కరోనావైరస్ - ముంబయి: ‘రూ.6 లక్షలు బిల్లు.. మొత్తం కట్టి, శవాన్ని తీసుకెళ్లండి..’ రోగి బంధువులకు ఓ ప్రైవేటు ఆస్పత్రి అల్టిమేటం

కరోనావైరస్ శవం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కరోనావైరస్ తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఏ చికిత్సకు ఎంత ధర చెల్లించాలో నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రులు ప్రభుత్వ ఉత్తర్వులను పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది.

ముంబయిలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్ చికిత్స పేరిట లక్షల రూపాయలు రోగుల నుంచి వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాల తర్వాత కూడా ప్రైవేటు ఆస్పత్రులు లాభార్జన కోసమే ప్రయత్నిస్తున్నాయా? అలాంటప్పుడు సర్కారు వారి దోపిడిని ఎప్పుడు అడ్డుకుంటుంది? ఇవి ఇప్పుడు జనం మదిలో మెదులుతున్న ప్రశ్నలు.

12 రోజుల చికిత్స కోసం రూ.7 లక్షల బిల్లు

ముంబయి నగర పరిధిలో ఉన్న కుర్లా ప్రాంతానికి చెందిన సాగర్ కొఛ్లే.. తన తల్లి ఆరోగ్యం బాగులేకపోవడంతో మే25న బెలపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. కోవిడ్-19తో పాటు, మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో కూడా ఆమె బాధపడుతున్నారు.

“నా తల్లికి 12 రోజుల చికిత్సకు రూ. 7 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. ఆమెను మరో పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచాలని డాక్టర్ చెప్పారు. కొన్ని సార్లు రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు అయ్యేది. ఆస్పత్రి పరిపాలనా విభాగం వారు నన్ను ఇప్పటికిప్పుడు రూ. 4లక్షలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఉన్న ఫళంగా రూ. 4 లక్షలు తెమ్మంటే నేను ఎక్కడ నుంచి తీసుకొస్తాను? ఉన్నదంతా ఊడ్చి వారికే ఇస్తే ఇక మేం బతికేదెలా? ప్రభుత్వం ఇప్పటికే చికిత్సకు సంబంధించి తగిన ధరలను నిర్ణయించింది. కానీ ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు ఆస్పత్రులు అనుసరిస్తున్నాయో లేదో ఎవరు చూస్తున్నారు?” అని సాగర్ బీబీసీతో అన్నారు.

ఇప్పుడు ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలని ఆయన ప్రశ్నిస్తున్నారు.

“నేను ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను. నాకు ఓ సోదరుడు, తండ్రి ఉన్నారు. అమ్మ చికిత్స కోసం నా స్నేహితులు, బంధువుల నుంచి డబ్బు అప్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. చూస్తుంటే ఆస్పత్రి బిల్లు మున్ముందు మరింత పెరిగిపోనుంది. ఆ బిల్లు ఎలా కట్టాలో నాకు అర్థం కావడం లేదు. రోజూ ఆస్పత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు” అని సాగర్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

సాగర్
ఫొటో క్యాప్షన్, సాగర్

డబ్బు కట్టిన తర్వాత శవాన్నే అప్పగిస్తారట!

ప్రైవేటు ఆస్పత్రుల దందాపై ప్రభుత్వానికి, ముంబయి మున్సిపాలిటీ విభాగానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఉత్తర ముంబయిలోని బొరివలి ప్రాంతంలో కూడా అటువంటి ఘటన ఒకటి జరిగింది.

బిల్లు మొత్తం చెల్లిస్తే కానీ రోగి శవాన్ని అప్పగించేది లేదని ఓ ప్రైవేటు ఆస్పత్రి తేల్చి చెప్పినట్టు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

వక్క పలుకుల వ్యాపారం చేసే అమిర్ షేక్ తండ్రికి కరోనా సోకింది. చికిత్స కోసం బొరివలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

“నా తండ్రిని ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి వాళ్లు బిల్లు చెల్లించాలని వెంటపడుతునే ఉన్నారు. మొత్తం బిల్లు దాదాపు రూ.6 లక్షల వరకు అయ్యింది. ఎలాగోలా రూ.4 లక్షల రూపాయలను చెల్లించగల్గాను. అంత ఖర్చు పెట్టినా నా తండ్రి ప్రాణాలు దక్కలేదు. చివరకు ఆయన మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్దామనుకుంటే మిగతా బిల్లు కడితే కానీ మృత దేహాన్ని ఇచ్చేది లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. మా నాన్న ఉదయం చనిపోయారు. మధ్యాహ్నం వరకు డెడ్ బాడీని ఇవ్వలేదు. మిగిలిన రూ.2 లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత శవాన్ని మాకు అప్పగించారు” అని తనకు ఎదురైన అనుభవాన్ని బీబీసీకి వివరించారు అమీర్ షేక్.

