గూగుల్ యాప్స్ లేని మొబైల్ ఫోన్ల భవిష్యత్ ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, Reuters
తమ అప్లికేషన్లు/సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ అయిన హువావేను గూగుల్ నిరాకరించడంతో ఆ సంస్థ చిక్కుల్లో పడింది.
అత్యధిక మంది ప్రజలు ఎక్కువగా ఉపయోగించే యూట్యూబ్, మ్యాప్స్, జీమెయిల్ వంటి వాటిపై ఎంతమేరకు ఆధారపడతారనే దానిపైనే ఈ చైనా టెక్నాలజీ కంపెనీ భవిష్యత్ ఆధారపడి ఉంది.
వ్యాపార లావాదేవీలను నిషేధిత కంపెనీల జాబితాలో హువావేను చేరుస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిర్ణయించడంతో గూగుల్ ఈ చర్యలు చేపట్టింది.
దీంతో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు పరిమితంగానే అప్‌డేట్స్ లభిస్తాయి, అంతేకాదు, ప్లేస్టోర్ వినియోగంపై కూడా పరిమితులు ఉండే అవకాశం ఉంది.
ఈ చర్యలన్నీ హువావే వృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఇటీవలే ఈ కంపెనీ హ్యాండ్‌సెట్ల అమ్మకాల్లో యాపిల్‌ను అధిగమించింది.
నిత్యజీవితంలో భాగంగా మారిపోయిన గూగుల్ యాప్స్‌ను ఉపయోగించకుండా ఎంతమంది తమ మొబైల్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటారనేదానిపైనే ఇప్పుడు హువావే భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉంది.

ఫొటో సోర్స్, EPA
సెర్చ్ ఇంజిన్‌గా మొదలై...
గూగుల్ మొదట్లో కేవలం ఓ సెర్చ్ ఇంజిన్‌గానే తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇప్పటికీ అది ఈ రంగంలో అగ్రగామిగానే ఉంది. ఫోన్ తీసుకుని ఏదైనా సమాచారం కావాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా 89శాతం మంది ప్రజలు గూగుల్‌నే ఉపయోగిస్తున్నారు. తర్వాత రెండో స్థానంలో ఉన్న సెర్చ్ ఇంజిన్ అసలు గూగుల్‌కు ఏమాత్రం పోటీనిచ్చే పరిస్థితిలో లేదు.
బైదూ సెర్చ్ ఇంజిన్‌ను 8శాతం మంది ఉపయోగిస్తున్నా, వీరంతా ప్రధానంగా చైనాలోనే ఉన్నారు. ఎందుకంటే చైనా ప్రభుత్వం గూగుల్‌పై నిషేధం విధించింది.
అందువల్ల తాజా చర్య వల్ల చైనాలో హువావే మార్కెట్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. కానీ ఇతర దేశాల్లో గూగుల్ ఉపయోగించే హువావే వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.

ఫొటో సోర్స్, Reuters
దగ్గరగా చూస్తే...
యూట్యూబ్ విజయవంతంకావడంతో యూట్యూబర్ అనే ఓ కొత్త ఉద్యోగం మార్కెట్లోకి వచ్చింది. మీరు ఏ రంగంలోనైనా ప్రతిభ చూపిస్తూ, దాన్ని వీడియోలుగా మార్చి అప్‌లోడ్ చెయ్యగలిగే నైపుణ్యం ఉంటే యూట్యూబ్ మిమ్మల్ని లక్షాధికారిగా మార్చగలదు. అయితే, ఎంత విజయవంతమైనప్పటికీ, యూట్యూబ్‌కు ఇతర అప్లికేషన్ల నుంచి కూడా పోటీ తీవ్రంగానే ఉందని ఎన్నో నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
2018 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసిన అప్లికేషన్లలో మూడోది టిక్‌టోక్ అని మార్కెటింగ్ కంపెనీ సెన్సార్ టవర్ వెల్లడించింది.
ఇది 2016లోనే ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం నెలకు 500 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ప్రపంచవ్యాప్తంగా టిక్‌టోక్ ఉపయోగిస్తున్నారు. బైట్‌డాన్స్ అనే ఓ చైనా కంపెనీ దీన్ని డౌయిన్ అనే పేరుతో ప్రారంభించింది. ఆ తర్వాత ఇది టిక్‌టోక్‌గా పాపులర్ అయ్యింది. కానీ చైనాలో ఇప్పటికీ డౌయిన్ గానే అందుబాటులో ఉంది.
ఈ యాప్‌లో తక్కువ నిడివి ఉన్న వీడియోలు ఉండటంతో ఇది యూట్యూబ్ కన్నా ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రధాన పోటీగా మారింది. ప్రజల ఆసక్తులు ఎలా మారిపోతాయనేదానికి ఈ ఆప్ వినియోగంలో పెరుగుదలే ఓ స్పష్టమైన ఉదాహరణ.
ప్రస్తుతం యూట్యూబ్.. గూగుల్‌కు ఉన్న అత్యంత విజయవంతమైన అప్లికేషన్లలో ఒకటి కావచ్చు. కానీ కొత్తగా వస్తున్న యాప్‌లు దీన్ని అధిగమించడానికి అవకాశాలు లేకపోలేదు.

