మారుతీనగర్ సుబ్రమణ్యం రివ్యూ: పనీపాటా లేని భర్తగా రావు రమేష్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారా?

మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ

ఫొటో సోర్స్, YT/Mythri Movie Makers

ఫొటో క్యాప్షన్, మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాలో రావు రమేష్‌దే ప్రధాన పాత్ర
    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

హీరో అంటే ఇలానే ఉండాలి అనే మార్కును చెరిపేస్తూ, దమ్మున్న కథతో ప్రేక్షకులను మెప్పించిన చిన్న సినిమాలు ఇప్పుడు హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా అదే పంథాలో, రావు రమేష్ ప్రధాన పాత్రగా వచ్చిన సినిమానే ‘మారుతీనగర్ సుబ్రమణ్యం.’

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌‌గా, కమెడియన్‌గా ఇప్పటి వరకు తన ‘వెటకారపు మేనరిజం’తో ఒక ముద్రను సొంతం చేసుకున్న రావు రమేష్‌ను రెండున్నర గంటలకు పైగా స్క్రీన్ మీద ‘సుబ్రమణ్యం’గా కొత్త అవతారంలో చూపించిన సినిమా ఇది.

బీబీసీ న్యూస్ తెలుగు

కథేంటంటే..

చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగమే కలగా బతికిన సుబ్రమణ్యం చేతికి పోస్టింగ్ వచ్చినా, అది కోర్టు స్టే ఆర్డర్ వల్ల ఆగిపోతుంది. ఆ ప్రభుత్వ ఉద్యోగం ఎప్పటికైనా వస్తుందనే ఆశతో సుబ్రమణ్యం ఏ ఉద్యోగం చేయకుండా 25 ఏళ్ళు గడిపేస్తాడు.

ఈ పరిస్థితిలో ఎప్పుడూ చేతిలో పట్టుమని పది రూపాయలు కూడా ఉండని సుబ్రమణ్యానికి, తన బ్యాంకు ఖాతాలోకి పది లక్షల రూపాయలు ఎలా వచ్చాయి? దానితో అతనికి వచ్చిన కష్టాలేమిటి? మధ్యతరగతి జీవితాల్లో భర్త ఉద్యోగం చేయకుండా ఉంటే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? చివరకు అతనికి ఉద్యోగం వచ్చిందా?లేదా అన్నదే కథ.

కథ మేరకు రావు రమేష్ సుబ్రమణ్యం పాత్రలో అద్భుతంగా నటించారు. కానీ, సుబ్రమణ్యం పాత్ర డిజైన్‌లో వైవిధ్యం లేకపోవడంతో రావు రమేష్ తప్ప ప్రేక్షకులకు ‘సుబ్రమణ్యం’ కనిపించడు.

మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ

ఫొటో సోర్స్, YT/Mythri Movie Makers

ఫొటో క్యాప్షన్, ఇంద్రజ

బాధ్యత గల భార్యగా కళారాణి పాత్రలో ఇంద్రజ మంచి నటన కనపరిచారు. కానీ ‘సుబ్రమణ్యం-కళారాణి’ మధ్య కెమిస్ట్రీ, బాండింగ్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. క్యారెక్టరైజేషన్‌లోనే ఉన్న లోపంతోపాటు సుబ్రమణ్యంతో కాంబినేషన్ సన్నివేశాలు ఎక్కువగా లేకపోవడం వల్ల కళారాణి పాత్ర కొన్నిసార్లు తేలిపోయింది.

సుబ్రమణ్యం కొడుకుగా చేసిన అంకిత్ కొయ్య చాలా బాగా నటించారు. ‘రావు రమేష్-అంకిత్’ కాంబినేషన్‌లో ఉన్న కామెడీ ఈ సినిమాకు గొప్ప అసెట్. ఎక్కడా అతిలేకుండా, సహజంగా క్లీన్‌గా నటించారు. అంకిత్ లవర్ పాత్రలో రమ్య, స్క్రీన్ టైమ్ తక్కువే అయినా కృష్ణవేణి పాత్రలో అన్నపూర్ణమ్మ బాగానే నటించారు.

మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ

ఫొటో సోర్స్, YT/Mythri Movie Makers

ఫొటో క్యాప్షన్, తండ్రీ కొడుకులుగా రావు రమేష్, అంకిత్ కొయ్య చక్కగా నటించారు

కథను కామెడీ ఓవర్‌టేక్ చేసిందా?

కథ కన్నా కామెడికే ఎక్కువ స్పేస్ ఉన్న సినిమా ఇది. సినిమాలో ఇంటర్వెల్ దగ్గర కథ మలుపులు తిరిగినట్టు అనిపించినా, మళ్లీ సెకండ్ హాఫ్‌లో కథను కామెడీ ఓవర్ టేక్ చేస్తుంది.

సుబ్రమణ్యం, అతని కొడుకు మధ్య కామెడీ కెమిస్ట్రీ బావుండటం వల్ల ఎక్కడా బోర్ కొట్టనప్పటికీ కథకు బలంగా ఉండాల్సిన ఎలిమెంట్స్‌ను కామెడీ ట్రాక్ ఆక్రమించినట్టు అనిపిస్తుంది.

