జంతువుల్లోనూ 'హిట్లర్, స్టాలిన్, ఈదీ అమీన్' లాంటి ఆధిపత్య మనస్తత్వాలు ఉంటాయా?

జంతువులు, బ్రిటన్, నియంతృత్వం

ఫొటో సోర్స్, Alamy

    • రచయిత, క్రిస్ బరాన్యూక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 9 నిమిషాలు

కొన్ని జంతు సమాజాల్లో ఉక్కుపిడికిలితో నియంతలు అధికారం చెలాయిస్తుంటే .. మరికొన్నింట్లో సహజంగానే సమానత్వం కనిపిస్తుంది. అవన్నీ మనకు పాఠాలు బోధిస్తాయి.

20వ శతాబ్దంలో నియంతలకు కొదవలేదు. తమ ప్రత్యర్థులను, తాము గీసిన హద్దులను దాటినవారిని క్రూరంగా అణచివేసిన నాయకులు ఉన్నారు.

అలాంటి వారిలో హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, మావో జెడాంగ్, ఈదీ అమీన్ .. అలాగే బిల్ అనే ఓ ఎలుక (హౌస్ మౌస్) కూడా ఉంది.

1950 ప్రారంభంలో.. యూకేలోని సఫోల్క్‌లో రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి శిక్షణా వైమానిక స్థావరంలో ఉన్నప్పుడు 'బిల్' ఎదుగుతున్న తీరును ఎలుకల నిపుణుడు, పర్యావరణవేత్త పీటర్ క్రౌక్రాఫ్ట్ పరిశీలించారు.

తన అసాధారణ ప్రయోగంలో భాగంగా ఒక ఎలుకకు ఆయన బిల్ అనే ముద్దుపేరు పెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'కాసేపట్లోనే నియంతగా మారిన బిల్'

బ్రిటన్ చుట్టుపక్కల ప్రాంతంలోని వ్యూహాత్మక ఆహార నిల్వల్లోని పెద్ద పరిమాణంలోని ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేస్తుండేవని చెబుతుంటారు.

ప్రచ్ఛన్న యుద్ధంకాలం ప్రారంభ సంవత్సరాల్లో… ఎలుకల ఆగడాలను అరికట్టే ఉద్దేశంతో.. వాటి ప్రవర్తనను మెరుగ్గా అర్థం చేసుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నించింది.

దాంతో.. ఒకప్పటి బాంబర్ ట్రైనింగ్ కేంద్రంలో ఎలుకలను పరిశీలించే ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి క్రౌక్రాఫ్ట్ నియమించారు.

ఈ పనిని మొదలు పెట్టే సమయంలో క్రౌక్రాఫ్ట్.. బిల్‌ను తోటి ఎలుక అయిన చార్లీకి పరిచయం చేశారు.

"చార్లీని తొలిసారి కలిసినప్పుడు బిల్ ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందనేదానిపై నాకు ఎలాంటి అవగాహన లేదు" అని క్రౌక్రాఫ్ట్ అన్నారు. ఆయన ఈ అధ్యయనాన్ని వివరిస్తూ "మైస్ ఆల్ ఓవర్" అనే పుస్తకం రాశారు.

కొద్దిసేపు ఆ రెండు ఎలుకలు తీవ్రంగా పోట్లాడాయి. ఆ కొద్దిసేపటికే బిల్‌ను విజయం వరించి, అక్కడ ఓ నియంత ఆవిర్భవించింది.

1966లో ప్రచురితమైన తన పుస్తకంలో క్రౌక్రాఫ్ట్… ఇతర ఎలుకల పట్ల బిల్ నిరంకుశ ప్రవర్తనను ఆయన అనేక పేజీల్లో వివరించారు.

బబూన్స్, బ్యాండెడ్ మాంగూస్(ముంగీస), నేక్‌డ్ మోల్ ర్యాట్స్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, బబూన్‌ల గుంపులో కొన్నింటికి అధికారం ఉంటుంది, వాటి ప్రవర్తనే మొత్తం గుంపును ప్రభావితం చేస్తుంది.

అనేక జంతు సమాజాల్లోనూ..

