లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులను పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలను వేధిస్తున్న ప్రశ్న

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీత పాండే
- హోదా, బీబీసీ న్యూస్
భారతదేశంలో మార్చి 25వ తేదీ నుంచి అమలులో ఉన్న లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. దీన్ని మళ్లీ పొడిగిస్తారో, లేదో ఇంకా స్పష్టత లేదు. అయితే, తాజా పొడిగింపు సందర్శంగా సడలించిన నిబంధనల్లో ఇళ్లల్లో పని చేసే వాళ్ళని పనుల్లోకి పిలవవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ, వారిని పనుల్లోకి పిలవాలా? వద్దా? అనే ప్రశ్న మాత్రం కోట్లాది కుటుంబాల్ని వేధిస్తోంది.
భర్త కావాలా? పని మనిషి కావాలా? అని అడిగితే.. పని మనిషినే ఎన్నుకుంటానని ఒకసారి నాతో ఒక స్నేహితురాలు సరదాగా అన్నారు.
సరదాగా అన్నదే అయినప్పటికీ, ఈ ఉదాహరణ భారతదేశంలో ప్రజలు పని మనుషుల మీద ఆధారపడిన తీరుని ఈ సమాధానం ప్రతిబింబిస్తుంది.
అధికారిక లెక్కల ప్రకారం దేశంలో మధ్య తరగతి, ధనికుల ఇళ్లల్లో అతి తక్కువ జీతానికి పని చేసే 40 లక్షల మంది పని మనుషులు ఉన్నారు. అనధికారికంగా ఈ సంఖ్య 50 లక్షలు ఉంది ఉండవచ్చు. ఇందులో రెండొంతుల మంది మహిళలే.
యజమాని-పని మనిషి ఒకరి మీద ఒకరు పరస్పరం ఆధారపడతారు. పేదరికం, చేతిలో మరో ఉద్యోగం చేయడానికి నైపుణ్యం లేకపోవడంతో చాలా మంది జీవనాధారం కోసం ఇంటి పనులు చేయడానికి సిద్ధపడతారు. తక్కువ జీతంతో లభించే వీరితో ఇంటి పనులు సాఫీగా సాగిపోవడానికి మధ్య తరగతి మహిళలకు వీలవుతుంది.
కానీ, గత ఆరు వారాల నుంచి పరిస్థితి మారింది. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ వలన కొన్ని కోట్ల మధ్య తరగతి కుటుంబాలు పని మనుషులు, డ్రైవర్లు, తోట మాలి లేకుండానే ఇళ్ళని నడిపిస్తున్నాయి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

మొదట్లో ఈ లాక్ డౌన్ ఒక మూడు వారాలు ఉంటుందని ఊహించారు. కొంత మంది నటీ నటులు, ప్రముఖులు ఇంటి పనులు చేస్తున్నట్లు, ఇల్లు తుడుస్తున్నట్లు, గిన్నెలు తోముతున్నట్లు ఉన్న వీడియోలని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఇప్పటికే రెండు సార్లు పొడిగించిన లాక్ డౌన్‌తో, ఇది ఇప్పట్లో తీరే సమస్యలా లేదని అర్ధం అవుతోంది.
ఎవరి సహాయం లేకుండా నివసిస్తున్న వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎలా ఇంటిని గడుపుతున్నారో అనే విషయాల పట్ల చాలా చర్చ జరుగుతోంది.
మరో వైపు పని మనుషులకి కూడా పనుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చాలా మందికి ఉద్యోగాలు పోగా కొంత మందికి లాక్ డౌన్ సమయంలో తమ యజమానులు జీతాలు ఇవ్వటం లేదని, ఇళ్లల్లో పని చేసే పని మనుషుల్ని ఆన్‌లైన్ ద్వారా అందించే ‘హెల్పర్ 4 యూ' అధినేత మీనాక్షి గుప్త జైన్ చెప్పారు.
