అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షుల మాటల యుద్ధం

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఘాటుగా స్పందించారు. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ చేసిన ప్రసంగానికి అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
అణు పరీక్షలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఆయుధాలు సమకూర్చుకోవడం తమ హక్కని స్పష్టం చేశారు. ట్రంప్ మానసిక పరిస్థితి సరిగా లేదని.. తమ జోలికొస్తే ఫలితం అనుభవిస్తారని అన్నారు.
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ మాట్లాడుతూ.. కిమ్ జంగ్ రాకెట్ మ్యానని, సూసైడ్ మిషన్‌లో ఉన్నారని ఎగతాళిగా మాట్లాడారు. కిమ్‌ను పిచ్చోడితో పోల్చారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యొంగ్ హొ కూడా ఘాటుగా స్పందించారు. ఆయన కామెంట్లను కుక్కల అరుపులతో పోల్చారు.
ట్రంప్ హెచ్చరికలకు నిరసనగా పసిఫిక్ సముద్రంలో హైడ్రోజన్ బాంబును పరీక్షిస్తామని కూడా ఆయన అన్నట్లు ఆ దేశ వార్త పత్రికలు ప్రచురించాయి.
అయితే, కిమ్ ఏం చేస్తారో తమకు సమాచారం లేదని, ఆయన ఏం చేప్తే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రి యొంగ్ చెప్పారు.
అమెరికా-ఉత్తర కొరియా మాటల యుద్ధంపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి.. ఇది సున్నితమైన, సంక్లిష్టమైన పరిస్థితని చైనా విదేశాంగ మంత్రి ‘లు కాంగ్’ అన్నారు. ఉద్రిక్తతలు పెరగడంపై రష్యా కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
విశ్లేషణ: ఒక్క పరీక్ష వంద భయాలు
-అంకితాపాండే, ఉత్తర కొరియా విశ్లేషకులు
పసిఫిక్ సముద్రంలో హైడ్రోజన్ బాంబు పరీక్షిస్తామన్న ఉత్తర కొరియా ప్రకటన ప్రపంచాన్ని భయపెడుతోంది. దీన్నిబట్టి పసిఫిక్ సముద్రంపై హైడ్రోజన్ బాంబు పరీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి రెండు మార్గాలున్నాయి. అణుక్షిపణిని జపాన్ మీదుగా పసిఫిక్ సముద్రంలోకి ప్రయోగించి అక్కడ హైడ్రోజన్ బాంబును పరీక్షించడం మొదటిది.
ఉత్తర కొరియాను అణ్వాయుధ దేశంగా గుర్తించేలా అమెరికాను లొంగతీసుకునేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని కిమ్ భావిస్తున్నారు. అయితే, ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందన్నది ప్రశ్న.

ఫొటో సోర్స్, Reuters
ఒకవేళ నిజంగానే ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగిస్తే భయంకర పరిస్థితులు ఏర్పడతాయని విశ్లేషిస్తున్నారు.
పరీక్షకు ముందు ఉత్తర కొరియా ముందస్తు హెచ్చరికలు చేసే అవకాశం లేదు. అందువల్ల ఆ ప్రాంతంలోని వైమానిక, నావికా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
పర్యావరణానికి భారీ నష్టం జరుగుతుంది. ఒకవేళ హైడ్రోజన్ బాంబు మార్గమధ్యలో జపాన్‌పై పడితే... పరీక్షకు ముందే పేలిపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అణు యుద్ధం వచ్చినా ఆశ్చర్యం లేదు.
అందుకే ఉత్తర కొరియా జపాన్ మీదుగా మిసైల్ ప్రయోగించి పసిఫిక్‌లో హైడ్రోజన్ బాంబు ప్రయోగించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ అణు బాంబు సామార్ధ్యాన్ని ఏదో విధంగా ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం ఉందంటున్నారు.
ఇక రెండో మార్గం. హైడ్రోజన్ బాంబును నౌకలో పసిఫిక్ సముద్రానికి తీసుకెళ్లి పరీక్షించడం. కానీ దీన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే పసిగట్టి, అడ్డుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, NICHOLAS KAMM
ట్రంప్ మాటలతో భయపడేది లేదని, తాను ఎంచుకున్న దారిలో ముందుకెళ్తానని కిమ్ అంటున్నారు. తన మాటలతో ట్రంప్ ఉత్తర కొరియా ఉనికిని, తనను అవమానించారని కిమ్ ఆరోపించారు.
అత్యంత కఠిన నిర్ణయాలతో అమెరికా తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామని కిమ్ హెచ్చరించారు.. ట్రంప్ మానసిక పరిస్థితి సరిగా లేదని.. తమ జోలికొస్తే ఫలితం అనుభవిస్తారని అన్నారు.
కిమ్ వ్యాఖ్యలపై జపాన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఉత్తర కొరియా రెచ్చగొడుతోందని జపాన్ కేబినెట్ సెక్రటరీ సుగా అన్నారు.
గత నెలలో జపాన్ మీదుగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తర కొరియాతో వ్యాపార, వాణిజ్యంపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ కొత్త ఆర్డర్‌పై ట్రంప్ మంగళవారం సంతకం చేశారు.
యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కొరియా ఉద్రిక్తతలే ప్రధాన అజెండాగా మారింది. ఉద్రిక్తతలు తగ్గించాలని అన్ని సభ్యదేశాలు కోరుతున్నాయి.
అణు పరీక్ష జరపాలన్న నిర్ణయం విధ్వంసానికి దారి తీస్తుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జి అన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)








