కరోనావైరస్: టీచర్లూ, లెక్చరర్లనూ ఉపాధి హామీ కూలీలుగా మార్చేసిన మహమ్మారి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లాలోని ఒక ప్రైవేటు స్కూల్ టీచర్ ఎంఫిల్, బిఇడి చేశారు. ఆయన పనిచేస్తున్న పాఠశాల లాక్‌డౌన్ వల్ల మూతపడింది. ఫిబ్రవరి జీతం ఇచ్చారు. ఏప్రిల్ మధ్య వరకూ లాక్కొచ్చాడు. ఇక ఇంటి నిర్వహణ తన వల్ల కాలేదు. తన ఊళ్లోనే ఉన్నాడు కాబ్టటి అక్కడే ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. రోజుకు సుమారు 200 వచ్చాయి. బండి నడిచిపోయింది.
అదే జిల్లాకు చెందిన మరో నిరుద్యోగి యువకుడు, డిగ్రీల్లో కెల్లా పెద్దది, పీహెచ్‌డీ చేశారు. ఆయన కూడా సదరు టీచర్‌తో కలసి ఉపాధి పనికి వెళ్లాడు. వరంగల్ జిల్లాలో కూడా తన మిత్రుడొకరు పీహెచ్‌డీ చేస్తూ, ప్రస్తుతం ఉపాధి పనుల్లో ఉన్నాడని చెప్పారాయన.
ఎమ్మెస్సీ డయాలసిస్ చదువుకొని గత ఐదు సంవత్సరాలుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డయాలసిస్ టెక్నీషియన్ గా నెలకు 30 వేల రూపాయలు జీతం పొందుతూన్న ఒక యువకుడు, ఆసుపత్రుల్లో పని లేక ఉపాధి పనికి వెళ్ళాడు.
కరీంనగర్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎంటెక్ అయింది. బిటెక్ వారికి ఇంజనీరింగ్ పాఠాలు చెప్పే ఆ యువకుడు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మూటలు మోస్తూ కనిపించాడు.
హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో ఎమెర్జెన్సీ టెక్నషియన్‌గా బాధ్యతలు నిర్వహించే కుర్రాడు కూడా నగర శివార్లలోని తన గ్రామంలో ఉపాధి పనుల్లో తేలాడు.

ఫొటో సోర్స్, @Anil Kumar Kandula
లాక్‌డౌన్ ఎందరో జీవితాలను మార్చింది. ప్రభావితం చేసింది. కానీ కొందరు వైట్ కాలర్ జాబ్ చేసే వారి జీవితాలను మాత్రం తలకిందులు చేసింది. తామెన్నడూ చేయాల్సి వస్తుందని ఊహించని పనులు చేయించింది. ఎంఫిల్, ఎంటెక్, బిఇడీ చదివిన వారు, టీచర్లు, నర్సులు, టెక్నీషియన్లు, హోటెల్ మేనేజర్లు, అకౌంటెట్లు.. ఇలాంటి వృత్తుల వారిని ఉపాధి కూలీలుగా మార్చింది.
ఇక పెద్ద చదువులు చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య చెప్పక్కర్లేదు. కరవు రోజుల్లో వంద రోజుల పనితో ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీరికి లాక్‌డౌన్ వేళ ఆధారమయింది.
ఇలాంటి పనులు చేసే వారిలో ఎక్కువ మంది జీతాలు గరిష్టంగా రూ. 25 వేలు ఉంటాయి. అది కూడా దాదాపు పదేళ్ల అనుభవం ఉంటేనే. ఎక్కువగా వీరి జీతాలు 8 వేల నుంచి 25 వేల మధ్య ఉంటాయి. అరుదుగా 30 వేల జీతాల వాళ్లుంటారు.
నెలకు సగటున 15-20 వేల జీతాలు తీసుకునే కుటుంబాలు ఒక నెల కంటే ఎక్కువ జీతం లేమిని భరించలేవు. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో వీరు స్థానిక పనుల్లో ఉపాధి పొందుతున్నారు.

