పంటల బీమా: రైతుల కోసమా - కంపెనీల కోసమా

రైతు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పంటలు నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఉద్దేశించిన బీమా పథకాలు ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు వరంగా మారుతున్నాయి.

2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ బీమా సంస్థలు పంటల బీమాతో ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా మిగుల్చుకోగా.. అదే సమయంలో ప్రభుత్వ రంగంలోని బీమా సంస్థలు రూ.4,085 కోట్ల మేర లోటు మూటగట్టుకున్నట్లు 'భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ'(ఐఆర్‌డీఏఐ) వార్షిక నివేదిక వెల్లడించింది.

ప్రైవేట్ బీమా సంస్థలకు రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లిస్తున్న బీమా మొత్తంతో పోల్చితే.. వరదలు, భూకంపాలు, ఇతర రూపాల్లో పంట నష్టాలకు సంబంధించి ఆ సంస్థలు పరిష్కరిస్తున్న క్లెయిముల మొత్తం చాలా తక్కువగా ఉంటోందనీ ఈ నివేదిక తేటతెల్లం చేసింది.

దీంతో పంటల బీమా పథకం రైతులకా? ప్రైవేట్ కంపెనీల కోసమా? అన్న ప్రశ్న రైతులు, రైతాంగ సమస్యలపై పోరాడుతున్న నాయకుల నుంచి వినిపిస్తోంది.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీం(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్), కోకోనట్ పామ్ ఇన్స్యూరెన్స్ స్కీం(సీపీఐఎస్) సహా పలు పంట బీమా పథకాల్లో మొత్తం 18 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. వీటిలో 13 ప్రయివేటు సంస్థలు కాగా 5 ప్రభుత్వ రంగ సంస్థలు.

పంట బీమా కాంట్రాక్టు పొందిన ప్రైవేటు సంస్థలకు రూ.11,905 కోట్లు ప్రీమియం రూపంలో సమకూరగా.. రూ.8,553 కోట్ల మేర క్లెయింలకు దరఖాస్తులొచ్చాయి. అంటే రూ.3,351 వేల కోట్ల మిగులు స్పష్టంగాకనిపిస్తోంది. క్లెయింలన్నీ యథాతధంగా పరిష్కారం కావు కాబట్టి ఈ మొత్తం ఇంకా పెరగొచ్చు.

అదే సమయంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు పంట బీమాల ప్రీమియంతో సమకూరిన మొత్తం కంటే క్లెయిములు అధికంగా ఉన్నాయి.

5 ప్రభుత్వ రంగ సంస్థలకు రైతులు, ప్రభుత్వం నుంచి ప్రీమియం రూపంలో రూ.13,411 కోట్లు సమకూరగా.. రూ.17,496 కోట్ల క్లెయిం దరఖాస్తులొచ్చాయి. దీంతో వాటికి రూ.4,085 కోట్ల లోటు కనిపిస్తోంది.

వీటిలో అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఏఐసీ) అత్యధికంగా నష్టపోయింది. ఈ సంస్థకు ప్రీమియం రూపంలో రూ.7,893 కోట్లు రాగా క్లెయింల రూ.12,339 కోట్లు మేర ఉన్నాయి. రూ.4446 కోట్లు నష్టం ఎదుర్కొంది.

80 శాతం లాభాలు 5 ప్రైవేట్ సంస్థలకే...

పంట బీమాలతో లబ్ధి పొందుతున్న 13 ప్రైవేట్ సంస్థల్లో 5 సంస్థలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. 80 శాతం లబ్ధి వీటికే కలుగుతోంది.

ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ అత్యధికంగా రూ.1,816 కోట్లు లబ్ధి పొందగా.. రిలయన్స్ రూ.1,361 కోట్లు, యూనివర్సల్ సొంపో జనరల్ ఇన్స్యూరెన్స్ రూ.1195 కోట్లు, ఐసీఐసీఐ రూ.1193 కోట్లు, ఎస్బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ రూ.1059 కోట్లు ప్రయోజనం ఆర్జించినట్లు ఐఆర్‌డీఏఐ గణాంకాలు చెబుతున్నాయి.

