అంతర్జాతీయ మహిళా దినోత్సవం : భారత్‌లో కులం-మతం లేకుండా సర్టిఫికెట్ పొందిన మొట్ట మొదటి మహిళ, కానీ ఈమె అలా ఎందుకు చేశారు?

ఫొటో సోర్స్, facebook
- రచయిత, నియాస్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో కులమతం లేకుండా ఇలాంటి సర్టిఫికెట్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఈమే అని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారత్ అనగానే అందరికీ ఎన్నో మతాలు, కులాల వారీగా విభజనకు గురైన ఒక దేశంలా అనిపిస్తుంది. కానీ ఆ దృష్టిని రూపుమాపేందుకు ముందుకు వచ్చింది తమిళనాడులోని స్నేహ. ఆమెపై మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
అయితే, ఈ స్నేహ ఎవరు?, మనం ఆమెనే అడిగి తెలుసుకుందాం.
నా పేరు స్నేహ ముంతాజ్ జెన్నిఫర్ అని మాటలు మొదలుపెట్టారు ఆమె..
నిర్ణయానికి మూలం ఎక్కడ?
"నేను లాయర్ల కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న(ఆనంద కృష్ణన్), అమ్మ(మణిమొళి) ఇద్దరూ లాయర్లే. కాస్త గతంలోకి వెళ్తే.. ఇలాంటి సర్టిఫికెట్ పొందాలని నేను మాత్రమే ప్రయత్నించ లేదు. దీన్ని మా నాన్నే ప్రారంభించారు. ఆయన ఈ సర్టిఫికెట్ పొందాలని చాలాసార్లు ప్రయత్నించారు. అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ చాలా ఏళ్ల కష్టం తర్వాత నేను దాన్ని సాధించగలిగాను" అన్నారు స్నేహ.
"సర్టిఫికెట్ తీసుకోలేకపోయినా, మా నాన్న నాకు, నా ఇద్దరు చెల్లెళ్లకు ఎలాంటి కులమతాల ముద్ర లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు నా పేరు తెలిసినా, ఎవరూ నా కులం, మతం డీకోడ్ చేయలేరు.
ఇది మా జీవనశైలి మాత్రమే
మా అమ్మనాన్నలు ఏదో సాధించాలని అలా చేయలేదు. వారి జీవనశైలి అలాగే ఉండేది, మా అమ్మనాన్నలు ఎలా జీవించారో, మమ్మల్ని కూడా అలాగే పెంచారు.
కులమతాలు లేకుండా సర్టిఫికెట్ తీసుకోవాలన్న ఈ నిర్ణయానికి నా భర్త కూడా అండగా నిలిచారు.

ఫొటో సోర్స్, facebook
"నా భర్త పార్తిబరాజా కూడా కులమతం అనే ఆచారాలకు వ్యతిరేకం. స్త్రీవాద ఆలోచనలపై చాలా ఆసక్తి చూపిస్తారు. మాది కులమతాలు లేని వివాహం. ఇలాంటి సర్టిఫికెట్ తీసుకోవడం వెనుక ఆయన చాలా కీలక పాత్ర పోషించారు".
భవిష్యత్ తరాలకు కూడా ఈ కులమత రహిత సిద్ధాంతాన్ని నేర్పించాలని స్నేహ భావిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వాళ్లకు ఆతిరై నస్రీన్, ఆతిలా ఇరేన్, హారిఫా జెస్సీ అని పేర్లు పెట్టారు. అప్లికేషన్‌లో కులం రాయకుండానే వాళ్లను స్కూల్లో కూడా చేర్పించారు.
కులమతాల గుర్తింపును తుడిచిపెట్టేందుకు తన కుటుంబం కృషి చేస్తోందని, తర్వాత తరాలకు కూడా దీనిని కొనసాగిస్తామని స్నేహ తెలిపారు.
"మేం ఏ కులాచారాలను, మతాల పండుగలను అనుసరించం. బహుశా అందుకేనేమో, మేం ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నాం".
"మత ఆధారిత రాజకీయాలపై దేశంలో ఎక్కువ ఆసక్తి ఉండడంతో.. నేను సాధించిన దీనిని చాలా ప్రత్యకంగా భావిస్తున్నాను" అంటారు స్నేహ
కుల, మతాల పేరుతో ఎవరూ మనల్ని విడదీయలేరని దీని ద్వారా నేను ప్రజలకు ఒక సంకేతం ఇస్తున్నాను. సమాజం కులమతాలపైనే ఏర్పడినదని చెప్పడానికి ప్రయత్నించినవారికి, ఇంకా ప్రయత్నించేవారికి అందరికీ ఇదే నా సమాధానం. అలాంటివారికి నా నిర్ణయం చాలా పెద్ద షాక్ అనుకుంటున్నాను.
నాలాగే మరింత మంది ముందుకు వచ్చి ఇలా కులమతాలను వదులుకున్నప్పుడు, వాటిపైనే ఆధారపడే ఎంతోమంది నాయకుల మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. వారి రాజకీయాలు కూడా కనుమరుగవుతాయి.

