కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనల నడుమ సినిమా హాళ్లు మూతపడి దాదాపు మూడు నెలలు అవుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు అనుమతిచ్చారు. మరి సినిమా థియేటర్లను ఎప్పుడు తెరుస్తారు?
కోవిడ్-19 వ్యాపించకుండా ఉండేందుకు థియేటర్లలో ఏం మార్పులు చేస్తున్నారు? థియేటర్‌లో లోపల సామాజిక దూరం పాటించడం సాధ్యమేనా?
"రోజుకు 30 కోట్లనష్టం"
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. భారత్‌లో 9,500కిపైనే సినిమా స్క్రీన్‌లు ఉన్నాయి. టికెట్ల విక్రయాల ద్వారానే రోజుకు రూ.30 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. తినుబండారాలు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం దీనికి అదనం.
అయితే లాక్‌డౌన్‌తో థియేటర్లపై చాలా ప్రతికూల ప్రభావం పడింది. భారత్‌లో ఐదో అతిపెద్ద మల్టీప్లెక్సుల చైన్ మిరాజ్ సినిమాస్ తీవ్రమైన నష్టాల బాట పట్టింది. సంస్థలో కొంత భాగాన్ని విక్రయించాలని నిర్ణయించినట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ శర్మ.. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.
పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్, కార్నివల్ సినిమాస్, సినీపోలిస్ లాంటి మల్టీప్లెక్స్ చైన్‌ల ఆదాయమూ లాక్‌డౌన్‌తో పూర్తిగా పడిపోయింది.
ఈ థియేటర్ చైన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) అయితే మల్టీప్లెక్స్‌ల ఓనర్లు, డెవలపర్లకు బహిరంగంగా సాయం కోరుతూ అభ్యర్థించింది. లాక్‌డౌన్ కాలంతోపాటు మళ్లీ పరిస్థితి మునుపటికి వచ్చేవరకూ అద్దె, కామన్ ఏరియా మెయింటెనెన్స్ (కామ్)ల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోరింది.
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకీ సాయం కోరుతూ ఎంఏఐ బహిరంగ లేఖ విడుదల చేసింది.
"మల్టీప్లెక్స్ పరిశ్రమ దాదాపు 2 లక్షల మందికి ఉపాది కల్పిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో నిర్వహణ ఖర్చులు, జీతాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చులు వీటికి అదనం. ఈ పరిస్థితి నుంచి బయటపడటంలో సాయం చేయాలి."అని అభ్యర్థించింది.

ఫొటో సోర్స్, Reuters
థియేటర్లు తెరచినా ప్రేక్షకులు వస్తారా?
ఫిబ్రవరి చివరినాటికి కరోనావైరస్ వ్యాప్తికి చైనా దాదాపుగా కళ్లెం వేసింది. చివరగా సడలించిన లాక్‌డౌన్ ఆంక్షల్లో సినిమా థియేటర్లను మళ్లీ తెరవడమూ ఒకటి.
అయితే, సినిమా థియేటర్లు తెరచినా వచ్చే ప్రేక్షకులు అంతంత మాత్రంగానే వస్తున్నట్లు చైనా ఫిల్మ్ అసోసియేషన్ వెల్లడించింది. 40 శాతానికిపైగా థియేటర్ల పరిస్థితి మూసేసే స్థాయికి దిగజారినట్లు తెలిపింది.
ముఖ్యంగా 500 కంటే తక్కువ సీట్లుండే చిన్న సినిమా థియేటర్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని, గతేడాది రెవెన్యూతో పోలిస్తే.. ప్రస్తుతం పది శాతం కూడా అర్జింజ లేకపోతున్నాయని సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది.
ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి కొత్త సినిమాలు లేకపోవడంతోపాటు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలు పెరగడమూ ఒక కారణమని అసోసియేషన్ విశ్లేషించింది.
భారత్‌లోనూ లాక్‌డౌన్‌తో చాలా సినిమాల షూటింగ్‌లపై ప్రభావం పడింది. చాలా సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. మరికొన్ని ఎప్పుడు విడుదలవుతాయో కూడా తెలియదు.
