కాకినాడ పోర్ట్‌లో డ్రగ్స్ దిగుమతులు జరుగుతున్నాయా... అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం ఏంటి?

డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోందని కాకినాడ పోర్టు మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్, డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోందని కాకినాడ పోర్టు మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి.
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

దేశంలోని అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. పంజాబ్‌లో ఎన్నికల ఎజెండాలో డ్రగ్స్ ఒక ప్రధాన అంశం. ఇటీవల తెలంగాణ రాజకీయ నేతలు కూడా దీనికి సంబంధించి ఆరోపణలు చేసుకున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో కూడా డ్రగ్స్ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్ దిగుమతులకు అనుమతి పత్రాలు విజయవాడ అడ్రస్‌తో ఉండడం అందుకు కారణం.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) సిబ్బందికి హెరాయిన్ చిక్కిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం రగులుతోంది. తాజాగా కాకినాడ చుట్టూ ఈ వివాదం ముదురుతోంది.

నిందితుడి మూలాలు కాకినాడలో...

ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్యంలో ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసు విచారణ సాగుతోంది. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

చెన్నైవాసులు మాచవరం సుధాకర్, ఆయన భార్య దుర్గా వైశాలి తో పాటుగా కోయంబత్తూరుకు చెందిన పి. రాజ్‌ కుమార్ అనే ముగ్గురిని నిందితులుగా పేర్కొన్నారు.

ఈ కేసులో నేరపూరిత కుట్ర, విదేశాల నుంచి డ్రగ్స్ రవాణాతో పాటుగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ వంటి అభియోగాలతో కేసు నమోదైంది.

మాచవరం సుధాకర్ తన భార్య పేరుతో తీసుకున్న జీఎస్టీ సర్టిఫికెట్ ఆధారంగా ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఈ వ్యవహారం నడుపుతున్నట్టు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

ఎగుమతులు, దిగుమతుల అనుమతి కూడా అదే కంపెనీ పేరుతో విజయవాడ సత్యనారాయణపురంలోని అత్తగారింటిని చూపించి తీసుకున్నట్టు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు.

తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన సుధాకర్ గతంలో కాకినాడలో పని చేయడంతో ఇప్పుడు వివాదంలో ఆ నగరం ప్రస్తావనకు వస్తోంది. కాకినాడకు చెందిన ఓ ట్రేడింగ్ కంపెనీలో 15 ఏళ్ల క్రితం కొద్దికాలం పాటు సుధాకర్ పని చేశారు.

ఆ తర్వాత కోల్‌కతా, చెన్నై సహా వివిధ ప్రాంతాల్లో పనిచేసి గత ఏడాది సొంతంగా సంస్థను ప్రారంభించినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అదే జిల్లాలో జన్మించడమే కాకుండా కాకినాడలో కొంతకాలం పాటు పనిచేసిన సుధాకర్ అతి పెద్ద డ్రగ్స్ రాకెట్‌లో పట్టుబడడంతో ఆ ప్రకంపనల ప్రభావం కాకినాడను తాకినట్టు కనిపిస్తోంది.

టీడీపీ నేతల ప్రెస్ మీట్ వద్ద ద్వారంపూడి అనుచరుల ఆందోళన
ఫొటో క్యాప్షన్, టీడీపీ నేతల ప్రెస్ మీట్ వద్ద ద్వారంపూడి అనుచరుల ఆందోళన

ఎమ్మెల్యే ద్వారంపూడి చుట్టూ వివాదం

కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికార పార్టీలో కీలక నేత. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా, కాకినాడలో ఆయన పలు వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు.

ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర ఉంటుంది. కాకినాడ పోర్టులో అనేక విషయాల్లో జోక్యం చేసుకుంటారు.

ఎమ్మెల్యే సన్నిహితుల్లో కూడా అనేకమందిపై బెట్టింగ్, భూఆక్రమణలు సహా పలు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నారంటూ అలీషా అనే వ్యాపారిని కేంద్రంగా చేసుకుని టీడీపీ నేతలు విమర్శలు చేశారు.

అలీషా పై ఆయిల్ అక్రమ రవాణా సహా వివిధ కేసులు కూడా ఉన్నాయి. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న నేరాలలో ఆయన పాత్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అదే అలీషా దగ్గరే సుధాకర్ కొంతకాలం పని చేయడంతో వారిద్దరికి సంబంధాలున్నాయని, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందనే విమర్శలకు ఆస్కారం ఏర్పడింది.

సెప్టెంబర్ 16న తగులబడిన బోటు
ఫొటో క్యాప్షన్, సెప్టెంబర్ 16న తగులబడిన బోటు

తగలబడిన బోటులో ఏముంది?

టీడీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ సెప్టెంబర్ 13న ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడగానే, కాకినాడ సమీపంలో బోటు తగులబెట్టేశారన్నది.