గత నెల రోజుల నుంచి వారి వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్‌కి డ్రైవర్లు, పని మనుషుల నుంచి రోజుకి కనీసం 10 నుంచి 15 కాల్స్ వస్తున్నాయని చెప్పారు.
"మా దగ్గర డబ్బులు అయిపోయాయి, పిల్లలని ఎలా పోషించాలని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మేమేమి చేయగలం? మేము వారుండే ప్రాంతంలో స్వచ్చంద సేవా సంస్థల వారిని కలిస్తే రేషన్ కానీ, వంట గ్యాస్ కానీ దొరకవచ్చని చెబుతున్నాం" అని మీనాక్షి చెప్పారు.
లాక్ డౌన్‌లో కూడా తన యజమానులు తనకి జీతం ఇవ్వడం అదృష్టమని సోమవారం నుంచి పనుల్లోకి తిరిగి హాజరైన సోనికా వర్మ చెప్పారు.
"నా భర్త ఒక ఆటో డ్రైవర్. కానీ, లాక్ డౌన్‌లో ఆటోలు నడపలేకపోవడంతో మాకు ఎటువంటి ఆదాయం లేదు. నాకు కూడా పని లేదు. నన్ను పనిలోంచి తీసేస్తే మా పరిస్థితి ఏమిటనే భయం నన్ను వెంటాడింది”.
"మా చెల్లెళ్లకి లాక్ డౌన్‌లో వాళ్ళ యజమానులు జీతాలు ఇవ్వలేదు."
‘‘వాళ్ళు పని చేసే యజమానులు వారు పని చేసిన రోజులకి మాత్రమే జీతాలు ఇచ్చి ఏప్రిల్ నెలకి పూర్తిగా జీతం ఇవ్వలేదని మా చెల్లెళ్లు చెప్పారు’’.
“పనుల్లోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు కానీ, ఎప్పటి నుంచి పనిలోకి పిలుస్తారో మాకైతే అర్ధం కావటం లేదని వారు అన్నారు” అని సోనికా చెప్పారు.

వాళ్ళని పనుల్లోకి పిలవకపోవడానికి కూడా కారణం ఉంది. చాలా హోసింగ్ సొసైటీలలో పని వాళ్ళని ఇళ్లల్లోకి రానివ్వాలా వద్దా అనే విషయంపై చాలా చర్చలు జరుగుతున్నాయి.
చాలా మంది లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ కరోనావైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోలేదని, పని వాళ్ళని బయట నుంచి లోపలికి రానివ్వడం ద్వారా ఇప్పటి వరకు నియంత్రణలో పెట్టిన వైరస్ వస్తుందేమోనని భయపడుతున్నారు.
అయితే, ముసలి వాళ్ళు, నిస్సహాయుల పరిస్థితిని విస్మరించకూడదని కొన్ని సొసైటీ లు భావిస్తున్నాయి. చాలా మంది మధ్య తరగతి భారతీయుల ఇళ్లల్లో డిష్ వాషర్లు, వాషింగ్ మెషిన్ల లాంటి సౌకర్యాలు ఉండవు. అలాంటి వారికి ఇంటి పని చేసుకోవడం కష్టంగానే ఉంటుంది.
పని వాళ్ళని పనుల్లోకి రానివ్వడం మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు, నోయిడాలో ఉన్న ఏ టి ఎస్ గ్రీన్స్ సొసైటీ అధ్యక్షుడు అనిల్ తివారి చెప్పారు.
"మా సొసైటీ లో 735 అపార్టుమెంట్లు ఉన్నాయి. ఇందులో చాలా మంది వృద్ధులు ఉన్నారు. చాలా మందికి పనులు చేసుకోవడం కష్టంగా ఉంది. అందుకు మేము పని వాళ్ళని రానివ్వాలని ఆలోచిస్తున్నామని” అన్నారు.
పరిస్థితి చాలా కష్టంగా ఉందని రిటైర్డ్ బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చొక్కర్ అన్నారు .
