బీబీసీ ఇంటర్వ్యూ: కార్పొరేట్ రంగానికి ఉత్తమ సేవలందించటంలో బీజేపీ చాలా ముందుంది: పి.సాయినాథ్

ఫొటో సోర్స్, praSHANT NANAWARE/ BBC
- రచయిత, అభిజిత్ కాంబ్లే
- హోదా, బీబీసీ మరాఠి
మహారాష్ట్రలో నాసిక్ నుంచి ముంబై వరకూ వేలాది రైతుల లాంగ్‌మార్చ్ నేపథ్యంలో.. దేశంలో రైతాంగం పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం తీరుతెన్నులపై సీనియర్ పాత్రికేయుడు పి.సాయినాథ్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. వ్యవసాయ రంగంపై పలు ప్రశ్నలకు సాయినాథ్ సమాధానాలివీ...
ప్రశ్న: మహారాష్ట్రలో వేలాది మంది రైతులు తమ డిమాండ్ల సాధన కోసం నాసిక్ నుంచి ముంబై వరకూ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఈ ఆందోళన గురించి మీరేమంటారు?
సాయినాథ్: ఈ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన రైతులను చూడండి. ఆ రైతులు ఎంత కష్టపడుతున్నారో చూడండి. అటవీ భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలకు ఇది ఎంత కష్టమో చూడండి. అరవై డెబ్బై ఏళ్ల వయసులోని నిరుపేద మహిళలు ఇంతటి ఎండలో నాసిక్ నుంచి ముంబై వరకూ నడవటం ఎంత కష్టమో ఆలోచించండి.
మొదట వాళ్లు 20,000 మంది ఉన్నారు. ఈ రోజు 50,000 మంది దాటిపోయారు.
ప్రభుత్వం వారి గోడు వినాలని నేనంటాను. గ్రామీణ సంక్షోభం గురించి వారు మనకు చెప్తున్నారు. మనం వారి గొంతు వినాలి.

ఫొటో సోర్స్, Rahul Ransubhe / BBC
ప్రశ్న: వీరి ప్రధాన డిమాండ్లలో రుణ మాఫీ ఒకటి. రుణ మాఫీ పథకం రైతులకు నిజంగా ప్రయోజనం కలిగించలేదని మీరు భావిస్తున్నారా?
సాయినాథ్: మహారాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ పథకం ఎన్నడూ సరిగ్గా పనిచేసేలా రూపొందించలేదు.
అమలు గురించిన ప్రశ్న కాదు. పథకం రూపకల్పనలోనే లోపాలున్నాయి. రుణ మాఫీకి సంబంధించి రెండో విషయం.. అప్పుల్లో అధిక భాగం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవే.
కేవలం బ్యాంకు రుణాలకు మాత్రమే ఉద్దేశించిన రుణ మాఫీ ఈ ప్రైవేటు అప్పులకు వర్తించదు. గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ అంతకంతకూ సమస్యాత్మకంగా మారుతోంది. ఒకవైపు రుణం పొందటం మరింత ఎక్కువగా కష్టమవుతోంది.
'వ్యవసాయ రుణాన్ని నేను రెట్టింపు చేశాను.. మూడు రెట్లు పెంచాను' అని ప్రణబ్‌ముఖర్జీ నుంచి, పి.చిదంబరం, అరుణ్‌జైట్లీ వరకూ ప్రతి ఆర్థికమంత్రీ చెప్పుకుంటారు. అది నిజం. కానీ అది వ్యవసాయదారులకు చేరటం లేదు. అది వ్యవసాయ వాణిజ్యానికి వెళుతోంది.
2017 సంవత్సరానికి నాబార్డు మహారాష్ట్ర లింక్ క్రెడిట్ ప్రణాళికలో 53 శాతం రుణం ముంబయి, దాని పరిసరాల్లోని పట్టణ ప్రాంతాలకు కేటాయించారు.
ముంబయిలో వ్యవసాయదారులెవరూ లేరు.. కానీ వ్యవసాయ వ్యాపారాలున్నాయి. అంటే వ్యవసాయ రుణాల్లో సింహ భాగం వ్యవసాయానికి అందటం లేదు. దీనివల్ల చిన్న రైతులు రుణం పొందటం అంతకంతకూ కష్టమవుతోంటే వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు.
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వారు భారీ మొత్తాల్లో రుణాలు పొందుతారు. కానీ ఒక రైతు రూ. 50 వేల రుణమైనా సులువుగా పొందలేడు.
ఈ రుణ మాఫీల ద్వారా మనం నీటి కుళాయిని కట్టేయకుండా నేల మీద తడిని తుడుస్తున్నామన్నమాట. అందుకే అది పనిచేయటం లేదు.

