మహారాష్ట్ర: రైతుల లాంగ్ మార్చ్ వెనుక 7 కారణాలు!

ఫొటో సోర్స్, RAHUL RANSUBHE
- రచయిత, సంకేత్ సబ్నిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'భారతీయ కిసాన్ సభ' మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తోంది. మహారాష్ట్రలోని వేలాది మంది రైతులు ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొంటున్నారు.
ఈ పాదయాత్ర మార్చి 12వ తేదీన ముంబై చేరుకుంటుంది. అక్కడ రైతులు అసెంబ్లీని ముట్టడించాలని భావిస్తున్నారు. ఇంతకూ ఈ నిరసన ప్రదర్శన వెనుక ఉన్న కారణాలేంటి?
'ఈ పాదయాత్ర 25 వేల మంది రైతులతో ప్రారంభమైంది. ముంబై చేరుకునేసరికి వారి సంఖ్య 50 వేలకు చేరుతుందని భావిస్తున్నాం. సమాజంలోని అనేక వర్గాలకు చెందిన ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. వీళ్లలో 96 ఏళ్ల ముసలివాళ్లు, మహిళా రైతులు కూడా ఉన్నారు'' అని ఈ లాంగ్ మార్చ్‌ను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ పార్థ్ మీనా నిఖిల్ బీబీసీకి వివరించారు.
ఈ పాదయాత్ర మహారాష్ట్రలో రైతుల దయనీయ పరిస్థితిని మరోసారి బహిర్గతం చేసింది.


పలువురు వ్యవసాయ నిపుణులు, జర్నలిస్టులు, రైతు నాయకులతో మాట్లాడిన బీబీసీ.. ఈ పాదయాత్ర వెనుక ఉన్న కారణాలను కనుగొనే ప్రయత్నం చేసింది.
1. రుణమాఫీ 'కట్టుకథలు'
'రుణమాఫీ గణాంకాలను చాలా ఎక్కువ చేసి చెబుతున్నారు. జిల్లా బ్యాంకులు దివాలా తీశాయి. ఈ పరిస్థితిలో బ్యాంకులు కేవలం అంచనా వేసిన లబ్ధిదారుల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రుణాలు ఇవ్వగలిగాయి. అందువల్ల రుణమాఫీ అసంపూర్తిగా జరిగింది. రుణమాఫీ ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా చేయాలి. కానీ వాళ్లెప్పుడూ డిజిటల్ లిటరసీ గురించి ఆలోచించలేదు.'' అని మరాఠ్వడా ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సంజీవ్ ఉన్హాలే తెలిపారు.
'రుణమాఫీ అమలు చేయడానికి ముందు వాళ్లు ఒక పైలెట్ ప్రాజెక్టును అమలు చేయాలి. అది చేయలేదు. తాము లబ్ధిదారుల్లో ఉన్నామా, లేదా అని రైతులు రిజిస్ట్రేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇది రైతుల విషయంలో చాలా క్రూరమైన పరిహాసం'' అన్నారు సంజీవ్.

ఫొటో సోర్స్, RAHUL RANSUBHE
2.పరిష్కారం కాని 'చట్టబద్ధమైన ధర' సమస్య
సీనియర్ జర్నలిస్ట్ నిషికాంత్ భాలేరావ్ చట్టబద్ధమైన ధర గురించి మాట్లాడుతూ, ''రైతుల సమస్యలు తొలగిపోవాలంటే వాళ్లకు చట్టబద్ధమైన ధర లభించాలి. కేవలం కనీస మద్దతు ధర సరిపోదు. ప్రకృతి విపత్తులతో పాటు, ప్రభుత్వ నిర్ణయాలు కూడా రైతులను దగా చేస్తున్నాయి'' అన్నారు.
చట్టబద్ధమైన ధరపై సంజీవ్ ఉన్హాలే, ''రైతులకు కానీ, ప్రభుత్వానికి కానీ అంతర్జాతీయ మార్కెట్‌పై నియంత్రణ లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడైనా ధరలు పడిపోతే, అది మన రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పినపుడే రైతులకు మంచి ధర లభిస్తుంది. అందువల్ల ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలి'' అని సూచించారు.

