5జీ సేవల ప్రారంభం: ఇక 4జీ మనుగడ ఎలా ఉండనుంది

5జీ స్పెక్ట్రమ్ వేలం

ఫొటో సోర్స్, AVISHEK DAS/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY IMAG

    • రచయిత, శుభమ్ కిశోర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇండియాలో 5జీ సేవలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు.

దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్-2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ అనంతరం 5జీ సేవలను ప్రారంభించారు.

అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన 5జీ సేవలకు సంబంధించిన ప్రదర్శను మోదీ వీక్షించారు.

5జీ సామర్థ్యాన్ని డెమొ ప్రదర్శన ద్వారా మోదీకి జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ వివరించారు.

Narendra Modi

ఫొటో సోర్స్, ANI

మొదటి దశలో 13 నగరాలలో..

ఈ 5జీ సేవలు తొలి విడతలో 13 నగరాలలో ప్రారంభమవుతున్నాయి. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.

తొలి దశలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, గుర్‌గావ్, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, జామ్‌నగర్, పుణె, ముంబయిలలో అందుబాటులోకి తెస్తారు.

వీటిలో కొన్ని నగరాలలో శనివారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

జులైలో స్పెక్ట్రమ్ వేలం

ఇండియాలో 5జీ నెట్‌వర్క్ కోసం స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాది జులైలో నిర్వహించారు.

ఆ వేలంలో జియోలో రూ. 88,078 కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. ఎయిర్‌టెల్ రూ. 43 వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కొనుగోలు చేశాయి.

అసలు స్పెక్ట్రం అంటే ఏమిటి, అది ప్రజల రోజువారి కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తుంది? 5జీ వచ్చాక 4జీ మనుగడ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం...

ఐఐటీ రోపార్‌కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సుదీప్త మిశ్రా 5జీ గురించి ‘బీబీసీ’కి వివరించారు.

"ఇంతకు ముందు మనం రేడియోను ఉపయోగించేవాళ్లం. అందులో ఏఎం, మీడియం వేవ్, ఎఫ్ఎం అని ఉండేవి. ధ్వని ఎన్ని మెగాహెర్ట్జ్ లేదా కిలోహెర్ట్జ్‌లలో ప్రసారం చేయగలరో ఇది సూచిస్తుంది. ఈ మేరకే రకరకాల ఫ్రీక్వెన్సీలలో భిన్నమైన విషయాలను వినే అవకాశం ఉండేది'' అన్నారు.

అదే విధంగా 2జీ, 3జీ, 4జీ, 5జీలకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. స్పెక్ట్రమ్ అనేది మొబైల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీల శ్రేణి.

ఏదైనా నెట్‌వర్క్‌ను వివిధ స్పెక్ట్రమ్ బ్యాండ్‌లుగా విభజిస్తారు. 5జీ నెట్‌వర్క్‌ల విషయంలోనూ అదే విధంగా ఉంటుంది. ఇందులో లో బ్యాండ్, హై బ్యాండ్, మిడ్ బ్యాండ్‌లు ఉంటాయి.

ఈసారి ప్రభుత్వం 72 GHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది. ఇందులో లోబ్యాండ్‌లో (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మిడ్ బ్యాండ్‌లో (3300 MHz), హై బ్యాండ్‌లో 26 GHz ఉంటుంది.

జూన్‌లో ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో, "5జీ టెక్నాలజీ ఆధారంగా టెలికం కంపెనీలు మిడ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తాయని అంచనా వేస్తున్నాం. దీని వేగం 4జీ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది." అని పేర్కొంది.

5జీ స్పెక్ట్రమ్ వేలం

ఫొటో సోర్స్, AVISHEK DAS/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY IMA

ప్రజలకు ప్రయోజనం ఏంటి?

5జీ అనేది పేరుకు తగ్గట్టుగానే మొబైల్ నెట్‌వర్క్‌లలో ఐదవ జనరేషన్ నెట్‌వర్క్. ఇవి మెరుగైన ఫ్రీక్వెన్సీలో పని చేస్తుంది కాబట్టి అప్‌లోడ్, డౌన్‌లోడ్‌ల వేగం పెరుగుతుందని భావిస్తున్నారు.

"3జీ నుండి 4జీ వచ్చే వరకు డేటా వేగం బాగా పెరిగిందని మీరు గమనింవచ్చు. ఆ తర్వాత ఆపరేటర్‌కు ఖర్చు తగ్గింది. దీని వలన డేటా చౌకగా మారింది. ఇప్పుడు వాళ్లు అనేక ఇతర సేవలను కూడా అందిస్తున్నారు. 5జీ వల్ల ఇంకా మరికొన్ని సర్వీసులు, మ్యాపింగ్ అప్లికేషన్‌లు మెరుగవుతాయి" అని సుదీప్త మిశ్రా అన్నారు.