ఫొటో సోర్స్, PRASHANT NANAVARE / BBC
ప్రశ్న: కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని ప్రకటించింది. అయినా ఎంఎస్‌పీ విధానాన్ని సక్రమంగా అమలుచేయాలన్న డిమాండ్ ఇంకా ఉంది. తాజా పాలసీ రైతులకు మేలు చేయటం లేదా?
సాయినాథ్: కనీస మద్దతు ధర అనేది స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసు. ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయించటానికి మూడు పద్ధతులున్నాయి.
ఎంఎస్‌పీని నిర్ణయించేటపుడు.. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారాల వ్యయంతో పాటు కుటుంబ సభ్యుల శ్రమనూ, ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది.
కానీ కేవలం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఖరీదు మాత్రమే ఉండే విధానాన్ని మాత్రమే ఎంఎస్‌పీ నిర్ణయానికి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
ఇది కేవలం కంటితుడుపు మాత్రమే. రైతులకు మేలు చేసేది కాదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ఆ ఆదాయం పెరుగుదల నామమాత్రంగా ఉంటుందా వాస్తవికంగా ఉంటుందా అనేది విస్పష్టంగా చెప్పలేదు. ప్రభుత్వం కేవలం ప్రజలను మభ్యపెట్టే మాటలు మాత్రమే చెప్తోంది. ఈ పాదయాత్ర చేస్తున్న రైతులు కూడా మోసపోబోతున్నారు.

ఫొటో సోర్స్, Rahul Ransubhe / BBC
ప్రశ్న: 2014 తర్వాత వ్యవసాయ సంక్షోభం పెరిగిందని మీరు అనుకుంటున్నారా?
సాయినాథ్: వ్యవసాయ సంక్షోభం 2014 తర్వాత పెరిగింది నిజమే. కానీ ఇది 2014 లోనే మొదలుకాలేదు. ఇది నూతన సరళీకరణ విధానాలను అమలుచేయటం మొదలైనప్పటి నుంచి 20 ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన సంక్షోభం. అయితే 2014 నుంచి ఈ పరిస్థితి మరింతగా దిగజారిందని చెప్పొచ్చు.
ఇటువంటి విషమ పరిస్థితి 2004కు ముందు ఉంది. అది 2004 ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు మళ్లీ అదే జరగబోతోందని నేను అనటం లేదు.
గత 20 ఏళ్లలో వ్యవసాయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరిన ఉదంతాలున్నాయి. కానీ 2014 నుంచీ అది మరింత విషమించిందనేది నిజం. వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని పార్టీ బీజేపీ.
విషయమేమిటంటే.. అది రైతులకు వ్యతిరేకంగా పనిచేయటం మాత్రమే కాదు.. నిజానికి వారు చేస్తున్నది.. ఒక దాని తర్వాత ఒకటి వచ్చిన ప్రభుత్వాలు చేస్తున్నదీ.. నేడు రాజ్యాన్ని నడిపిస్తున్న కార్పొరేట్ రంగం లక్ష్యాన్ని పూర్తిచేయటమే.
ఆ మాటకొస్తే కార్పొరేట్ రంగానికి ఉత్తమ సేవలందించగలిగేది ఎవరు? అందులో బీజేపీ చాలా ముందుంది.