ఈ నిరంకుశ లక్షణం ఎలుకల్లో మాత్రమే కాకుండా అనేక జంతు సమాజాల్లో ఉంది. బబూన్స్, బ్యాండెడ్ మాంగూస్ (ముంగీస), నేక్‌డ్ మోల్ ర్యాట్స్ వంటివి వాటిలో కొన్ని.

ఆధిపత్య క్రమానుగత వ్యవస్థ (డామినెన్స్ హైరార్కీస్) లేదా పెక్కింగ్ ఆర్డర్స్ అని పర్యావరణవేత్తలు పిలిచే ఈ జంతువుల కమ్యూనిటీల్లో, ఉన్నత స్థానంలో ఉండే జంతువు లేదా జంతువులు తమ ఉక్కు పిడికిలితో ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తాయి.

అవే ఎక్కువ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మంచి లైంగిక భాగస్వాములను పొందుతాయి. వాటి ప్రవర్తన మొత్తం ఆ జంతు సమూహాన్ని తమకు కావాల్సిన దిశలో తిప్పుతుంది.

కిందివారు(సబార్డినేట్స్) ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ నిరంకుశత్వం మరింత విస్తృతంగా మారేది. ఇదే పరిస్థితి… మానవ సమాజాల్లో కూడా నిరంకుశత్వం ఏర్పడ్డానికి దారి తీసింది.

అయితే, కొన్నిసార్లు… ఈ పరిస్థితులు తమ దూకుడైన నాయకులు తొలగించేందుకు కూడా దారి తీసేవి. మరికొన్ని జంతు సమాజాలు.. నిరంకుశత్వాన్ని తప్పించుకోవడం కోసం కలిసి పని చేయడం కనిపిస్తుంది.

'ఎలుకలను గమనించి మనుషుల ప్రవర్తన తెలుసుకున్నా'

బ్రెజిల్‌లో శాంతియుతంగా ఉండే కోతి జాతులుగా ప్రసిద్ధి పొందిన నార్తర్న్ మురిక్వీ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవి సున్నితమైన, సమానత్వ సమాజాన్ని తమ మధ్య కొనసాగించేవి.

జంతువుల జన్యువులు అలాగే అవి ఉండే వాతావారణం కూడా అవి ఎంత నిరంకుశులో, కావో నిర్ణయిస్తుంది. బహుశా వాటి నుంచి మనం నేర్చుకోవచ్చు.

"నేను ఎలుకలను ఎంత ఎక్కువగా గమనించానో, అంత ఎక్కువగా నా చుట్టూ ఉండేవారి ప్రవర్తనలోని అంశాలను గమనించాను. దాంతో రెండు జాతులనూ మరింతగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను" అని క్రౌక్రాఫ్ట్ తన పుస్తకంలో రాశారు.

ఎలుకల్లో నియంత తేల్చిన ట్యూబ్ టెస్ట్

ప్రభుత్వ డబ్బులను వృథా చేస్తున్నారని క్రౌక్రాఫ్ట్‌ పనిపై విమర్శలు వినిపించినప్పటికీ.. ఇది అనేకమంది పరిశోధకులకు మార్గదర్శకంగా నిలిచింది.

అలాంటివారిలో అమెరికాలోని జార్జియాలోని కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో బయోమెడికల్ సైంటిస్ట్ అయిన జస్టిన్ వర్హోలిక్ ఒకరు. ఆయన పీహెచ్‌డీ సమయంలో ఎలుకల ప్రవర్తనను అధ్యయనం చేశారు.

"నా రీసెర్చ్‌లో చాలా ప్రధాన ఆధారం ఆ పుస్తకమే" అని ఆయన చెప్పారు.

ల్యాబోరేటరీల్లో ఎలుకలను తరచుగా చిన్న కేజుల్లో పెడతారు. అక్కడ నియంతృత్వం ప్రబలుతుంటుంది. 2019లో వర్హోలిక్ ఆయన సహోద్యోగులు కలిసి ఈ ప్రవర్తనపై పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు.

మూడు వేర్వేరు గ్రూపులుగా విభజించి, ఓ ప్రామాణిక ల్యాబ్ కేజ్‌లో ఉంచిన కొన్ని ఎలుకలను వారు పరిశీలించారు.