ఆయన వయస్సు 80 సంవత్సరాలు. పేస్ మేకర్‌తో ఉన్న ఆయన తన 75 సంవత్సరాల వయసు భార్యతో కలిసి ఉంటున్నారు. ఆమెకి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
"మేము వయసులో ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదేమో. కానీ, మాకున్న ఆరోగ్య సమస్యలతో ఇంటి పనులు చేసుకోవడం చాలా కష్టంగా ఉంది” అని ఆయన ఫోన్‌లో చెప్పారు.
లాక్ డౌన్ ముందు వరకు, వారికి ఒక డ్రైవర్, ఒక పని మనిషి, ఒక తోట మాలి, కారు శుభ్రం చేసే మనిషి ఉండేవారు.
"వాళ్ళు తిరిగి పనుల్లోకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. వారు వస్తే నా జీవితం కాస్త సులభతరమవుతుంది” అని కుల్దీప్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, NurPhoto
స్కూల్ టీచర్‌గా రిటైర్ అయిన మా పొరుగింటామె పింకీ భాటియా మాత్రం పని వాళ్ళని ఇంటి లోపలికి రానివ్వడానికి భయపడుతున్నారు. తాను నడుం నొప్పితో బాధపడుతున్నప్పటికీ సొంతంగా పనులు చేసుకుంటున్నట్లు చెప్పారు.
"ప్రస్తుతం మా దగ్గర వేరే మార్గం లేదు మా ఇంటి పనులు.. ఇల్లు ఊడవటం, తుడవటం, గిన్నెలు కడుక్కోవడం అన్నీ మేమే చేసుకుంటున్నాం” అన్నారామె.
ఆమె 60ల్లో ఉండగా, ఆమె భర్త 70 ల్లో ఉన్నారు. ఆయనకు బీపీ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
60 సంవత్సరాలు పై బడిన వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం వారిని బయటకి రావద్దని సూచించింది.
దీంతో వీరు గత 6 వారాల నుంచి ఇంటికే పరిమితం అయ్యారు.
మా పొరుగింటి వారి డ్రైవర్, కాయగూరలు, పాలు తెచ్చి పెడుతున్నారు అని వారు చెప్పారు.
వాళ్ళ పనమ్మాయిని పనుల్లోకి పిలవాలా వద్దా అనే విషయం పై ఆమె సందిగ్ధతతో ఉన్నారు.
"మా పిల్లలు ముంబైలో , స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. ఏమి చేయాలని అడిగితే ఇంకొక వారం రోజులు చూసి ఆలోచిద్దాం అన్నారు. ఇంకొక వారం రోజులు చూస్తాం" అని అన్నారు
"కాయగూరలు అమ్మేవారు, చెత్త ఎత్తే వారిని అనుమతిస్తున్నప్పుడు, పని వాళ్ళని ఎందుకు అనుమతించకూడదు” అని గుప్త జైన్ ప్రశ్నిస్తున్నారు.
"వాళ్ళు ఇంట్లో పని చేస్తున్నప్పుడు, మాస్క్ లు, శానిటైజెర్లు, ప్రత్యేక దుస్తులు ఇచ్చి పని చేయమంటే బాగుంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని వారిని అనుమతిస్తే బాగుంటుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- విజయవాడలో 233 కరోనా కేసులు.. అందులో సగం ‘పేకాట, తంబోలా వల్ల వచ్చినవే’
- తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క: నెత్తిన బస్తాలు మోస్తూ.. కాలి నడకన గిరిజన గ్రామాలకు
- మాస్క్ వాడమన్నందుకు మర్డర్ - అమెరికాలో స్టోర్ గార్డును కాల్చిచంపిన ఓ కుటుంబం
- అమెరికాలో కరోనావైరస్ వల్ల కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ లాక్‌డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్: మీరు ఏ జోన్లో ఉన్నారు, ఏం చేయవచ్చు?
- లాక్‌డౌన్ సడలింపు: ఏపీలో మద్యం షాపుల ముందు భారీగా క్యూలు... ఇతర దుకాణాలు తెరవడంపై గందరగోళం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