బిల్లు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు తనను పదే పదే వేధించాయని అమీర్ ఆరోపించారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా క్వారంటైన్లో ఉండటంతో ఎవ్వరూ కూడా ఆస్పత్రి వద్దకు రాలేకపోయారు. దీంతో వాళ్లకు ఏం జరిగిందో కూడా తెలియదు.

“నేను ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశాను. ఆస్పత్రిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాను. ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న ఈ దోపిడిని కచ్చితంగా అరికట్టాలి” అని అమీర్ అన్నారు.

కరోనావైరస్ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన బిల్లు
ఫొటో క్యాప్షన్, కరోనావైరస్ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన బిల్లు

ప్రైవేటు ఆస్పత్రులపై పెరుగుతున్న ఫిర్యాదులు

మహాత్మ జ్యోతిబా పూలే పబ్లిక్ హెల్త్ స్కీమ్ విభాగానికి చెందిన అధికారులకు ఇప్పటి వరకు ప్రైవేటు ఆస్పత్రులపై 47 ఫిర్యాదులు అందాయి. వాటిల్లో కొన్ని అధిక బిల్లులకు సంబంధించినవి కాగా మరిన్ని ఆస్పత్రుల్లో బెడ్స్‌కు సంబంధించినవి మరి కొన్ని.

“ఈ మహమ్మారి విరుచుకుపడుతున్న ఈ పరిస్థితుల్లో రోగి కరోనాతో కానీ మరే ఇతర వ్యాధితో బాధపడుతున్నప్పటికీ చికిత్స అందుబాటు ధరల్లో లభించాలి. ఆ ఉద్ధేశంతోనే ప్రభుత్వం ఒక్కో చికిత్సకు ఒక్కో ధరను నిర్ణయించింది” అని మహాత్మ జ్యోతిబా పూలే ఆరోగ్య పథకం సీఈఓ డాక్టర్ సుధాకర్ షిండే బీబీసీతో అన్నారు.

ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఆయా నగరాల్లో మున్సిపల్ కమిషనర్లకు, జిల్లాల్లో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రున్నింటికీ షోకాజ్ నోటీసులు జారీ చేశామని డాక్టర్ సుధాకర్ చెప్పారు.

“ఈ విషయంలో నగరాలు, జిల్లా స్థాయిల్లో ఓ ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయాలి. డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా వచ్చే ఫిర్యాదులపై కమిషనర్లు,కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముంబయిలో ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చే ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించాం. ఫలితంగా రోగుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం తగిన చర్యలు తీసుకోవచ్చు” అని డాక్టర్ సుధాకర్ అన్నారు.

కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజే తోపే ముంబయి నగరంలోని నాలుగు ప్రముఖ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆపై ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదంటూ వాటికి షోకాజ్ నోటీసులను జారీ చేశారు. అయినప్పటికీ ముంబయిలోని ప్రైవేటు ఆస్పత్రులు చికిత్స పేరిట లక్షలు గుంజుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

“ఆస్పత్రులు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్(టీపీఏ) లేదా బీమా ప్యాకేజీని అనుసరించే ధరలు నిర్ణయించాలి. ఇష్టానుసారం ధరల్ని నిర్ణయిస్తే మేం ఊరుకోం. ఒక వేళ ఆ నెపంతో వైద్యులు, ఇతర సిబ్బంది ఆస్పత్రులకు రాకపోతే వాళ్లపై ‘మెస్మా’ చట్టం ప్రయోగించాల్సి ఉంటుంది. రోగులకు కచ్చితంగా అవసరం మేరకు బెడ్స్‌ కేటాయించాల్సిందే” అని తన ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీల తర్వాత మంత్రి రాజేశ్ వ్యాఖ్యానించారు.