తమతో కేజ్‌లో ఎవరు ఉన్నరాన్న దానిని బట్టి, ఈ ఎలుకల ర్యాంకులు మారుతాయని వర్హోలిక్ కనుగొన్నారు. దీన్ని వాళ్లు ట్యూబ్ టెస్ట్ అనే పద్ధతి ద్వారా తెలుసుకున్నారు.

ఈ టెస్టులో భాగంగా రెండు ఎలుకలను ఒక ట్యూబ్‌‌‌కు ఉన్న రెండు వైపుల నుంచి పంపించినప్పుడు.. వాటిల్లో ఏదైతే ముందుగా వెనక్కు వస్తుందో అది తనను తాను సబార్డినేట్‌గా ప్రకటించుకుంటుంది.

సెక్స్‌లో పాల్గొనకుండా చెట్టు చిటారుకొమ్మపైకి తరిమి..

దక్షిణాఫ్రికాలో ఉండే చక్మా బబూన్స్‌‌ విషయానికి వస్తే.. ఈ బబూన్ సమాజాల్లో సాధారణంగానే నియంతలు అధికారం చెలాయిస్తాయని 2008 నాటి ఓ అధ్యయనం చెబుతోంది.

ఉదాహరణగా చెప్పాలంటే ఈ కోతులు ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ ప్రవర్తన స్పష్టంగా కనిపించింది. "గుంపులుగా ఆహారం వెతకడానికి తీసుకునే నిర్ణయాలు తీసుకోవడం ఓ అధిపత్యం చెలాయించే మగకోతి నేతృత్వంలోనే ఉంటాయి. అలాగే ఆ నిర్ణయాల వల్ల అధిక ప్రయోజనాలు కూడా దానికే దక్కుతాయి" అని పరిశోధకులు గుర్తించారు.

ఈ పేపర్‌ను ప్రచురించినవారిలో ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, బిహేవియరల్ ఎకాలజిస్ట్ అయిన ఎలిసే హుచార్డ్ ఓ సహ రచయిత్రిగా ఉన్నారు.

నమీబియాలో బబూన్లపై ఆమె అనేక సంవత్సరాలు పరిశోధన చేశారు. ఈ గుంపుల్లోని ఆధిపత్యం చెలాయించే మగ బబూన్లు ఆడ బబూన్లను తమతో సంభోగం కోసం ఎలా బలవంతం చేస్తాయో, అలాగే ఇతర మగ బబూన్లతో సంభోగంలో పాల్గొనకుండా వాటిని ఎలా బెదిరిస్తాయో హుచార్డ్ వివరించారు.

ఈ నిరంకుశ బబూన్.. ఆడ బబూన్‌ను చెట్టుకుపైకి ఎక్కేలా చెట్టు చిటారు కొమ్మల వరకు చేరేలా తరుముతుంది. కొన్ని సందర్భాల్లో ఇవి విషాదాలుగా కూడా పరిణమిస్తాయని ఆమె చెప్పారు.

"గర్భంతో ఉన్న ఓ ఆడ బబూన్‌ను అలా తరమడం మేం చూశాం" అని హూచార్డ్ అన్నారు. అప్పుడు అది చెట్టుపై నుంచి కిందపడిందని, తర్వాతి రోజు దానికి గర్భస్రావం అయిందని ఆమె చెప్పారు.

నేక్‌డ్ మోల్ ర్యాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేక్‌డ్ మోల్ ర్యాట్

ఆడ జంతువులు కూడా ఆధిపత్యంతో..

అయితే, హై-ర్యాంకింగ్‌తో ఉండే ఆడ బబూన్లు కూడా తమ సబార్డినేట్ ఆడ బబూన్ల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తాయని హుచార్డ్ చెప్పారు. ఆడ బబూన్లకు ఈ సామాజిక ర్యాంకు తల్లి నుంచి వస్తుంది.

వేరు బుడిపెలను తింటూ, ముందు పంటితో చిన్న బొరియల్లాంటివి తవ్వి అందులోనే నివసించే.. నేక్‌డ్ మోల్ ర్యాట్ సొసైటీల్లో రాణి ఉంటుంది. అది మాత్రమే… పిల్లల్ని కంటుంది.

ఈ రాణులు.. ఇతర మోల్‌ర్యాట్స్‌ను బలవంతంగా నెట్టడం, తోక లాగడం, తోయడం వంటి ప్రవర్తనల ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటాయి.

ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ గుంపు నుంచి వేరుపడి వెళ్లిపోవడం వాటికి ప్రమాదకరం.

"వాటికి కావాల్సిన వేరు బడిపెలు మరో చోట ఎక్కడ దొరుకుతాయో వాటికి తెలియదు" అని జంతువులు, మానవ సమాజాల్లో నిరంకుశత్వంపై అధ్యయనం చేసిన ఇండిపెండెంట్ ఆంథ్రోపాలజిస్ట్ లారా బె‌ట్జిగ్ అన్నారు. అవి అక్కడే ఉంటూ ఈ నిరంకుశత్వాన్ని భరిస్తాయని ఆమె చెప్పారు.

రాణి కాకుండా ఇతర ఆడచీమలు పెట్టిన గుడ్లను శ్రామిక చీమలు తింటాయని కూడా బెట్జిగ్ పేర్కొన్నారు. "రాణి చీమ ఓ శ్రామిక చీమల ఆర్మీని, ఓ పోలీసు బలగాన్ని ఉపయోగించి గుడ్లను ధ్వంసం చేస్తుంది" అని బెట్జిగ్ అన్నారు. ఇది తమ ప్రత్యర్థులను తొలగించడంలో ఓ నాయకుడు అనుసరించే ఓ పద్ధతి.

జత కట్టాలన్నప్పుడు యుద్ధం ప్రకటించి…

ఇక బ్యాండెడ్ మాంగూస్(ముంగీస) విషయానికి వస్తే ఆడ బ్యాండెడ్ మాంగూస్‌లో నిరంకుశత్వం ఇంకొక అడుగు ముందుకెళ్లి కనిపిస్తుంది. ఈ జంతువులు గుంపులు గుంపులుగా జీవిస్తాయి.

వాటిల్లో ఏదైనా నాయకత్వ స్థానంలో ఉండే ఆడ ముంగిస… సంభోగంలో పాల్గొనాలని భావించినప్పుడు.. తమ సమీపంలోని ప్రత్యర్థి సమూహాలతో ఓ రకమైన యుద్ధాన్ని ప్రకటిస్తుంది.

సాధారణంగా ఈ ఆధిపత్య ఆడ ముంగీస.. సంభోగం కోసం తన ప్రత్యర్థి గుంపులోని మగ ముంగీస కోసం వెతుకుతుంది. తర్వాత ఆ గుంపుపై దాడికి వెళుతుంది. ఇందుకోసం తన గంపులోని మగ ముంగీసలను రక్షణగా తీసుకువెళుతుంది.

"ఈ యుద్ధంలో గెలిచి విజయవంతంగా జతకట్టినప్పుడు, పుట్టే పిల్లలు జన్యుపరంగా మరింత వైవిధ్యంతో, పెద్దవిగా, ఎక్కువ కాలం బతికే అవకాశాలతో ఉంటాయి" అని 2020లో ఓ పరిశోధకుడు తన అధ్యయనంలో వెల్లడించారు.

అయితే, ఈ ప్రక్రియలో అనేక ముంగీసలు ప్రాణాలు కోల్పోతాయి.

కదల్లేకపోవడమే కారణమా…?

జంతు సమాజాల్లో అనేక జంతువులకు ఇది ప్రమాదకరమైనప్పటికీ ఇంకా వాటిల్లో ఈ నిరంకుశత్వం ఎందుకు కొనసాగుతుందో తేల్చడానికి ప్రయత్నిస్తే.. కదలిక లేకపోవడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది.

చారిత్రకంగా నిరంకుశత్వంతో పాలన సాగిన మానవ సమాజాలను చూస్తే… తప్పించుకోవడానికి అవకాశం లేని భౌగోళిక ప్రాంతాల్లోనే ఈ నిరంకుశత్వం కొనసాగిందనడానికి ఆధారాలు తాను కనుగొన్నట్లు బెట్జిగ్ చెప్పారు.

ఇది నిరంకుశులకు తన అధీనంలో ఉన్నవారిపై వేధింపులకు పాల్పడేలా దారి తీసింది.

