భారత్‌లో పిల్లల ఆత్మహత్యలకు ‘బ్లూ వేల్’ కారణమా?
అపర్ణ అల్లూరి - బీబీసీ న్యూస్, ఢిల్లీ

ఫొటో సోర్స్, Getty Images
బ్లూవేల్... ఇప్పుడు భారతదేశంలో తల్లిదండ్రులను తీవ్రంగా భయపెడుతున్న పదమిది. ఇంటర్నెట్‌లో ఆడే ఈ ఆట.. కొందరు టీనేజర్లు, పిల్లల ఆత్మహత్యలకు కారణమని వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణం.
అయితే ఆయా మరణాలకు ఈ ‘బ్లూ వేల్’కు సంబంధం ఉందని కానీ.. అసలు ’బ్లూ వేల్‘ అనేది ఒకటి ఉందని కానీ పోలీసులు ఇంతవరకూ నిర్ధారించలేదు. అయితే చాలా దేశాల్లో టీనేజర్ల ఆత్మహత్యలకు సంబంధించి పలు కేసుల దర్యాప్తుల్లో ఈ బ్లూ వేల్ ప్రస్తావన వచ్చింది.
బ్లూ వేల్ ప్రభావం వల్లే తమ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని.. కొందరు తల్లిదండ్రులు విలేకరులతో చెప్పారు. ఈ ఆరోపణను పోలీసులు నిర్ధారించలేదు.
అసలు ఇదంతా ఒక బూటకమని ఇంటర్నెట్ నిపుణులు కొందరు అనుమానిస్తున్నారు. ఇది ‘‘సంచలనాత్మకం చేసిన బూటకపు వార్తా కథనం’’ అని బ్రిటన్‌కు చెందిన సేఫర్ ఇంటర్నెట్ సెంటర్ అభివర్ణించింది.
అయితే ఆత్మహత్యలకు బ్లూవేల్‌తో లింకుల గురించి భారతీయ మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. దీంతో ఒకవైపు అధికారులు దీని ఆనవాళ్లు పట్టుకోవడానికి తంటాలుపడుతోంటే.. జనంలో ఆందోళన ఇంకా పెరుగుతోంది.
నిషేధం సరే.. అమలు ఎలా?
ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. బ్లూ వేల్‌ను సాధ్యమైతే నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మీద విచారణ చేపట్టింది.
ఇప్పటికే పలు హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారిక సంస్థలు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేశాయి. కానీ ఆ నిషేధాన్ని అమలు చేసే ప్రణాళికేమిటో ఎవరూ వివరించలేదు.
ఇదిలావుంటే, ‘బ్లూ వేల్‘కి సంబంధించినవంటున్న గ్రూపులు, వెబ్‌సైట్ల లింకులను తొలగించాలంటూ ఫేస్‌బుక్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కానీ అది ఎలా చేయవచ్చు అనేదాని మీద కూడా స్పష్టత లేదు.
ఈ ‘బ్లూ వేల్’ ప్రమాదాలపై స్కూళ్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది చాలా మంది తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచుతోంది. అందరిలోనూ తీవ్ర భయానికి దారితీస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో అధికారులు స్కూళ్లలో స్మార్ట్ ఫోన్లను నిషేధించారు. విద్యార్థుల చేతులను తనిఖీ చేయడానికి వీలుగా వారు పొట్టి చేతుల చొక్కాలు తొడుక్కోవాలని పంజాబ్‌లో ఒక స్కూలు యాజమాన్యం నిర్దేశించింది.
వారి చేతుల మీద తిమింగలం ఆకారంలో టాటూలు (పచ్చబొట్లు) ఉంటే వారు బ్లూ వేల్ చాలెంజ్‌లో పాల్గొంటున్నట్లు ఆధారంగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Magnum Photos
అసలు ఈ ‘బ్లూ వేల్’ ఏమిటి?
