పెంపుడు మొసళ్లు: ఆ రాష్ట్రంలో ఎన్నికల అజెండాగా ఎందుకు మారాయి? ప్రభుత్వం ఏమంటోంది...

మొసళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇళ్లల్లో మొసళ్లను పెంచుకోవడమనేది కట్టుకథ కాదు...ఆస్ట్రేలియాలోని నార్తరన్ టెర్రిటరీలో జరుగుతున్న వాస్తవం.
    • రచయిత, టిఫనీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ న్యూస్

పెరట్లో మొసళ్లను పెంచుకోవడం, కంగారూలపై కూర్చుని స్కూళ్లకు వెళ్లడం, ఇంత వరకు ఎక్కడా కనిపించని డ్రాప్‌బేర్‌‌ను చూడటంలాంటి కబుర్లు విన్నప్పుడు కాస్త వింతగా అనిపిస్తాయి. కానీ, ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో ఇలాంటివి కొన్ని నిజంగానే జరుగుతుంటాయి.

ట్రెవర్ సులివాన్ ఇంట్లో 11 మొసళ్లు ఉన్నాయి. డార్విన్‌ ( ఆస్ట్రేలియాలో ఒక రాష్ట్రం)కు దక్షిణంగా గంటసేపు ప్రయాణిస్తే బాచిలర్ అనే టౌన్‌ వస్తుంది. ట్రెవర్ సులివాన్ ఇల్లు అక్కడే ఉంది.

ట్రెవర్ ఇంట్లో ఉన్న మొసళ్లలో ఒకదానిపేరు బిగ్ జాక్. దాని ప్రవర్తన ఎలాగున్నా, ఆ ఇంట్లోని వారంతా ఈ భారీ జీవిని ప్రేమిస్తారు.

22 సంవత్సరాల కిందట ట్రెవర్‌ కూతురు పుట్టిన రోజునే ఇది కూడా గుడ్డు నుంచి బయటకు వచ్చింది.

ఇక అప్పటి నుంచి అది వారి కుటుంబంలో భాగమైంది. జాక్‌ను తన కూతురు సోదరుడిగా భావిస్తుందని ట్రెవర్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నిబంధనల్లో మార్పులేంటి?

80 ఎకరాల స్థలంలో ఈ పదకొండు మొసళ్లు నివసిస్తుంటాయి. ఇందులో ఒక బుల్లి మొసలితోపాటు, ‘షా’ అనే పేరున్న పెద్ద సైజు మొసలి కూడా ఉంది. పొడవు15.4 అడుగులు ఉంటుంది. దాని వయసు దాదాపు 100 సంవత్సరాలపైనే. అది సంపూర్ణ జీవితాన్ని అనుభవించిందని అన్నారు ట్రెవర్.

"బహుశా షా రెండు ప్రపంచ యుద్ధాలను చూసి ఉండవచ్చు. 1901లో ఆస్ట్రేలియా ఫెడరేషన్ ఏర్పడడం కూడా చూసి ఉండొచ్చు." అని తన పెంపుడు మొసలి గురించి చెప్పారు ట్రెవర్.

షా ఒకప్పుడు ఒక వ్యక్తిని చంపేసిందని, దానిని సైన్సు పరిశోధన కోసం ఉపయోగించారని, బర్డ్ పార్క్‌లో విష ప్రభావంతో దాదాపు చనిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు.

క్వీన్స్‌లాండ్ క్రోకోడైల్ పార్క్‌లో మరో మొసలితో జరిగిన ఘర్షణలో దాని దిగువ దవడలో సగం దెబ్బతింది. ఇవన్నీ కొన్ని సంవత్సరాల కిందట, అది ట్రెవర్ ఇంటికి రావడానికి ముందు జరిగిన ఘటనలు.

తన పెంపుడు మొసళ్ల గురించి చాలా ఉత్సాహంగా బీబీసీకి వివరించారు ట్రెవర్. " ఇంత మంచి జీవులు మరెక్కడా కనిపించవు. మొసళ్లు పెంపుడు జంతువుల్లో హార్లే డేవిడ్‌సన్ లాంటివి" అని అన్నారు.

అయితే, ఇంట్లో పెంపుడు జంతువులుగా మొసళ్లను పెట్టుకోవడం ఆ రాష్ట్ర ఎన్నికలలో ప్రధాన అంశంగా మారింది. ఇకపై మొసళ్లను పెంచుకోవడం కుదరని పని ట్రెవర్ అన్నారు.