"అందుకే నేనేమంటానంటే కదలడం ఆపకండి. గోడల మధ్యే ఉండకండి. ఎగిరేందుకు ఎలాంటి అడ్డంకులను పెట్టుకోకండి" అని బెట్జిగ్ అన్నారు.

అయితే జంతు సమాజాల్లో కొన్నింట అధికంగా ఈ నిరంకుశత్వం ఎందుకు ఉందనే విషయాన్ని పరిశోధకులు ఇంకా తేల్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

జన్యువులు, నేర్చుకున్న ప్రవర్తన కారణంగా ఈ నిరంకుశత్వం ఏర్పడవచ్చు. ఆలివ్ బబూన్స్ మధ్య ఓ అసాధారణమైన ఒకదాని తర్వాత మరొకటిగా జరిగిన సంఘటనల గురించి 2004లో ప్రచురితమైన ఓ అధ్యయనాన్ని బెట్జిగ్ ప్రస్తావిస్తున్నారు.

1980ల మధ్యలో ట్యూబర్‌క్యూలోసిస్ (టీబీ) వ్యాధి ఈ బబూన్లలో వ్యాపించింది. దీంతో… ఈ గంపుల్లోని చాలా పురుష బబూన్లు చనిపోయాయి. ఇలా చనిపోయినవాటిల్లో చాలా మేరకు ఎక్కువ దూకుడుతో ఉండే మగ బబూన్లే ఉన్నాయి. దాంతో శాంత స్వభావంగల మగ కోతులు నాయకత్వం చేపట్టాయి.

ఈ ఆడ, మగ బబూన్ల మధ్య స్నేహపూర్వకంగా, అనుబంధాన్ని పెంచే ప్రవర్తన కనిపించింది. దీని వల్ల సరళీకృతమైన ఆధిపత్య వ్యవస్థ ఏర్పడిందని భావించారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ తక్కువ దాడి స్వభావం ఉన్న సమాజం చాలా ఏళ్ల పాటు కొనసాగింది. అంతేకాకుండా, ఇది తరువాతి తరాల వరకు నిలిచి, తరతరాలుగా కొనసాగింది.

జంతువులు, బ్రిటన్, నియంతృత్వం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, అనేక జంతువుల్లో నియంతృత్వం ఒక లక్షణంగా కనిపిస్తుంది.

అణచివేతతో అనార్థాలేంటి?

అణచివేత… ఇది అన్నిసార్లు జంతువుల్లో మంచి మాత్రమే చేస్తుందని చెప్పలేం. ప్రోటోమ్యాగ్నాథస్ అమెరికానస్ అనే జాతి చీమలు… తమ ప్రత్యర్థి జాతి చీమల (టెమ్నోథోరాక్స్ చీమలు) లార్వాలను అపహరించి, వాటిని తమ బానిసలుగా మార్చుకుంటాయి.

కానీ, ఆ బానిస చీమలు పెరిగాక, తమను బందీ చేసిన యజమాని చీమలను చంపేస్తాయి.

ఇక నిరంకుశుల విషయానికి వస్తే… ఒకరు అధికారం చెలాయించడానికి వనరుల లభ్యత కూడా ఓ కారణమని న్యూయార్క్‌లోని యూనివర్సిటీ ఎట్ ఆల్బనీలో బయోలాజికల్ ఆంథ్రోపాలజిస్టు మార్సీ ఎకానయాకే-వెబర్ అన్నారు.

ఒకవేళ వనరుల పంపిణీ అసమానంగా జరిగితే… అప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ వనరులపై గుత్తాధిపత్యం సాధించగలరు. ఈ ప్రక్రియలో వారు నిరంకుశులుగా మారగలరని ఆమె భావిస్తున్నారు.

వీటన్నింటి నుంచి మానవ సమాజాలు ఎంత మేరకు నేర్చుకోవచ్చు?

మానవేతర జంతు సమాజాలపై సాగిన తమ అధ్యయనాలు మానవుల ప్రవర్తనపై ఉన్న అభిప్రాయాల మీద ప్రభావం చూపాయని నేను మాట్లాడిన శాస్త్రవేత్తలందరూ చెప్పారు.

"ఇతర జంతు సమాజాలను అధ్యయనం చేసి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి అదొక పద్ధతి" అని వర్హోలిక్ అన్నారు.