దీని మూలాల గురించి కొంత గందరగోళం ఉంది. అయితే.. కావాలని ఒడ్డుకు వచ్చి చనిపోయే కొన్ని నీలి తిమింగలాలు (బ్లూ వేల్స్) చేసే పనిని సూచిస్తూ పెట్టిన పేరుగా భావిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఉందని చెప్తున్న ఒక బృందం ఈ పేరును ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చాలెంజ్‌లో పాల్గొనే వారికి ఒక్కొక్కరికి ఒక నిర్వాహకుడిని కేటాయిస్తుందని.. పాల్గొనే వ్యక్తి 50 రోజుల్లో కొన్ని పరీక్షలు పూర్తిచేసేలా ఆ నిర్వాహకుడు ప్రోత్సహిస్తూ ఉంటాడని చెప్తున్నారు.
ఒక భయానక సినిమాను వీక్షించడం మొదలుకుని, చాలా భీతావహ పనులు చేయడం వరకూ.. చివరకు ఆత్మహత్యకు దారితీసే పనులను కూడా సదరు వ్యక్తి చేయాల్సిందిగా నిర్దేశిస్తారని అంటున్నారు.
దురదృష్టవశాత్తూ.. టీనేజర్లు కొన్ని రకాల సోషల్ మీడియా గ్రూపుల పట్ల ఆకర్షితులవడం అసాధారణం కాదు. అటువంటి కొన్ని గ్రూపులు చివరకు వారి మానసిక ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావం కూడా చూపగలవు.
‘బ్లూ వేల్‘ కథనాలలో ప్రస్తావిస్తున్న ఆన్‌లైన్ గ్రూపులో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వేలాది మంది సభ్యులు ఉన్నారని చెప్తున్నారు.
రష్యాలో కథనాలు నిరాధారం...
రష్యా, ఉక్రెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో ఈ గ్రూపు పేరు వినిపించింది.
ఆత్మహత్యలకు ఈ గ్రూపుకు సంబంధం ఉందంటూ మొదట రష్యా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవి నిరాధారమని కొట్టివేశారు.
రష్యాకు చెందిన వికాంటాక్టే అనే సోషల్ నెట్‌వర్క్‌లో ఇది మొదలైనట్లు చెప్తున్నారు. తాము లక్షలాది బ్లూ వేల్ హ్యాష్‌ట్యాగ్‌లను గుర్తించినట్లు ఆ నెట్‌వర్క్ తెలిపింది.
అయితే ‘బ్లూ వేల్’ సంబంధిత ఆత్మహత్యలంటూ స్థానిక మీడియాలో ప్రతి రోజూ వార్తలు వస్తుండటంతో.. భారదేశానికి చెందిన స్కూళ్లు దీనికి అవకాశం ఇవ్వడం లేదు.

ఫొటో సోర్స్, Robin Singh
జీవితంకన్నా ఏదీ విలువైనది కాదు...
‘‘నా అభిప్రాయం ఏమిటంటే.. ఇది డ్రగ్స్ లాంటిది. అసలు మొదటి అడుగే వేయకూడదు’’ అని పంజాబ్‌లోని స్ప్రింగ్ డేల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజీవ్ శర్మ తరగతి గదిలోని 16 ఏళ్ల విద్యార్థులకు ఉద్బోధించారు.
‘‘ఒకే ఒక్క మంత్రం గుర్తుంచుకోండి: జీవితం కన్నా విలువైనది ఏదీ లేదు’’ అని వారికి చెప్పారు.
‘‘నాకు చాలా భయమేసింది... మనకు ఇలా చేసే దానిని వైపు చూడకూడదు. దానికోసం సెర్చ్ చేయకూడదు. అసలు దాని గురించి ఆలోచించనే కూడదు’’ అని ఆ తరగతి విద్యార్థి శివ్‌రామ్ రాయ్ లూథ్రా బీబీసీతో పేర్కొన్నాడు.
కానీ ఇది సరైన పద్ధతని అందరూ అనుకోవడం లేదు.
మూల కారణాన్ని విస్మరిస్తున్నాం...
‘‘బ్లూ వేల్‘ మీద తరగతులు పెడుతున్న స్కూళ్లు నిజానికి దాని గురించి ప్రచారం చేస్తున్నాయి’’ అని సునీల్ అబ్రహాం అనే ఇంటర్నెట్ పరిశోధకుడు అభిప్రాయపడ్డారు.
‘‘ఆన్‌లైన్‌లో బెదిరింపుల నుంచి సెక్స్ చాట్ల వరకూ ఇంటర్నెట్‌కు సంబంధించిన ఆందోళనకర విషయాలన్నిటి గురించీ మాట్లాడకుండా దానినొక్కదానినే ప్రత్యేకంగా ఎందుకు చూపించాలి?’’ అని ఆయన బీబీసీ మాట్లాడుతూ ప్రశ్నించారు.
