ప్రకాశ్ రాజ్ క్రైస్తవ మతంలోకి మారడం నిజమేనా, వాస్తవం ఏంటి?- Fact Check

ఫొటో సోర్స్, https://twitter.com/prakashraaj
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
దక్షిణాది ప్రముఖ నటుడు, ప్రస్తుతం రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన ప్రకాష్ రాజ్ క్రైస్తవ మతం పుచ్చుకున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతోంది.
ఆదివారం ఆయన బెంగళూరులోని బెథెల్ ఏజీ చర్చికి వెళ్లిన తర్వాత విడుదలైన ఫొటోలతో ఈ వార్త వైరల్ అయ్యింది.
"వి సపోర్ట్ అజిత్ డోవల్" అనే ఒక ఫేస్‌బుక్ గ్రూప్ ప్రకాష్ రాజ్, చర్చి పాస్టర్‌తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. "ఈ నటుడు అయ్యప్పపై నమ్మకం లేదంటూ కపటనాటకాలు ఆడారు" అని రాసింది. క్రైస్తవ దేవుడిని అయ్యప్పకు పోటీగా పెట్టాలని ప్రకాశ్ రాజ్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
చాలా మంది హిందుత్వ మద్దతుదారులు ప్రకాశ్ రాజ్‌కు హిందువులంటే ద్వేషమని, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించారు.
రమేష్ రామచంద్రన్ అనే ట్విటర్ హాండిల్‌లో "ఈ నటుడు కర్ణాటకలో వేల మంది హిందువులను మతం మార్చిన ఒక నకిలీ పాస్టర్‌తో కలిసి ప్రార్థనలు చేస్తున్నారు" అని రాశారు.
కొన్ని ట్విటర్ హాండిళ్లలో 'క్రైస్తవ నాస్తికుడు' అంటూ ఆయన్ను ఆటపట్టించారు.
మా పరిశీలనలో ఈ వైరల్ ఫొటోలు విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయని విషయం గుర్తించాం.
ఆ ఫొటోలు ప్రకాశ్ రాజ్ దిగినవే. కానీ, వాటిని ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో వీళ్లు షేర్ చేస్తున్నారో అది వాస్తవం కాదని తేలింది.
ఆయన మసీదు, గురుద్వారా, ఆలయానికి వెళ్లిన ఏ ఫొటోలనూ ట్విటర్ హాండిల్స్, గ్రూప్స్ షేర్ చేయలేదు.

ఫొటో సోర్స్, prakashraaj/twitter
ప్రముఖ ప్రాంతాల సందర్శన
ప్రకాశ్ రాజ్ చర్చికి మాత్రమే కాదు, ఇంకా ఇతర మతపరమైన ప్రదేశాలకు వెళ్తుంటారు.
ఈయన అధికారిక ట్విటర్, ఫేస్‌బుక్ పేజిలో తను ఆలయంలో, గురుద్వారాలో, ఒక మసీదులో, చర్చిలో ఉన్న ఫొటోలను షేర్ చేశారు.
"నేను ప్రజలకు దగ్గరవడానికి అన్ని మతాలనూ గౌరవిస్తున్నాను. అందరినీ గౌరవించడం మన సంస్కృతి. సంబరాలు చేసుకుందాం, దేశం కలిసిమెలిసి ఉండేలా చేద్దాం, ప్రజావాణిని వినిపిద్దాం" అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
త్వరలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలకు మతం రంగు పులమడానికే అలాంటి సందేశాలు వ్యాప్తి చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ బీబీసీకి చెప్పారు.
"నేను చర్చికి, మసీదుకు, గురుద్వారా, ఆలయానికి వెళ్తా. ఎందుకంటే వాళ్లు తమకు తాము లౌకిక ఓటు వేయాలని అనుకుంటున్నారు. నేను దాన్ని గౌరవిస్తా. దేశంలో ద్వేషాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే భక్తులు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు" అన్నారు.

ఫొటో సోర్స్, prakashraaj/twitter
అయ్యప్పపై నమ్మకం ఉందా?
అయ్యప్పపై నమ్మకం లేని ఆయన క్రైస్తవ మతాన్ని ఎలా నమ్ముతారని ప్రకాశ్ రాజ్‌ను కొందరు ప్రశ్నించారు.
కేరళ ఆలయంలోకి వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఒక సందర్భంలో అంటున్న వీడియో ఆధారంగా చేసుకుని అందరూ ఈ వాదనకు తెరతీశారు.
"ఏ మతమైనా మహిళను, నా తల్లిని ప్రార్థించకుండా నిషేధిస్తే.. అది నాకు మతమే కాదు. ఏ భక్తుడైనా నా తల్లిని పూజించకుండా అడ్డుకుంటే, అతడు నాకు భక్తుడే కాదు. ఏ దేవుడైనా నా తల్లి తనను పూజించాలని కోరుకోకపోతే ఆయన నాకు దేవుడే కాదు" అని ఆయన అందులో అనడం మనకు వినిపిస్తుంది.
ఆయన ఈ ప్రకటనను శబరిమల ఆలయంలో ప్రవేశించే హక్కు కోసం ఉద్యమం చేసిన మహిళలకు మద్దతుగా చేశారు.
ఆయన మతంపై ఎన్నో తప్పుడు వార్తలు వైరల్ కావడంతో ఆయన తన ట్విటర్‌లో ఒక వీడియో షేర్ చేశారు. అందులో "నేను దేవుడిని నమ్ముతానా, నమ్మనా అనేది ముఖ్యం కాదు. ఇతరులు నమ్మేదాన్ని మనం గౌరవిస్తున్నామా, లేదా అనేదే ముఖ్యం. మతంలోకి రాజకీయాలను తీసుకురండి అన్నారు.
దేశంలో ఫేక్ న్యూస్ పెరగడంపై బీబీసీతో మాట్లాడిన ప్రకాశ్ రాజ్..కొన్ని గ్రూపుల్లో ఉన్న వారు తమకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తినపుడు, వారిపై యాంటీ-నేషనల్, అర్బన్-నక్సల్స్, టుక్డే, టుక్డే గ్యాంగ్, యాంటీ-హిందూ లాంటి ముద్ర వేస్తాయని, ఆ వార్తలు వైరల్ చేస్తాయని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నచ్చితే పవన్ కల్యాణ్ పార్టీకి మద్దతు: ప్రకాశ్‌రాజ్
- ‘రజనీకాంత్, నేను స్నేహపూర్వక ప్రత్యర్థులం’
- ఆడియన్స్ కళ్లలో ఆనందం కోసం.. ఒత్తిడిలోకి యూట్యూబ్ స్టార్స్
- పంటల బీమా: రైతుల కోసమా - కంపెనీల కోసమా
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- శారదా కుంభకోణం: పది లక్షల మందికి గాలం... పది వేల కోట్ల మోసం
- ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్ళి చేసుకున్నారు
- డమ్మీ తుపాకీతో రెస్టారెంట్‌కు వచ్చిన 'కిమ్'
- క్రికెట్ మ్యాచ్‌లు ఇలా కూడా ఆలస్యమవుతాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








