కుర్రకారు కోసం ఫేస్‌బుక్ కొత్త యాప్

ఫొటో సోర్స్, tbh
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ గూటికి 'టీబీహెచ్' అనే మరో యాప్ వచ్చి చేరింది. ప్రత్యేకించి యుక్తవయసు పిల్లల మధ్య స్నేహభావాన్ని, నమ్మకాన్ని, నిజాయతీని పెంచేందుకు ఈ యాప్ సాయపడుతుందని ఫేస్‌బుక్ తెలిపింది.
కేవలం తొమ్మిది వారాల క్రితమే(ఆగస్టులో) విడుదలైన ఈ యాప్‌ను ఇప్పటికే 50 లక్షల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
రోజూ 25 లక్షల మంది వినియోగిస్తున్నారు.
అది కూడా కేవలం ఐఓఎస్ వెర్షన్‌లో మాత్రమే. ఇంకా ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి రాలేదు.
ఇంత తక్కువ సమయంలో అంతగా పాపులరైన ఈ యాప్‌పై ఫేస్‌బుక్ కన్ను పడింది.
తాజాగా దాన్ని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. డీల్ ఎంత? అన్న వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు.
టీబీహెచ్ యాప్‌ను రూపొందించేందుకు నలుగురు సభ్యుల బృందం దాదాపు ఏడేళ్లపాటు పనిచేసింది. ఇప్పుడు ఆ నలుగురు ఫేస్‌బుక్‌లో చేరిపోయారని టెక్నాలజీ న్యూస్ వెబ్‌సైట్ టెక్‌క్రంచ్ పేర్కొంది.

ఫొటో సోర్స్, PA
ఈ యాప్‌ను స్కూలు విద్యార్థులు అత్యధికంగా వినియోగిస్తున్నట్లు టీబీహెచ్ రూపకర్తలు చెబుతున్నారు.
పిల్లల మధ్య సానుకూల భావాలను, నిజాయతీని పెంపొందించేందుకు ఈ యాప్ ఓ వేదికగా పనిచేస్తుందని తెలిపారు.
‘మిమ్మల్ని ఇష్టపడేది ఎవరు?’ అనేది టీబీహెచ్ ట్యాగ్ లైన్.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








