ఇరాన్‌కు నాయకత్వం లేకుండా చేయడం వెనక అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, క్షిపణి దాడులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఖమేనీకి లక్షల మంది సంతాపం తెలిపారు.
    • రచయిత, గోర్డన్ కొరేరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద తమకు వైమానికంగా ఆధిపత్యం ఉందని, తమ ఫైటర్ జెట్లు లక్ష్యాల మీద కాావలసినట్లు దాడి చేసే వీలుందని అమెరికా, ఇజ్రాయెల్ తెలిపాయి.

నిఘా విషయంలోనూ ఈ రెండు దేశాలకున్న అధిపత్యం వల్లే అనేకమంది ఇరాన్ నాయకుల్ని చంపగలిగాయి.

అయితే, ఇరాన్ నాయకత్వాన్ని లేకుండా చేయడం వెనుక వ్యూహం ఏంటి? ఒక సమాధానం ఏంటంటే గందరగోళం సృష్టించడం.

అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రారంభించినప్పుడు ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ నివాసం వారి లక్ష్యం కాదు. అయితే అమెరికన్ సైబర్ కమాండ్, స్పేస్ కమాండ్ హ్యాకర్లు వారి ఇజ్రాయెల్‌ సహచరులు, ఇరాన్ నిఘా విభాగం కళ్లకు గంతలు కట్టారు.

ఏం జరుగుతుందో అర్థం కాక ఇరాన్ నిఘా విభాగం విఫలమైందని అమెరికన్ సైనిక అధికారులు చెబుతున్నారు. ఇది అమెరికా, ఇజ్రాయెల్‌కు అవకాశంగా మారింది. ఇరాన్ సీనియర్ నాయకులు తమ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. సీఐఏ, మొసాద్ సంస్థలు రెండూ ఇరాన్ నిఘా విభాగం అధికారుల్ని కొన్ని నెలలుగా ట్రాక్ చేస్తూ వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, క్షిపణి దాడులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా తెహ్రాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది.

ఇరాన్‌ను గందరగోళంలోకి నెట్టేందుకే దాడులు

మొస్సాద్ గూఢచారులు ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలలో చాలా కాలంగా సాంకేతిక సమస్యల్ని సృష్టించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు.

దీని ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. చనిపోయిన వారిలో సైన్యాధిపతి, రక్షణ మంత్రి, రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి కూడా ఉన్నారు.

ఈ దాడులకు ఇజ్రాయెల్ నాయకత్వం వహించినట్లు భావిస్తున్నారు.

దాడుల ప్రారంభంలో తాము ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్, ఖండాంతర క్షిపణి కేంద్రాలు, నిఘా వ్యవస్థ మౌలిక వసతులపై దాడులు చేసినట్లు అమెరికా చెబుతోంది.

ఇరానియన్లను 'గందరగోళంలో పడేయడం' ఈ దాడుల ఉద్దేశమని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్ చెప్పారు.

తమపై దాడులు జరుగుతాయనే వాస్తవాన్ని తెహ్రాన్ నాయకత్వం గ్రహించింది. తాము మరణిస్తే తమ స్థానంలో నియమించవలసిన వారి గురించి అధికారులకు ముందే సూచనలు ఇచ్చారు. (వారి గుర్తింపు రహస్యంగా ఉంచారు)

ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలిసినప్పటికీ ఇరానియన్ నాయకులు అనేకమంది శనివారం ఉదయం సమావేశం కావడం ఆశ్చర్యం కలిగించే అంశం. అందరూ ఒకే చోట సమావేశం కావడంతో వారిని చంపడం ప్రత్యర్థులకు తేలిగ్గా మారింది.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, క్షిపణి దాడులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రివల్యూషనరీ గార్డ్స్ కొత్త అధిపతిగా అహ్మద్ వహిదీని నియమించారు.

ఇరాన్ పాలకుల హత్యలు దేనికి సూచిక?

దీన్నుంచి కోలుకోవడం, గట్టిగా బదులివ్వడం ఇరాన్‌కు కష్టమే కావచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు సైనికపరంగా పైచేయి సాధించినప్పటికీ ప్రమాదం కూడా పొంచి ఉంది.

దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ పశ్చిమాసియాలోని అనేక దేశాల్లో లక్ష్యాలపై వరుసగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.