ఫొటో సోర్స్, facebook
ఇది రిజర్వేషన్లకు వ్యతిరేకమా?
నేను చేసిన ఈ పనిని కొంతమంది రిజర్వేషన్లకు వ్యతిరేకం అని భావిస్తున్నారు. మన సమాజం సర్టిఫికెట్ వద్దని మనం అనుకున్నంత మాత్రాన, కులం సమూలంగా నాశనం అవుతుందా? అని ఆమె ప్రశ్నించారు.
"నిజానికి నేను రిజర్వేషన్లకు వంద శాతం మద్దతిస్తాను. శతాబ్దాలుగా వంచనకు గురై, స్వేచ్ఛ కోల్పోయిన ఎంతోమంది జీవితాల్లో రిజర్వేషన్లు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వారి అభివృద్ధికి సాయం చేస్తున్నాయి. మనం కష్టపడి సాధించుకున్న రిజర్వేషన్ల కోసం కులం సర్టిఫికెట్ తీసుకోడానికి నేను వ్యతిరేకం కాదు. దాన్ని విరోధించడం లేదు. అణచివేతకు గురైన వారికి కచ్చితంగా వారి సమాజం ధ్రువీకరణ పత్రం అవసరమే" అని స్నేహ తెలిపారు.
"నేను కులవ్యవస్థలో అగ్రస్థానంలో ఉన్న వారిని ఆ వ్యవస్థ నుంచి బయటకు రావాలని కోరుతున్నాను. వాళ్లు తమపై సమాజం ముద్రను, సర్టిఫికెట్‌ను వదులుకోవాలి. అణచివేతకు గురైనవారికి అండగా నిలవాలి".

ఫొటో సోర్స్, facebook
దీనిని ప్రభుత్వం ఎలా చూస్తోంది?
కులమతాలు లేని సర్టిఫికెట్ తీసుకోవాలని అనుకున్నప్పుడు తన కుటుంబం, స్నేహితుల నుంచి చాలా మద్దతు లభించిందని స్నేహ చెప్పారు. "దానికి ఎప్పుడు అప్లై చేస్తున్నావ్" అని వారు అడిగారని తెలిపారు.
"నేను పదేళ్ల క్రితమే ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాను. సాధారణంగా నా అప్లికేషన్లు తాలూకా ఆఫీస్ దగ్గరే చెత్తబుట్టలోకి వెళ్లిపోయేవి. వాళ్లు నాతో మేం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి మీ విషయం పరిశీలిస్తాం అని చెప్పడం అలవాటైపోయింది. కొందరు 'మీరు ఇలాంటి సర్టిఫికెట్ ఎందుకు అడుగుతున్నారు' అని ఆసక్తిగా అడిగేవారు. కానీ ఈసారీ సబ్ కలెక్టర్, తాశీల్దార్ ఇద్దరూ నాకు చాలా మద్దతుగా నిలిచారు, ఇలాంటి సర్టిఫికెట్ మొదటిసారి జారీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు".
ఎన్నోసార్లు విఫలం అయ్యాక, రెండేళ్ల క్రితం అందరూ కాస్ట్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసినట్టే, నేను దానికోసం మళ్లీ దానికోసం దరఖాస్తు చేశాను. మొదట వీఏఓ ఆఫీసులో అప్లికేషన్ పెట్టా. వాళ్లు దాన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు పంపించారు. చివరికి అది తాశీల్దార్ ఆఫీసు చేరింది. తర్వాత వాళ్లు దర్యాప్తు ప్రారంభించారు. దీని గురించి నేను వాళ్లకు చాలా వివరణ ఇవ్వాల్సి వచ్చింది" అన్నారు స్నేహ.

ఫొటో సోర్స్, facebook
"నేను ఇతరుల హక్కులు కాలరాయడానికి ఈ సర్టిఫికెట్ అడగడం లేదు. అని నేను వాళ్లకు భరోసా ఇచ్చాను. అప్పటిగ్గానీ అది నా చేతికి రాలేదు".
మీరు ఒక లాయర్ కాబట్టి దీన్ని సాధించగలిగారు? కానీ ఇది కావాలనుకునే ప్రతి పౌరుడికీ ఇది సాధ్యం అవుతుందా? ప్రభుత్వం వారిని సమర్థిస్తుందా? అని నేను ఆమెను ప్రశ్నించాను.
"సాధ్యమే, ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసమే పనిచేస్తుంది. సామాన్యుల ప్రతి అవసరం, కోరిక నెరవేర్చడం వాళ్ల విధి. ఇలాంటి సర్టిఫికెట్ ఎవరు అడిగినా ప్రభుత్వ అధికారులు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సామాజిక విప్లవంగా మారుతుందేమోననే భయంతో వారు దానికి సిద్ధంగా లేకపోవచ్చు. కానీ, ప్రభుత్వం దీన్ని సానుకూలంగా తీసుకోవాలనే నేను కోరుతున్నా" అన్నారు స్నేహ.
ఇవి కూడా చదవండి:
- జహంగీర్: సొంత కొడుకు కళ్లు పొడిపించేసిన మొఘల్ చక్రవర్తి
- కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి, 34 మంది మృతి
- సైస్స్ ఆఫ్ లవ్: ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?
- ప్రేమలేఖ: ఆ మోహపు మైమరపు ప్రేమే కదా...
- ప్రధాని మోదీని రాహుల్, ప్రియాంక పొగిడారా...
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