మరోవైపు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ-5, హాట్‌స్టార్ లాంటి స్ట్రీమింగ్ సేవల హవా కొనసాగుతోంది. ఒరిజినల్స్ పేరుతో నేరుగా ప్లాట్‌ఫామ్‌పైనే విడుదల చేసే సినిమాలు ఎక్కువయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
థియేటర్లలో తీసుకునే చర్యలు ఏంటి?
కరోనావైరస్ వ్యాప్తికి కళ్లెం వేయడంతోపాటు ప్రేక్షకులకు థియేటర్లను సురక్షితంగా మార్చేందుకు మల్టీప్లెక్సులు చర్యలు తీసుకుంటున్నాయి. దీనికి సంబంధించి థియేటర్లు తెరిచాక మొదటి రెండు నెలలూ తీసుకోబోయే చర్యలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఎంఏఐ సమర్పించింది. దానిలోని వివరాల ప్రకారం..
- బాక్స్ ఆఫీస్, సెక్యూరిటీ, ప్రేక్షకులు నిరీక్షించే ప్రాంగణాలు, థియేటర్ లోపల, ఆహార విక్రయ పరిసరాలు, బాత్‌రూమ్‌లు.. ఇలా అన్నింటినీ తరచూ శానిటైజ్ చేస్తారు.
- ఇన్‌ఫ్రారెడ్ స్కానర్లతో శరీర ఉష్ణోగ్రతను లోపలికివచ్చేటప్పుడు కొలుస్తారు.
- అందరికీ మాస్క్‌లు తప్పనిసరి. ప్రేక్షకుల కోసం పీపీఈ కిట్లు కూడా థియేటర్లలో అమ్ముతారు.
- అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోనూ చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి.
- థియేటర్ ప్రాంగణంలో ప్రేక్షకులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేందుకు నేలపై గుర్తులు ఉంచుతారు.
- డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తారు.
- కుటుంబాలు, జంటలు, స్నేహితులు.. ఇలా బృందాలుగా వచ్చేవారిని పక్కపక్కన కూర్చోడానికి అనుమతిస్తారు. ఈ బృందాలకు అటూఇటూ ఒక సీటు ఖాళీగా వదిలేస్తారు.
- లగ్జరీ ఆడిటోరియంలకు మాత్రం ఇలా సీట్లు ఖాళీగా ఉంచరు. ఎందుకంటే ఇక్కడ సీట్ల మధ్య తగినంత దూరం ఉంటుంది.
- సింగిల్ యూస్ 3డీ గ్లాస్‌లను అందుబాటులోకి తెస్తారు.
- సిబ్బందికి మొత్తం ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి.
‘సిబ్బందికి ప్రత్యేక శిక్షణ’ - పీవీఆర్
ప్రేక్షకుల్లో కరోనావైరస్ వ్యాప్తి భయం పోగొట్టేందుకు తాము మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారత్‌లో అత్యధిక థియేటర్లను నడిపిస్తున్న పీవీఆర్ సినిమాస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా 80పైచిలుకు స్క్రీన్‌లను సంస్థ నడిపిస్తోంది.
ప్రేక్షకుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని తాము సిబ్బందికి కొత్త శిక్షణ ఇస్తున్నామని, పని విధానాల్లోనూ మార్పులు చేస్తున్నామని పీవీఆర్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీప మేనన్ వివరించారు. పీవీఆర్ అదనంగా తీసుకుంటున్న చర్యలివి..
ప్రతి సినిమా షో తర్వాత సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి.. అన్ని పరిసరాలను శానిటైజ్ చేస్తారు. ప్రతి రోజు మెడికల్ గ్రేడ్ డిస్ఇన్ఫెక్షన్ కెమికల్స్‌తో శుభ్రం చేస్తారు.
- బాక్స్ ఆఫీస్‌కు వచ్చే కరెన్సీ నోట్లనూ యూవీ కిరణాలతో శానిటైజ్ చేస్తాం.
- ఫుడ్ ప్యాకేజీకి వాడే సామగ్రిని యూవీ కిరణాలతో శానిటైజ్ చేస్తాం.
- ఉష్ణోగ్రత 99.5 డిగ్రీల కంటే ఎక్కువుంటే వెనక్కి పంపించేస్తాం. డబ్బులనూ వెనక్కి ఇచ్చేస్తాం.