తానేదో ధనవంతుడి కొడుకుగా పుడితే, తనకు కష్టం విలువ తెలియాలని తల్లిదండ్రులు తనను సుబ్రమణ్యం దంపతులకు ఇచ్చారని పిచ్చి కలల్లో ఉండే కొడుకు.. ఆ తండ్రిని కాసేపు దెప్పిపొడిచే అత్తగారు.. ఇలాంటి పాత్రల మధ్య బాధ్యతల గురించి ఆలోచించే సుబ్రమణ్యం భార్య కళారాణి .. వీటికి తోడు సుబ్రమణ్యం కొడుకు ప్రేమ-పెళ్లి.. ఇలా కథ నడుస్తుంది.

మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ

ఫొటో సోర్స్, YT/Mythri Movie Makers

ఉద్యోగం చేయకుండా భార్య మీద ఆధారపడే భర్త పాత్రగా మాత్రమే ఈ సినిమాలో ‘సుబ్రమణ్యం’ మిగిలిపోతాడు. కథ మొత్తంలో ఎక్కడా కూడా కుటుంబ బాధ్యతల గురించి కానీ, తన పరిస్థితి గురించి కానీ ఆలోచించే సందర్భం ఉండదు. అలా గాలివాటుకు కొట్టుకుపోయే పాత్రగా మాత్రమే సుబ్రమణ్యం పరిమితమైపోతాడు.

ముగింపు సుఖాంతమే అయినా , ఆ ముగింపు ఎటువంటి సంఘర్షణ లేకుండా జరిగిపోతుంది. అందుకే ‘సుబ్రమణ్యం’ పాత్ర తేలిపోయిన భావన కలుగుతుంది.

రావు రమేష్ మిగిలిన సినిమాల్లో నటనకు, ప్రధాన పాత్రగా చేసిన ఈ సినిమాలో నటనకు మధ్య తేడా ఏమీ ఉన్నట్టు అనిపించదు. ఆ వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్ పాయింట్.

రావు రమేష్ స్క్రీన్ అపీల్, వెటకారపు మేనరిజం వల్ల సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నా, కథాపరంగా ఈ సినిమా బలహీనంగా ఉందనే చెప్పొచ్చు.

సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బావున్నాయి. పాటలు ఫర్వాలేదనిపించాయి.

మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ

ఫొటో సోర్స్, YT/Mythri Movie Makers

ఫొటో క్యాప్షన్, సినిమా ఆద్యంతం రావు రమేష్ నటన ఆకట్టుకుంటుంది.

దర్శకత్వం ఎలా ఉంది?

లక్ష్మణ్ కార్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఒకే రకం సినిమా ఫార్ములా నుంచి కొంత విభిన్నంగా కథను ఎన్నుకున్నారు లక్ష్మణ్. తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్స్, మధ్యతరగతి జీవితాల్లో డబ్బు సృష్టించే అలజడులు, ఆర్థిక సంబంధాల గురించి పరోక్షంగా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించారనే చెప్పవచ్చు.

కానీ కథ-స్క్రీన్ ప్లే, సుబ్రమణ్యం క్యారెక్టర్ ఇంకా బలంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే సుబ్రమణ్యం మధ్యతరగతి మనుషులకు ఐకానిక్ పాత్రగా నిలిచిపోయేది. కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ మూడు నాలుగు చోట్ల పడినా అవి పెద్దగా ఆకట్టుకోలేదు.

సినిమా సక్సెస్ అవ్వడానికి కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరమే. ఈ ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమాలో అలాంటివి అతిగా లేకుండా జాగ్రత్త తీసుకున్నారు.

మొత్తంమీద ఇది క్లీన్ అండ్ నీట్ సినిమా.

హర్షవర్థన్, రమ్య

ఫొటో సోర్స్, YT/Mythri Movie Makers

ప్లస్‌లు.. మైనస్‌లు..

ప్లస్ పాయింట్స్:

1)రావు రమేష్ -అంకిత్ కొయ్య కాంబినేషన్ సన్నివేశాలు

2)రావు రమేష్ మేనరిజపు మార్క్

3)సినిమాటోగ్రఫీ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్

4)ప్రీ ఇంటర్వెల్ , సెకండాఫ్‌‌, ప్రీ క్లైమాక్స్‌లలో ఉండే మలుపులు

మైనస్ పాయింట్స్:

1)కథలో కొత్తదనం ఉండేలా ప్రెజెంట్ చేయకపోవడం

2)సుబ్రమణ్యం క్యారెక్టర్ రొటీన్‌గా ఉండటం

3)ఎస్టాబ్లిషింగ్ సీన్స్,ఎమోషనల్ సీన్స్ బలంగా లేకపోవడం

4)కామెడీ ట్రాక్ కథను ఆక్రమించడం

కథలో కామెడీ భాగమవ్వడం కన్నా, ‘కామెడీ ట్రాక్’ను కథగా చేసి నడిపించిన సినిమా ఇది.

(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)