భారతదేశంలోని మొబైల్ ఫోన్ వినియోగదారులు తరచుగా ఇంటర్నెట్ స్లోగా ఉండటం, కాల్ డ్రాప్ వంటి సమస్యలపై కంప్లయింట్లు చేస్తుంటారు. మరి, 5జీ రాకతో ఈ సమస్యలు తొలగిపోతాయా? దీనికి ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

5జీ సేవలు అందుబాటులో ఉన్న దేశాలలో మొబైల్ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు భిన్నంగా ఉన్నట్లు గమనించవచ్చు. 4జీ (LTE), 3జీ నెట్‌వర్క్‌ల మాదిరి కాకుండా, అధిక బ్యాండ్‌విడ్త్, లేటెన్సీ, స్పెషల్ నెట్‌వర్క్ ఉన్న ప్రత్యేక రేడియో టెక్నాలజీ దీనికి అవసరం.

5జీ వేగం 10 Gbps వరకు ఉంటుంది. అదే 4జీ వేగం 100 Mbps మాత్రమే. అంటే 5జీ వేగం 4జీ కన్నా 100 రెట్లు ఎక్కువ.

''వాస్తవానికి 4జీ అన్నది సంపూర్ణంగా 4జీ నెట్‌వర్క్ కాదు. 3.8జీ వద్దే ఆగిపోయింది. కాబట్టి, ఇప్పుడు 5 జీ మీద చాలా అంచనాలున్నాయి. అయితే, ఇది ఎన్నాళ్లు మనుగడ సాగిస్తుందో చూడాలి'' అని సుదీప్త అన్నారు.

"కానీ 5జీ ని కేవలం డేటా స్పీడ్ పరంగా మాత్రమే చూడకూడదు. భవిష్యత్తులో ' ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' కి ఇది బాగా ఉపయోగపడుతుంది" అన్నారామె.

5జీ స్పెక్ట్రమ్ వేలం

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి?

5జీలో స్పీడ్ ఒక భాగం మాత్రమే. రాబోయే కాలంలో దీని వాడకం బాగా పెరుగుతుంది. మీ రోజువారీ పనిని ఇది సులభతరం చేసే అవకాశం ఉంది.

ఇప్పుడు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలోనే ఎక్కువగా ఇంటర్నెట్‌ను వాడుతున్నాం. 5జీకి మారడం ద్వారా రిఫ్రిజిరేటర్‌, టీవీ, మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్, ఏసీలకు కూడా ఇంటర్నెట్‌ను అధిక వేగంతో అనుసంధానించవచ్చు. ఇంటర్నెట్‌కు వాటిని అనుసంధానించడం ద్వారా మీరు వాటిన్నింటిని వాడుకోవచ్చు.

సర్వర్ నుంచి పరికరానికి వేగంగా సిగ్నల్స్ వెళ్తాయి. కాబట్టి పనులు తొందరగా, సులభంగా అవుతాయి.

కానీ, దీనికి మెరుగైన మౌలిక వసతులు అవసరం. ఈ సదుపాయాలను మీకు అందించడానికి కంపెనీలకు సమయం పట్టొచ్చు. కంపెనీలు అందించే మౌలిక సదుపాయాలపై కూడా దీని పనితీరు ఆధారపడి ఉంటుంది.

భారత్‌లో ఇలాంటి సౌకర్యాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కానీ, '5జీ' సేవలను త్వరలోనే తీసుకొస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని మొబైళ్లు ఇప్పటికే 5జీకి అనుకూలంగా రూపొందాయి.

వచ్చే ఏడాదికే 5జీ వచ్చేస్తే మీకు తక్షణమే కలిగే ప్రయోజనాలేంటి?

ప్రొఫెసర్ సుదీప్త దీని గురించి మాట్లాడుతూ... '' ఒకవేళ మనం నగరాల గురించి చెప్పాల్సి వస్తే, ఇప్పుడు నా దగ్గర ఒక 5జీ ఫోన్ ఉందనుకోండి. నేను దాని సర్వీసులను, డేటాను సమర్థంగా వినియోగించుకోగలుగుతా. ఈ లెర్నింగ్ వంటి అంశాలు మరింత మెరుగు అవుతాయి. ఇంట్లో ఆటోమేషన్‌కు సంబంధించిన వస్తువులు ఉంటే, వాటిని మరింత మెరుగ్గా ఉపయోగించుకోగలుగుతాం.

''ఇక గ్రామాల పరంగా చూస్తే, ఈ- గవర్నెన్స్, వ్యవసాయానికి సంబంధించిన చాలా అంశాలు మెరుగు పడతాయి. టెక్నాలజీకి అనుగుణంగా చాలా కొత్త సర్వీసులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీసులను ఏర్పాటు చేసేంతవరకు పెద్దగా ప్రయోజనం ఉండదు'' అని అన్నారు.

వీడియో క్యాప్షన్, పాత కంప్యూటర్లు, టీవీల నుంచి బంగారం తయారు చేసే కొత్త టెక్నాలజీ

మీ ఫోన్ బిల్లు తగ్గుతుందా?

దేశంలో 5జీ ధర, వేలంలో కంపెనీలు ఖర్చు చేసే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. కానీ, భారత్‌లో టెలికాం కంపెనీల మధ్య పోటీ చాలా తక్కువ. కాబట్టి దీన్ని సొంతం చేసుకున్న కంపెనీలు నిర్ణయించే ధరలపై ఇది ఆధారపడి ఉంటుంది.

5జీ రాకతో 4జీ, 3జీ సేవలు ముగిసినట్లు కాదు. 5జీతో పాటు ఇవి కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)