లూలో రోజ్: ఇంత పెద్ద పింక్ డైమండ్ గత 300 ఏళ్లలో ఎక్కడా దొరకలేదు

ఫొటో సోర్స్, LUCAPA DIAMOND CO.
ఆఫ్రికా దక్షిణ భాగంలోని అంగోలాలో అరుదైన గులాబీ వజ్రం దొరికింది. బుధవారం గనుల తవ్వకాల్లో ఈ వజ్రం బయటపడినట్లు సమాచారం. దీని బరువు 34 గ్రాములు. గత 300 ఏళ్లల్లో దొరికిన అతిపెద్ద గులాబీ వజ్రం ఇదేనని చెబుతున్నారు.
170 క్యారెట్ల ఈ వజ్రానికి లూలో రోజ్ అని పేరు పెట్టారు.
185 క్యారెట్ల 'దరియా-ఇ-నూర్' గులాబీ వజ్రం తరువాత గనుల తవ్వకాల్లో లభించిన అతిపెద్ద గులాబీ వజ్రం ఇదేనని అంటున్నారు. దరియా-ఇ-నూర్ వజ్రాన్ని భారతదేశంలో కనుగొన్నారు. దీన్ని ఇంకా పెద్ద రాయి నుంచి తవ్వి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అది ఇరానియన్ కిరీటంలోని రత్నాల్లో భాగంగా ఉంది.
లూలో రోజ్ 'టైప్ 2ఏ' వజ్రం. అంటే అతి తక్కువ మలినాలు గలది అని అర్థం.
"ప్రపంచంలో అంగోలా వజ్రాల గుట్ట అని లూలోలో బయటపడ్డ ఈ అద్భుతమైన గులాబీ వజ్రం నిరూపిస్తోంది" అని అంగోలా ఖనిజ వనరుల మంత్రి డైమంటినో అజెవెడో అన్నారు.
లులో గని నుంచి లభించిన అయిదవ అతిపెద్ద వజ్రం ఇది. ఈ గనుల తవ్వకం ఆస్ట్రేలియాకు చెందిన లుకాపా డైమండ్ కంపెనీ, అంగోలా ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్.

ఫొటో సోర్స్, Getty Images
దీని ఖరీదు ఎంత?
లూలో రోజ్ లాంటి అరుదైన వజ్రాలు గతంలో లక్షల కోట్లకు అమ్ముడయ్యాయి. 2017లో పింక్ స్టార్ అనే వజ్రం హాంగ్‌కాంగ్‌లోని ఒక వేలంలో 71.2 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 567 కోట్లు) అమ్ముడైంది.
అయితే, లూలో రోజ్‌ను సానబెట్టేవరకు దాని విలువను అంచనా వేయలేమని జ్యువెలరీ స్పెషలిస్ట్ జోవన్నా హార్డీ అన్నారు.
గులాబీ వజ్రాలు చాలా అరుదు. వీటి భౌతిక లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందువల్లే ఈ వజ్రాలను ఒక ఆకృతిలో పొదగడం చాలా కష్టం.
ఈ వజ్రం పబ్లిక్‌లోని రాకపోవచ్చనని, బహిరంగంగా వేలం వేసే అవకాశాలు కూడా తక్కువని హార్డీ అన్నారు. ఇలాంటి అరుదైన వజ్రాలను కైవసం చేసుకునేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటారని చెప్పారు.
ప్రపంచంలోని అతిపెద్ద గులాబీ వజ్రం దరియా-ఇ-నూర్. రంగుతో సంబంధం లేకుండా ప్రపంచంలో లభ్యమైన అతిపెద్ద కఠినమైన వజ్రం 'కుల్లినాన్ వజ్రం'. దీన్ని 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. దీని బరువు 3,107 క్యారట్లు. అంటే అర కిలో కన్నా ఎక్కువ. కుల్లినాన్ వజ్రాన్ని 105 వేర్వేరు వజ్రపు తునకలుగా కట్ చేశారు.
వీటిల్లో అతిపెద్ద ముక్క 'కుల్లినాన్ I' ఇంగ్లండ్ రాచరికపు కిరీటాల్లో భాగం. ప్రపంచంలో సానబెట్టిన వజ్రాల్లో ఇదే అతిపెద్దది.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- టెంపెస్ట్: పైలట్ మెదడును చదివేసే విమానం
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










