రియా చక్రవర్తి అరెస్ట్: డ్రగ్స్ నిరోధక చట్టం నిబంధనలు ఏం చెప్తున్నాయి?

ఫొటో సోర్స్, PUNIT PARANJPE
- రచయిత, ప్రవీణ్ శర్మ
- హోదా, బీబీసీ కోసం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. సినీ నటి రియాచక్రవర్తిని తాజాగా అరెస్ట్ చేసింది. ఇంతకుముందు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తి, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాందాలను కూడా అరెస్ట్ చేసింది.
శోవిక్, శామ్యూల్‌లలను సెప్టెంబర్ 9వ తేదీ వరకూ.. డ్రగ్స్ సప్లై చేసినట్లు అనుమానిస్తున్న కైజెన్‌ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. తర్వాత డ్రగ్స్ కొనుగోలు, లావాదేవీల కేసులో ఎన్‌సీబీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో సహాయకుడు దీపేష్ సావంత్‌ను కూడా అరెస్ట్ చేసింది.
డిజిటల్ సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా సావంత్‌ను అరెస్ట్ చేశామని ఎన్‌సీబీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ కేపీఎస్ మల్హోత్రా చెప్పారు.
మరో వైపు, కన్నడ సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తున్న కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) నటి రాగిణీ ద్వివేదీని అరెస్ట్ చేసింది.
గతంలో తెలంగాణలో డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా పోలీసులు చాలామంది సినీ ప్రముఖులను కూడా విచారించారు.
సుశాంత్ కేసు, తాజాగా కన్నడ నటి అరెస్టులతో సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఉపయోగం, వాటి వ్యాపారం గురించి ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ఎన్‌డీపీఎస్ యాక్ట్ అంటే?
ఈ డ్రగ్స్ కేసుల ద్వారా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) లాంటి లా ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, ఎన్‌డీపీఎస్ యాక్ట్ కూడా పతాక శీర్షికల్లో నిలిచాయి.
“నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ యాక్ట్-1985 (ఎన్‌డీపీఎస్)లోని సెక్షన్ 20బి, 28, 29 కింద శోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరాందాలను అరెస్ట్ చేశార”ని బీబీసీ కోసం చట్టపరమైన అంశాలను కవర్ చేసే సీనియర్ జర్నలిస్ట్ సుచిత్ర్ మొహంతి చెప్పారు.
ఎన్‌డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20బి కింద డ్రగ్స్ కొనుగోలు చేయటం, ఉత్పత్తి చేయటం, తమ దగ్గర ఉంచుకోవడం, అమ్మటం, రవాణా చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు.
ఎన్‌డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 28లో నేరానికి ప్రయత్నించినందుకు శిక్ష విధిస్తారు. సెక్షన్ 29లో రెచ్చగొట్టడం, నేరపూరిత కుట్రకు పాల్పడానికి శిక్ష విధిస్తారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
శోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరాందాపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయని సుచిత్ర్ మొహంతి చెప్పారు. “దోషులుగా తేలితే వారికి పదేళ్ల వరకూ శిక్ష విధించవచ్చు. ఎన్‌సీబీ 90 రోజులలోపు చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది” అన్నారు.
పశ్చిమ దేశాల్లో, మధ్యప్రాచ్యంలో డ్రగ్స్ ఉపయోగించినా, మాదక ద్రవ్యాల వ్యాపారం చేసినా శిక్షలు కఠినంగా ఉంటాయి.
భారత్‌లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కన్విక్షన్ రేట్ (శిక్ష పడే శాతం) చాలా ఎక్కువని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ దూబే చెప్పారు.
ఈ కేసుల్లో కన్విక్షన్ రేట్ దాదాపు 95 శాతం ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ప్రజలను తప్పుడు కేసుల్లో ఇరికించేస్తారు. కింది కోర్టులు వారిని దోషిగా ఖరారు చేస్తాయి. ఆ కేసులు పై కోర్టుల వరకూ వెళ్లగలిగితే తీర్పులు మారిపోతాయి” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్‌డీపీఎస్ కింద శిక్ష విధించే నిబంధన
ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ ఓపీఎం-18(సి), కేనబిస్-20, కోకా-16 కింద లైసెన్స్ లేకుండా ఓపియం, గంజాయి, కోకా మొక్కలను పెంచితే పదేళ్ల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.
ఈ చట్టంలోని సెక్షన్ 24 కింద విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినా, వాటిని సరఫరా చేసినా కఠిన శిక్షలు విధిస్తారు. ఈ సెక్షన్ ప్రకారం 10 నుంచి 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష, లక్ష నుంచి 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు.
డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునే లక్ష్యంతో మాదక ద్రవ్యాల సాగు, వాటి ఉత్పత్తి, క్రయవిక్రయాలు, దగ్గర ఉంచుకోవడం, ఉపయోగించడం, ఎగుమతులు-దిగుమతులు లాంటి వాటికి కఠిన శిక్షలు విధిస్తున్నారు.
ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 31ఎ కింద డ్రగ్స్ కు సంబంధించిన నేరాలను మళ్లీ మళ్లీ చేసినవారికి మరణశిక్ష విధిస్తారు. ఇప్పటివరకూ ప్రపంచంలోని 32 దేశాల్లో మాత్రమే మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి.
“మన దేశంలో ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985లో వచ్చింది. ఆ తర్వాత నుంచి దానికి ఎలాంటి సవరణలు చేయలేదు. కాలంతో పాటూ అవసరాలను బట్టి వాటిలో మార్పులు చేయాల్సుంటుంద”ని అడ్వకేట్ సంజయ్ దూబే అంటున్నారు.
“భారత్‌లో డ్రగ్స్ వ్యాపారం చేసేవారు, లేదా వాటిని ఉపయోగించేవారిలో ఏ కొందరికో శిక్ష పడుతోంది. శోవిక్, శామ్యూల్‌కు ఎలాంటి శిక్ష పడుతుందనేది, పోలీసుల దర్యాప్తుపై ఆధారపడి ఉంటుంద”ని ఆయన భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సవరణలు అవసరం
అయితే, మాదక ద్రవ్యాల నేరాలైనా, వేరే ఎలాంటి కేసులైనా న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత ముఖ్యం అని సంజయ్ దూబే చెబుతున్నారు.
“మన దేశ న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు కింది కోర్టులో ఒక తీర్పు వస్తుంది. కానీ అపీల్ చేసుకుంటే పై కోర్టు ఆ తీర్పును కొట్టేస్తుంది. అంటే దానికి అర్థమేముంది” అంటారు దూబే.
“ఇలాంటి తీర్పులతో ప్రజలు డబ్బు, న్యాయవ్యవస్థ సమయం రెండూ వృథా అవుతాయి. యూఏఈ లేదా మిగతా దేశాల్లో 7-8 నెలల్లోనే నిందితుడు దోషా, నిర్దోషా అనేది తేలిపోతుంది. మన దేశంలో తీర్పు రావడానికే ఏళ్లు పడుతోంది. కేసులను నిర్ణీత కాలంలో పరిష్కరించాల”ని అన్నారు.
ఎన్‌డీపీఎస్ నిర్మాణం
ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద నార్కోటిక్స్ కమిషనర్ (సెక్షన్ 5), కాంపిటెంట్ అథారిటీ (సెక్షన్ 68డి), అడ్మినిస్ట్రేటర్ (సెక్షన్ 68జి) లాంటి చట్టపరమైన అధికారాలను సృష్టించారు.
నార్కోటిక్స్ కమిషనర్ నేతృత్వంలో ఉండే సంస్థను సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) అంటారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనే మరో అథారిటీని ఎన్‌డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 4 కింద ఏర్పాటు చేశారు. అన్ని సంస్థల పనితీరు స్థిరంగా ఉంటుంది.
నిబంధనల ప్రకారం ఎన్‌డీపీఎస్ యాక్ట్ పరిపాలనను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ చూసుకుంటుంది.
భారత్‌లో ఎన్‌డీపీఎస్ చట్టాన్ని బ్రిటన్ నార్కోటిక్స్ నేరాలను అడ్డుకోడానికి చేసిన కొత్త చట్టం ఆధారంగా రూపొందించారు.
అయితే, దేశంలో డ్రగ్స్ డిమాండ్ తగ్గించడానికి సంబంధించిన పనులను సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. దానికోసం ఈ శాఖ వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేస్తుంది.
భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యసనాల నుంచి విముక్తి అందించేందుకు కేంద్రాలను నడుపుతోంది.
ఎన్‌డీపీఎస్ కింద హోంమంత్రిత్వ శాఖ అధీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వేరువేరు అధికారులతో కలిసి పనిచేస్తుంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- మీడియా జడ్జి పాత్ర పోషించొచ్చా.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అలాంటి కేసులివే
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- అన్నం తింటే డయాబెటిస్ వస్తుందా
- ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు.. పరువు కోసం చంపేస్తామంటున్న కుటుంబం
- ‘అధ్యాపక వృత్తి నుంచి వచ్చి వెండితెరపై వెలిగిన నటుడు జయప్రకాశ్ రెడ్డి’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