సెప్టెంబర్ 16 సాయంత్రం కాకినాడ జగన్నాధపురం బ్రిడ్జికి సమీపంలో పెద్ద ఏరులో ఆగి ఉన్న బోటు తగులబడింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో ఆ బోటులో హెరాయిన్ ఉండడంతో కాల్చేశారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు.

''ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌కు వైసీపీ నేతలతో సంబంధాలున్నాయి. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిని దర్యాప్తు సంస్థకు అందిస్తాం. ఈ కేసులో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులే ప్రధాన నిందితులు. ఎమ్మెల్యే కుటుంబీకులు అఫ్గానిస్తాన్‌కు బియ్యం ఎగుమతులు చేస్తూ ఉంటారు. అక్కడికి పీడీఎస్ బియ్యం పంపించి, డ్రగ్స్ దిగుమతులు చేస్తున్నారు'' అని టీడీపీ నేతలు ఆరోపించారు.

ముంద్రా పోర్టులో డ్రగ్స్ దొరికినట్టు తెలియగానే కాకినాడ బోటులో ఉన్న హెరాయిన్ ని తగులబెట్టేసి ప్రమాదంగా చిత్రీకరించారని, దీనిపై పూర్తి విచారణ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

టీడీపీ ఆరోపణలపై వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మత్స్యకారుల బోట్లను డ్రగ్స్ మాఫియాతో ముడి పెడతారా అంటూ కాకినాడ టీడీపీ ఆఫీసు ముందు నిరసనకు దిగారు. టీడీపీ నేతలతో వాగ్వావాదం, తోపులాటకు కూడా సిద్ధపడ్డారు.

‘షార్ట్ సర్క్యూట్ కారణం’

''సెప్టెంబర్ 16న ఉప్పుటేరులో బోట్లు పార్క్ చేసే స్థలంలో ఆగి ఉన్న బోటు తగులబడింది. దానికి షార్ట్ సర్క్యూట్ కారణం. పోలీసు, ఫైర్, ఫిషరీస్ అధికారులు కూడా అక్కడ చాలాసేపు శ్రమించి మంటలు ఆర్పాల్సి వచ్చింది. దీనికి షార్ట్ సర్య్యూట్ తప్ప మరో కారణమే కనిపించలేదు'' అని కాకినాడ డీఎస్పీ భీమారావు స్పష్టం చేశారు.

''ఘటనా స్థలానికి కాకినాడ టీడీపీ నేతలు కూడా వచ్చారు. బోటు తగులబడినప్పుడు వాసన, పొగ వచ్చిందనే ఆరోపణలు అసంబద్ధం. దానికి సంబంధించి కాకినాడ వన్ టౌన్ పీఎస్ జనరల్ డైరీలో అన్ని వివరాలు ఉన్నాయి'' డీఎస్పీ అన్నారు.

హెరాయిన్ ఉండడం వల్లనే ఆ బోటు ఎక్కువ సేపు తగలబడిందని, సమీప ప్రాంతాలకు వాసన కూడా వచ్చిందన్నది టీడీపీ నేతలు చేస్తున్న వాదన. ఈ వాదనకు తగిన ఆధారాలు వారం రోజుల్లోగా చూపించాలంటూ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకు నోటీసులు కూడా ఇచ్చామని డీఎస్పీ బీబీసీకి తెలిపారు.

కాకినాడ నుంచి అఫ్గానిస్తాన్‌కు బియ్యం తరలివెళుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఫొటో క్యాప్షన్, కాకినాడ నుంచి అఫ్గానిస్తాన్‌కు బియ్యం తరలివెళుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు.

కాకినాడ నుంచి అఫ్గానిస్తాన్‌కు బియ్యం వెళుతుందా?

కాకినాడ పోర్టు నుంచి సుదీర్ఘ కాలంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఇటీవల యాంకరేజ్ పోర్టుతో పాటుగా డీప్ వాటర్ పోర్టుకి కూడా అనుమతులు రావడంతో ఆ ఎగుమతులు పెరిగాయి. ఆగ్నేయాసియాతో పాటుగా ఆఫ్రికా దేశాలకు ఎక్కువగా బియ్యం ఎగుమతి అవుతుంటాయి.

పేదలకు పంపిణీ చౌక దుకాణాల బియ్యం రీప్రాసెసింగ్ చేసి విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. గతంలో పలుమార్లు వాటిని గుర్తించి కొన్ని రైసు మిల్లులు, గోడౌన్లు కూడా సీజ్ చేసిన చరిత్ర ఉంది.

అయితే కాకినాడ నుంచి అఫ్గానిస్తాన్‌కు ఎగుమతులు గానీ, ఎటువంటి దిగుమతులు గానీ జరగడం లేదని కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సీఈవో మురళీధర్ బీబీసీకి తెలిపారు.

''రాజకీయంగా పార్టీలు ఆరోపణలు చేసుకుంటాయి. వాటికి కాకినాడ పోర్టుతో సంబంధం లేదు. కాకినాడ నుంచి అఫ్గానిస్తాన్‌తో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ముంద్రా నుంచి కాకినాడకు తెస్తున్నారనే వాదన కూడా తెస్తున్నారు. అది కూడా నిరాధారం'' అని మురళీధర్ వెల్లడించారు.

