అమెజాన్ కీ: మీరున్నా లేకున్నా డోర్‌డెలివరీ చేస్తుంది

ఫొటో సోర్స్, Amazon
ఆన్‌లైన్‌లో బుక్ చేసిన స్మార్ట్‌ఫోన్ కాసేపట్లో హోమ్ డెలివరీ కావాల్సి ఉంది. కానీ అర్జెంటు పనిపై మీరు మరో ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అందుబాటులో మరెవరూ లేరు. రెండు అత్యవసరమే. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఒకటి కావాలంటే మరొకటి త్యాగం చేయాల్సిందే. అమెజాన్ కొత్త సర్వీసుతో ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
'అమెజాన్ కీ' పేరుతో కొత్త సర్వీస్ రాబోతోంది. మీరు లేకున్నా కొరియర్ బాయ్ మీ ఇంటి తాళం తీసి వస్తువులు ఇంట్లో పెట్టేస్తారు.
'అమెజాన్ కీ' పని చేయాలంటే స్మార్ట్ లాక్, క్లౌడ్ కామ్ కెమేరా ఉండాలి.
'అమెజాన్ కీ' ఎలా పనిచేస్తుంది?
- కొరియర్ బాయ్ డెలివరీ కావాల్సిన ప్యాకేజీ బార్‌కోడ్‌ను మొదట స్కాన్ చేస్తారు.
- బార్‌కోడ్ సాయంతో దాన్ని ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకుంటారు.
- ఈ రెండు అయిపోగానే క్లౌడ్ కెమేరా డెలివరీ బాయ్ కదలికలను రికార్డు చేయడం ప్రారంభిస్తుంది.
- యాప్ సాయంతో కొరియర్ బాయ్ డోర్ లాక్ తీసి, వస్తువులు ఇంట్లో పెడతారు. తిరిగి డోర్ లాక్ చేస్తారు.
- డోర్ లాక్ తీయడం దగ్గరి నుంచి వస్తువులు ఇంట్లో పెట్టడం, తిరిగి డోర్ లాక్ చేయడం వరకు అంతా కెమేరాలో రికార్డవుతుంది.
- హోమ్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు మీరు లైవ్‌లో చూడొచ్చు. లేదంటే ఆ వీడియోను అమెజాన్ మీకు మెయిల్ చేస్తుంది.
అయితే, సురక్షితమని భావిస్తేనే వినియోగదారులు ఈ పద్ధతిని ఎంచుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
బంధువులకు, ఇంట్లో పనివారికి కూడా ఈ పద్ధతిని ఉపయోగించొచ్చు.
వినియోగదారులకు మరింత మెరుగ్గా హోమ్ డెలివరీ చేసేందుకు అమెజాన్ ప్రయత్నిస్తోంది.
2015లో ఆడి కారులో వస్తువులను తీసుకెళ్లి హోమ్ డెలివరీ చేయడం అందులో ఒకటి.

ఫొటో సోర్స్, Amazon
మా ఇతర కథనాలు:
ప్రతి ఇంట్లో దేన్నీ వదలకుండా అమెజాన్ అన్నింటినీ టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోందని సీసీఎస్ ఇన్‌సైట్ నిపుణులు బెన్ వూడ్ అన్నారు.
వీడియో డోర్‌బెల్, స్మార్ట్ లాక్ సాయంతో తన గారేజ్‌ను తెరిచేందుకు కొరియర్ బాయ్‌కి పర్మిషన్ ఇచ్చానని, గతంలో ఈ సర్వీస్ ఉపయోగించానని ఆయన వివరించారు.
ఇంటి తాళం కొరియర్ బాయ్‌కి అప్పగించడం కాస్త ఇబ్బందే అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించొచ్చని అన్నారు. భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. భద్రత సరిగా లేదని భావిస్తే ఎవరూ 'అమెజాన్ కీ'ని ఉపయోగించబోరని ఆయన అభిప్రాయపడ్డారు.
గత నెల అమెజాన్ పోటీ సంస్థ నెస్ట్ స్మార్ట్ హోమ్ పరికరాలను విడుదల చేసింది.
ఇంటర్నెట్‌తో అనుసంధానించిన అలారమ్, వీడియో స్ట్రీమింగ్ డోర్ బెల్, యాలీ స్మార్ట్ లాక్‌లు వాటిలో ఉన్నాయి. ఎక్కడో ఉండి ఇంటి తాళం తీసేందుకు ఇవి కూడా ఉపకరిస్తాయి. బంధువులు, స్నేహితులు, కొరియర్ బాయ్‌లు ఇంటి తాళం తీసేలా సెట్ చేసుకోవచ్చు.
మా ఇతర కథనాలు:
ప్రస్తుతం అమెరికాలోని 37 నగరాల్లోనే 'అమెజాన్ కీ' అందుబాటులో ఉంది. ఎందుకంటే అక్కడ మాత్రమే అమెజాన్ సొంతగా హోమ్ డెలివరీ చేస్తోంది.
డెలివరీ బాయ్స్‌ని తీసుకునే ముందే క్షుణ్ణంగా పరిశీలిస్తాం. బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తాం. వాహనాల రికార్డులను కూడా పరిశీలిస్తామని అమెజాన్ చెబుతోంది.
అయితే, ఇంట్లో సెక్యూరిటీ సిస్టం ఆన్‌లో ఉంటే కొరియర్ బాయ్ తాళం తీయలేడు. అందుకే వస్తువుల డెలివరీ రోజు ఇంట్లోని సెక్యూరిటీ సిస్టం ఆఫ్ చేయాలి.
అంతేకాదు, ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటే 'అమెజాన్ కీ' ఉపయోగించొద్దని ఆ కంపెనీ సూచిస్తోంది. అమెజాన్ తయారు చేసిన క్లౌడ్ కామ్ కెమేరా 8వేల రూపాయలు, స్మార్ట్ లాక్ 16వేల రూపాయలకు విక్రయిస్తోంది. ఇన్‌స్టలేషన్ మాత్రం ఉచితమని చెబుతోంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