ప్రశ్న: రైతుల ఈ ఆగ్రహం 2019 ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందా?
సాయినాథ్: రైతుల ఆగ్రహం భవిష్యత్తులో ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారా? ఎన్నికలనేవి మరింత సంక్లిష్టమైన అంశం.
మహారాష్ట్రలో గత 20 ఏళ్లలో సుమారు 65,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అది పోగుపడిన సంక్షోభం.
దేశంలోని అత్యధిక రైతులు సంఘటితం కాదు. మహారాష్ట్రలో కొన్ని రైతు సంఘాలు ఉన్నాయి. కానీ దేశంలోని చాలా ఇతర ప్రాంతాల్లో బలమైన సంఘాలు లేవు.
2004లో ఆంధ్రాలో వ్యవసాయ సంక్షోభం ఫలితంగా చంద్రబాబునాయుడు ఓడిపోయారు. కీలక పాత్ర పోషించే ఇతర అంశాలు చాలా ఉన్నాయి.
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మతతత్వం వైపు మళ్లించటానికి బలమైన ప్రయత్నం జరగబోతోంది.
ప్రత్యేకించి.. రాబోయే కొన్ని నెలల్లో కర్ణాటకలో మతప్రాతిపదికన భారీ సమస్య తలెత్తవచ్చు. గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల వెంటనే భీమా కోరెగావ్ ఘటనను మనం చూశాం.
దానికి చాలా స్పష్టమైన లింకు ఉందనేది నా అభిప్రాయం. ఆ ఫలితాల తర్వాత భీమా కోరెగావ్ ఘటన, రాజస్థాన్‌లో హత్య, ఇతర దారుణ ఘటనలు జరిగాయి.
గుజరాత్ ఎన్నికల్లో విభజన సామాజిక-ఆర్థిక విభజన నుంచి సామాజిక-మతతత్వ విభజనకు మారింది. పరిస్థితులు మరింత దిగజారనున్నాయి.
ఎన్నికల్లో ఇతర అంశాలు చాలా ఉంటాయి. ప్రతిపక్షం ఏకమవుతుందా లేదా అన్న దానిమీద కూడా ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న: ఆత్మహత్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి?
సాయినాథ్: జాతీయ బ్యాంకుల రుణ వ్యవస్థను వరుస ప్రభుత్వాలు ధ్వంసం చేశాయి.
బ్యాంకులు తమ రుణాలను రైతుల నుంచి మధ్య తరగతికి, ఎగువ మధ్యతరగతికి, నీరవ్ మోదీ వంటి వారికి మళ్లించాయి. నిజానికి గత 20 ఏళ్లలో భారతదేశంలో వ్యవసాయ కుటుంబాలు రెట్టింపయ్యాయి. అంటే వ్యవసాయ రుణాలను పెంచాలి.
కానీ ప్రభుత్వం ఆ నిధులను సమాజంలోని ధనిక వర్గాలకు ప్రత్యేకించి కార్పొరేట్ రంగానికి మళ్లించింది.
వ్యవసాయాన్ని కార్పొరేట్లు స్వాధీనం చేసుకోవటానికి ప్రభుత్వాలు సాయం చేశాయి. నేడు.. వ్యవసాయంలో కీలకమైన పెట్టుబడి సాధనాలను కార్పొరేట్ రంగం నియంత్రిస్తోంది.
బ్యాంకులు తమ రుణాలను రైతులకు బదులుగా కార్పొరేట్ రంగానికి మళ్లిస్తున్నాయి. కార్పొరేట్ రంగం లక్ష్యాలను నెరవేర్చటానికి ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి.
ఈ దేశ ఆర్థిక విధానంలో ఇదే ప్రాధమిక సమస్య.

ఫొటో సోర్స్, praSHANT NANAWARE/ BBC
ప్రశ్న: ఈ సంక్షోభానికి పరిష్కారం ఏమిటి?
సాయినాథ్: జాతీయ రైతు కమిషన్ అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలి.
వ్యవసాయ సంక్షోభం మీదే పూర్తిగా చర్చించటానికి ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నా.
మూడు రోజుల పాటు స్వామినాథన్ కమిషన్ మీద చర్చించండి. మూడు రోజులు రుణం విషయం మీద చర్చించండి. మూడు రోజులు దేశంలో నీటి సంక్షోభం మీద చర్చించండి.
మరో మూడు రోజులు.. వ్యవసాయ సంక్షోభం బాధితులను తీసుకువచ్చి పార్లమెంటులో వారిచేత మాట్లాడించండి.
వ్యవసాయ కూలీల గళం విందాం.. దిల్లీలోని మేధో బృందాల మాటలు కాదు.
అందుకోసం కోటి మంది రైతులు పార్లమెంటుకు పాదయాత్ర చేయాలి. వారంతా పార్లమెంటు దగ్గరే ఉండాలి.
ఇవి కూడా చదవండి:
- ‘ట్రంప్‌కి ఆ ప్రమాదాలు తెలుసు’
- తమిళనాడు అడవిలో మంటలు.. చిక్కుకుపోయిన 50 మంది విద్యార్థులు
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- సోషల్ మీడియా: వైరల్‌గా మారిన మోదీ వీడియో!
- తెలంగాణ: మళ్లీ ‘మిలియన్ మార్చ్’ వేడి.. ఎందుకు?
- పుతిన్‌ను సవాల్ చేస్తున్న మహిళా జర్నలిస్టు!
- #గమ్యం: డిగ్రీలు, ధ్రువపత్రాలు లేకుండా సంపాదన అందించే 10 కెరీర్స్!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