- డోర్ హ్యాండిల్స్, లిఫ్టులో బటన్లు, గోడలకు యాంటీబాక్టీరియల్ ఫిల్మ్స్ అంటిస్తాం.
- ఆడిటోరియం మొత్తం అల్ట్రా లోవాల్యూమ్ శానిటేషన్ ప్రాసెస్ చేపడతాం. దానివల్ల అన్ని ఉపరితలాలపై యాంటీ మైక్రోబియల్ లేయర్ వస్తుంది.
- కుర్చీలపై శానిటైజ్ చేసినట్లు తెలియజెప్పే సీట్ బ్యాండ్స్ ప్రతిసారీ పెడతాం.
- కుర్చీల మధ్య గ్లాస్ ప్యానెల్స్ ఏర్పాటుచేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఏంటి?
లాక్‌డౌన్ ప్రభావంతో కొన్ని చిన్న సినిమా థియేటర్లు అయితే మూసేసే పరిస్థికి వచ్చాయి. కొన్ని సూపర్ మార్కెట్ చైన్‌లు.. థియేటర్లను తమకు ఇచ్చేయాలని అడుగుతున్నట్లు ఓ చిన్న సినిమా థియేటర్ యజమాని వివరించారు.
జనవరి వరకు పరిస్థితి ఇలానే ఉండేలా అనిపిస్తోందని హైదరాబాద్‌లోని అర్జున్, వైజయంతి, ప్రతాప్ థియేటర్ల యజమానుల్లో ఒకరైన ఎన్ సదానంద గౌడ్ వివరించారు.
"థియేటర్లు తెరచినా ప్రేక్షకులు రాకపోవచ్చు. మేం థియేటర్లను లీజుకు తీసుకున్నాం. ఈ కష్టకాలంలో అద్దెలు ఇవ్వకపోయినా ప్రాపర్టీ ఓనర్లు మమ్మల్ని అర్థంచేసుకుంటున్నారు. నిర్వహణ, విద్యుత్ బిల్లులు, జీతాలు మాత్రం కట్టుకుంటున్నాం. విద్యుత్ బిల్లులే కనిష్ఠంగా నెలకు రూ.30 నుంచి 40 వేలు కట్టాల్సి వస్తోంది. లాక్‌డౌన్ తెరిచాక టికెట్ ధరలు పెంచితే.. వచ్చేవారు కూడా రారు."
"మొదట నెల సిబ్బందికి పూర్తి జీతాలు ఇచ్చాం. రెండో నెల 50 శాతం, మూడో నెల 40 శాతం జీతాలు ఇచ్చాం. ఏవైనా ఉద్యోగాలుంటే చూసుకోమని కొందరికి చెప్పాం."
"50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అయితే ఇది సాధ్యంకాదని నిర్మాతలు అంటున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీకి శానిటైజేషన్ ప్రక్రియలు తోడైతే.. చిన్న సినిమా థియేటర్లు నడవడం చాలా కష్టం".
"విద్యుత్ బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్‌లను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. దీనిపై చర్చలు జరుపుతామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు."
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
"మంచి సినిమాలుంటే ప్రేక్షకులు వస్తారు"
మరోవైపు లాక్‌డౌన్ తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లకే ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశముందని హైదరాబాద్లోని శారద థియేటర్ యజమాని కాలేశ్వర్‌గౌడ్ అన్నారు.
"ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనతో అనుమతులు ఇచ్చేలా కనిపిస్తోంది. మల్టీప్లెక్సుల్లో 200 నుంచి 350 వరకు మాత్రమే సీట్లు ఉంటాయి. అదే సింగిల్ థియేటర్ అయితే 800కుపైనే సీట్లు ఉంటాయి. దీంతో ఇక్కడకు వచ్చే ఆడియెన్స్ ఎక్కువ ఉంటారు."
థియేటర్లను తెరచిన తర్వాత ప్రేక్షకులు వచ్చే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు రావడమనేది సినిమాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
మంచి సినిమాలతో ఆడియెన్స్ తప్పకుండా థియేటర్లకు వస్తారని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత దగ్గుబాటి సురేశ్ కూడా చెప్పారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీల తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