''ఒక పోర్టులో దించి, మళ్లీ లోడ్ చేసి రెండో పోర్టుకి తరలించే ప్రక్రియ ఎక్కడా ఉండదు. ఇక షిప్పులో బియ్యం వేసుకుని వెళ్లి అటు నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారని కొందరు అంటున్నారు. కానీ షిప్పు ఒక లోడుతో వెళ్లిన తర్వాత మళ్లీ వెనక్కి కాకినాడ వస్తుందనే గ్యారంటీ లేదు. అక్కడే మరో లోడ్ వేసుకుని ప్రపంచంలో ఏదో మూలకు వెళుతుంది. కాబట్టి డ్రగ్స్ దిగుమతులకు కాకినాడ పోర్ట్ కేంద్రం అనే ఆరోపణలు సరికాదు'' అని మురళీధర్ స్పష్టం చేశారు.

కాకినాడ నుంచి అఫ్గానిస్తాన్‌కి బియ్యం ఎగుమతులు ఇప్పటి వరకూ ఎన్నడూ జరగలేదని రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు కూడా బీబీసీకి తెలిపారు.

కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులు ఇటీవల పెరిగాయి
ఫొటో క్యాప్షన్, కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులు ఇటీవల పెరిగాయి

కంటైనర్ల రవాణాపై ఎమ్మెల్యే ఎందుకలా చెప్పారు..

ద్వారపూడి గ్రామానికి చెందిన సుధాకర్ పట్టుబడడంతో ఈ వ్యవహారం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వరకూ వచ్చింది. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండిస్తున్నారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా బురదజల్లే పనికి దిగుతోందని ఆయన అంటున్నారు.

వాస్తవానికి కాకినాడలో ఇటీవల గంజాయి విక్రయం విస్తృతంగా పెరిగింది. పోలీసులే భారీ స్థాయిలో గంజాయి పట్టుకోగా, అంతకు అనేక రెట్లు గంజాయి అమ్మకాలు సాగుతున్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో తాను ఇటీవల ఐవరీ కోస్ట్ అనే దేశానికి వెళ్లినట్టు ద్వారంపూడి అంగీకరించారు. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఆఫ్రికాలో పర్యటించానని ఆయన చెబుతుండగా, టీడీపీ నేతలు మాత్రం ఆఫ్రికా డ్రగ్స్ రాకెట్లో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తున్నాయి.

వాటికి వివరణ ఇస్తూ కాకినాడ నుంచి కంటైనర్ ద్వారా దిగుమతులు జరగడం లేదని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలిపారు. వాస్తవానికి కాకినాడలో కూడా కంటైనర్ ద్వారా దిగుమతులు జరుగుతున్నాయి. అయితే అవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి.

విశాఖ లాంటి పోర్టులో నెలకు 10 నుంచి 15వేల కంటైనర్ల రవాణా జరిగితే కాకినాడలో అది కేవలం పది లోపు ఉంటుంది. అవి కూడా ఐటీసీ భద్రాచలం, ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు రాజమండ్రి వంటి లిస్టెడ్ కంపెనీలు కెమికల్స్ ని కంటైనర్ ద్వారా దిగమతులు చేసుకున్నట్టు కాకినాడ సీ పోర్ట్ వర్గాలు బీబీసీకి తెలిపాయి.

ఇప్పటికే ఇటీవల డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కంటైనర్ ద్వారా దిగుమతి అయిన సరుకుల వివరాలను పోలీసులు తీసుకున్నారని కూడా వివరించారు.

సీఎం వై.ఎస్.జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు

ఫొటో సోర్స్, Dwarampudi Chandrasekhara Reddy/FB

ఫొటో క్యాప్షన్, సీఎం వై.ఎస్.జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు

'బురదజల్లే పనిలో ఉన్నారు'

''రాజకీయంగా జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే బురదజల్లే పని జరుగుతోంది. కాకినాడలో ఎన్నో ఏళ్లుగా మేం వ్యాపారాలు చేస్తున్నాం. ఇప్పుడు డ్రగ్స్ అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. నిజంగా టీడీపీ నేతల దగ్గర ఆధారాలుంటే దర్యాప్తు అధికారులకు ఇవ్వాలి. కానీ కాకినాడ చుట్టూ వివాదం రాజేయడం కుట్ర'' అన్నారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి.

''కాకినాడలో నేను వచ్చిన తర్వాత గంజాయి పట్టించా. దందాలు అరికట్టాం. శాంతియుత వాతావరణం ఉంది. దానిని చెడగొట్టే పని సాగనివ్వం'' అన్నారాయన.

టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న తరుణంలో పూర్తిస్థాయిలో విచారణకు ప్రభుత్వం వైపు నుంచి సానుకూలత కనిపించడం లేదు. డ్రగ్స్ దందా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఎన్ఐఏ చూసుకుంటుందని ఏపీ పోలీస్ బాస్ కూడా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)