ప్రేమ, శృంగారానికి వైకల్యం ఉంటుందా?

- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
''కభీ కభీ మేరే దిల్ మే.. ఖయాల్ ఆతాహై...''
ఈ పాట ఆల్ టైం హిందీ క్లాసిక్. ఈ పాట వినగానే మీ ప్రేమికుడు లేదా ప్రేయసి మదిలో మెదలుతారు.
ఒక్కసారి ఊహించుకోండి.. ఓ వెన్నెల రాత్రి, ప్రేమికుడు ప్రేయసికోసం వయొలిన్ వాయిస్తున్నాడు. ఈ పాటలోని ప్రేమికుడు కాళ్లు లేని వాడైతే.. ఆ ప్రేయసికి కళ్లు లేకపోతే.. ఆమె అతడిని చూడలేకపోతే..ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోగలరా?
''కి యే బదన్ యె నిగాహే మేరి అమానత్‌హై..''
ఒక్కసారి ఊహించుకోండి.. ఈ పాట పాడుతున్న ప్రేమికుడికి ఓ చేయి కానీ కాలు కానీ లేకపోతే! ఆ ప్రేయసికి అంధత్వం ఉంటే?
ఊహించుకోవడం కష్టంగా ఉంది కదా!!
వికలాంగుల జీవితాలపై మనకు శ్రద్ధ కానీ వారి అనుభూతుల గురించి కానీ మనకు తెలియవు. అందుకే, ఓ శృంగార సన్నివేశాన్ని ఇద్దరు వికలాంగుల మధ్య ఊహించుకోవడం కష్టంగా ఉంది.
ఇద్దరు వికలాంగుల మధ్య ప్రేమనూ, శృంగారాన్నీ, వైవాహిక బంధాన్నీ మనం ఎందుకు ఊహించుకోలేం? మన మన:ఫలకం మీద వారెందుకు తారాడరు?
ఒకవేళ మనం ఊహించుకుంటే.. ఆ దృశ్యం ఎలా ఉంటుంది?
రానున్న మూడు రోజుల్లో, ఆ దృశ్యాన్ని ఆవిష్కరిస్తాను. మనకు తెలియని సమాజం నుండీ మీకోసం కొన్ని కథలను మోసుకువస్తాను.
కాలేజ్‌లో చదువుతోన్న ఓ యువతిని నేను కలిశాను. ఆమె అంధురాలు. తన పొడువాటి జడ, కోల మొహం, సూటిగా మాట్లాడటం అన్నీ.. ఇంటికి వెళ్ళేదాకా నన్ను వెంటాడాయి. ఆమె చాలా తెలివైనది. చదువులోనూ ఆటల్లోనూ ఆమే ఫస్ట్. నా స్నేహితురాళ్ల జీవితంలాగానే ఆమె జీవితం కూడా ఉంది. ఆమె మొదటిసారి ప్రేమలో పడింది. పురుష స్పర్శను కూడా అనుభవిస్తోంది. నేను మోసపోతానేమో అని కూడా ఆమె భయపడుతోంది. అతడు దూరమైతే, తనలో ఏర్పడే శూన్యం గురించి కూడా ఆమె ఆలోచిస్తోంది. ఆమె ఆనందం, ప్రేమ, మోహం, భయం... ఈ ఉద్వేగాల అనుభూతి మాత్రం వేరు.
నేను మరొక యువతిని కూడా కలిశాను. ఆమె స్నేహితుడు, పొరుగింటివాడు కలిసి ఆమెను రేప్ చేశారు.తనను రేప్ చేశారంటే ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే, ఆమె వికలాంగురాలు. ఇరుగుపొరుగువారు, పోలీసులతో పాటుగా, చివరికి కుటుంబ సభ్యులు కూడా తన మాటలు నమ్మలేదు.
వికలాంగురాలిని రేప్ చేస్తే ఏమొస్తుందని మొహం మీదనే అడిగారు కూడా.. తనను రేప్ చేశారన్న బాధకంటే ఈ మాటలు ఆమెను ఎక్కువగా బాధించాయి. లైంగిక దాడితో ఆమె కృంగిపోలేదు. ధైర్యం కూడగట్టుకుంది. జీవితంలో ముందుకు సాగాలనుకుంది. తనను కూడా ఓ పురుషుడు ప్రేమించాలని కోరుకుంది.

మనం ఏం చేస్తాం??
ఓ వ్యక్తి మనకు భారమైతే, ఆ వ్యక్తితో మనం ప్రేమలో పడతామా? వారి వైకల్యం పట్ల సహానుభూతి చెందుతామా? వారిపై జాలి చూపిస్తామా? లేక వారి బలహీనతను అవకాశంగా తీసుకుంటామా?
ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడం వికలాంగులకు చాలా ముఖ్యం. ప్రేమ, పెళ్లి అంశాల్లో ఈ విషయాలు కీలకం.
మామూలు వ్యక్తి వికలాంగులను పెళ్లి చేసుకోవడం అరుదు. కానీ, ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకోవడం మామూలుగా జరుగుతూ ఉంటుంది. కానీ, వీరి పెళ్లిళ్లకు కుటుంబ సభ్యులు కూడా అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వరు.
ఈ ఆలోచనా విధానాన్ని మార్చాలని చాలా రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. వికలాంగులను పెళ్లి చేసుకుంటే ఆర్థికసాయం చేస్తామని కూడా ప్రకటించాయి.
బీహార్‌లో ఓ జంటను కలిశాను. దంపతులు ఇద్దరూ వికలాంగులే. కానీ, వారి దాంపత్యం ఎంత విలువైనదో నాకు అర్థమయ్యింది. వీరు, ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం మీదే వీరి దాంపత్యం ఏర్పడింది. అయినా, డబ్బుకంటే విలువైనదేదో వారి జీవితాల్లో నాకు కనిపించింది.
ఈ ప్రయాణంలో మీరు నాతోపాటు రావాలనుకుంటే, ఈ పాటను మరోసారి పాడతామని నాకు హామీ ఇవ్వండి..
''కభీ కభీ మేరే దిల్ మే.. ఖయాల్ ఆ..తాహై...''
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








