తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క: నెత్తిన బస్తాలు మోస్తూ.. కాలి నడకన గిరిజన గ్రామాలకు

- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘నేను ఉద్యమంల ఉండి అడవుల్లో తిరిగినప్పుడు కూడా ఇలాంటి కష్టాల్లో ఉన్న ఊరు, దుర్భరం ఎన్నడూ చూడలే. గిరిజనులు వాళ్ల పని వాళ్లు చేసుకుని పొట్ట పోషించుకుంటారు. కానీ, ఇప్పుడు వాళ్ల కాళ్లుచేతులు కట్టేశారు. చేయడానికి పని కూడా లేకపోయె. ఆకలి తప్ప వాళ్లకు ఇంకేమీ మిగల్లేదు. అందుకే సాయం చేయడానికి వెళ్లాను’’ అన్నారు తెలంగాణ రాష్ట్రం ములుగు నియోకజవర్గ ఎమ్మెల్యే సీతక్క.
కాలి బాట కూడా లేని ఒక అటవీ గ్రామానికి కొంత దూరం ద్విచక్రవాహనంపై.. ఆ తరువాత కొండలు, వాగులు దాటుతూ సుమారు 16 కిలోమీటర్లు భుజాన సంచులు మోసుకుంటూ కాలినడకన వెళ్లారామె.
ఆమె మోసుకెళ్లిన సంచుల్లో నిత్యవసర సరకులు, కూరగాయలు ఉన్నాయి. వాటిని అక్కడి గిరిజన కుటుంబాలకు పంచిపెట్టి మళ్లీ కాలినడకన తిరుగు ప్రయాణమయ్యారు.దీనికి సబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో బీబీసీ ‘సీతక్క’తో మాట్లాడింది. ములుగు నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులపై లాక్‌డౌన్ ప్రభావం, వారికి ఎదురవుతున్న ఇబ్బందులు వంటి అంశాలపై మాట్లాడింది.
నిజానికి దేశంలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి సీతక్క దినచర్య దాదాపుగా ఇదే. తన నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలకు వెళ్తూ ఏ సదుపాయాలూ అందని వారికి బియ్యం, పప్పులు, నూనె వంటి నిత్యవసరాలతో పాటు కూరగాయలు అందించి వస్తున్నారామె.

సీతక్క ఆదివారం వాజేడు మండలంలోని పొనుగోలు అనే గ్రామానికి వెళ్లారు. గుమ్మడిదొడ్డి వరకు ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆమె ఆ తరువాత రహదారి లేకపోవడంతో సరకులున్న సంచులను భుజాన మోసుకుంటూ నడక మొదలుపెట్టారు.
అలా సుమారు 16 కిలోమీటర్లు సాగిపోయిన తరువాత పొనుగోలు చేరుకున్నామని చెప్పారామె.
కరోనావైరస్-లాక్‌డౌన్ ప్రభావంప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనావైరస్ కట్టడి కోసం భారత్‌లోనూ లాక్‌డౌన్ విధించారు.

లాక్‌డౌన్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన వర్గాల్లో గిరిజనులు కూడా ఒకరు.
వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, వృత్తి పనివాళ్లు, కూలీలు, పట్టణ పేదలు, ఇతర అల్పాదాయ వర్గాలు, పేదలు కూడా లాక్‌డౌన్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారిలో కొందరికి ఎంతో కొంత ప్రభుత్వ సాయమో.. లేదంటే దాతలు, స్వచ్ఛంద సంస్థల సాయమో అందుతోంది.
కానీ, గిరిజనుల పరిస్థితి వేరు. ప్రభుత్వం వారినీ దృష్టిలో పెట్టుకున్నప్పటికీ అనేక అవాంతరాలు వారిని కష్టాల్లోకి నెట్టేశాయి.
‘‘చాలామందికి రేషన్ కార్డులు, జనధన్ ఖాతాలు, ఇతర బ్యాంకు ఖాతాలు వంటివేమీ లేకపోవడంతో ప్రభుత్వం అందించే సహాయం అందనివారూ వీరిలో చాలా ఎక్కువ.పైగా లాక్‌డౌన్ వల్ల వారపు సంతలు నిలిచిపోయాయి. దీంతో గూడేలు, తండాల్లోని గిరిజనులకు నిత్యవసరాలు దొరికే దారి లేకుండా పోయింది.ఇదే సమయంలో చేయడానికి పనులు కూడా లేకపోవడంతో పూర్తిగా కష్టాల్లో చిక్కుకుపోయారు గిరిజనులు’’ అన్నారామె.

ఎన్నో సమస్యలు
‘‘పేదల ఖాతాలకు రూ.1500 వేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, గిరిజనుల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నవారెందరు? ఆధార్‌తో లింక్ చేసుకున్నవారెందరు? బ్యాంకులు ఎన్నో కండిషన్లు పెడుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న డబ్బు చాలామందికి అందడం లేదు. రేషన్ కొంతమందికి అందుతుంది.. కొంతమందికి అందడం లేదు’’ అన్నారు సీతక్క.
ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం, తాడ్వాయి, ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మంగపేట, కొత్తగూడ మండలాల్లోని గిరిజన గ్రామాల్లో సీతక్క నిర్విరామంగా తిరుగుతున్నారు.
ఇటీవల తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కూలీలకూ కుటుంబానికి 5 కిలోల బియ్యం, ఇతర సరకులు, కూరగాయలు అందజేసినట్లు చెప్పారు.

వైద్యమూ కష్టమే..
వైద్యసౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండే గిరిజన ప్రాంతాల్లో లాక్‌డౌన్ వల్ల మరిన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు సీతక్క.
తాను వెళ్లిన గ్రామాల్లో కొన్నిచోట్ల వైద్యం కావాల్సినవారు ఉంటే అధికారులకు సమాచారం ఇచ్చి వైద్య బృందాలను పంపించినట్లు చెప్పారు.

మామూలుగానే వేసవిలో కష్టాలు.. పైగా కరోనా
‘‘మామూలుగానే వేసవిలో గిరిజనులను కష్టాలు చుట్టుముడతాయి. పని దొరకదు.. నీరు దొరకదు.. పదుల కిలోమీటర్ల దూరం పనులు వెతుక్కుంటూ వెళ్తారు.
అలాంటిది లాక్‌డౌన్ వల్ల గిరిజనులు మరిన్ని కష్టాల్లో చిక్కుకున్నార’’ని గిరిజన ప్రాంతాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పనిచేస్తున్న సామాజిక కార్యకర్త సురేంద్ర చెప్పారు.
‘‘కోయ, గొత్తికోయ, నాయకపోడు, కొండరెడ్లు, గోండులు వంటి ఆదివాసీ తెగలు.. లంబాడాలు తెలంగాణ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. వీరంతా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు’’ అని సురేంద్ర అన్నారు.
బీడీ ఆకుల సేకరణ వంటి పనులూ నిలిచిపోయాయన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
అందరికీ సహాయం అందిస్తున్నాం: ప్రభుత్వం
కాగా, రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా ఉండేలా పేదలందరికీ ఉచితంగా రేషన్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. తెల్ల రేషన్ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో 1500 రూపాయల నగదు వేస్తున్నామనీ అంటోంది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: హిందువుకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు, ‘హర హర మహాదేవ' నినాదాలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








