35ఏళ్ల తరవాత బయటికొచ్చిన ఒబామా ప్రేమలేఖలు

ఫొటో సోర్స్, Getty Images
‘నేను నిన్ను మిస్సవుతున్నానని నీకు బాగా తెలుసు. నీ చుట్టూ వీచే గాలిలా, నా ఆలోచనలు ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి. నీ పైన నాకున్న నమ్మకం సముద్రమంత లోతైనది. నీ పైన నాకున్న ప్రేమ దేనితోనూ కొలవలేనిది’.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన ప్రేమలేఖల్లోని వాక్యాలివి.
బరాక్ ఒబామా 35ఏళ్ల క్రితం రాసిన ప్రేమ లేఖలు ఇటీవలే బయటపడ్డాయి. కాలిఫోర్నియాలో చదువుకునే రోజుల్లో తన ప్రేయసి అలెగ్జాండ్రియా మెక్‌నియర్‌కి ఒబామా ఈ ఉత్తరాలు రాశారు.
అలెగ్జాండ్రియాపై ఉన్న ప్రేమతో పాటు విద్యార్థిగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, తొలి ఉద్యోగంలో ఎదురైన అనుభవాలు, జీవితంలో దాటొచ్చిన పరిస్థితులు లాంటి ఎన్నో అంశాలను ఆ లేఖల్లో పంచుకున్నారు.
2014లో ఈ లేఖలు ఎమొరి యూనివర్సిటీ లైబ్రరీకి చేరాయి. వాటిని ఇప్పుడు బయటికి విడుదల చేశారు.

ఫొటో సోర్స్, EMORY
‘తనకంటూ ఓ గుర్తింపు కోసం ఆరాటపడే ఓ కుర్రాడి మనసు ఆ ఉత్తరాల్లో కనిపిస్తుంది. ఇప్పటి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్నే అప్పట్లో ఒబామా కూడా అనుభవించారు అన్న విషయం కూడా ఆ ఉత్తరాల్ని చదివితే తెలుస్తుంది’ అంటారు యూనివర్సిటీ లైబ్రరీ డైరెక్టర్ రోస్ మేరీ మేగీ.

ఫొటో సోర్స్, Getty Images
దూరమైన ప్రేమ
1982-84 మధ్య కాలంలో ‘ప్రేమతో.. నీ బరాక్’ అని ముగిస్తూ తాను ఇష్టపడ్డ అలెగ్జాండ్రియాకు ఒబామా ఎన్నో ఉత్తరాలు రాశారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారి ప్రేమ చిగురించలేదు. ‘మనిద్దరికీ కావల్సినవి ఏవీ మనకు వెంటనే దొరకవు. ఆ సారూప్యతే మనల్ని దగ్గర చేసింది. మళ్లీ అదే మనల్ని దూరం చేసింది’ అంటారు ఒబామా ఓ లేఖలో.
ఒబామా తండ్రి కెన్యా దేశస్థుడు. ఒబామా పుట్టింది హవాయిలో, పెరిగింది ఇండోనేసియాలో. చదువంతా అమెరికాలో సాగింది. అందుకే ‘నేను ఏ వర్గానికీ, ఏ సంస‌్కృతికీ చెందనివాణ్ణి. ఒక రకంగా అదీ మంచిదే. అందరు వ్యక్తులూ నా వాళ్లే అనుకోవచ్చు’ అంటారు మరో లేఖలో.
డిగ్రీ పూర్తి చేశాక ఇండోనేసియాలో జీవిద్దామని వెళ్లిన ఒబామా, ఆ భాషను మాట్లడటం మరచిపోయి ఇబ్బందిపడ్డారట.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక కష్టాలూ ఒబామాకి మామూలే. 1983లో తన ప్రేయసికి రాసిన ఓ లేఖలో.. ‘కొన్ని వారాల క్రితం నా రెజ్యుమెనీ, ఆర్టికల్స్‌నీ పోస్టులో పంపించడానికి నాకు డబ్బులు సరిపోలేదు. టైప్‌రైటర్ అద్దె చెల్లించడానికి ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయింది’ అని తన పరిస్థితిని తెలిపారు.
‘స్కూల్లో చదివే రోజుల్లో ఉన్నంత ఉత్సాహంతో ఇప్పుడు ఆలోచించలేకపోతున్నా. కానీ ఇప్పుడు నా ఆలోచనల్లో చాలా పరిపక్వత వచ్చింది’ అని కూడా అలెగ్జాండ్రియాకి రాసిన లేఖల్లో ఆయన పేర్కొన్నారు. భార్య మిషెల్‌తో పరిచయానికి ఐదేళ్ల ముందు ఒబామా రాసిన లేఖలివి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








