2,492 క్యారెట్ల వజ్రం దొరికింది.. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద డైమండ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫారోక్ చోటియా
- హోదా, బీబీసీ న్యూస్
బోట్స్‌వానాలోని ఓ వజ్రాల గనిలో 2,492 క్యారెట్ల ముడి వజ్రం లభించింది. ప్రపంచంలో అతి పెద్ద వజ్రాలలో ఇది రెండోదని ప్రకటించారు.
కెనడాకు చెందిన లుకారా డైమండ్ కంపెనీకి బోట్స్‌వానాలో వజ్రాల గని ఉంది. ఆ గనిలోనే ఈ భారీ వజ్రం లభ్యమైంది.
1905లో దక్షిణాఫ్రికాలో 3,106 క్యారెట్ల కులినాన్ డైమండ్ ఇప్పటివరకు అతి పెద్ద వజ్రంగా రికార్డుల్లో ఉంది. ఆ వజ్రాన్ని 9 ముక్కలు చేశారు. అందులో కొన్ని బ్రిటన్ రాజకిరీటంలో ఉన్నాయి.
ఇప్పుడిది ఆ కులినాన్ డైమండ్ తరువాత రెండో స్థానంలో ఉంది.
బోట్స్‌వానా రాజధానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోవీ గనిలో 2,492 క్యారెట్ల వజ్రం దొరికింది.
తమ దేశంలో ఇప్పటివరకు దొరికిన వజ్రాలలో అతి పెద్దది ఇదేనని బోట్స్‌వానా ప్రభుత్వం ప్రకటించింది.


ఫొటో సోర్స్, Lucara Diamond
కాగా బోట్స్‌వానాలో ఇంతకుముందు 2019లో 1,758 క్యారెట్ల వజ్రం ఒకటి దొరికింది. ఆ వజ్రం కూడా కరోవీ గనిలోనే లభ్యమైంది.
ప్రపంచంలో వజ్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలలో బోట్స్‌వానా ఒకటి. ప్రపంచ వజ్రాల ఉత్పత్తిలో బోట్స్‌వానాది 20 శాతం వాటా.
మరోవైపు గని యాజమాన్య కంపెనీ లుకారా కూడా దీనిపై ప్రకటన చేసింది. ఇప్పటివరకు వెలికితీసిన అతి పెద్ద వజ్రాలలో ఇదొకటి అని ఆ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
మెగా డైమండ్ రికవరీ ఎక్స్‌రే టెక్నాలజీ
ఈ వజ్రాన్ని లుకారా కంపెనీకి చెందిన ‘మెగా డైమండ్ రికవరీ ఎక్స్‌రే టెక్నాలజీ’ సాయంతో గుర్తించినట్లు సంస్థ హెడ్ విలియం లాంబ్ చెప్పారు.
2017 నుంచి ఈ టెక్నాలజీ వాడుతున్నామని.. ఈ టెక్నాలజీ వల్ల వజ్రాలను గుర్తించడంతో పాటు వాటిని విరిగిపోకుండా వెలికితీయడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
అయితే, తాజాగా తవ్వితీసిన భారీ వజ్రం నాణ్యత గురించి కంపెనీ ఏమీ చెప్పలేదు.
కాగా 2019లో ఈ గనిలో తవ్వితీసిన 1,758 క్యారెట్ల వజ్రాన్ని అప్పట్లో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ లూయీ విటన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
అలాగే, 2016లో ఇక్కడ దొరికిన 1,109 క్యారెట్ల వజ్రాన్ని లండన్‌కు చెందిన నగల వ్యాపారి, గ్రాఫ్ డైమండ్స్ చైర్మన్ లారెన్స్ గ్రాఫ్ 5.3 కోట్ల డాలర్లకు(ప్రస్తుత విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో సుమారు రూ. 444 కోట్లు) కొనుగోలు చేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