రోమన్లు సహా చారిత్రక మానవ సమాజాలపై సాగిన అధ్యయనాలను ఉదాహరణగా తీసుకుంటే… పురుష నిరంకుశులు సంపద, అధికారం కలిగి ఉండడం, వాటితో అనేక మంది మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉండడానికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు తాను కనుగొన్నానని బెట్జిగ్ అన్నారు.

అంటే.. నిరంకుశ పురుష బబూన్లలా కాదని అర్థం చేసుకోవచ్చు.

అయినప్పటికీ… ఇతర విషయాలన్నింటితో పోలిస్తే, మానవులు వ్యవసాయం చేయడం.. ఈ సామాజిక క్రమానుగతాన్ని రూపొందించాయని ఎకానయకె-వెబర్ అన్నారు.

"పురుషాధిక్య లేదా పితృస్వామ్య సమాజాలు ఆవిర్భవించడానికి మానవ వ్యవసాయమే కారణమై ఉండవచ్చు. వేట సేకరణలో అధిక సమానత్వాన్ని పాటించే రోజులతో పోలిస్తే ఇది కీలకమైన వైరుధ్యం" అని వెబర్ అన్నారు.

జంతువులు, బ్రిటన్, నియంతృత్వం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, నార్తర్న్ మురిక్వీలు సమానత్వాన్ని పాటించే గుంపుల్లో జీవిస్తాయి. వీటిల్లో నిరంకుశ పాలకులు ఉండరు.

మురిక్వీల స్టైల్ వేరుగా..

మరో పద్ధతి ఏంటంటే… బ్రెజిల్‌లోని అట్లాంటిక్ అడవుల్లో నివసించే కోతి జాతులు ఈ భూమి మీద అత్యంత శాంతియుత ప్రైమేట్‌గా (కోతి జాతిగా) చెబుతారు.

చెట్లపై నివసించే నార్తర్న్ మురిక్వీ కోతులు సమానత్వాన్ని పాటించే గుంపుల్లో జీవిస్తాయి. వీటిల్లో నిరంకుశ పాలకులు ఉండరు.

కొంతమంది మురిక్వీని "హిప్పీ కోతి" అని పిలుస్తారు. ఈ పదం వాటి విశ్రాంతిమయ జీవనశైలిని ప్రతిబింబిస్తుందని అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో ప్రైమటాలజిస్ట్ కరెన్ స్ట్రియర్ చెప్పారు. ఆమె దశాబ్దాలుగా మురిక్వీలపై అధ్యయనం చేస్తున్నారు.

ఈ కోతులు లైంగికంగా చాలా స్వేచ్ఛగా ఉంటాయని ఆమె చెబుతారు.

"ఆడ కోతులు తక్కువ వ్యవధిలోనే చాలా మగ కోతులతో సంభోగంలో పాల్గొంటాయి" అని ఆమె చెప్పారు.

అంతకుమించి, ఈ మురిక్వీలు అరుదుగా గొడవ పడతాయని, వనరులను నిజాయతీగా పంచుకుంటాయని ఆమె వెల్లడించారు.

దాదాపు ఒకే సమయానికి ఏదైనా నీటి వనరు ఉన్న ప్రాంతాన్ని రెండు కోతులు కనుగొంటే… అక్కడికి మొదట చేరుకున్న కోతి ముందు తాగుతుంది. అంతసేపు మరో కోతి దాని వంతు వచ్చేవరకు ఎదురు చూస్తుందని స్ట్రియర్ వివరించారు.

"ఈ మురిక్వీ కోతులలో కనిపించే లక్షణం ఓర్పు, సహనం" అని ఆమె అన్నారు. అవి దూకుడుగా ప్రవర్తించడం కంటే ఒకదానినొకటి ఎక్కువగా కౌగిలించుకుంటాయని కూడా ఆమె తెలిపారు.

బబూన్లపై కొంత కాలం అధ్యయనం చేశాక 1980లో మొదటిసారి నార్తర్న్ మురిక్వీలపై అధ్యయనం చేయడం ప్రారంభించారు స్ట్రియర్.

అయితే, ఒకదానికొకటి దగ్గర సంబంధం ఉన్న ప్రైమేట్ జాతుల మధ్య కూడా.. ప్రవర్తనలో కొన్నిసార్లు పెద్ద తేడాలు కనిపిస్తాయి.

