ఫేస్‌బుక్: రాజకీయ ప్రకటనలు ఇచ్చిందెవరో ఇకపై తెలుసుకోవచ్చు

ఫొటో సోర్స్, Reuters
రాజకీయ ప్రకటనలు ఎవరు ఇస్తున్నారో ఇకపై తెలిసిపోతుంది. ఈ దిశగా ఫేస్‌బుక్ చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ఇస్తున్న వారి వివరాలను వెల్లడిస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ విషయంలో మరింత పారదర్శకంగా ఉంటామని చెప్పింది.
రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు ఇకపై తమ వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ ప్రకటనకు డబ్బులెవరిచ్చారో యాడ్‌లో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. వ్యక్తుల వివరాలు, ప్రాంతం వంటి వివరాలు తప్పనిసరి చేయబోతున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా 'పెయిడ్ ఫర్ బై' అనే ఆప్షన్ యాడ్ చేయబోతోంది.
రష్యా మద్దతిచ్చిన కొన్ని సంస్థలు సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రకటనలు పారదర్శకంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఫేస్‌బుక్, ఇతర ఇంటర్నెట్ సంస్థలు మంగళవారం అమెరికా సెనెట్ ముందు వివరణ ఇవ్వబోతున్నాయి.
మా ఇతర కథనాలు:
'ప్రకటన ఇస్తున్న వారెవరో ప్రజలకు తెలియాలి. ముఖ్యంగా రాజకీయ ప్రకటనలు ఎవరిస్తున్నారో వారికి చెప్పాలి' అని ఫేస్‌బుక్ ఉపాధ్యక్షుడు రాబ్ గోల్డ్‌మెన్ బ్లాగ్‌లో అభిప్రాయపడ్డారు.
'పెయిడ్ ఫర్ బై' పై క్లిక్ చేస్తే ఆ ప్రకటన ఇచ్చినవారి పూర్తి వివరాలు వస్తాయి. అన్ని ప్రకటనల్లో పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్నట్లు ఫేస్‌బుక్ చెబుతోంది. 2018 నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరిగే కెనడాలో 'పెయిడ్ ఫర్ బై'ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు.
ప్రకటనలకు సంబంధించి స్వీయ నియంత్రణ పాటించాలని సోషల్ మీడియా దిగ్గజాలు భావిస్తున్నాయి. ఫేస్‌బుక్‌లాగే ట్విటర్ కూడా ఇలాంటి చర్యలే చేపడుతోంది. రాజకీయ ప్రకటనలపై 'లేబుల్' వేయడంతో పాటు, నిధులిచ్చినవారి మరిన్ని వివరాలు పొందుపరిచేలా చర్యలు తీసుకుంటోంది.

ఫొటో సోర్స్, EPA
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాయని రష్యాకు చెందిన 'ఆర్‌టీ' (రష్యా టుడే), 'స్ఫుత్నిక్' మీడియా సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకటనలు కొనుగోలు చేయకుండా ట్విటర్ ఆ రెండు సంస్థలపై నిషేధం విధించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలను రష్యా ఖండించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు సాగుతోంది. అయితే, నాటి ఎన్నికలకు సంబంధించి రష్యాతో కలిసి ఎలాంటి కుట్రా పన్నలేదని ట్రంప్ చెబుతున్నారు. రష్యా- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య సంబంధాలపై విచారణ సాగుతోంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








