్లంఘన, అవినీతి మొదలైన విషయాలపై రాప్లర్ కూలంకషంగా చర్చించింది.
సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రోపగాండా గురించి రెస్సా స్వయంగా విశ్లేషణలు రాశారు.
రెస్సాపై ఎన్నో కేసులు వేశారు. అవన్నీ రాజకీయంగా ప్రేరేపించబడినవని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డిమిత్రి మురటోవ్
డిమిత్రి మురటోవ్ 1993లో నోవాయ గెజిటాను స్థాపించారు. అప్పటి నుంచి ఆ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తున్నారు.
రష్యాలో పాలకవర్గం, ముఖ్యంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న అతి కొద్ది వార్తాపత్రికలలో నోవాయ గెజిటా ఒకటి.
పాలక వర్గాలలో అవినీతి, అధికార దుర్వినియోగాన్ని ఈ పత్రిక తరచూ ఎండగడుతూ ఉంటుంది. బాధితుల అవస్థలపై వెలుగు సారిస్తుంది.
వీరు అందించిన కథనాల కారణంగా, ఈ పత్రికకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారని 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్' తెలిపింది.
చెచ్న్యాలో మానవ హక్కుల ఉల్లంఘనలను నివేదించినందుకు, ఇతరత్రా కూడా ఈ వార్తాపత్రిక బెదిరింపులు, వేధింపులకు లోనవుతూ ఉంటుంది.
గతంలో ఎవరెవరికి ఈ బహుమతి లభించింది?
నోబెల్ శాంతి బహుమతిని అందుకొంటున్న 102వ విజేతలు మరియా రెస్సా, డిమిత్రి మొరటోవ్.
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్‌పీ) గత సంవత్సరం విజేతగా నిలిచింది. ఆకలిని ఎదుర్కొనేందుకు, శాంతిని పునరుద్ధరించేందుకు ఈ సంస్థ చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతిని అందించారు.
2009లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతిని అందుకొన్నారు.
"అంతర్జాతీయ దౌత్యం, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషికి" ఈ పురస్కారం లభించింది.
నోబెల్ శాంతి బహుమతి అందుకున్నవారిలో కొందరు ప్రముఖులు.. మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (2002), చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్ మలాలా యూసఫ్‌జాయ్ (2014లో మరొకరితో పంచుకున్నారు), యూరోపియన్ యూనియన్ (2012), ఐక్యరాజ్యసమితి, ఆ సమయంలో ఆ సంస్థ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ (2001లో సంయుక్తంగా), మదర్ థెరిస్సా (1979).
ఇవి కూడా చదవండి:
- 'నోబెల్ శాంతి బహుమతి నాకు రావాల్సింది... ఎవరికో ఇచ్చేశారు' - డోనల్డ్ ట్రంప్
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి... రూ. 18,000 కోట్లతో బిడ్ గెల్చుకున్న టాటా సన్స్
- 97 ఏళ్ల వయసులో నోబెల్... విజేతల చరిత్రలోనే అత్యధిక వయస్కుడు జాన్ గుడ్ఇనఫ్
- నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం
- కాకినాడ పోర్ట్‌లో డ్రగ్స్ దిగుమతులు జరుగుతున్నాయా... అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం ఏంటి?
- డబ్బుతో పని లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ
- చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ
- 'పప్పు' చేసిన అద్భుతం... అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో జంటకు నోబెల్
- అబియ్ అహ్మద్ తూర్పు ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పారా?
- నోబెల్ పురస్కారాలు: పోలండ్ రచయిత్రి ఓల్గా (2018), ఆస్ట్రియా రచయిత పీటర్ హాండ్కే (2019)
- ‘బొగ్గు దొరక్కపోతే మీ కరెంట్ బిల్లు పెరగొచ్చు’
- పాకిస్తాన్ ఐఎస్ఐకి కొత్త చీఫ్, ఎలాంటి మార్పులు రానున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








