నల్లగొండ శిశుగృహలో అంతుచిక్కని మరణాలు

- రచయిత, విజయభాస్కర్
- హోదా, బీబీసీ తెలుగు కోసం
మూడు నెలలు.. 10 మరణాలు.. అందరూ పసివాళ్లే. అది కూడా ఒక్క నల్లగొండ జిల్లాలోనే!
చూడచక్కని రూపం. ముద్దొచ్చే చిట్టిపొట్టి మాటలు. బుడి బుడి అడుగుల బుజ్జి బుజ్జి పాపాయిల అల్లరి కూడా ఆనందమే. కానీ ఆ తల్లిదండ్రులకు కంటిపాపే భారమైంది. తల్లి ప్రేమకు దూరమై.. నాన్న ఆదరణకు నోచుకోక, చిరుప్రాయంలోనే అనాథల్లా శిశుగృహాల్లో తనువు చాలిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని శిశు గృహంలో సుమారు 40 మంది చిన్నారులున్నారు. వీరంతా తల్లిదండ్రుల నిరాదరణకు గురైనవారే.

మగపిల్లాడిపై మమకారంతో ఆడపిల్లను ఆరుబయట పడేస్తున్న వారు కొందరు, పేదరికంతో అధిక సంతాన భారం మోయలేక కన్నప్రేమను చంపుకుంటున్న వారు మరికొందరు, వివాహేతర సంబంధాల వల్ల ముళ్లపొదల చెంతకు చేరుతున్న శిశువులు ఇంకొందరు.. ఇలా కళ్లు తెరిచిన మరుక్షణంలోనే కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు పసివాళ్లు. నల్లగొండ జిల్లాలో బాగా వెనకబడిన ప్రాంతాల్లో ముఖ్యంగా నిరక్షరాస్యత రాజ్యమేలే తండాల్లో ఈ దారుణాలు ఇంకా కొనసాగుతున్నాయి.
తల్లిదండ్రులకు భారమై, చెత్తకుప్పల్లో తేలుతున్న శిశువులు అక్కడే జంతువులకు ఆహారమై పోతున్నారు. అదృష్టం బాగుండి ఎవరికైనా కనిపిస్తే శిశుగృహానికి చేరుతున్నారు.

నల్లగొండ జిల్లా శిశుగృహంలో గత మూడు నెలల్లో 10మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మరో 11 మంది నీలోఫర్, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యానికి తోడు సంరక్షణ, పౌష్టికాహార లోపం కూడా వీరికి శాపంగా మారుతోంది.
అయితే, శిశుగృహానికి తీసుకొచ్చే సమయంలోనే వారి ఆరోగ్యం క్షీణించి ఉంటోందని, వారికి తమ వంతుగా వైద్య చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. శిశువుల మరణాలకు మరెన్నో ఇతర కారణాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
శిశువుల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం, తక్కువ బరువుతో పుట్టడం, ఇన్‌ఫెక్షన్ సోకడం వంటి కారణాలతో శిశువులు మరణిస్తున్నారని జిల్లా అధికారులు వివరించారు.

అయితే, శిశుగృహం నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. సరైన పౌష్టికాహారం అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి. పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. పౌడర్ పాల వల్ల తరచూ వాంతులు, విరేచనాల బారిన పడి పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని వివరిస్తున్నారు.
పరిమితికి మించి శిశువులు ఉండటం, పరిసరాల అపరిశుభ్రత, నిధుల లేమి కూడా పసివారి ప్రాణాలు తీస్తున్నాయని చెబుతున్నారు. శిశువుల మృతిపై నల్లగొండ జిల్లా ఐసీడీఎస్ పీడీ పుష్పలతను సంప్రదించగా చిన్నారులు మృతి చెందిన మాట వాస్తవమేనన్నారు. తక్కువ బరువు కలిగి ఉండటం, కేంద్రాలకు తరలించే లోపే వారి ఆరోగ్యం క్షిణించటం, రక్తహీనత తదితర కారణాల వల్ల తాము మెరుగైన చికిత్స అందించినా పిల్లల్ని బతికించలేకపోతున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి ఈ కేంద్రాన్ని సందర్శించి సమగ్ర విచారణకు ఆదేశించారు.

గిరిజన తండాలు అధికంగా ఉన్న నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో గతంలో శిశు విక్రయాలు జరిగేవి. ఆడపిల్ల పుట్టిందని, పేదరికంతో పోషించలేమని వారిని అంగట్లో సరకుల్లా అమ్ముకున్న ఘటనలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం కొంత తగ్గినా ఇంకా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి.
వివిధ కారణాలతో తల్లిదండ్రులకు దూరమైన చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు ప్రభుత్వం దేవరకొండ, నల్లగొండల్లో రెండు శిశుగృహాలు ఏర్పాటు చేసింది. 2010లో దేవరకొండ శిశుగృహాన్ని కూడా నల్లగొండకు తరలించి, రెండు కేంద్రాలనూ ఒకే దగ్గర నిర్వహిస్తున్నారు.
ఒక్కొక్క కేంద్రంలో పదిమందికి మాత్రమే అవకాశం కల్పించాల్సి ఉండగా, రెండు కేంద్రాల్లో సుమారు 50 మందిని చేర్చుకున్నారు. ఒకవేళ ఎక్కువ మంది చిన్నారులు వస్తే.. వారిని ఇతర కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ అందర్నీ ఒకే దగ్గర ఉంచడంతో వారికి సరైన వసతులు కల్పించలేకపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం రెండు కేంద్రాల్లో 50మంది శిశువులు ఉన్నారని పీడీ చెప్పారు. గడిచిన ఏడాదిలో 100 మంది పిల్లలను దత్తత ఇచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని శిశువులను దత్తత తీసుకోవచ్చని ఆమె వివరించారు.
మా ఇతర కథనాలు:
- వసతుల్లేక బడి మానేస్తున్న బనాస్కాంఠా బాలికలు
- ఈమె రాక్షస బల్లుల 'రాకుమారి'
- ఛాతి నొప్పా? గుండెపోటా?: నిమిషాల్లో నిర్ధరణ
- ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి
- నిద్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
- సౌదీలో మహిళల కంటే రోబోకే ఎక్కువ స్వేచ్ఛ!
- 12 ఏళ్లకే నరకం చూపించారు
- అబ్బాయిలు ‘ఆ’ చిత్రాలను నెట్లో పెట్టలేరు!
- టీవీ సీరియల్ తెచ్చిన చైతన్యం
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









