ఆడ గొరిల్లాల స్నేహం ఎలా ఉంటుందంటే..

గొరిల్లాలు, అడవులు, వన్యప్రాణులు, వైల్డ్ లైఫ్

ఫొటో సోర్స్, Dian Fossey Gorilla Fund

ఫొటో క్యాప్షన్, ఆడ గొరిల్లాలు తమ సామాజిక సంబంధాలను ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నట్లు కనిపిస్తాయి.
    • రచయిత, విక్టోరియా గిల్
    • హోదా, సైన్స్ కరస్పాండెంట్, బీబీసీ న్యూస్

ఆడ గొరిల్లాల (ఫీమేల్ మౌంటైన్ గొరిల్లాస్) మధ్య సంబంధాలు.. గతంలో మనకు తెలిసిన దానికంటే చాలా ముఖ్యమైనవని రువాండా నుంచి వెలువడిన తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. (రువాండా, ఉగాండా వంటిచోట్ల పర్వతప్రాంత అడవుల్లో కనిపించే ఆడ గొరిల్లాలను ఫీమేల్ మౌంటైన్ గొరిల్లాలుగా పిలుస్తారు)

ఇవి కొత్త సమూహంలోకి ప్రవేశించినప్పుడు, అక్కడ తనకు అప్పటికే పరిచయం ఉన్న ఆడ గొరిల్లాను వెతుక్కుని మరీ కలుస్తాయని పేర్కొంటున్నాయి.

రువాండాలోని వోల్కనోస్ నేషనల్ పార్కులోని గొరిల్లాల సమూహాలకు చెందిన 20 ఏళ్ల డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

రెండు ఆడ గొరిల్లాలు విడిపోయి చాలా ఏళ్లు గడచిపోయినప్పటికీ, మళ్లీ కొత్తగా సమూహంలోకి వచ్చినప్పుడు గతంలో సంబంధమున్న గొరిల్లాతో జతకట్టేందుకు ప్రయత్నిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గొరిల్లాలు, అడవులు, వన్యప్రాణులు, వైల్డ్ లైఫ్

ఫొటో సోర్స్, Dian Fossey Gorilla Fund

రాయల్ సొసైటీ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమైన ఆ పరిశోధనాంశాలు.. గొరిల్లా సమాజంలో రెండు ఆడ గొరిల్లాల మధ్య సంబంధం ఎంత ముఖ్యమైనదో చెబుతున్నాయి.

జ్యూరిచ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పరిశోధకురాలు విక్టోయిర్ మార్టిగ్నాక్ ఏమంటారంటే, ''స్నేహం గురించి నేను శాస్త్రీయంగా మాట్లాడగలనో లేదో నాకు తెలియదు. కానీ, గొరిల్లా సమూహాల్లో స్వలింగ సంబంధాలు వాస్తవంగా చాలా ముఖ్యమైనవని మేం ఇక్కడ చూపిస్తున్నాం'' అని చెప్పారు.

ఈ జంతువుల సామాజిక వ్యవస్థ నిర్మాణంలో వేర్వేరు సమూహాల మధ్య కలయిక కీలకం. ఆడ, మగ గొరిల్లాలు రెండూ ఈ పనిచేస్తాయి. కానీ, ఆడ గొరిల్లాలు మాత్రం తమ జీవితకాలంలో అనేకసార్లు సంచరిస్తాయి.

ఇలా చెదిరిపోవడమనేది, సంతానోత్పత్తిని నిరోధించడంలో, జన్యు వైవిధ్యాన్ని వ్యాప్తి చేయడంలో, సామాజిక సంబంధాలను ఏర్పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

''అడవుల్లో ఇది చాలా ముఖ్యం. కానీ, అధ్యయనం చేయడం చాలా కష్టం. ఎందుకంటే, గొరిల్లాలు ఒక సమూహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాటిని ట్రాక్ చేయడం కష్టం'' అని మార్టిగ్నాక్ వివరించారు.

క్షేత్రస్థాయిలో 1967 నుంచి పర్యవేక్షిస్తున్న డయాన్ ఫోస్సీ గొరిల్లా ఫండ్‌తో కలిసి మార్టిగ్నాక్, ఆమె సహచరులు.. గొరిల్లాల కదలికలను ట్రాక్ చేయగలిగారు.

గొరిల్లాల జీవితాలకు సంబంధించి దశాబ్దాల సమాచారాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, 56 గొరిల్లాల కదలికలను అనుసరించారు. అవి ఏ కొత్త సమూహంలో చేరాలని ఎంచుకున్నాయో, ఎందుకు చేరాయో పరిశీలించారు.

గొరిల్లాలు, అడవులు, వన్యప్రాణులు, వైల్డ్ లైఫ్

ఫొటో సోర్స్, Dian Fossey Gorilla Fund

ఫొటో క్యాప్షన్, ఆడ గొరిల్లాల స్నేహం

ఆడ స్నేహితులే ముఖ్యం...

''ఆడ గొరిల్లాలు గతంలో తమతో సంబంధమున్న మగ గొరిల్లాలు ఉన్న సమూహాలను పట్టించుకోలేదు. గతంలో వాటికి తెలిసిన ఆడ గొరిల్లాల తెలిసివుండడమే చాలా ముఖ్యమైనది'' అని మార్టిగ్నాక్ వివరించారు.

దూరమై చాలా సంవత్సరాలైనప్పటికీ, ఆడ గొరిల్లాలు తమ స్నేహితురాళ్ల వైపే అవి ఆకర్షితులయ్యాయి.

బహుశా తాము ఆటలాడుకునో, ముచ్చటించుకునో సామాజిక సంబంధాన్ని ఏర్పరచుకున్న స్నేహితురాళ్ల కోసం ఆడ గొరిల్లాలు వెతుకుతాయి. చాలా సంవత్సరాలైనా సరే, తాము కలిసి పెరిగిన ఆడ గొరిల్లాలు ఉన్న గుంపు వైపే అవి ఆకర్షితులవుతాయి.

ఈ సంబంధాలకే గొరిల్లాలు ప్రాధాన్యమిస్తాయని, ఎందుకంటే.. అవి కీలకమైన సామాజిక ప్రయోజనాలను చేకూర్చుతాయని మార్టిగ్నాక్ వివరించారు.

''కొత్తగా చేరే ఆడ గొరిల్లాలు సాధారణంగా ఆ సమూహ సోపానక్రమంలో దిగువ నుంచి ప్రారంభమవుతాయి. అప్పటికే అందులోఉన్న ఆడ గొరిల్లాలు వాటి పట్ల దూకుడుగా ఉంటాయి. ఎందుకంటే అవే పోటీదారులుగా ఉంటాయి'' అని చెప్పారు.

మానవ సమాజ నిర్మాణంలో సంచారం కూడా కీలకమైంది. గొరిల్లాల మూలాల్లోకి వెళ్లి పరిశోధించడం వల్ల పరిణామ చోదక శక్తులు వెలుగులోకి వస్తాయని పరిశోధకులు అంటున్నారు.

గొరిల్లాల సామాజిక జీవితాలపై ఈ కొత్త అధ్యయనం, మహిళ-మహిళ మధ్య సామాజిక సంబంధాల గురించి మన ఆలోచనా విధానాన్ని పునర్నిర్మిస్తుంది అని మార్టిగ్నాక్ చెప్పారు.

''మనం అనుకున్న దానికంటే ఆ సంబంధాలు ఈ జంతువులకు చాలా ముఖ్యమైనవి'' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)