గ్రౌండ్ రిపోర్ట్ : ‘8 నెలలుగా సంతోషి కుటుంబానికి రేషన్ అందడం లేదు’

ఫొటో సోర్స్, dhiraj
- రచయిత, రవి ప్రకాశ్,
- హోదా, సిమ్‌డెగా (ఝార్ఖండ్) నుంచి బీబీసీ ప్రతినిధి
ఝార్ఖండ్‌లోని సిమ్‌డెగా జిల్లాలో సంతోషి కుమారి అనే బాలిక మృతిపై ప్రభుత్వ విచారణ ముగిసింది. ఈ విచారణలో సంతోషి కుటుంబానికి గత ఫిబ్రవరి నుంచి రేషన్ అందడం లేదని తేలింది.
నివేదికలో సంతోషి ఆకలితో మరణించలేదని, మలేరియా వల్ల అని పేర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ నివేదికను ఝార్ఖండ్ ప్రభుత్వం కేంద్రానికి పంపింది.
ఈ సంఘటనపై ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాస్, ''ఒక కుటుంబానికి కొన్ని నెలల పాటు రేషన్ అందలేదంటే చాలా విషాదకరం. సంతోషి కుటుంబానికి రేషన్ అందకపోవడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాం'' అని తెలిపారు.
అటు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఐఏడీఏఐ) సీఈఓ అజయ్ భూషణ్ పాండే సంతోషి కుటుంబానికి 2013లోనే ఆధార్ కార్డు జారీ అయినట్లు పేర్కొన్నారు.
''చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం, ఆధార్ సంఖ్య లేనంత మాత్రాన ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న సంక్షేమ పథకాల లబ్ధిని నిలిపివేయడానికి లేదు'' అని ఆయన స్పష్టం చేశారు.
సంతోషి మృతిపై విచారణ ముగిసిన నేపథ్యంలో గ్రామానికి చెడ్డ పేరు తెచ్చారంటూ ఆ బాలిక ఇంటిపై గ్రామస్తులు దాడి చేశారు. దాడి వార్త తెలిసిన వెంటనే సిమ్‌డెగా డిప్యూటీ కమిషనర్ బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారిని సంతోషి ఇంటికి పంపారు.

ఫొటో సోర్స్, Ravi Prakash
'మలేరియా వల్లే మృతి'
మరోవైపు సిమ్‌డెగా డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంతి తానే స్వయంగా సంతోషి గ్రామం కరిమాటికి వెళ్లి విచారణ జరిపినట్లు బీబీసీకి తెలిపారు.
సీఎం కార్యాలయానికి పంపిన తన నివేదికలో ఆయన కొంతమంది అధికారులను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు.
''సంతోషి తల్లి కోయలిదేవి అక్టోబర్ 13న సదర్ హాస్పిటల్‌కు వచ్చారు. అక్కడ సంతోషికి చేసిన రక్త పరీక్షల్లో పీవీ పాజిటివ్ అని తేలింది. సంతోషి మలేరియాతో మృతి చెందింది కానీ ఆకలితో కాదు'' అని మంజునాథ్ బీబీసీకి తెలిపారు.
ఫిబ్రవరిలో రేషన్ కార్డుతో అనుసంధానించడానికి ఆధార్ కార్డు ఇమ్మని అడిగినా సంతోషి కుటుంబం ఆ పని చేయలేదని తెలిపారు.
ఈ చర్యతో వారి వద్ద రెండు రేషన్ కార్డులు ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోందనీ, అందువల్లే రేషన్ కార్డు రద్దు అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Ravi Prakash
ఇంటర్నెట్ సమస్యలతో అందని రేషన్
ఝార్ఖండ్‌లోని 80 శాతం రేషన్ షాపుల్లో ఆధార్ ఆధారంగానే రేషన్ ఇస్తున్నారని, దీని వల్ల చాలా దుష్పరిణామాలు కలుగుతున్నాయని ప్రముఖ సామాజిక కార్యకర్త జ్యాన్ ద్రేజ్ తెలిపారు.
ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్య వల్ల ప్రజలకు రేషన్ అందడం లేదనీ, మరి కొన్ని సార్లు కుటుంబ పెద్ద వేలిముద్రలను స్కాన్ చేయలేని సందర్భంలో కూడా ఆ కుటుంబానికి రేషన్ లభించడం లేదని ద్రేజ్ అన్నారు. ఈ అవ్యవస్థ ఫలితంగానే సంతోషి మృతి చెందిందని ద్రేజ్ అభిప్రాయపడ్డారు.








