టెంపెస్ట్: పైలట్ మెదడును చదివేసే విమానం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మైఖెల్ డింప్సీ
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సూపర్‌మెరైన్ స్పిట్‌ఫైర్ విమానాలు పైలట్‌లను ఆశ్చర్యానికి గురిచేసేవి. చిన్నచిన్న మార్పులకు కూడా ఇవి స్పందిస్తూ సమాచారాన్ని అందించేవి. అవి తమ అవయవాల్లానే పనిచేసేవని వీటిని నడిపిన పైలట్లు కూడా చెప్పారు.
అయితే, 2030లో వీటికి మించి పైలట్‌తో మరింత అనుసంధానమయ్యే విమానాలు రాబోతున్నాయి. ఇవి పైలట్‌ల మెదడును కూడా చదివేయబోతున్నాయి.
‘‘టెంపెస్ట్’’గా పిలుస్తున్న ఈ విమానాలను బ్రిటన్‌కు చెందిన బీఏఈ సిస్టమ్స్, రోల్స్-రాయిస్, యూరోపియన్ మిసైల్స్ గ్రూప్ ఎండీబీఏ, ఇటలీకి చెందిన లియోనార్డో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.
పైలట్‌లు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు లేదా విపత్కర పరిస్థితుల్లో సాయం చేసేలా ఈ విమానాల్లో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను సిద్ధం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఎలా పనిచేస్తుంది?
మొదటగా పైలట్ హెల్మెట్‌లో సెన్సర్‌లు ఏర్పాటుచేస్తారు. ఇవి మెదడు సంకేతాలతోపాటు ఇతర ఆరోగ్య సమాచారాన్ని నిత్యం సేకరిస్తుంటాయి. దీంతో రోజులు గడిచేకొద్దీ భారీ మొత్తంలో బయోమెట్రిక్, సైకోమెట్రిక్ డేటా సిద్ధం అవుతుంది. ఈ డేటాబేస్ ఆధారంగానే ఏఐ చర్యలు తీసుకుంటుంది.
పైలట్‌కు ఎప్పుడు సాయం అవసరం అవుతుంది? ఎప్పుడు జోక్యం చేసుకోవాలి లాంటి అంశాలను ఈ డేటా సాయంతో ఏఐ విశ్లేషిస్తుంది.
ఉదాహరణకు గురుత్వాకర్షణ శక్తి పెరగడంతో పైలట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతే వెంటనే విమానాన్ని ఏఐ తన నియంత్రణలోకి తీసుకుంటుంది.
2027నాటికి ఈ విమానాన్ని ఎగురవేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఫర్న్‌బరో ఎయిర్‌షోలో బీఏఈ సిస్టమ్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన టెక్నాలజీలను లాంకషైర్‌లోని తమ ప్లాంట్‌లో పరీక్షించబోతున్నట్లు తెలిపింది.
ఈ విమానంలో దాదాపు 60 భిన్నమైన కొత్త టెక్నాలజీలను పరీక్షించబోతున్నారు. వీటిలో కొన్ని పూర్తిగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2018లో తొలిసారిగా..
టెంపెస్ట్ విమానం తొలి చిత్రాలను 2018లోనే విడుదల చేశారు. అయితే, ప్రస్తుతం దీనిలో చాలా మార్పులు చేశారు. దీని బరువు కూడా తగ్గించారు. పరిమాణం కూడా కాస్త చిన్నదైంది.
ఇది గాల్లో ఎగిరేటప్పుడు దీనితోపాటుగా పక్కనే మానవ రహిత డ్రోన్లు కూడా ఎగరేయాల్సి ఉంటుందని టెంపెస్ట్ కన్షార్షియమ్ వెల్లడించింది.
ఇలాంటి అధునాత టెక్నాలజీల మానిటరింగ్, కంట్రోల్‌లకు సరికొత్త వ్యవస్థలు అవసరం అవుతాయి. వీటిని కొత్తగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
‘‘టెక్నాలజీలో వస్తున్న మార్పులను మనం అందిపుచ్చుకోవాలి’’అని టెంపెస్ట్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టన్ జాన్ స్టాకర్ చెప్పారు.
‘‘ఇదివరకు రక్షణ రంగంపై పెట్టే పెట్టుబడుల వల్ల రక్షణ పరిజ్ఞానం చాలా వేగంగా అభివృద్ధి అయ్యేది. వాణిజ్య పరమైన సాంకేతికతలు కాస్త ఆలస్యంగా వచ్చేవి. కానీ, ఇప్పుడు వాణిజ్య పరమైన సాంకేతికతలే ముందుంటున్నాయి’’అని ఆయన అన్నారు.
స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నంత తేలిగ్గా అప్‌గ్రేడ్ చేసుకోగలిగే టెక్నాలజీలతో ఈ విమానాన్ని తయారుచేస్తున్నామని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆటోమేషన్‌తోనే
ఈ విమానంలో చాలావరకు తయారీ ప్రక్రియలు ఆటోమేషన్ ద్వారానే పూర్తిచేస్తారు. దీనికి సంబంధించిన డేటాను సప్లయిర్స్‌తో తయారీ సంస్థలు షేర్ చేస్తాయి. దీంతో వేగంగా విడి భాగాలు అభివృద్ధి చేసేందుకు వీలుపడుతుంది.