ఫొటో సోర్స్, RAHUL RANSUBHE
3. సంక్షోభంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం, వ్యవసాయాభివృద్ధి రేటు మందగించింది. సీనియర్ రైతు నాయకులు విజయ్ జవన్‌ధియా దీనికి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
'రాజ్యాంగం ప్రకారం, వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. కానీ ముఖ్యమైన నిర్ణయాలన్నీ కేంద్రమే తీసుకుంటుంది. కనీస మద్దతు ధరతో పాటు వ్యవసాయోత్పత్తుల ఎగుమతి-దిగుమతుల విధానాలను కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. దాని ప్రభావంతో వ్యవసాయ ఆదాయం 44 శాతం పడిపోయింది. పత్తి, కాయధాన్యాలు, గింజలపై ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా మందగిస్తోంది'' అని తెలిపారు.
4. చీడల నివారణ - కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత
'పంట చీడలు పత్తి పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి పరిష్కారంగా మనం కొత్త హైబ్రిడ్ విత్తనాలను కనుగొనాలి. మనం ఇంకా కరువును తట్టుకునే, రోగాలను తట్టుకునే విత్తనాలపై దృష్టి పెట్టలేదు. ఔరంగాబాద్‌లోని మహికో కంపెనీ దీనిపై పరిశోధనల కోసం ఏటా రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు చెందిన నేతలు హైబ్రిడ్ రకంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.''
'ఆహార పదార్థాలు కాకుండా మిగతా వ్యవసాయోత్పత్తులను రసాయనాల ద్వారా ప్రాసెస్ చేయవచ్చు. కొత్త రకం విత్తనాలతో మహికో సిద్ధంగా ఉంది. కానీ కేంద్రమే దీనిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ విత్తనంతో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి'' అన్నారు భాలేరావ్.

ఫొటో సోర్స్, RAHUL RANSUBHE
5. గిరిజనులకు భూమిపై యాజమాన్యం
ఈ పాదయాత్రలో వేలాదిమంది గిరిజనులు పాల్గొంటున్నారు. నిజానికి ఈ పాదయాత్రలో అతి పెద్ద బృందం వాళ్లదే. గిరిజనుల సమస్యలపై మాట్లాడుతూ జర్నలిస్ట్ నిఖిల్,''నాసిక్ ప్రాంతంలోని గిరిజన భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయి. గిరిజనులు పంటలను పండిస్తున్నా, వాటిపై యాజమాన్య హక్కు మాత్రం లేదు. అందువల్ల గిరిజనులు ఆ భూమిపై తమకు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ''
కొందరు గిరిజనులు తమ పరిస్థితిని వివరిస్తూ, ''అటవీ అధికారులు హఠాత్తుగా వచ్చి మా పంటలను నాశనం చేస్తుంటారు. అందువల్ల మాకు భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలి. లేకపోతే మేమెప్పుడూ వాళ్ల దయ మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది'' అని తెలిపారు.
6. పెరిగిపోతున్న అప్పులు
విజయ్ జవన్‌ధియా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి గురించి వివరిస్తూ, 'కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రానికి రూ.2.5 లక్షల కోట్ల అప్పులు ఉండేవి. ఇప్పుడు అవి రూ.4.13 లక్షల కోట్లకు చేరాయి. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? దాని వల్ల ఒక్క సామాన్యునికైనా మేలు జరిగిందా? కేవలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలు మాత్రమే పెరిగాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం రైతుల చుట్టూ తిరుగుతూ ఉన్నా, ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నది కూడా వాళ్లే'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, RAHUL RANSUBHE
7. దయనీయ స్థితిలో జంతు ప్రాథమిక సంరక్షణ కేంద్రాలు
లాల్య-ఖుర్కట్ లాంటి వ్యాధుల కారణంగా అనేక మంది రైతుల పశువులు మరణించాయి.
ఈ సమస్యపై జర్నలిస్ట్ భాలేరావ్, 'గ్రామీణ ప్రాంతాలలో పేరుకు జంతువుల ప్రాథమిక సంరక్షణ కేంద్రాలైతే ఉన్నాయి కానీ, వాటి పరిస్థితి అత్యంత దయనీయం. అక్కడ పశువులకు సరైన సమయంలో వైద్యం లభించడం లేదు. మీడియా కూడా దీనిని పట్టించుకోవడం లేదు. అందువల్లే ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