ఫొటో సోర్స్, Ysrcp Avanigadda
ఎక్కువ భాగం ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లే
ప్రస్తుతం కూలీలుగా మారిన వారిలో అన్ని రకాల వైట్ కాలర్ల వారూ ఉన్నా, అందులో సంఖ్యా పరంగా ఎక్కువ మందీ, ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిందీ ప్రైవేటు టీచర్లూ, లెక్చరెర్లే.
ఇతర వృత్తులు చేసేవారు వేర్వేరు పనులు చేసినా ఎవరూ పెద్ద పట్టించుకోరు. కానీ టీచర్ అనే పదానికి భారత సమాజంలో ఉన్న గౌరవ మర్యాదల దృష్ట్యా వారిపై ఫోకస్ ఎక్కువ ఉంది. దానికితోడు బోధనా వృత్తిలో ఉండేవారే ఎక్కువ డిగ్రీలు చదువుతారు. దాంతో అన్ని డిగ్రీలు పెట్టుకుని ఉపాధి పని చేస్తున్నారన్న మాట ఇప్పుడు పెద్ద విషయం అయింది.
కార్పొరేట్లు, లేదా బాగా ఎష్టాబ్లిష్ అయిన సంస్థల్లో పనిచేసే వారి కంటే, చిన్న స్థాయి బడులలో పనిచేసే వారికి ఎక్కువ సమస్య అయింది.
''నిజానికి ప్రైవేటు టీచర్లు, చిన్న కాలేజీల్లో లెక్చరర్లకు 11 నెలల జీతమే ఉంటుంది. వారికి మే జీతం ఉండదు. చాలా వరకూ చిన్న స్కూళ్లలో పిల్లల తల్లితండ్రులు ఏడాది చివరి వరకూ ఫీజులు కట్టరు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో పరీక్షలు సమయంలో ఫీజులు కడతారు. దాంతో చిన్న సంస్థలు జీతాల బకాయిలు కూడా అప్పుడే క్లియర్ చేస్తాయి. సరిగ్గా అదే సమయంలో లాక్‌డౌన్ పడింది. నిజానికి తెలంగాణలో ప్రైవేటు టీచర్లకు ఈ ఏడాది రెండు దెబ్బలు తగిలాయి. మొదటిది ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీ సమ్మె కాలంలో చాలా మంది పిల్లలు బడికి రాలేదు. ఆ కాలంలో ఫీజులు కూడా ఆగిపోయాయి'' అంటూ తన సమస్య కారణాలు వివరించారు ఉపాధి కూలీగా మారిన ఎంఫిల్ పట్టభద్రుడు ఒకరు.
చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాపారం, దానిపై ఆధార పడ్డ వారి గురించి ఆయన అద్భుత విశ్లేషణ చేశారు. కానీ తన ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న భయంతో పేరు రాయవద్దని కోరారు.

ఫొటో సోర్స్, Rajashekhar Sai/Facebook
సంస్థల్లో సిబ్బందికి ఉద్వాసన...
వివిధ ఆసుపత్రులు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు, స్కూళ్లు తమ సిబ్బందిని రకరకాల నిబంధనలతో వెనక్కు పంపేశాయి. కొందరికి ఫిబ్రవరి జీతం మాత్రమే అందగా, మరికొందరికి మార్చి జీతం పూర్తిగానూ, ఇంకొందరికి సగమూ అందింది. అసలు ఏప్రిల్, మే నెలల గురించి చెప్పక్కర్లేదు. జూన్ మొదలైనా ఇంకా చాలా మంది యజమానులు సిబ్బందిని వెనక్కు పిలవడం లేదు.
బీబీసీతో మాట్లాడిన చాలా మంది తమ పేరు రాయవద్దని కోరారు. అయితే కూలి పనికి వెళుతున్నందుకు నామోషీగా ఉన్న వారు ఒకరిద్దరే. కానీ ఎక్కువ మంది మాత్రం, మళ్లీ తిరిగి తాము ఉద్యోగంలో చేరాలని ఆశిస్తున్న వారు. తమ పేరు, ఫోటో మీడియాలో వస్తే తమ సంస్థ తమను వెనక్కు పిలవదేమోనన్న భయం వారిలో ఉంది. ''కూలీ పనిచేయడంలో నాకేమీ నామోషీ లేదు. కానీ ఇది మా ఆర్థిక పరిస్థితి అద్దం పడుతుంది. మార్చి వరకూ ఎలాగోలా నెట్టుకొచ్చాం. ఏప్రిల్ మధ్య నుంచి ఇక కష్టమైంది. దీంతో పనులకు రావాల్సిన వచ్చింది. ముందు నుంచీ డబ్బు పొదుపు చేసుకున్న అతి కొద్ది మంది మాత్రమే దీనికి మినహాయింపు'' అన్నారు ఒక టీచర్.
