ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు.. పరువు కోసం చంపేస్తామంటున్న కుటుంబం.. లెస్బియన్ జంటకు సెక్యూరిటీ ఇచ్చిన కోర్టు

పోలీస్ ట్రైనింగ్ సమయంలో పాయల్, కాంచన్ ప్రేమలో పడ్డారు. అయితే వారికి చాలా వ్యతిరేకత ఎదురైంది. దీంతో తమ కుటుంబాల నుంచే రక్షణ కల్పించాలని వారు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ అంశంపై బీబీసీ గుజరాతీ ప్రతినిధి భార్గవ్ పారిఖ్ అందిస్తున్న కథనం.
2017లో కాంచన్‌ను తొలిసారి కలిసినప్పుడు ప్రేమలో పడతానని పాయల్ ఎప్పుడూ అనుకోలేదు. అదే ఏడాది స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీం కోర్టు కూడా తీర్పునిచ్చింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు మద్దతు పలుకుతూ ఇదివరకు ఇచ్చిన తీర్పును తిరగరాసింది. కానీ ఏళ్లనాటి సంప్రదాయాలు, ధోరణులు స్వలింగ సంపర్క సంబంధాలకు ఇప్పటికీ అడ్డుగోడగానే నిలుస్తున్నాయి.
24ఏళ్ల వయసున్న వీరిద్దరూ 2018 నుంచీ గుజరాత్‌లో కలిసే జీవిస్తున్నారు. వివక్ష అంటే ఎలా ఉంటుందో వీరు ప్రత్యక్షంగా అనుభవించారు కూడా. వీరు ఇటీవల హైకోర్టు తలుపుతట్టినప్పుడు వీరి ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది.
''మా కుటుంబాలు మా బంధానికి వ్యతిరేకంగా మారాయి. వారు మమ్మల్ని బెదిరిస్తున్నారు''అని కోర్టు ముందు దాఖలుచేసిన అభ్యర్థనలో పాయల్ తెలిపారు. తమకు పోలీసు రక్షణ ఇప్పించమని వేడుకొన్నారు. వెంటనే ఈ జంటకు సాయుధ బలగాల రక్షణ కల్పించాలని కోర్టు సూచించింది.
తమ కుటుంబానికి మచ్చ తెచ్చారంటూ సొంతవారిని మట్టుపెట్టే పరువు హత్యలు భారత్, ఇతర దక్షిణాసియా దేశాల్లో సర్వసాధారణం. భారత్‌లో కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి లేదా ప్రేమ వ్యవహారాలను నడిపే వారిని వందల సంఖ్యలో హతమారుస్తున్నట్లు ఇటీవల ఒక సర్వే తేల్చింది.
గుజరాత్‌లోని రెండు మారుమూల గ్రామాల్లో పాయల్, కాంచన్ పెరిగారు. అక్కడ సంప్రదాయ విలువలు, పురుషాధిపత్యానిదే పెద్దపీట. తమకు ఎదురైన అడ్డుగోడలను ఛేదించి పురుషులు ఆదిపత్యంగా ఉండే రంగాల్లో రాణించాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. అందుకే పోలీస్ రంగాన్ని వారు ఎంచుకున్నారు.

