కరోనావైరస్ ముంబయి: 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 8 మందికి కోవిడ్-19.. అంతా ఎలా బయటపడ్డారంటే..

ఫొటో సోర్స్, janhavi moole
- రచయిత, జాహ్నవి మూలే,
- హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధి
“ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం భారిన పడ్డారు. ఒకరు దగ్గుతుంటే మరొకరు తుమ్ముతున్నారు. ఒక్కసారిగా చాలా భయమేసింది”అంటూ తన కుటుంబం మొత్తానికి ఎలా కరోనావైరస్ సోకిందో నెహాలి పవార్.. బీబీసీకి వివరించారు.
18 మంది ఉండే ఈ ఉమ్మడి కుటుంబం ముంబయిలోని వాడాల పరిసరాల్లో నివసిస్తుంది. చుట్టుపక్కల అంతా గుడిసెలు, కిక్కిరిసిన వీధులు ఉన్నప్పటికీ వీరి ఇంట్లో తొమ్మిది గదులున్నాయి.
లాక్‌డౌన్ సమయంలో అందరిలానే ఈ కుటుంబంలోని వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. కొత్త వంటకాలు, ఆటలు, పాటలతో ఇల్లంతా సందడిగా మారింది. అయితే, నెల తిరిగేలోగా ఈ సంతోషానికి కరోనావైరస్‌తో ముగింపు పడింది. అదృష్టవశాత్తు పవార్ కుటుంబం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కింది.

ఫొటో సోర్స్, janhavi moole
‘ఒకే ఒక తప్పు.. కుటుంబం మొత్తానికి ముప్పు తెచ్చింది’
ఇంట్లో ఎంతో ఆహ్లాదకరంగా గడిపినప్పటికీ.. అవసరమైన జాగ్రత్తలు పాటించామని నెహాలి చెప్పుకొచ్చారు.
“ప్రభుత్వంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో) ప్రకటించిన అన్ని నియమాలనూ పాటించాం. చేతులు కడుక్కోవడం, బయట నుంచి తెచ్చిన కూరగాయాలను, వస్తువులను శానిటైజ్ చేయడం. ఇంటిని రోజూ శుభ్రం చేసుకోవటం, వేడి నీళ్లు తాగటం.. ఇలా చేయాల్సిందంతా చేశాం.”
నెహాలి కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి నుంచే పనిచేశారు. అయితే కొందరు కుటుంబ సభ్యులు పని చేయడానికి బయటకు వెళ్లాల్సివచ్చేది. దీంతో ఇంట్లో ఎవరికైనా వైరస్ సోకుతుందేమోనని ఆమె దిగులు పడేవారు.
నెహాలి భర్త అమిత్ పవార్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఒక్కోసారి ఆయన వరుసగా రెండు మూడు రోజులు విధుల్లోనే ఉండాల్సి వచ్చేది. ఆమె బావ ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. మామగారు ఒక సామాజిక కార్యకర్త.
“మేం ఒకే ఒక్క తప్పు చేశాం. ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చే వారితో సామాజిక దూరం పాటించకపోవటం. మాకు ఆప్యాయతలు ఎక్కువ. అందరం సంతోషంగా ఉండేటప్పుడు.. ఒకరిని దూరం పెట్టలేం. మా ఆయన డ్యూటీకి వెళ్లి రోజుల తర్వాత వచ్చినా.. ఎప్పటిలానే కలిసుండేవాళ్లం. సామాజిక దూరం పాటించే వాళ్లం కాదు.”