వీటితో పాటు బజాజ్ అలయంజ్ రూ. 815 కోట్లు, భారతీ ఏఎక్స్ఏ రూ.302, చోళమండలం రూ.182, ఫ్యూచర్ జనరల్ రూ.111 కోట్లు, శ్రీరాం జనరల్ ఇన్సూరెన్స్ రూ.107 కోట్లు మేర లాభపడ్డాయి.

కాగా 2016లో ప్రారంభమైన ఫసల్ బీమా యోజనలో రబీ పంటలకు 2 శాతం, ఖరీఫ్ పంటలకు 1.5 శాతం, వాణిజ్య.. ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. మిగతాది ప్రభుత్వాలు చెల్లిస్తాయి.

ప్రస్తుతం అన్ని పంట బీమా పథకాల పరిథిలో సుమారు 5 కోట్ల మంది రైతులు ఉండగా అందులో 2.75 కోట్ల మంది రైతులు 2017-18లో మొత్తం రూ.26,050 కోట్ల మేర పంట నష్టం క్లెయిం చేశారు. ఇది మొత్తం ప్రీమియం రూ.25,291 కోట్లు కంటే ఎక్కువ.

పెథాయ్ తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్‌లో పంట చేతికొచ్చే దశలో నీట మునిగిన వరి చేలు
ఫొటో క్యాప్షన్, పెథాయ్ తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్‌లో పంట చేతికొచ్చే దశలో నీట మునిగిన వరి చేలు

'ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు'

కాగా పంట బీమా పథకాలు ప్రయివేటు బీమా సంస్థలకు కోట్లు ఆర్జించిపెడుతున్నాయని సీనియర్ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్ అభిప్రాయపడ్డారు.

2016 నుంచి ఇప్పటివకరకు ప్రయివేటు, ప్రభుత్వ బీమా సంస్థలకు ప్రభుత్వం రూ.66 వేల కోట్లను ప్రీమియం రూపంలో చెల్లించిందని.. ఈ కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం ఉన్నప్పటికీ రైతులకు దక్కిన పరిహారం చాలా తక్కువని అన్నారు.

రైతులు

ఫొటో సోర్స్, Getty Images

మొత్తం బీమా సంస్థల చేతిలోనే: సారంపల్లి మల్లారెడ్డి

దేశంలో ప్రస్తుత పంట బీమా పథకాల వల్ల ఇన్స్యూరెన్స్ కంపెనీలకు లాభం కలుగుతోందే తప్ప రైతులకు న్యాయం జరగడం లేదని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు.

గత పంట బీమా పథకాలకు, ప్రస్తుత పథకాలకు మధ్య వ్యత్యాసం చెబుతూ ఇప్పటి విధానం రైతుకు ఏమాత్రం అనుకూలం కాదన్నారు.

''ఫసల్ బీమా యోజనకు ముందు ఉన్న 'మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ స్కీం(ఎంఎన్ఏఐఎస్) విధానంతో పోల్చినప్పుడు ఇప్పుడు ప్రీమియం అధికంగా ఉంది.

పాత విధానంలో పరిహారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే చెల్లించేవి.. ప్రీమియం కూడా వారి వద్దే ఉండేది. బీమా సంస్థ కేవలం మధ్యవర్తిగా ఉంటూ నిర్వహణ ఖర్చులు తీసుకునేది. కానీ, కొత్త విధానంలో ప్రీమియం తీసుకోవడం, పరిహారం చెల్లించడం రెండూ బీమా సంస్థలే చేస్తాయి.

ప్రయివేటు బీమా సంస్థలంటే లాభాపేక్షతో వ్యాపారం చేసే సంస్థలే కాబట్టి అవి నష్టపోయేందుకు సిద్ధంగా ఉండవు. దీంతో రైతుకు పూర్తిస్థాయిలో పరిహారం అందడం కష్టం'' అని అభిప్రాయపడ్డారు.

నీట మునిగిన పంట

ఫొటో సోర్స్, Getty Images

30 కోట్ల రైతుల్లో 20 శాతం మందికే బీమా

''ఫసల్ బీమా యోజనలో ప్రాంతాలవారీగా బీమా సంస్థలను నిర్ణయిస్తారు. ఇవి కూడా ఏటా మారే అవకాశం ఉంటుంది. దీంతో క్లెయిముల పరిష్కారంలో ఇబ్బందులేర్పడితే కొత్త సంస్థ బాధ్యత వహించదు. ఇది రైతులకు ఇబ్బందికరం.