కరోనావైరస్:ముంబైలో ప్రైవేటు ఆస్పత్రుల దందా

ఐఏఎస్ అధికారుల నియామకం

ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు బెడ్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని, అలాగే అధిక ధరలు వసూలు చేస్తున్నాయని బ‌ృహన్ ముంబయి(బీఎంసీ) మున్సిపల్ కార్పొరేషన్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అటువంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించారు. ఒక్కో అధికారి ఒక నిర్ణీత సంఖ్యలో ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల బాధ్యతల్ని అప్పగించారు. ఆ ఆస్పత్రులకు సంబంధించి రోగుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వారు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు.

అధికారుల వివరాలు..

1.మదన్ నగర్జోజే-

ఫిర్యాదులు చేయాల్సిన ఈమెయల్ అడ్రస్: [email protected]

2) అజిత్ పటేల్

ఫిర్యాదులు చేయాల్సిన ఈమెయల్ అడ్రస్: [email protected]

3)రాధాకృష్ణన్

ఫిర్యాదులు చేయాల్సిన ఈమెయల్ అడ్రస్: [email protected]

4) సుశీల్ ఖోవడ్కర్

ఫిర్యాదులు చేయాల్సిన ఈమెయల్ అడ్రస్: [email protected]

5) ప్రశాంత్ నార్నవరే

ఫిర్యాదులు చేయాల్సిన ఈమెయల్ అడ్రస్: [email protected]

ముంబయిలోని మొత్తం 35ప్రైవేటు ఆస్పత్రుల బాధ్యతను ఆ ఐదుగురు అధికారులకు అప్పగించారు. ఎటువంటి ఫిర్యాదులైనా ఆయా ఆస్పత్రులను పర్యవేక్షిస్తున్న అధికారుల ఈమెయిల్ అడ్రస్‌లకు పంపాలని ప్రజలకు బీఎంసీ విజ్ఞప్తి చేసింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి?

ప్రభుత్వం నిర్ణయించిన ధరల్ని కాదని కోవిడ్ -19 చికిత్స పేరిట అధిక రుసుముల్ని వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై రోగుల బంధువులు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతల్ని డాక్టర్ నగరేశ్ సోంకాంబ్లేకి అప్పగించింది మహాత్మ జ్యోతిబా పూలే ప్రజారోగ్య పథకం విభాగం.

“వాట్సాప్, ఈమెయిల్, సామాజిక మాధ్యమాల ద్వారా మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ మేం సంబంధిత అధికారులకు పంపిస్తున్నాం. చాలా వరకు ముంబయి, పూణె, థానే ప్రాంతాలనుంచే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి” అని డాక్టర్ నగేశ్ బీబీసీకి చెప్పారు.

ప్రైవేటు ఆస్పత్రుల దందాను అరికట్టడంలో భాగంగా ఆస్పత్రులలోని 80శాతం బెడ్స్ ధల్ని నిర్ణయించింది ప్రభుత్వం. బీమా సౌకర్యం ఉన్న రోగులకు ఆయా కంపెనీల నియమ నిబంధనలకు అనుగుణంగా ధరల్ని వసూలు చేయవచ్చు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు (రోజుకి)

కోవిడ్ బెడ్ లేదా ఐసోలేషన్ –రూ. 4,000

ఐసీయూ –రూ.7,500

వెంటిలేటర్ –రూ.9,000

అధిక ధరలు వసూలు చేస్తున్న ఆస్పత్రుల గురించి మాట్లాడుతూ డాక్టర్ నగేశ్ ఇలా అన్నారు. “ఆయా ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలని కోరినప్పుడు, సిబ్బంది లేరనో, సంబంధిత వైద్యులు తమ ఫీజుల్ని పెంచారనో, నర్సులు, ఐసీయూ సిబ్బంది కూడా ఎక్కువ జీతం డిమాండ్ చేస్తున్నారో ఇలా ఏదో ఒక సాకు చెబుతూ వస్తున్నాయి. రక్త పరీక్షలు, ఎక్స్ రే, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఇవన్నీ కలిపే ప్రభుత్వం ఆయా ధరల్ని నిర్ణయించింది. కానీ ఆస్పత్రులు ఆయా పరీక్షలకు కూడా అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి” అని డాక్టర్ నగేశ్ అన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా అధికంగా వసూలు చేస్తున్నామన్న విషయం ఆయా ఆస్పత్రుల పరిపాలనా విభాగాలకు కూడా తెలుసు. కానీ వాళ్లు ఏదో ఒక కారణం చూపిస్తున్నారు.

స్వచ్ఛంద సంస్థలు ఏమంటున్నాయి?