ఫొటో సోర్స్, Getty Images
కరోనా సోకిందని ఎలా తెలిసింది?
ఏప్రిల్ 21న అమిత్ పవార్ డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక జ్వరం ఉన్నట్లు గుర్తించారు. అయితే రెండు గంటలకే అది తగ్గిపోయింది.
“కరోనావైరస్ సోకితే.. దగ్గు, తుమ్ములు వస్తాయని అనుకుంటాం.. కానీ ఆయనకు అవేమీ రాలేదు. అందుకే ఆయన జ్వరాన్ని అంత పట్టించుకోలేదు. చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల జ్వరం వచ్చిందని అనుకున్నాం” అని నెహాలి అన్నారు.
ఏప్రిల్ 25న వారి ఇంటి పరిసరాల్లో కోవిడ్-19 పరీక్షల శిబిరం ఏర్పాటుచేశారు. దీంతో బటయకు తరచూ వెళ్లే ఐదుగురు కుటుంబ సభ్యులూ పరీక్షలు చేయించుకోవాలని అనుకున్నారు. అయితే అమిత్ దగ్గుతున్నారని తెలియడంతో ఆయనకు వెంటనే వైద్యులు స్వాబ్ టెస్ట్ చేశారు.
నాలుగు రోజుల తర్వాత, ఏప్రిల్ 28న, అమిత్ డ్యూటీకి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి దగ్గరకు కొందరు వైరస్ నుంచి రక్షణ కల్పించే పీపీఈ సూట్లు వేసుకొని వచ్చారు. శానిటైజర్‌ను చల్లడమూ మొదలుపెట్టారు. అమిత్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యిందని వారే చెప్పారు. అంతేకాదు ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. ఆ మరుసటి రోజే అమిత్‌ను వాడాలాలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వచ్చింది.
“నాకు ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాలేదు. నేను దాదాపుగా కుప్పకూలిపోయాను. మా ఆయన్ను మళ్లీ చూడగలుగుతానా? మా కుటుంబంలో ఎంత మందికి కరోనావైరస్ సోకింది? ఒక్కోరోజు మా ఇంట్లో తెల్లవారుజామున 3.30 వరకు అందరమూ చిన్నచిన్న గేమ్స్ ఆడుకునేవాళ్లం. అవన్నీ మళ్లీ చూడగలనా అనిపించింది” అని నెహాలి వివరించారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR
టెస్టింగ్ సమయంలో సమస్యలు
ఇంట్లో మరుగుదొడ్లు విడివిడిగా ఉండటంతో.. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యేందుకు పవార్ కుటుంబానికి అనుమతిచ్చారు. అయితే తమకు ఎప్పుడు, ఎలా పరీక్షలు నిర్వహిస్తారు? ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఎలా? ఇలాంటి విషయాల్లో వారికి ఎలాంటి స్పష్టతాలేదు. తర్వాత కొన్ని రోజులకే ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం బారిన పడటం మొదలైంది.
“మేం రోజూ బీఎంసీకి ఫోన్ చేసేవాళ్లం. అయితే పరీక్షల కిట్లు అయిపోయాయని వారు చెప్పేవారు. దీంతో మూడు రోజులు అలానే ఉండిపోయాం. అప్పటికి ప్రైవేటు ఆసుపత్రులు పరీక్షలు నిర్వహించేవి కాదు. మా చేతిపై క్వారంటైన్ ముద్రలు వేయడంతో.. మేం బయటకు కూడా వెళ్లలేకపోయేవాళ్లం. ఇంటికి వచ్చి కూడా ఎవరూ పరీక్షలు చేసేవారు కాదు.”
నెహాలి భర్త సోదరుల్లో ఒకరు కళాకారుడు. ఆయన తమ పరిస్థితిని వివరిస్తూ ఫేస్‌బుక్ లైవ్ చేశారు. దీంతో సోషల్ మీడియాతోపాటు స్థానిక టీవీ ఛానెళ్లకూ సమాచారం అందింది. అనంతరం మే 2న లక్షణాలు బటయకు కనిపించిన ఏడుగురికి బీఎంసీ పరీక్షలు నిర్వహించింది. వీరంతా పాజిటివ్‌గా తేలారు. దీంతో వీరందరినీ మిగతా కుటుంబ సభ్యుల నుంచి విడిగా ఉంచారు.

