“రైతుబంధు, అన్నదాత సుఖీభవ పథకాలు మాకొద్దు.. మమ్మల్ని ఇలా వ్యవసాయం చేసుకోనివ్వండి”

అడవి
    • రచయిత, రాజేష్ పెదమళ్ల
    • హోదా, బీబీసీ కోసం

'నీటిలో చేపల్లా, ఆదివాసీలు అడవిని అంటిపెట్టుకుని జీవిస్తున్నారు. ఊపిరైనా వదులుతాం కానీ అడవులను మాత్రం వదిలేది లేదు... అని ఆదివాసీలు అంటున్నారు. అది వేటైనా, పోడు వ్యవసాయమైనా, ఆవాసమైనా అన్నిటికీ అడవే వారికి ఆధారం.

‘భూ యాజమాన్య హక్కు’ను నిరూపించుకోలేని ప్రజలను అడవుల నుంచి వెంటనే ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు ఆందోళన చెందారు.

కానీ, కేంద్రం విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 28న స్టే విధించింది. అయితే, ఆదివాసీల తొలగింపునకు తీసుకున్న చర్యలను వివరిస్తూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కోరింది.

స్టే విధించినప్పటికీ ఆదివాసీల్లో ఆందోళన మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో బీబీసీ తెలుగు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలకు వెళ్లింది.

వీడియో క్యాప్షన్, వీడియో: ‘చావైనా బతుకైనా అడవితోనే’

అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం 2005 డిసెంబర్‌ 13కు ముందు, అడవిలో జీవనం సాగిస్తున్న గిరిజనులకు.. వారి ఆధీనంలో ఉన్న భూమిలో నివసించే, సాగు చేసుకునే హక్కు ఉంటుంది.

అయితే సుప్రీం కోర్టు ఫిబ్రవరి 13న ఇచ్చిన ఆదేశాలతో దేశవ్యాప్తంగా అడవుల్లో నివసిస్తున్న 11 లక్షలకుపైగా కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డట్లయిందని గోండ్వాన సంక్షేమ పరిషత్ చెబుతోంది.

వీరంతా అడవిపై తమ హక్కును రుజువు చేసుకోలేకపోయారని, అడవిని ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇలా అడవిని వదిలేయాల్సిన గిరిజనులు ఆంధ్ర, తెలంగాణల్లో కూడా చాలామంది ఉన్నట్లు గోండ్వాన సంక్షేమ పరిషత్‌ చెబుతోంది.

చట్ట ప్రకారం తమకు అడవిలో ఉండే అర్హత ఉన్నా సరే ఖాళీ చేయాలంటూ అటవీ శాఖ అధికారులు చెబుతున్నారంటూ పరిషత్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడవి

రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉండే భద్రాచలం సమీప ప్రాంతంలో ఇటు రంపచోడవరం, చింతూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నట్లు వారు వివరించారు.

చింతలపాడుకు చెందిన గిరిజనురాలు మడకం సమరు బీబీసీతో మాట్లాడుతూ..

'నాకు పెళ్లి అయినప్పుడు ఈ గ్రామానికి వచ్చాం. అప్పటి నుంచి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు వేరే పనిరాదు. మా పిల్లలు కూడా ఇదే పని చేస్తారు. ఇప్పుడు బయటకు పొమ్మంటే ఎలా? చావైనా బతుకైనా ఇక్కడే. మమ్మల్ని అడివి నుంచి ఎవరూ వేరు చేయలేరు’’ అన్నారు.

దుమ్ముగూడెం మండలం గద్దల మడుగు అనే గ్రామమైతే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అక్కడి వారు 25 ఏళ్ల క్రితమే వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు.