కొన్ని మకాక్ జాతి కోతులు తీవ్రమైన నిరంకుశత్వంతో ఉంటే, మరికొన్నింటిలో సమానత్వం కనిపిస్తుంది.

ఈ జంతు సమాజాల్లో శాంతిని ప్రేరేపించేది ఏంటి?

మురిక్వీల విషయానికి వస్తే… ఇందులో మగ కోతులు, ఆడ కోతులు పరిమాణంలో, శరీర ఆకారంలో చాలా మేరకు ఒకే విధంగా ఉంటాయని, అదే కారణమై ఉండచ్చని స్ట్రియర్ భావిస్తున్నారు.

దీనివల్లే.. ఈ ఆడ మురిక్వీ కోతులపై మగ మురిక్వీ కోతులు ఆధిపత్యం చెలాయించడానికి కష్టంగా ఉంటుందని ఆమె అన్నారు.

అయితే అంతిమంగా, వివిధ కారణాల వల్ల, నిరంకుశ పాలన వల్ల మురిక్వీ కోతుల సమూహంలోని వ్యక్తిగత జీవులకు తగినన్ని ప్రయోజనాలు లభించడం లేదనేది సింపుల్‌గా చెప్పవచ్చు.

"దూకుడుగా వ్యవహరించడం ఎందుకు పనికిరాదో దానికి తగిన కారణాలు ఉండవచ్చు" అని స్ట్రియర్ అన్నారు. సమాజం, దాని పరిసరాలు ఏ రకమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తాయి అనే ప్రశ్నకు ఇది దారితీస్తుంది.

నిస్సందేహంగా.. మనుషులు ఒకరితో ఒకరు సహకరించుకున్నప్పుడే ఉత్తమ ప్రయోజనాలు ఉంటాయని ఎకానయకే-వెబర్ అన్నారు. సాంస్కృతికంగా మనం తరచుగా జరుపుకునే విషయాలలో ఇది కూడా ఒకటి అని చెప్పారు.

ఒక కొత్త గూడు కట్టుకోవడానికి రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకునేటప్పుడు… కొన్ని చీమల జాతులు పెద్ద గుంపుల్లా కలిసి ఉండేందుకు ప్రాధాన్యతనిస్తాయని 2022 నాటి ఓ అధ్యయనంలో తేలింది. తక్కువ అనుకూలమైన స్థలాన్ని ఎంచుకోవాల్సి వచ్చిన సందర్భంలోనూ గుంపులుగానే ఉంటాయని ఈ అధ్యయనం తెలిపింది.

చీమల సమాజాల్లో కఠినమైన క్రమానుగత శ్రేణి(హైరార్కీ) వ్యవస్థ ఉంటుంది. వాటి కాలనీలోని ప్రతి సమూహం లేదా వర్గం ఒక నిర్దిష్ట పాత్రను పోషిస్తూ ఉంటుంది. కానీ, ఈ చీమల జాతికి సంబంధించి.. అవన్నీ కలిసికట్టుగా ఉండటమే మొత్తంగా అత్యంత ముఖ్యమైన విషయం అని ఆ అధ్యయనం సూచించింది.

చీమలు, బబూన్లు, మోల్ ర్యాట్స్‌తో పోలిస్తే మానవులు విభిన్నమైనవారు.

వేలాది సంవత్సరాలుగా ఈ భూమిపై ఉంటున్న మనం ఓ సొంత పంథాను సృష్టించుకున్నాం. అయినా, జంతు సామ్రాజ్యంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి.

"నా జీవితంలో సగం కాలంపాటు మురిక్వీలను గమనించి నేర్చుకున్న విషయాలను నేను ప్రజలతో సంబంధాల విషయంలో పాటిస్తాను" అని స్ట్రియర్ అన్నారు. ఉదాహరణగా, ఇతరులతో గొడవలను తగ్గించడానికి, ఎలాంటి ఒత్తిడి లేని సంబంధాలను కొనసాగించడానికి దీన్ని వినియోగిస్తానని ఆమె అన్నారు.

"శాంతియుతంగా సహజీవనం చేసే మరో జాతిని గమనించడం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది" అని ఆమె అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)