ఫొటో సోర్స్, REUTERS
క్వారంటైన్ సమయం
18 మందిలో ఎనిమిది మందిని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మిగతా పది మందిని ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో నాలుగేళ్ల బాబుతో పాటు 15, 14 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ సమయంలో తల్లి దండ్రులకు దూరంగా ఉండటంతో తన మేనల్లుడు చాలా భయపడ్డాడని నెహాలి చెప్పారు.
“నాలుగేళ్ల బాబుకు ఇది పెద్ద షాక్ లాంటిది. తనను ఎవరూ హత్తుకోవటం లేదు. ఎవరూ ఎత్తుకోవటం లేదు. తన వస్తువులను కూడా పక్కకు తీసి పెట్టారు. నన్ను ఇప్పటికీ అడుగుతాడు.. చిన్నమ్మా, నేను నీ దగ్గరకు రానా? నిన్ను హత్తుకోనా? అని.”
కుటుంబంలో వయసు పైనపడ్డ వారికి ఇది చాలా కష్టమైన సమయం. “62 ఏళ్ల వయసున్న పెద్ద మామ గారిని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన్ను కృత్రిమ శ్వాసపై ఉంచారు. 60ఏళ్ల వయసున్న మరో మామ గారికి గుండె జబ్బు ఉంది. ఆయన్ను ఐసీయూ వార్డులో ఉంచారు. వారిద్దరికీ మధుమేహం ఉంది.”
నెహాలిలో మాత్రం ఏ లక్షణాలు కనపడలేదు. మొదటి రెండు రోజులు తనను క్వారంటైన్ లో ఉంచారు. ఆ తర్వాత ఐసోలేషన్ వార్డుకు మార్చారు.
“రాత్రి మాత్రమే క్వారంటైన్ కేంద్రానికి డాక్టర్లు వచ్చేవారు. ఆ రోజు జరిగినవన్నీ.. అప్పుడే వారికి మనం చెప్పాలి. అయితే నర్సులు మాత్రం 24 గంటలూ ఐసోలేషన్ వార్డుల్లో ఉండేవారు. విడిగానే ఉంటున్నప్పటికీ.. చుట్టుపక్కల లక్షణాలు ఉండేవారు కూడా ఉన్నారని చాలా భయం వేసేది.”
“కోవిడ్-19కు ఎలాంటి ప్రత్యేకమైన ఔషధమూ లేకపోవడంతో మాకు విటమిన్లు, యాంటీబయోటిక్ ఔషధాలు ఇచ్చేవారు. భోజనం విషయానికి వచ్చేసరికి... శుభ్రమైన మంచి ఆహారం ఇచ్చేవారు. అయితే మాకు ఎలాంటి రుచులూ తెలిసేవి కాదు. దీంతో ఎంతో ఏం తింటున్నామో కూడా తెలిసేదికాదు.”
“సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అయితే రోగులు బయట నుంచి భోజనం తెచ్చుకునేందుకు అనుమతించేవారు. దీంతో మా మామయ్యగారికి బంధువుల్లో ఒకరు భోజనం తీసుకెళ్లేవారు. మా ఇంటికి దగ్గర్లో ఉండే ఓ మహిళ, దాదర్‌లో ఉండే మా అమ్మ కూడా సాయం చేశారు. మాకు ప్రతి అడుగులోనూ చాలా మంది సాయం చేశారు. మా వెనక అండగా నిలబడ్డారు.”

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19 నేర్పిన పాఠాలు
“మే 7, బుద్ధ పూర్ణిమనాడు శుభవార్త విన్నాం. నా భర్త అమిత్‌కు నయమైందని రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత పది నుంచి 12 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు.. అందరమూ ఇంటికి వచ్చేశాం” అని నెహాలి చెప్పారు.
“ఇంటికి వచ్చే అందరికీ చప్పట్లతో స్వాగతం పలికారు. అయితే ఇదివరకటిలా జీవితం ఉండబోదని ప్రతి ఒక్కరమూ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇంట్లో కూడా భౌతిక దూరం తప్పకుండా పాటిస్తున్నాం.”
“బయటకువెళ్లే ప్రతి ఒక్కరూ ఇతరుల నుంచి సామాజిక దూరం పాటిస్తున్నాం. ఇంట్లో మిగతవాళ్లం కూడా ఒకరి నుంచి ఒకరం దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. మా వస్తువులు, బట్టలు ఇలా అన్నీ.. వేర్వేరుగా ఉంచుకుంటున్నాం.”

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- అన్‌లాక్ 1: నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
- కరోనావైరస్ రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు ఇస్తున్నారు? అసలు ఇవి ఎలా పనిచేస్తాయి?
- కరోనా లాక్‌డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది?
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: డాక్టర్ల అంత్యక్రియలను ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు?
- కరోనావైరస్: ఈక్వెడార్ గ్వాయాక్విల్‌లో వేలల్లో మృతులు... మార్చురీలు మూసేయడంతో రోడ్ల మీద మృతదేహాలు
- కరోనావైరస్: మృతదేహాల నుంచి వైరస్ సోకుతుందా?
- కరోనావైరస్: స్పెయిన్‌లో దిక్కు లేకుండా మృతి చెందిన వృద్దులు.. సైన్యాన్ని రంగంలోకి దించిన ప్రభుత్వం
- కరోనావైరస్: 'చనిపోయిన బామ్మ'ను నెల రోజుల తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించిన ఆస్పత్రి వర్గాలు
- కరోనావైరస్: శవపేటికలతో నిండిన ఇటలీ.. మరణించిన వారికి అంతిమ సంస్కారాలనూ దూరం చేసిన కోవిడ్-19
- కరోనావైరస్: హిందువుకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు, ‘హర హర మహాదేవ' నినాదాలు’
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులను పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలను వేధిస్తున్న ప్రశ్న
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