‘‘మనం నైతిక భయానికి గురవుతున్నాం. దానికి నైతిక విద్యతో స్పందిస్తున్నాం. దానివల్ల పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తున్నాయనే మూల కారణాన్ని విస్మరిస్తున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశపు యువత మరణానికి రెండో అతి పెద్ద కారణం ఆత్మహత్య అని 2012లో నిర్వహించిన ఒక అధ్యయనం చెప్తోంది.
ఆ వదంతులే ఆధారాలా..?
పైగా.. ‘బ్లూ వేల్’తో సంబంధముందని చెప్తున్న ఆత్మహత్యల గురించి తెలిసిందీ చాలా తక్కువ.
ఈ లింకులను పరిసోధిస్తే.. వారి వాట్సాప్ చాట్ గ్రూపుల్లో ప్రస్తావన వచ్చిందనో, వారు ఆత్మహత్య చేసుకునే ముందు ఫోన్లకు అతుక్కుపోయి ఉన్నారన్న వదంతుల వద్దో అవి ముగిసిపోతున్నాయి.
‘‘ఈ పిల్లల గతంలోకి ఎవరూ చూడటం లేదు. మనం చేస్తున్నదంతా ఏదో ఒకటి ఊహించేయడమే’’ అని టెక్నాలజీ రచయిత మాలా భార్గవ బీబీసీతో పేర్కొన్నారు.
డాక్టర్ అచల్ భగత్ ఢిల్లీకి చెందిన ఒక సైకియాట్రిస్ట్. తాను రోజూ పిల్లలతో మాట్లాడుతుంటానని కానీ ’బ్లూ వేల్‘ ఉదంతం ఒక్కటీ తనకు ఎదురు కాలేదని ఆయన బీబీసీకి చెప్పారు.
‘‘జనం తమ అనుభవాలను వివరించడానికి అప్పటికే ప్రచారంలో ఉన్న కథలను ఆశ్రయిస్తుంటారు’’ అని ఆయన పేర్కొన్నారు. వదంతిగా వినిపిస్తున్న ఈ చాలెంజ్ నిజంగా ఉందనేందుకు ఆధారం ఏదీ లేకపోయినా కూడా.. కొందరు పిల్లలు తాము అందులో పాల్గొన్నట్లు చెప్పడానికి ఇది కారణం కావచ్చునని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి...
పిల్లల్లో మానసిక ఆరోగ్యాన్ని ‘‘తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఆత్మహత్యను నివారించడానికి భారతదేశంలో జాతీయ కార్యక్రమం ఏదీ లేకపోవడం, కనీసం స్కూళ్లలో మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి మార్గదర్శకాలూ లేకపోవడం దీనికి కారణమన్నారు.
‘‘పిల్లలతో రోజూ ఎలా మాట్లాడాలో మనకు తెలియనపుడు, వారు సంక్షోభంలో ఉన్నపుడు ఎలా మాట్లాడగలం? పిల్లలు ఏం చేయకూడదో వారికి చెప్పడానికి బదులుగా వారు ఏం చెప్తున్నారో మనందరం వినాల్సిన అవసరముంది’’ అని డాక్టర్ భగత్ వివరించారు.
మీడియా, ఇతరులు అసలు ఉందో లేదో తెలియని దాని గురించి అదే పనిగా పట్టించుకునే బదులుగా.. చిన్న పిల్లల్లో వాస్తవిక మానసిక ఆరోగ్యం మీద మరింత ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని డాక్టర్ భగత్ వంటి నిపుణులు ఆకాంక్షిస్తున్నారు.
ఎవరైనా టీనేజర్లు ఈ అనుమానిత ’బ్లూ వేల్‘ ఇంటర్నెట్ చాలెంజ్ ప్రభావానికి గురయ్యారనో.. లేదంటే వారికి భావోద్వేగ మద్దతు అవసరమనో అనిపించినట్లయితే తల్లిదండ్రులు మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలని ఆయన సూచిస్తున్నారు.
అదనపు సమాచారం రవీందర్‌సింగ్ రాబిన్.
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.