ఉపాధి పనుల తరువాత ఎక్కువ మంది చేపట్టింది పండ్ల అమ్మకం. సొంతగానూ, ఉద్యోగులగానూ రోడ్ల పక్కన పండ్ల బుట్టలు, తోపుడు బండ్లపై పండ్లు అమ్మారు చాలా మంది విద్యావంతులు.
హోటళ్లు మూసేయడంతో అక్కడ కెప్టెన్లుగా, ఫ్లోర్ మేనేజర్లుగా పనిచేసే వారు కూడా చాలా మంది పొలం పనుల్లో పడ్డారు. ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, చిన్న చిన్న క్లినిక్స్‌లో నర్సులుగు పనిచేసే మహిళలూ కూడా వీరిలో ఉన్నారు.
వీరిలో చాలా మంది విడిగా కూలి పనులకు వెళుతున్నారు. కానీ అటువంటి వారి కంటే, ఉపాధి హామీ పథకాలకు వెళ్లే వారి సంఖ్యే ఎక్కువ ఉంది.

భారీగా పెరిగి ఉపాధి కూలీల సంఖ్య
లాక్‌డౌన్ తరువాత ఉపాధి కూలీల సంఖ్య భారీగా పెరిగింది. ఆంధ్రలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ, 4,085.37 కోట్ల రూపాయలను కూలీగా చెల్లించారు. కానీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే - కేవలం ఈ 3 నెలల్లోనే రూ. 2,071.62 కోట్లు చెల్లించారు. అంటే గత ఏడాది మొత్తం ఇచ్చిన కూలీలో సగం ఈ మూడు నెలల్లోనే చెల్లించారు.
తెలంగాణలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,335.04 కోట్ల జీతాలు చెల్లించారు. కానీ 2019-20 ఏడాదికి మొత్తం రూ. 1,638.25 కోట్లు చెల్లించారు. కేంద్రం కూడా ఇందుకు తగ్గట్టు ఉపాధి నిధులను పెంచింది. కూలీ కూడా రూ. 211 నుంచి రూ. 237 కు పెరిగింది. తెలంగాణలో నాగర్ కర్నూల్ వంటి జిల్లాలో కూలీల సంఖ్య భారీగా పెరిగింది. సిద్ధిపేటలో గతంలో ఒకసారి అత్యధికంగా 70 వేల మంది పని చేస్తే, లాక్‌డౌన్ సమయంలో లక్షా 24 వేల మంది పనిచేశారు.
''గతంలో కంటే కూలీల సంఖ్య భారీగా పెరిగింది. చదువుకున్న వారు, పెద్ద చదువులున్న వారు చాలా మందే వస్తున్నారు. వారికి అర్హతను బట్టి జాబ్ కార్డులు ఇస్తున్నాం. జాబ్ కార్డులు ఇచ్చే నిబంధనలు కూడా మరీ అంత కఠినంగా ఉండవు. పనిలేదు, పనికావాలి అన్న వారందరికీ పని ఇవ్వడమే కదా ఈ పథకం ఉద్దేశం. మిగత చోట్ల పరిస్థితి నేను చెప్పలేను కానీ, మా దగ్గర మాత్రం జనం పెరగడం వల్ల లాభమే జరిగింది. ఎందుకంటే చెఱువు పూడిక తీత పనులు గతంలో కంటే వేగంగా జరుగుతున్నాయి'' అని బీబీసీతో అన్నారు ఒక ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన పంచాయితీరాజ్ ఆఫీసర్.
ఇవి కూడా చదవండి:
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
- జపాన్‌లో డబ్బులిచ్చి ఉద్యోగాలు మానేస్తున్నారు.. ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