2017లో వారు తొలిసారి కలిసినప్పుడు బృందంలోని మిగతావారు తమతో మాట్లాడటానికి అంత సుముఖంగా లేరని వారు తెలిపారు. ఎందుకంటే మిగతా వారంతా పట్టణాలు, నగరాల నుంచి వచ్చినవారని, తాము మాత్రం గ్రామీణ నేపథ్యమున్న వారిమని వివరించారు. తమని వేరుగా పెడుతున్నారనే భావన కలిగేదని చెప్పారు.
పోలీస్ శిక్షణ సమయంలో వీరిద్దరికీ ఒకే గది కేటాయించారు. దీంతో వీరిద్దరి దిన చర్యలు క్రమంగా కలవడం మొదలైంది. ఎక్సర్‌సైజ్‌ల అనంతరం సాయంత్రం వీరు కూర్చుని మాట్లాడుకునేవారు. అలా వీరి మాటలు కుటుంబ నేపథ్యాల వరకూ వెళ్లాయి. క్రమంగా వీరు ప్రాణ స్నేహితులుగా మారారు.
''కాంచన్ నా బట్టలు ఉతికితే, నేను తన కోసం భోజనం వండేదాన్ని. కాలంతోపాటు మా బంధం మరింత బలపడింది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మేం ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం''అని పాయల్ తెలిపారు.
మరోవైపు వీరికి పోస్టింగ్ కూడా ఒకే నగరంలో వచ్చింది. దీంతో పోలీసు సిబ్బందికి ఇచ్చే వసతుల్లో ఓ గదిని ఇద్దరూ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
''పాయల్‌కు నైట్ డ్యూటీ ఉంటే.. ఇంట్లో పనంతా నేను చేసేదాన్ని. ఒకవేళ నాకు నైట్ డ్యూటీ ఉంటే.. పాయల్ పనంతా చూసుకునేది''అని కాంచన్ తెలిపారు. ''మా పనులతో మేం చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కాలంతోపాటు మా జీవితాలు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి''
ఈ సమయంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
''2017, డిసెంబరు 31న కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా మేం ఒకరినొకరు హత్తుకున్నాం. అదే తొలిసారి మేం ఒకరినొకరం హత్తుకోవడం. మాకు చాలా కొత్తగా అనిపించింది''అని కాంచన్ తెలిపారు.
అయితే, పెళ్లి చేసుకోవాలంటూ వీరిపై కుటుంబాలు ఒత్తిడి తేవడం మొదలుపెట్టాయి. పెళ్లి సంబంధాలు కూడా చూశాయి. ఆ ఒత్తిడిని వీరు ఎలాగోలా తట్టుకొనేవారు. గతేడాది చివరిలో వీరి మధ్య సంబంధం సహచర ఉద్యోగులకు తెలిసింది. దీంతో దీన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయాలని వీరు భావించారు.
''మేం చెప్పగానే వారు షాక్‌కు గురయ్యారు''అని పాయల్ తెలిపారు.
''మేం ఈ విషయాన్ని చెప్పిన తర్వాత, మా ప్రతి కదలిక పైనా వారు నిఘా పెట్టారు. ఈ ఏడాది మొదట్లో పరిస్థితులు మరింత దిగజారాయి''.
''ఒకరోజు మేం విధులు నిర్వర్తిస్తున్నప్పుడు.. మా కుటుంబ సభ్యుల్లో ఒకరు మమ్మల్ని అనుసరించారు. రోడ్డు మధ్యలోనే వాహనాన్ని ఆపి బెదిరించారు''అని పాయల్ వివరించారు. ''పోలీసు క్వార్టర్స్‌కు కూడా వారు ఒకసారి వచ్చి గందరగోళం సృష్టించారు. అసభ్యకర పదజాలంతో దూషించారు''

ఫొటో సోర్స్, Getty Images
''కొన్నిరోజుల తర్వాత చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. అప్పుడే పోలీసు రక్షణ కోసం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాం''
తమకు అనుగుణంగా కోర్టు తీర్పును ఇవ్వడంపై ఈ జంట సంతోషం వ్యక్తంచేసింది. తాజా తీర్పుతో భవిష్యత్ గురించి ఆలోచించుకోవడానికి కొంచెం సమయం దొరికిందని తెలిపింది.
''కరోనావైరస్ వ్యాప్తి ముగిసిన వెంటనే మేం హనిమూన్ కోసం దక్షిణ భారత్‌కు వెళ్తాం''అని కాంచన్ వివరించారు.
భవిష్యత్‌లో ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
భారత్‌లో స్వలింగ సంపర్కం నేరంకాదు. అయితే వీరి వివాహాలు, దత్తత హక్కులను గుర్తించే ఎలాంటి చట్టాలూ ఇక్కడ లేవు. కానీ త్వరలో ఇవి వస్తాయని వీరు ఆశాభావం వ్యక్తంచేశారు.
''మేం ఇప్పుడు 24ఏళ్ల వయసులో ఉన్నాం. డబ్బుల్ని దాచుకోవాలని అనుకుంటున్నాం. ఓ చిన్నారిని కూడా దత్తత తీసుకుంటాం. తనను బాగా పెంచి, మంచి చదువులు చదివిస్తాం''అని పాయల్ వివరించారు.
బొమ్మలు నిఖిత దేశ్‌పాండే
కథనంలో గోప్యతను కాపాడేందుకు అమ్మాయిల పేర్లు మార్చాం.
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఈ పిల్ వేసుకుంటే కండోమ్ అవసరం ఉండదు.. కానీ అది మార్కెట్లోకి రావట్లేదు?
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- కరోనావైరస్: గుజరాత్‌లో కోవిడ్-19 మరణాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి?
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
- కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- జగన్ ఏడాది పాలనలో టీడీపీ నేతలు ఎవరెవరిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఆ కేసులు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








