తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సింధువాసిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
సుబర్ణా ఘోష్ దంపతులు, తమకు పుట్టబోయే మొదటి బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కడుపుతో ఉన్నంతకాలం సుబర్ణ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాగైనా తనకు నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు.
‘‘ఈరోజుల్లో అందరూ సిజేరియన్ డెలివరీలనే ఆశ్రయిస్తున్నారు. మీరెందుకు అంత బాధ భరించడానికి సిద్ధపడుతున్నారు? మీలాంటి చదువుకున్నవాళ్ళు ఆధునిక పద్ధతిని ఎన్నుకోవాలి కదా! అని మా డాక్టర్ నాతో అన్నారు" అంటూ సుబర్ణ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
డాక్టర్ మాట విని సుబర్ణా, ఆమె భర్తా ఆలోచనలో పడ్డారు. చివరికి సిజేరియన్ కోసం ఒప్పుకున్నారు. కానీ, దానివల్ల ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది.
"ఆపరేషన్ అయ్యాక కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నాకు తగినన్ని పాలు పడేవి కావు. దాంతో నా బిడ్డకు పాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను" అని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ తరవాత సుబర్ణ ఆన్‌లైన్ ఫోరం Change.Org లో ఒక అభ్యర్థన పెట్టారు. తమ దగ్గర ఎన్ని సిజేరియన్ ఆపరేషన్లు అవుతున్నాయో, ఎన్ని నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయో తెలపాలంటూ ఆస్పత్రుల యాజమాన్యాలను ఆమె కోరారు.

ఫొటో సోర్స్, Subarna Ghosh/Facebook
డాక్టర్లు ఏమంటున్నారు?
సిజేరియన్ తరవాత రికవరీకి ఎక్కువ టైమ్ పడుతుందనీ, అదే నార్మల్ డెలివరీ అయితే తొందరగా కోలుకుంటారనీ గైనకాలజిస్ట్ మధు గోయల్ అన్నారు.
సిజేరియన్ వల్ల ఒక్కోసారి చాలా రక్తం పోతుంది. అలాంటప్పుడు నీరసపడిపోవడం, పాలు తయారవ్వకపోవడం, డిప్రెషన్‌కు లోనవ్వడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విపరీతంగా ఒళ్ళు రావడంతో పాటు డయాబెటిస్ బారినపడే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.
"మా పని తేలికవుతుందనీ , డబ్బుకోసం సిజేరియన్లు చేస్తున్నామనీ డాక్టర్ల మీద చాలా సులువుగా ఆరోపణలు మోపుతారు.. కానీ అది నిజం కాదు. చాలామంది మహిళలు వజైనల్ డెలివరీలో వచ్చే నొప్పిని తట్టుకోవడానికి సిద్ధపడరు. వాళ్ళే సిజేరియన్ చేయమని మమ్మల్ని అడుగుతుంటారు" అని డాక్టర్ మధు అన్నారు.
చాలామంది డెలివరీకి ముహూర్తాలు చూసుకుని వస్తారు. వాళ్ళకు నచ్చిన తేదీ, ఘడియల్లోనే డెలివరీ కావాలని కోరుకుంటారు. అలాంటప్పుడు కూడా సి-సెక్షన్ తప్ప మరో మార్గం లేదు. కొందరు తల్లుల వయసు ఎక్కువగా ఉండటం, ప్రసవానికి ముందు వ్యాయామం చేయకపోవడం లాంటి కారణాలు కూడా సిజేరియన్‌కు దారితీస్తున్నాయి అని ఆమె చెబుతారు.