ఫొటో సోర్స్, Reuters
హువావేకు బైదూ మద్దతివ్చొచ్చు
గూగుల్ ప్రమాణాల ప్రకారం చూస్తే, మ్యాప్స్ చాలా పాపులర్ అప్లికేషన్. అయితే 2012లో యాపిల్ తమ సొంత అప్లికేషన్ ప్రారంభించడంతో మ్యాప్స్ వినియోగంలో కొద్దిగా తగ్గుదల కనిపించింది. అయితే ఈ కొత్త యాప్ చాలా విమర్శలను ఎదుర్కొంది. కచ్చితత్వం, సరైన సమాచారం లోపించడం వంటివి ఎక్కువ మంది ఎదుర్కొన్న సమస్యలు. దీంతో యాపిల్ ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో రీడిజైన్ చేయడానికి గత సంవత్సరం ఉపక్రమించింది.
అమెరికాలోని ఐఫోన్ వినియోగదారుల్లో 69శాతం మంది గూగుల్ మ్యాప్స్ వాడేందుకే సుముఖంగా ఉన్నారని ఫ్లూయెంట్ అనే మార్కెటింగ్ కంపెనీ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉండొచ్చు.
చైనాలో గూగుల్ అప్లికేషన్లపై నిషేధం కారణంగా బైదూ మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో బైదూ చైనా బయట కూడా తన విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది.
ప్రస్తుతం హువావేపై గూగుల్ పరిమితులు విధించడంతో బైదూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. తన అప్లికేషన్ల వ్యాప్తికి హువావేను వాడుకునే అవకాశాలున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
మూడో ప్లాట్‌ఫాం వస్తుందా?
ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో చాలామంది ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్... ఈ రెండు ప్లాట్‌ఫాంలపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నారు. హువావేపై నిషేధం మరో కొత్త ప్లాట్‌ఫాంకు దారికల్పించే అవకాశం ఉందేమో చూడాలి.
"అమెరికా మా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తోంది" అని హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫీ చైనా మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
అమెరికన్ కంపెనీ గూగుల్ సాఫ్ట్‌వేర్ సహాయం లేకుండానే తమ కార్యకలాపాలు కొనసాగించగలమని హువావే భావిస్తోంది.

ఫొటో సోర్స్, AFP
"ఇలా ఏదో జరుగుతుందని మేం ముందే ఊహించాం, దీనికి తగిన ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం. అయితే అవి ఇంకా ఎలాంటి కార్యరూపం దాల్చలేదు" అని హువావే యూకే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెరేమీ థాంప్సన్ వ్యాఖ్యానించారు.
"ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి మా ప్రణాళికలు మాకున్నాయి. వాటితో మా వినియోగదారులను సంతోషపెట్టగలం" అని ఆయన అన్నారు.
దీనర్థం... ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లు కాకుండా మూడో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారనేది ఇప్పుడే చెప్పలేం.

ఫొటో సోర్స్, AFP
ప్రస్తుతానికైతే హువావే తమ దేశ ప్రభుత్వం, మార్కెట్ నుంచి పూర్తి మద్దతును పొందొచ్చు.
మొబైల్ మార్కెట్లో గూగుల్ తమ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవాలనే ఆశిస్తుంది.
అమెరికాకు చెందిన మరో టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఒకప్పుడు అమెరికా మార్కెట్లో 42శాతం వాటా ఉండేది. నోకియా కొనుగోలుతో దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని ప్రయత్నించినప్పటికీ తర్వాత ఆ ప్రయత్నాల్ని పూర్తిగా విరమించుకుంది.
ఇప్పుడు హువావేపై ఆంక్షల కారణంగా గూగుల్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి.
- హువావే: ఈ చైనా ఫోన్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీ ఎలా అయింది?
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- హువావే స్మార్ట్ ఫోన్లకు ఇక ఆండ్రాయిడ్ అప్డేట్లు రావు - గూగుల్ ప్రకటన
- ఎనిమిదేళ్ల తర్వాత చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఢమాల్!
- BBC Fact Check: ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- జనసేన పార్టీ వైఫల్యానికి, పవన్ కల్యాణ్ ఓటమికి కారణాలేంటి?
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- పెళ్లయ్యాక సంతోషం ఎన్నాళ్లు?
- కిమ్ కర్దాషియన్: ఆన్లైన్లో అత్యంత ప్రమాదకరమైన ప్రముఖురాలు
- కొందరు ఆడవారి శరీరం నుంచి వచ్చే వాసనకు మగవారు ఎందుకు ఆకర్షితులవుతారు?
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