శనివారం నాడు ముగిసిన ఎన్నికలలో ద్రవ్యోల్బణం, రియల్ ఎస్టేట్ ధరలు, క్రైమ్‌లాంటివి ఓటర్లపై ప్రభావం చూపించిన అంశాలు.

కానీ, ట్రెవర్‌కు అది సమస్య కాదు. ఇకపై మొసళ్లను పెంచుకోవడం వీలు లేకుండా అధికార లేబర్ పార్టీ తీసుకొచ్చిన నిబంధనలపై అసంతృప్తిగా ఉన్నవారిలో ట్రెవర్ ఒకరు.

ఆస్ట్రేలియాలో పెంపుడు జంతువులుగా మొసళ్లను అనుమతిస్తున్న చివరి ప్రాంతం నార్తర్న్ టెరిటరీయే. అయితే, ఇప్పటి వరకు మొసళ్ల పెంపకం చేపడుతున్న వారికి ఈ నిబంధనలు ఏమీ అడ్డురావు. కానీ, కొత్తగా ఇకపై ఎవరూ మొసళ్ల పెంపకం చేపట్టలేరు.

ప్రస్తుతం పెంచుతున్నవారు వాటిని ఎవరికీ ఇవ్వడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది.

కానీ, ఈ సరీసృపాలు, ప్రజల సంక్షేమం కోసం తాము ఆందోళన చెంది ఈ ప్రతిపాదనలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు విపక్ష కంట్రీ లిబరల్ పార్టీ మాత్రం వీటిని పెంచుకోవడంపై ఆంక్షలు పెట్టబోమని పేర్కొంది.

తాము గెలిస్తే మొసళ్లను పెంచుకోకూడదు అన్న నిర్ణయంపై సమీక్షిస్తామని, వాటిని పెంచుకోవడానికి అనుమతించేలా కృషి చేస్తామని అంతకు ముందే ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికల్లో ఆ పార్టీయే విజయం సాధించింది.

మొసలి, ఉప్పునీటి మొసళ్లు,ఆస్ట్రేలియా, ఎన్నికలు, నార్త్ టెర్రిటరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొసలి

అసలు నిబంధనలేంటి?

రెండున్నర లక్షలమంది జనాభా ఉన్న నార్తర్న్ టెరిటరీ (ఎన్‌టీ)లో కొద్దిమంది దగ్గరే మొసళ్లు ఉన్నాయి.

ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న తాము ఎన్ని పెంపకం మొసళ్లు ఉన్నాయనే లెక్కలను ఇవ్వలేమని ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది.

అయితే, వీటిని పెంచుకునే అనుమతి పొందినవారు సుమారు 100 మంది ఉంటారని అంతకుముందు అంచనాలు చెప్పాయి.

ఏ పరిస్థితుల్లో, ఎక్కడ ఈ జంతువులను పెంచుకోవచ్చనే విషయంలో కఠినమైన నిబంధనలున్నాయి.

ఉదాహరణకు....పుట్టిన మొసళ్లు, 60 సెంటిమీటర్లు పెరిగేంత వరకు పట్టణ ప్రాంతాల్లో ఉండొచ్చు. అప్పటికి అవి ఏడాది వయసుకు వస్తాయి. ఆ తర్వాత వీటిని అధికారులకు అప్పజెప్పాలి లేదా పట్టణ ప్రాంతాల నుంచి బయటికి తీసుకురావాలి. సిటీ లిమిట్స్ వెలుపల ఉన్న మొసళ్ల ఫామ్‌కు తరలించాలి.

నిబంధనల కింద, వీటి యజమానులకు ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేదా పరిజ్ఞానం అవసరం లేదు.

మొసలి, ఉప్పునీటి మొసళ్లు,ఆస్ట్రేలియా, ఎన్నికలు, నార్త్ టెర్రిటరీ, మొసళ్ల ఫోటోగ్రఫీ, ఫోటోలు

ఫొటో సోర్స్, Tom Hayes

ఫొటో క్యాప్షన్, హేస్ ఒక మొసళ్ల ఫోటోగ్రఫీ ఖాతాను నడుపుతున్నారు.

మొసళ్లను చెరలో ఉంచడం ఎంత వరకు సమంజసం?