దీన్ని ఆటో పైలట్‌లో భాగంగా ముందుగా నిర్ణయించారా లేక స్థానిక కమాండర్లు సొంతంగా చొరవ తీసుకుని దాడులు చేస్తున్నారా లేక చైన్ ఆఫ్ కమాండ్‌కు కేంద్ర స్థానంలో ఉండి ఎవరైనా ఆదేశాలు జారీ చేస్తున్నారా అనే దానిపై స్పష్టత లేదు.

తమ నాయకులను చంపేయడంతో యుద్ధం చేయాలా లేక మరో మార్గాన్ని ఎంచుకోవాలా అనే దానిపై ఇరాన్ ఏమనుకుంటోందనేది మరో ప్రశ్న.

ఇరాన్ సుప్రీం లీడర్‌ను చంపేస్తే , రివల్యూషనరీ గార్డ్స్‌లోని అతివాదులు పాలన మీద మరింత పట్టు బిగిస్తారని, యుద్ధం ప్రారంభించడానికి ముందు సీఐఏ నిఘా విభాగం అంచనా వేసింది.

యుద్ధాన్ని కొనసాగించాలా లేక చర్చలు చేపట్టాలా లేక అమెరికా డిమాండ్లకు తలొగ్గాలా అనే దానిలో దేనిని ఎంచుకుంటారనే దాన్నిబట్టి ఇరాన్ కొత్త పాలకుడి మనుగడ ఉంటుంది.

పాలకుల్ని ఇలాగే చంపుకుంటూ పోతే వాళ్లు ఏదైనా నిర్ణయం తీసుకోవడం లేదా చర్చలు జరపడం కష్టమవుతుంది.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, క్షిపణి దాడులు

ఫొటో సోర్స్, EPA

అమెరికాకు అతి పెద్ద సవాలు

వెనెజ్వెలాలో నికొలస్ మదురో స్థానంలో డెల్సీ రోడ్రిగ్స్ అధికారంలోకి వచ్చారు. ఆమె అమెరికన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారు.

ఇరాన్‌లోనూ అలాంటి నాయకత్వం ఉండాలని అమెరికా భావిస్తోంది. అయితే తెహ్రాన్‌లో అలాంటి వ్యక్తి ఉన్నారా? ఉంటే అధికారంలో కొనసాగగలరా అనే దానిపై స్పష్టత లేదు.

ఇక చివరిది, అత్యంత కీలకమైన ప్రశ్న. ఖమేనీతో పాటు ఇరానియన్ నాయకుల్ని చంపేయడం వల్ల ఇరాన్‌లో పాలన మారుతుందా?

వైమానిక దాడుల ద్వారా పాలన మారిన సందర్భాలు చాలా అరుదని చరిత్ర చెబుతోంది. అమెరికా తెహ్రాన్‌లో తిష్ట వేసి తమకు కావలసిన నాయకుడిని అక్కడ అధికారంలో కూర్చోబెట్టే పరిస్థితి కనిపించడం లేదు.

ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో ఎగసిన ఆందోళనలను క్రూరంగా అణచి వేసిన తర్వాత భద్రతా బలగాలు, నిఘావర్గాలు ఈసారి ఆందోళనలకు సహకరించి వాటిని విజయవంతం చేయవచ్చు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరోసారి ఆందోళనలకు పిలుపిచ్చారు. ఆయుధాలు విడిచిపెట్టే సాయుధ బలగాల సభ్యులను క్షమించి వదిలిపెడతానని చెప్పారు.

అయితే తెహ్రాన్ నాయకత్వం అన్ని వ్యవస్థల్లోనూ బలంగా పాతుకుపోయింది. అధికారంలో కొనసాగేందుకు అది వీలైనదంతా చేస్తుంది.

నాయకత్వపు భవిష్యత్తు అస్థిరంగా కనిపిస్తోంది. దీంతో ఇరాన్‌లో వీలైనంత నష్టం చేయడమే అమెరికా, ఇజ్రాయెల్‌కు ప్రాధాన్య అంశంగా ఉంది.

పాలన మారితే దాన్ని ఇరానియన్ పాలకులు స్వాగతించవచ్చు. నాయకత్వం మారడం వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా వాళ్లే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)