మరోవైపు టెంపెస్ట్ తరహాలోనే జపాన్‌కు చెంది మిత్సుబిషి సంస్థ బిత్సుబిషి ఎఫ్-ఎక్స్ ప్రాజెక్టు చేపడుతోంది. దీనిలో కూడా బీఏఈ సిస్టమ్స్, లియోనార్డో కలిసి పనిచేస్తున్నాయి.
యూరోపియన్ ఏరోస్పేస్ బిజినెస్‌లో ఇది ఒక కొత్త సాంకేతికత లాంటిది. అయితే, ఇది డిజిటల్ ప్రాజెక్టు కావడంతో జపాన్ కూడా పాలుపంచుకునేందుకు వీలు పడుతోంది.
‘‘డిజిటల్ ఎన్విరాన్‌మెంట్‌లో మనం చాలా చేయొచ్చు. ఇతర సంస్థలతో కలిసి పనిచేయడం కూడా చాలా తేలిక. ఎందుకంటే మనం టోక్యో, వార్టన్‌ల మధ్య ఎలాంటి బ్రీఫ్‌కేస్‌లను అటూఇటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు’’అంటూ స్టాకర్ చమత్కరించారు.
ఇంగ్లిష్‌తోపాటు జపనీస్‌లోనూ అనర్గళంగా మాట్లడే అనువాదకులను కూడా ఈ ప్రాజెక్టు కోసం నియమించుకున్నారు.
లియోనార్డోకు చెందిన రాడార్ విభాగం కూడా ప్రస్తుతం మిత్సుబిషితో కలిసి పనిచేస్తోంది.
ఈ రాడార్ల సాయంతో ముందు ఏం ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఇవి రోటేట్ అవుతున్న డిష్‌లలా పనిచేస్తూ సెన్సర్‌ల సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు ఉపయోగపడతాయి.
అయితే, సెన్సర్‌లు మరింత వేగంగా పనిచేస్తాయి. దీంతో ఈ సమాచారాన్ని విశ్లేషించేందుకు కొన్నిసార్లు మానవ మెదడుకు కష్టం అవుతుంటుంది. అలాంటి సమయాల్లో ఏఐ మెరుగ్గా పనిచేయగలదు.
టెంపెస్ట్‌లో అభివృద్ధి చేస్తున్న ఏఐ గేట్‌కీపర్‌లా పనిచేస్తుంది. ముఖ్యంగా పైలట్ మీద కుప్పలు తెప్పలుగా సమాచారం పడినప్పుడు ఇది సాయం చేయగలదు.
టెంపెస్ట్ నుంచి క్షిపణులు కూడా ప్రయోగించొచ్చు. అయితే, ఇవి మరింత మెరుగ్గా లక్ష్యాలను చేరుకునేందుకు, వేగంగా దిశలను మార్చుకునేందుకు ప్రధాన విమానానికి పక్కన ఎగిరే డ్రోన్లకు వీటి బాధ్యతలను అప్పగించే వీలుంది.
ఈ విమానం పనిచేసేందుకు కొత్త ఇంజిన్లు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. టెంపెస్ట్ ఇంజిన్లతోపాటు డిజిటల్ వ్యవస్థ మొత్తానికి పవర్ అందించేందుకు రోల్స్-రాయిస్ పనిచేస్తోంది. డిజిటల్ వ్యవస్థల వల్ల ఈ విమానం త్వరగా వేడెక్కే అవకాశం ఉంటుంది.
ఆ వేడిని ఎలా తగ్గించాలనే అంశంపై రోల్స్-రాయిస్ ఇంజినీర్లు దృష్టి పెడుతున్నారు.
‘‘మొత్తం అన్ని వ్యవస్థలకూ సరిపడా విద్యుత్‌ను అందించే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం’’అని రోల్స్-రాయిస్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ జాన్ వార్డెల్ చెప్పారు.
టెంపెస్ట్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రెండు బిలియన్ పౌండ్లు (రూ.19,125 కోట్లు) అందిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మరిన్ని నిధులు కూడా వెచ్చించే అవకాశముంది. అయితే, ప్రస్తుతం మెరుగ్గా పనిచేస్తున్న టైఫూన్ ఫైటర్ జెట్‌లను మరిన్ని ఎందుకు తయారుచేయకూడదు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
దీనిపై బీఏఈ సిస్టమ్స్ స్పందిస్తూ.. 2040నాటికి ప్రపంచ దేశాలకు కొత్తరకమైన ముప్పులు వస్తాయని, వీటిని అడ్డుకునేందుకు మరింత మెరుగైన సాంకేతికత అవసరమని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- 5జీ స్పెక్ట్రమ్ వేలం: 4జీ ఫోన్లు ఇక పనిచేయవా
- ఆస్ట్రేలియా చెఫ్‌ల పోటీలో మెరిసిన భారతీయ వంటకాలు.. బిరియానీ గెలిపించిందా?
- లక్షలాది మంది భారతీయులు ఎందుకు భారత పౌరసత్వం వదులుకుంటున్నారు?
- చెన్నై వాటర్‌మ్యాన్: ఆయన నల్లా తీసుకోరు... నీళ్ళు కొనుక్కోరు
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














