చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా మహిళలు, బాలికలు

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియాకు చెందిన వేల మంది మహిళలు, బాలికలు చైనాలో వ్యభిచార కూపంలో మగ్గుతున్నారని లండన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ కొరియా ఫ్యూచర్ ఇనిషియేటివ్ (కేఎఫ్ఐ) నివేదిక వెల్లడించింది.
నేర ముఠాలు వారిని అపహరించి వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాయని, చైనీయులతో బలవంతంపు వివాహాలు జరిపిస్తూ సెక్స్ బానిసలుగా మార్చుతున్నాయని పేర్కొంది.
ఈ వ్యభిచార వ్యాపారంలో ఏటా దాదాపు రూ.700 కోట్లు చేతులు మారుతున్నట్లు వివరించింది.
స్వదేశానికి తిరిగి వెళ్తే వేధింపులు ఎదుర్కోవాల్సి రావడంతో మహిళలు, బాలికలు చిక్కుకుపోతున్నారని కేఎఫ్‌ఐ నివేదిక పేర్కొంది.
ఈ బాధితులను రూ.10 వేలకూ కొనుక్కొని చైనీయులు భార్యలుగా మార్చుకుంటున్నారని నివేదిక రూపకర్త యూన్ హీ సూన్ తెలిపారు.
వారితో రూ.300కీ వ్యభిచారం చేయిస్తున్నారని, ఆన్‌లైన్‌లో వీక్షకుల కోసం సైబర్ డెన్‌లకు తరలిస్తున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బాధితుల వయసు సాధారణంగా 12 నుంచి 29 ఏళ్లుగా ఉంటోందని, కొన్ని సార్లు ఇంతకన్నా చిన్న వయసు వారు కూడా బలవుతున్నారని కేఎఫ్ఐ తెలిపింది.
''వారిని ఉత్తర కొరియా నుంచి అక్రమంగా తీసుకువస్తారు. కొందరిని చైనాలోనే అపహరిస్తారు. అత్యాచారాలు చేస్తారు. అమ్మేస్తారు. ఒక వ్యభిచార గృహం నుంచి మరొకటి వీరిని కొనుగోలు చేస్తూ ఉంటాయి. సొంత దేశం నుంచి బయటకు వచ్చిన ఏడాది లోపే ఏదో ఒక రకమైన సెక్స్ బానిసలుగా వీరు మారిపోతున్నారు'' అని పేర్కొంది.
‘‘వలస కార్మికుల జనాభా ఎక్కువగా ఉండే ఈశాన్య చైనా జిల్లాల్లోని వ్యభిచార గృహాల్లోనే చాలా మంది చిక్కుకుపోతున్నారు. బాధితుల్లో తొమ్మిదేళ్ల చిన్నారులు కూడా ఉంటున్నారు. సైబర్ సెక్స్ డెన్‌ల్లో బాధితులతో వెబ్ కెమెరాల ముందు లైంగిక కృత్యాలు చేయిస్తారు. వీటిని వీక్షిస్తున్నవారిలో చాలా మంది దక్షిణ కొరియా వారు ఉన్నట్లు సమాచారం’’ అని వెల్లడించింది.
చైనీయులు బాధిత మహిళలను రూ.10 వేల నుంచి రూ.5 లక్షల ధరకు కొనుగోలు చేసి, బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారని.. వారిపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో ఉన్న బాధితులు నుంచి, వ్యభిచార కూపం నుంచి తప్పించుకుని దక్షిణ కొరియాకు వెళ్లినపోయిన వారి నుంచి కేఎఫ్ఐ ఈ సమాచారం సేకరించింది.
ఒక హోటల్‌లో తనను, మరో ఆరుగురు ఉత్తర కొరియన్లను నేరగాళ్లు అమ్మేశారని ఉత్తర కొరియాలోని చాంగ్జిన్ పట్టణానికి చెందిన ప్యోన్ అనే మహిళ చెప్పినట్లు కేఎఫ్ఐ పేర్కొంది.
తమకు తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదని, బ్రోకర్లు హింసించేవారని ఆమె అన్నట్లు తెలిపింది.
''చైనాలోని డలియన్‌లో దక్షిణ కొరియా వారు చాలా మంది ఉంటారు. దక్షిణ కొరియన్ సంస్థలు తమ వ్యాపారుల దగ్గరికి ఉత్తర కొరియా అమ్మాయిలను పంపిస్తాయి'' అని కిమ్ అనే మరో బాధితురాలు వివరించినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- చెన్నైలో Hidden కెమెరాలు పెట్టి మహిళా హాస్టల్ నడుపుతున్న వ్యక్తి
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేయనున్న ఏడు కీలక శక్తులు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- BBC Special: భారత బీచ్‌లలో అణు ఇంధనం... అందాలంటే 30 ఏళ్లు ఆగాలి
- అదిగదిగో 5జీ: ఈ 5జీ వస్తే ఎలా ఉంటుంది?
- ఎనిమిదేళ్ల తర్వాత చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఢమాల్!
- స్మార్ట్ ఫోన్‌ను అతిగా వాడుతున్న పిల్లలను ఎలా నియంత్రించాలి?
- పోర్నోగ్రఫీ సమస్యకు దక్షిణ కొరియా పోలీసుల షాక్ థెరపీ
- బాత్ రూంలో హిడెన్ కెమెరా నుంచి తప్పించుకోవడం ఎలా?
- అడుగడుగునా ‘పోర్న్ కెమెరా’ పై దక్షిణ కొరియా యువతి పోరాటం
- BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









