పెళ్లి కాలేదు..ఇద్దరు పిల్లల తల్లయింది!

- రచయిత, సింధువాసిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓ ఆదివారం ఎప్పటిలానే ఆస్పత్రికి డ్యూటీకి వెళ్లాను. కానీ తిరిగి ఇద్దరు పిల్లల తల్లిగా ఇంటికి వస్తానని అస్సలు ఊహించలేదు.
ఆదివారం కాబట్టి తీరిగ్గా ఆస్పత్రికి వెళ్దామనుకున్నా. ఉన్నట్టుండి ఓ ఎమర్జెన్సీ డెలివరీ కేసు ఉంది రమ్మని ఫోనొచ్చింది. వెంటనే బయల్దేరి వెళ్లి డెలివరీ పూర్తిచేశాను. ఆ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే.
నేను సర్జరీ పూర్తిచేసి, చేతులు కడుక్కుంటున్న సమయంలో ఎవరో వచ్చి, ‘ఆవిడ పిల్లల్ని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు’ అని చెప్పారు.
ఆ మహిళకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. భర్త కూడా చనిపోయాడు. దాంతో నలుగురు ఆడపిల్లల్ని పోషించే శక్తి తనకు లేదనీ, ఆ పిల్లలు తనకు వద్దనీ ఆమె చెప్పింది. ఎలాగోలా ఒప్పించే ప్రయత్నం చేసినా వినలేదు.
ఆ పిల్లల్ని ఏం చేయాలో తెలీక అందరూ ఆలోచనలో పడ్డారు. వెంటనే ‘వాళ్లిద్దర్నీ నేను దత్తత తీసుకుంటున్నా’ అని చెప్పా.
నిజానికి ఆ నిర్ణయం గురించి ఎక్కువసేపు ఆలోచించేంత సమయం లేదు. ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరోగ్యం బాలేదు. అందుకే అప్పటికప్పుడు ఆ మహిళతో అఫిడవిట్ మీద సంతకం చేయించుకుని వాళ్లను దత్తత తీసుకున్నా. వెంటనే ఆ అమ్మాయి చికిత్స బాధ్యతనూ తీసుకున్నా.
ఫరూఖాబాద్ లాంటి చిన్న ప్రాంతంలో ఓ పెళ్లికాని యువతి ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఆస్పత్రి సిబ్బంది కూడా నన్ను కాస్త ఆలోచించుకోమన్నారు కానీ, నేను నా నిర్ణయం మార్చుకోలేదు.
ఇదంతా రెండేళ్ల క్రితం కోమల్ అనే ఓ యువ వైద్యురాలి జీవితంలో చోటుచేసుకున్న పరిణామం.

కెరీర్ మొదలుపెట్టిన కొత్తల్లో పని తప్ప కోమల్‌కు మరో ప్రపంచం తెలీదు. అలాంటిది భావోద్వేగంతో నిండిన ఓ సందర్భంలో ఆమె ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు.
ఆ తరువాత ఆమె ప్రయాణం ఆశించినంత సాఫీగా సాగలేదు.
విషయం తెలీగానే ఆమె తల్లిదండ్రులు చాలా కోప్పడ్డారు.
‘పిల్లల్ని వదలేయకపోతే నాకూ నీకూ ఎలాంటి సంబంధం లేదు’ అని కోమల్ తండ్రి తేల్చి చెప్పారు.
కోమల్ కూడా అంతే దృఢంగా జవాబిచ్చారు. ఏదేమైనా ఆ పిల్లల్ని వదిలిపెట్టేది లేదని చెప్పారు.
కొన్నాళ్ల తర్వాత కోమల్‌కు హిమాచల్ ప్రదేశ్‌కు బదిలీ కావడంతో పిల్లల్లిద్దరినీ తీసుకొని అక్కడికి వెళ్లారు.
ఓ ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లలతో అక్కడే ఉండసాగారు. వాళ్లకి రిథ్, రిథమ్ అని పేర్లు పెట్టారు.

‘‘మొదట్లో అందరూ ‘మీ భర్త ఎక్కడుంటారు?’ అని పరోక్షంగా పిల్లల గురించి అడిగేవారు. నాకు పెళ్లి కాలేదనీ, పిల్లల్ని దత్తత తీసుకున్నాననీ చెప్పేదాన్ని’’ అంటారామె.
కొన్నాళ్ల తరవాత కోమల్ తల్లి మనసు కాస్త మెత్తబడింది. కానీ ఆమె తండ్రి మాత్రం పిల్లల్ని అనాథాశ్రమంలో వదిలేయమని చెప్పేవారు.
కోమల్ దానికి ఒప్పుకోలేదు. ఆమెను పెళ్లికి ఒప్పించాలన్న బంధువుల ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
హిమాచల్‌లో ఉద్యోగం చేసే సమయంలో కోమల్‌కు రాహుల్ అనే వ్యక్తితో పరిచయమైంది. క్రమంగా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.
ఓ రోజు రాహుల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. కోమల్ కూడా అతడితో పెళ్లికి ఒప్పుకున్నారు. కాకపోతే ఒక్కటే షరతు పెట్టారు. పెళ్లయ్యాక కూడా పిల్లలు తనతోనే ఉంటారనీ, తనకు మళ్లీ తల్లయ్యే ఆలోచన లేదనీ, దానికి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాననేది ఆమె షరతు.

ఫొటో సోర్స్, Komal Parashar/Facebook
రాహుల్ దానికి ఒప్పుకున్నా, అతడి తల్లి మాత్రం మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డారు. కోడలు ఇద్దరు పిల్లలతో ఇంట్లో అడుగుపెడితే చుట్టుపక్కలవాళ్లు ఏమనుకుంటారోనని భయపడ్డారు.
కానీ క్రమంగా అన్నీ సద్దుమణిగాయి. వాళ్లిద్దరికీ పెళ్లి జరిగింది.
ప్రస్తుతం కోమల్ చండీగఢ్‌లో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. భర్తా ఇద్దరు పిల్లలతో కలిసుంటున్నారు.
కోమల్ అత్తింటివారు ఇప్పటికీ ఆమెను పిల్లల్ని కనమని ఒత్తిడి చేస్తారు. కానీ ఆమె మాత్రం ఒప్పుకోరు. రిథ్, రిథమ్‌లే తన ప్రపంచమని చెబుతారు.
‘పిల్లలు పెద్దయ్యాక చెబుతా.. నేను వాళ్లను దత్తత తీసుకోలేదనీ, వాళ్లే నన్ను దత్తత తీసుకున్నారనీ’ అంటారు కోమల్.. భావోద్వేగం నిండిన కళ్లతో.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








