హైదరాబాద్ : ప్రేమించలేదని కాలేజీకి బయల్దేరిన అమ్మాయిని కత్తితో నరికేసిన యువకుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ బర్కత్ పుర ప్రాంతంలో మధులిక అనే అమ్మాయి పై ఒక యువకుడు కత్తితో దాడి చేశాడు. 'తనను ప్రేమించడం లేదని కోపంతో ఈ దాడికి తెగబడ్డాడు..'' అని పోలీసులు చెప్పారు. అతడిని అరెస్ట్ చేశామని అతనిపై హత్యాయత్నం కేసు పెట్టామని పోలీసులు వివరించారు.
పోలీసులు.. అమ్మాయి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..
అమ్మాయి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
నిందితుడు ఈ అమ్మాయిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడని.. అమ్మాయి తల్లిదండ్రులు ఇటీవలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు అబ్బాయికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. తర్వాత ఆ అబ్బాయి ఏకంగా అమ్మాయిపై కత్తితో దాడికి దిగాడు.
ప్రస్తుతం అమ్మాయి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె రెండు చేతులకి తీవ్ర గాయాలయ్యాయి
వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఉదయం 8.45 గంటల ప్రాంతంలో అమ్మాయి కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని.. అబ్బాయి నివాసం కూడా అమ్మాయి ఇంటికి దగ్గరలోనే ఉందని పోలీసులు తెలిపారు.
అబ్బాయి ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడని వివరించారు.
నిందితుడి కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీ రమేష్ తెలిపారు.
అయితే అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.
అమ్మాయిని ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు.. "ఆమెకు చాలా సీరియస్‌గా ఉంది. స్పృహలో లేదు. రక్తం బాగా పోయింది. చాలా చోట్ల గాయాలయ్యాయి. చేతులు తెగిపోయాయి. మెడ తెగింది. రక్తం పోకుండా కట్టడి చేస్తున్నాం" అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
"ఆమెకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, వాటికి ఏ విధంగా ఆపరేషన్ చేయాలి అనేది డాక్టర్లు విశ్లేషిస్తున్నారు" అని ఆసుపత్రి ప్రతినిధి సంపత్ బీబీసీ తెలుగుకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ వేధింపులు..
మధులిక తండ్రి మీడియా ప్రతినిధులకు చెప్పిన సమాచారం ప్రకారం.. నిందితుడు భరత్ ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడు.
దీనిపై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఒకసారి షీ టీంకి ఫిర్యాదు చేశాం.
షీ టీమ్ వారు అబ్బాయిని, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.
కౌన్సిలింగ్ ఇచ్చిన రెండు రోజులకే ఇలా జరిగింది.
దాడి చేసిన అబ్బాయీ షాక్ లో ఉన్నాడు - పోలీసులు
దాడి చేసిన అబ్బాయి షాక్‌లో ఉన్నారని తూర్పు మండల డీసీపీ రమేష్ తెలిపారు.
''తన ప్రేమ ఒప్పుకోలేదనీ, తనతో మాట్లాడడం లేదనే అబ్బాయి దాడి చేశాడు. అమ్మాయి ఇంటికి 15 అడుగుల దూరంలో అబ్బాయి ఇల్లు ఉంది. అమ్మాయి కాలేజీకి వెళ్లేప్పుడు ఆపి కత్తితో దాడి చేసాడు. అమ్మాయి గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చేలోపు అబ్బాయి పారిపోయాడు. నిందితుడు మూసీ నది దగ్గర ఉంటే పట్టుకున్నాం. కత్తి అబ్బాయి ఇంట్లో దొరికింది.'' అని డీసీపీ వివరించారు.
అబ్బాయికీ, అమ్మాయికీ పరిచయమూ స్నేహమూ ఉన్నాయని వారిది ఒకే కులమని డీసీపీ చెప్పారు. అబ్బాయిపై హత్యాయత్నం కింద కేసు, అమ్మాయి మైనర్ కాబట్టి బాలలపై దాడులకు సంబంధించిన పోస్కో చట్టం కింద కేసు పెడతాం అని వివరించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