నేషన్ ఫస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ముంబయి కేంద్రంగా రోగుల కోసం పని చేస్తోంది. ఆస్పత్రులకు సంబంధించిన సమాచారాన్ని రోగులకు అందిస్తూ వారిని సరైన దవాఖానాలకు పంపిస్తోంది.

“ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చే ఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల్ని నియమించింది. కానీ వారికి ఫిర్యాదుల్ని ఈమెయిల్ ద్వారా పంపాలి. అయితే అది సరైన విధానం కాదు. ఫిర్యాదుల్ని నమోదు చేసేందుకు ఈమెయిల్ కాకుండా తక్షణం సాయం అందేలా ఓ హెల్ప్ లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేయాలి” అని ఆ స్వచ్ఛంధ సంస్థ తరపున పని చేస్తున్న సంజయ్ పర్మార్ అభిప్రాయపడ్డారు.

“రోగిని ఆస్పత్రిలో చేర్చిన తర్వాత చికిత్స సమయంలో వారి బంధువులు తీవ్ర ఆందోళనలో ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఈమెయిల్ చెయ్యగలరు? చదువుకున్న వాళ్ల సంగతి సరే.. మరి నిరక్షరాస్యులు, పేదవాళ్ల సంగతేంటి? ఈమెయిల్ పంపలేని వారి పరిస్థితి ఏంటి? ఈ విధానంలో ఇలాంటి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి. కేవలం ఐఏఎస్ అధికారుల్ని నియమించినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రజలకు ఉపశమనం కల్గుతుంది” అని సంజయ్ చెప్పుకొచ్చారు.

మరో సామాజిక కార్యకర్త అనిల్ గాల్గ్లీ బీబీసీతో మాట్లాడుతూ “ప్రజలు దోపిడికి గురికాకుండా ప్రభుత్వం వీలైనంతగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రైవేటు ఆస్పత్రులలో రిసెప్షన్ లేదా బయట బిల్లు మొత్తాన్ని డిస్ ప్లే చేసే ఏర్పాటు చేయాలి. ఫలితంగా ఆస్పత్రి వర్గాలు తప్పుడు సమాచారం ఇవ్వలేవు. అలాగే వాస్తవ పరిస్థితి ఏంటన్నది సాధారణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. అధికారులు, మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేసి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. కానీ తక్షణం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆస్పత్రి వర్గాలు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి” అని చెప్పారు.

“పీపీఈ కిట్ల కోసం కొన్ని ఆస్పత్రులకు రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ ఆస్పత్రిలో కూడా ఒక్క రోగే ఉండరు. పదుల సంఖ్యలో ఉంటారు. అలాంటప్పుడు ఉన్న రోగులకు అనుగుణంగా పీపీఈ కిట్ల ధరల్ని నిర్ణయించాలి. అయినా పీపీఈ కిట్ల కోసం ప్రతి రోగి వద్ద ఎందుకు డబ్బులు వసూలు చేయాలి? దీనిపై మేం మున్సిపాలికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశాం. ఆస్పత్రి అధికార వర్గాలతో కూడా మేం ఈ విషయంపై చర్చించాం” అని ఎంఎన్ఎస్ నేత నయన్ కడెం తెలిపారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

ప్రైవేటు ఆస్పత్రులేమంటున్నాయి?

ప్రైవేటు ఆస్పత్రులకు, ముంబయి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ విభాగాలకు మధ్య సమన్వయ కర్తగా డాక్టర్ గౌతమ్ భన్సాలీ పని చేస్తున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ “ప్రభుత్వం ధరల్ని నిర్ణయించిన తర్వాత అన్ని ఆస్పత్రులు వాటినే అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే రోగుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక వేళ ఇప్పటికీ కొన్ని ఆస్పత్రులు అధిక ధరల్ని వసూలు చేస్తున్నట్టయితే ప్రభుత్వం తప్పని సరిగా చర్యలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులలో 471 ఐసీయూ బెడ్స్, అలాగే కోవిడ్-19 రోగుల కోసం 2,400 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి” అని తెలిపారు.

అయితే ప్రభుత్వాసుపత్రులతో పోల్చితే ప్రైవేటు ఆస్పత్రులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ భిన్నంగా ఉంటుంది. ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని భన్సాలీ అన్నారు. ప్రతి సారీ అధికారులు అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులను నిందించడం సరికాదు ఆయన అభిప్రాయపడ్డారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)