పంట నష్టాలను నిర్ధారించే విధానాలూ హేతుబద్ధంగా లేవని, రైతుకు అనుకూలంగా లేవు.

అలాగే ఇది అన్ని పంటలకూ, అందరు రైతులకు వర్తించడం లేదు. బ్యాంకులో రుణాలు తీసుకునే రైతులకు నిర్బంధ బీమా వర్తింపజేస్తున్నారు కానీ రుణాలు తీసుకోని రైతులు స్వచ్ఛందంగా ఈ బీమా పథకాల్లో చేరే అవకాశం ఉన్నా కూడా వారికి ఆ దిశగా అవగాహన కల్పించడం లేదు. దీంతో ఇది అందరికీ చేరడం లేదు.

దేశంలో 30 కోట్ల మంది రైతులున్నారు. వీరిలో 20 శాతం కంటే తక్కువ మంది రైతులే బీమా పరిధిలో ఉన్నార''ని మల్లారెడ్డి చెప్పారు.

అరటి తోటలో రైతు

ఫొటో సోర్స్, Getty Images

నష్టాల్లేన్ని ప్రాంతాల్లోనే ప్రైవేట్ కంపెనీల వ్యాపారం

ఫసల్ బీమా యోజనలో బీమా సంస్థలు టెండర్లలో పాల్గొంటాయి. తక్కువకు కోట్ చేసిన సంస్థకు ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కేటాయిస్తుంది. ప్రీమియం ప్రభుత్వం ద్వారా ఆయా సంస్థలకు అందుతాయి. క్లెయింలు మాత్రం సంస్థ ద్వారా జరుగుతాయి.

అయితే నష్టభయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఎక్కువకు కోట్ చేసి అక్కడి బాధ్యతల నుంచి తప్పుకొంటున్నాయి. కొన్ని సంస్థలు అసలు టెండర్లలోనే పాల్గొనడం లేదు. దీంతో అలాంటి ప్రాంతాల్లో బీమా బాధ్యత ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు దఖలు పడుతోంది.

ఈ కారణంగానే ప్రైవేట్ సంస్థలతో పోల్చితే ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రీమియం కంటే క్లెయింలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఏం చేస్తే రైతుకు ప్రయోజనం

‘‘ప్రీమియం విధానం నుంచి నష్టం నిర్ణయించే పద్ధతి, పరిహారం చెల్లింపు ప్రక్రియ వరకు అంతా లోపభూయిష్టంగానే ఉంది.

మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తూ.. దేశంలోని రైతులందరినీ దీని పరిథిలోకి తెస్తే నిజమైన లబ్ధి కలుగుతుంది.

అన్ని పంటలకు.. ప్రధానంగా అన్ని ఆహారపంటలకు ఇది వర్తింపజేస్తేనే భూమిని నమ్మకున్న కర్షకులకు ధైర్యం కలుగుతుంది’’ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

‘2.92 కోట్ల మంది రైతులకు లబ్ధి కలిగింది’

కాగా పంటలు వేశాక కలిగే నష్టమే కాకుండా అసలు పంటలు వేయడానికి కలిగే నష్టాలకు పరిహారం అందించే బీమా పథకాలను వర్తింపజేస్తున్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు.

రైతులు క్లెయిం చేసుకున్న తరువాత నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించకపోతే బీమా సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 3.40 కోట్ల మంది రైతులు బీమాకు నమోదు చేసుకున్నారని అందులో 27 శాతం మంది రుణాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని ఆయన ప్రకటించారు.

దేశంలో వీలైనంత ఎక్కువమంది రైతులను, ఎక్కువ పంటలను బీమా పరిధిలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

2017-18 రబీ సీజన్ వరకు 2.92 కోట్ల రైతుల క్లెయింలు పరిష్కారమయ్యాయని ఫసల్ బీమా యోజన ట్విటర్ హ్యాండిల్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)