గతంలో దాదాపు అయిదారు సార్లు ఆ ఊరు మొత్తాన్ని ఖాళీ చేయించి, ఇళ్లను కాల్చేశారని, అయినా వారికి ఏ ఆధారం లేక తిరిగి అక్కడికే వచ్చి జీవనం సాగిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

అదేరీతిలో చింతలపాడు, మద్దిగూడెం గ్రామాలు కూడా వాటి అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నాయని గోండ్వాన సంక్షేమ పరిషత్‌ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

అయితే 1998లోనే హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చామని అయినా అటవీ శాఖ అధికారులు ఇప్పటివరకు తమకు పట్టాలు ఇవ్వకపోగా, తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలు అంటూ తమని ఖాళీ చేయాలని చెప్పడంతో గిరిజన కుటుంబాలు ఆందోళనలో ఉన్నట్లు గోండ్వాన సంక్షేమ సంఘం తెలిపింది.

అడవి

'మాకు రైతు బంధు వద్దు.. మా కష్టం మమ్మల్ని చేసుకోనీయండి..!'

వ్యవసాయానికి అండగా నిలవాలని ప్రభుత్వాలు రైతుబంధు, ఇతర రాయితీలు కల్పిస్తున్నాయని, తాము వ్యవసాయం చేస్తుంటే సాయం చేయకపోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడమేంటని పరిషత్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

పండిన పంటను అడవి నుంచి మార్కెట్ కు తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, కనీసం తమ గ్రామాలకు రహదారి కూడా లేదంటున్నారు.

‘‘ఆటోలు, బస్సులు గ్రామంలోకి రావు. ఏదైనా ప్రైవేటు వాహనాలు తీసురావడానికి రహదారి ఉండదు. కష్టపడి పంట తీసుకెళితే మార్కెట్‌లో సరైన ధర ఇవ్వరు. సాగు సమయంలో పొలానికి నీరు పెట్టాలంటే అధికారులు బోరు వేయనివ్వరు. కేవలం వర్షంపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం అని గ్రామస్తులు బీబీసీతో అన్నారు.

'‘చాలా ఏళ్ల కిందే ఈ ఊరు వచ్చాం. పోడు కొట్టుకుని వ్యవసాయం చేస్తున్నాం. అటవీ అధికారులు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చెరువు గట్టులను ట్రాక్టర్లు, ప్రొక్లైన్లు పెట్టి కూలగొట్టారు. 1998లో హైకోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నాం. మళ్లీ కట్టలు వేసుకుని వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. చాలాసార్లు పట్టాలకు దరఖాస్తు చేసుకున్నాం. అయినా పట్టించుకోలేదు. మళ్లీ మమ్మల్ని వెళ్లిపోవాలని అంటున్నారు. వ్యవసాయం కన్నా పోరాటం చేయాల్సి వస్తుంది’’ అని చింతలపాడుకు చెందిన గిరిజనుడు మడవి మాదయ్య అన్నారు.

అడవి

ఇన్ని ఇబ్బందుల్లో వ్యవసాయం చేస్తున్నా చివరకు సాగు మాని తమ జీవనం కోసం నిత్యం పోరాటం చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అడవి నుంచి బయటకు వెళ్లి కూలి చేసుకునే పరిస్థితి లేదని, కనీసం తమకు ఉపాధి హామీ వంటి పథకాలు కూడా అమలు చేయరని వారు చెబుతున్నారు.

ప్రభుత్వం తమకు ఎలాంటి సాయం చేయకపోయినా తమ రెక్కల కష్టంతో పిల్లలను పోషించుకుంటున్నామని చెబుతున్నారు.

అయినా తాము సాగు చేసే భూమి కోసం పోరాటం తప్పడం లేదని, చివరకు అడవిని ఖాళీ చేయమని చెప్పడంతో బాధగా ఉందని చెబుతున్నారు.

తమకు వ్యవసాయం తప్ప మరే జీవనాధారం లేదని వాపోతున్నారు.

ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు ఇచ్చారు తప్ప తమకు ఎటువంటి సాయం అందని పరిస్థితి నెలకొందని వివరిస్తున్నారు. తమకు అండగా నిలబడకపోయినాసరే, తమను వ్యవసాయం చేసుకోనిస్తే చాలని వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)