టామ్ హేస్ అనే వ్యక్తి ఒక పెద్ద మొసలిని దత్తత తీసుకునే ప్రయత్నంలో ఉండగా, ఈ మారిన నిబంధనల వ్యవహారం తెలిసింది. ఇది హేస్‌కు తీవ్ర నిరాశను కలిగించింది.

ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత, వ్యక్తుల భద్రత, జంతువుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని నార్తర్న్ టెరిటరీ పర్యావరణ శాఖ మంత్రి కేట్ వార్డెన్ చెప్పారు.

‘‘ఇది చాలా పెద్ద జంతువు. అందుకే వాటిని చెరలో బంధించి ఉంచడం సరైంది కాదన్నది మనం గుర్తుంచుకోవాలి.’’ అని రిపోర్టర్లతో ఆమె అన్నారు.

ఈ ప్రాంతంలో మొసళ్లు తమ యజమానులపై దాడి చేసిన కేసులు నమోదైనట్లు ఆమె గుర్తు చేశారు.

నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న జంతు ప్రేమికులకు ఇది అతిపెద్ద విజయం.

మొసళ్లను పెంచుకునే వారికి మంచి ఉద్దేశ్యాలున్నప్పటికీ, ఏ వన్య ప్రాణి కూడా తన అవసరాలను బందిఖానాలో ఉండగా తీర్చుకోలేదని వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ సంస్థకు చెందిన ఒలివియా చార్లటన్ అన్నారు.

"ఈ మొసళ్లకు అడవిలో ఉండేంత స్థలం, స్వేచ్ఛ మరెక్కడా ఉండదు." అని ఒక ప్రకటనలో తెలిపారు చార్లటన్.

మొసళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిబంధనల్లో మార్పు జంతు ప్రేమికులకు అతిపెద్ద విజయం.

అయితే ఈ మార్పు వచ్చినట్లు తమకు తెలియదని, తమ పెంపుడు జంతువులకు ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నామని మొసళ్ల యజమానులు అంటున్నారు.

మొసళ్ల నిర్వహణ ప్రణాళికలో చేపట్టిన మార్పులను ప్రభుత్వం దాచిపెట్టిందని వారు ఆరోపించారు.

మొసళ్లను పెంచుకోవడం చాలా సులభమని, అలా చేయడం ప్రమాదకరమనే వాదనలను సులివాన్ తిప్పికొట్టారు.

"అడవిలో అవి కొంత భాగాన్ని వాటి నివాస స్థలంగా చేసుకుంటాయి. అక్కడ నివసించేందుకు నిరంతరం పోరాటం చేస్తాయి. ఆహారం కోసం నిత్యం వేటాడాలి. శత్రువులను తరమాలి. వాటి పార్టనర్లను కాపాడాలి. మొసళ్లకు ఇన్ని సవాళ్లతో కూడిన జీవితం ఉంటుంది.’’ అని ఆయన అన్నారు.

"అదే సంరక్షణలో అనువైన స్థలం, పుష్కలంగా నీరు, సూర్యకాంతి, నీడ, ఆహారం లభిస్తాయి. వాటికి అంతకంటే కావాల్సింది ఏముంది." అని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి ఎవా లాలర్, ప్రతిపక్ష నేత లియా ఫినోచియారో

ఫొటో సోర్స్, Getty Images

మొసళ్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ట్రెవర్‌కు బాధ కలిగించింది. ఒక దశలో తన ఇంటిని, జూను అమ్మేయాలనుకున్నారు. న్యూజీలాండ్ వెళ్లి స్థిరపడాలనుకున్నారు.

కానీ, నిబంధనల్లో ప్రస్తుతం తీసుకురానున్న మార్పులతో తన నిర్ణయం సందిగ్ధంలో పడింది.

‘‘మన దగ్గర 80 ఎకరాల స్థలం, 11 మొసళ్లు ఉండి, వాటిని ఇతరులకు ఇవ్వడానికి అనుమతులు లేకపోతే ఎలా?’’ అని ట్రెవర్ ప్రశ్నిస్తున్నారు.

‘‘నేను వాటిని వదిలేసి వెళ్లిపోవడమో, చంపేయడమో చేయలేను. నేను చనిపోయేంత వరకు లేదంటే నిబంధనల్లో ఏదో ఒక మార్పు వచ్చే వరకు నా 80 ఎకరాల ఫామ్‌లోనే ఉంటా.’’ అన్నారు ట్రెవర్.

( బీబీసీ కోసం కలెక్టివ్‌ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)