ఫొటో సోర్స్, Madhu Goel/Facebook
"మారుతున్న జీవనశైలి ఈ పరిణామానికి ఓ ప్రధాన కారణం. ఈరోజుల్లో అమ్మాయిలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, ఆలస్యంగా పిల్లల్ని కంటున్నారు. సరైన వ్యాయామాలు కూడా చెయ్యట్లేదు. ఇలాంటప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడం కష్టమే!" అని ఆమె వివరించారు.
తల్లి.. బిడ్డను పుష్ చేయలేకపోయినా, లేదా తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అనిపించినా సిజేరియన్ చేయకతప్పదు.
సిజేరియన్ డెలివరీలు ఎందుకు పెరుగుతున్నాయి?
నిజానికి మహిళల ఆరోగ్యానికి సిజేరియన్లు అంత మంచివికాకపోయినా, భారత్‌తో సహా అనేక దేశాల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోంది.
అందుకే, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైల్డ్ బర్త్ గైడ్‌లైన్స్‌లో కొన్ని మార్పులు సూచించింది. దీనిని "ఇంట్రాపార్టమ్ కేర్ ఫర్ ఎ పాజిటివ్ చైల్డ్‌బర్త్ ఎక్స్‌పీరియన్స్" (Intrapartum Care for a Positive Childbirth Experience) అని పిలుస్తారు.
‘‘నార్మల్ డెలివరీకి ఎక్కువ టైమ్ పడుతుంది. సిజేరియన్ త్వరగా అయిపోతుంది. అందుకే WHO గైడ్‌లైన్స్‌లో 'మహిళల ప్రసవానికి ఎక్కువ సమయం కేటాయించాలి' అని చేర్చారు’’ అని WHO హెల్త్ ఆఫీసర్ డా. ఒలుఫిమి ఒలాడాపో అన్నారు.
అన్ని ప్రసవాలకూ "వన్ సెంటిమీటర్ రూల్" వర్తించదు అని కూడా ఈ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వన్ సెంటిమీటర్ రూల్ ఏంటి?
ప్రసవ సమయంలో ప్రతి గంటకు బిడ్డ ఒక సెంటీమీటర్ కిందకు జరుగుతుంటుంది. దీన్ని మెడికల్ భాషలో "వన్ సెంటిమీటర్ రూల్" అంటారని డాక్టర్ మధు చెబుతారు.
భారతదేశంలో సిజేరియన్లు
నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS), 1992-93 నుంచి 2015-16 వరకు నమోదైన డేటాను అధ్యయనం చేసింది. దీని ప్రకారం భారత్‌లో 18శాతం జననాలు సిజేరియన్ ద్వారానే నమోదవుతున్నట్లు తేలింది. తెలంగాణ (57.7%), ఆంధ్రప్రదేశ్ (40.1%), కేరళ (35.8%), తమిళనాడు (34.1%) రాష్ట్రాలు అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ముందున్నాయి.
బ్రిటన్‌లో నార్మల్ డెలివరీల వృద్ధి...
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎన్నో అధునాతనమైన ఆరోగ్య సదుపాయాలున్నప్పటికీ బ్రిటన్‌తో సహ అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో, భారత్‌తో పోలిస్తే సిజేరియన్ల సంఖ్య చాలా తక్కువ.
2015లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఇంగ్లండ్‌లో 11%, ఇటలీలో 25%, నార్వేలో కేవలం 6.6% సిజేరియన్ డెలివరీలు జరుగుతున్నాయి.
"ఎమర్జన్సీ అయితే తప్ప మేము సిజేరియన్ ఆపరేషన్ల జోలికి వెళ్లము. ఇక ఏ మాత్రం నార్మల్ డెలివరీ సాధ్యం కాదని తెలిశాక, తల్లి, బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉందనుకుంటే తప్ప సిజేరియన్ చేయము" అని బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్‌వైవ్స్ అడ్వైజర్ గేల్ జాన్సన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"సిజేరియన్ చాలా పెద్ద ఆపరేషన్. అత్యవరసమైతే తప్ప డాక్టర్లు సిజేరియన్ చేయరు" అని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ మాల్కామ్ గ్రిఫ్ఫిత్స్ అంటున్నారు.
గతంలో సిజేరియన్‌కు సంబంధించిన నిర్ణయం డాకర్లు మాత్రమే తీసుకునేవారు. ఎవరైనా మహిళ సిజేరియన్ కావాలని అడిగినా, డాక్టర్లు ఒప్పుకునేవారు కాదు. కానీ 2011లో ఈ నియమాన్ని సడలించారు. ఎవరైనా సిజేరియన్ చేయమని అడిగితే డాక్టర్ ఒప్పుకోవాలి. కానీ, సిజేరియన్ కోరిన మహిళలకు దాంట్లో ఉన్న కష్టనష్టాలు పూర్తిగా వివరించాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉంది.
వీలైతే నార్మల్ డెలివరీకి ఒప్పించగలగాలి. ప్రసవానికి ముందు స్త్రీలకు అనేక రకాల భయాలుంటాయి. దీన్ని "టోకోఫోబియా (Tocophobia)" అంటారు. ఆ భయం వల్ల సిజేరియన్ చేయమని అడగొచ్చు. అలాంటి భయాలు పోగొట్టి పేషెంట్‌ని నార్మల్ డెలివరీకి ఒప్పించడం డాక్టర్ బాధ్యత.

ఫొటో సోర్స్, Thinkstock
భారత్‌లో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
"మనదేశంలో, బ్రిటన్‌కన్నా భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆధునిక వైద్య సదుపాయాలు తక్కువైనప్పటికీ సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, వేల సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులు పుట్టుకురావడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య పెరగడం మొదలైన కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది’ అంటారు మద్రాస్ మెడికల్ కాలేజ్ గైనకాలజిస్ట్ వినీతా నారాయణన్.
"సిజేరియన్ జరిగాక కోలుకోవడానికి టైమ్ పడుతుంది. ఆపరేషన్ అయ్యాక లేచి తిరగడానికి కొంత సమయం కావాలి. దీనివల్ల ప్రైవేట్ ఆస్పత్రులు లాభపడతాయి. ఖరీదైన సిజేరియన్‌కు తోడు పేషెంట్ ఎక్కువకాలం అక్కడే ఉంటే గది, భోజనం లాంటి వాటికి కూడా డబ్బులు కట్టాలి"
ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం.. ప్రసవ సమయంలో నర్సుల ప్రాధాన్యత. "ప్రసవ సమయంలోనూ, ఆ తరవాత కూడా తల్లీబిడ్డల ఆరోగ్యం విషయంలో నర్సుల పాత్ర చాలా ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న సిజేరియన్ల వల్ల నర్సులకు డిమాండ్ కూడా పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి" అని డా. వినీత అభిప్రాయపడ్డారు.
‘మహిళల కడుపును కోయడం ద్వారా లాభపడుతున్నది ఎవరు?’... అనే సుబర్ణా ఘోష్ ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








