చెన్నైలో రహస్య కెమెరాలు పెట్టి మహిళా హాస్టల్ నడుపుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images
ఓ భవనంలో రహస్య కెమెరాలు పెట్టి.. మహిళా హాస్టల్ నడుపుతున్న వ్యవహారం చెన్నైలో వెలుగులోకి వచ్చింది.
ఆదంబాక్కంలోని ఓ మహిళా హాస్టల్లో పలు రహస్య కెమెరాలు బయటపడ్డాయి.
సంపత్ కుమార్ అలియాస్ సంజయ్ (45) కొన్ని ఇళ్లను అద్దెకు తీసుకుని మహిళా హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఈ హాస్టల్లో చాలా మంది ఉద్యోగిణులు ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా బయటపడింది?
సోమవారం ఓ మహిళ హెయిర్ డ్రయ్యర్ వినియోగించుకోవాలని చూసి.. దాన్ని కరెంట్ ప్లగ్‌కు తగిలించారు. కాసేపటికి ఆ ప్లగ్ సాకెట్ ఊడిపోయింది. అప్పుడు ఆ సాకెట్ వెనుకాల బ్యాటరీ సాయంతో నడిచే ఓ పరికరం ఉన్నట్లు ఆ మహిళ గుర్తించారు.
తర్వాత అది రహస్య కెమెరా అని తేలడంతో ఆమె షాక్‌కు గురై వెంటనే ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు చేరవేశారు.
పోలీసులు వచ్చి ఆ హాస్టల్ భవనంలో తనిఖీలు జరుపగా.. పలు రహస్య కెమెరాలు బయటపడ్డాయి.
దీంతో పోలీసులు హాస్టల్ యజమాని సంపత్ కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఓ మహిళ హెయిర్ డ్రయ్యర్ వినియోగిస్తుండగా పవర్ సాకెట్ వెనుక రహస్య కెమెరా గుర్తించారు. తర్వాత ఇతర స్విచ్ బాక్సులను తనిఖీ చేయగా.. అక్కడా కొన్ని కెమెరాలు బయటపడ్డాయి. దీంతో ఆ మహిళల ఫిర్యాదు చేశారు''.. అని పోలీసులు చెప్పారు.
ఇప్పటి వరకూ తాము ఆరు కెమెరాలను గుర్తించామని ఈ హాస్టల్ 15 రోజుల కిందటనే ప్రారంభమైందని తెలిపారు.
సంపత్ బహుళ అంతస్థు భవనాన్ని అద్దెకు తీసుకుని ఇలా చేశారని పోలీసులు వివరించారు.
సంపత్‌పై ఐటీ చట్టం, మహిళలపై వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి తమ వద్ద చాలా వివరాలున్నాయని.. మహిళలు భయపడుతున్నందున వాటిని వెల్లడించలేమని చెప్పారు.

ఫొటో సోర్స్, Science Photo Library
హిడెన్ కెమెరాలను గుర్తించండి
మొదట కెమెరాను ఎక్కడెక్కడ రహస్యంగా అమర్చగలరో తెలుసుకోవాలి.
హిడెన్ కెమెరాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ మీరు బాత్రూంలో ఉన్నా, ఏదైనా స్టోర్ చేంజింగ్ రూంలో బట్టలు మార్చుకుంటున్నా, లేక హోటల్ గదిలో మీ భాగస్వామితో ఉన్నా అక్కడ జరిగేదంతా రికార్డ్ చేయగలుగుతాయి.
ఈ కెమెరాలను సాధారణంగా ఎక్కడ దాస్తారంటే..
- అద్దాల వెనుక
- తలుపుపై
- గోడ మూల ఎక్కడైనా
- పైకప్పులో
- ల్యాంప్‌లో
- ఫొటో ఫ్రేంలో
- టిష్యూ పేపర్ డబ్బాలో
- పూలకుండీలో
- స్మోక్ డిటెక్టర్‌లో

ఫొటో సోర్స్, Getty Images
కెమెరా ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి
మొదట పరిశీలించాలి: అన్నిటికంటే మొదట మీరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మీరు ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్, చేంజింగ్ రూమ్, లేదా హోటల్లోని ఏదైనా గదిలోకి వెళ్తే నాలుగు వైపులా జాగ్రత్తగా చూడాలి. లోపల ఉన్న వస్తువులన్నీ పరిశీలించాలి. పైకప్పు మూలల్లో కూడా గమనించాలి.
ఏదైనా రంధ్రం ఉందా?: ఎక్కడైనా రంధ్రాలు కనిపిస్తే అందులో కెమెరా ఏదైనా పెట్టారేమో తెలుసుకోడానికి దానిలోపల గమనించాలి. నిజానికి కెమెరాలను అద్దాల వెనుక, ఫొటో ఫ్రేమ్ లేదా బ్యాక్ డోర్ లాంటి చోట పెడతారు. కాస్త అప్రమత్తంగా ఉంటే వాటిని గుర్తించవచ్చు.
ఏదైనా వైరు కనిపిస్తోందా?: ఎక్కడైనా అదనపు వైరు వెళ్తోందేమో కూడా గమనించాలి. అలా ఏదైనా కనిపిస్తే అది ఎక్కడికి వరకు వెళ్లుందో చూడాలి. ఆ వైరు మిమ్మల్ని దాచిన కెమెరా దగ్గరకు తీసుకెళ్లచ్చు. కానీ, చాలా కెమెరాలకు ఎలాంటి వైర్లూ ఉండవు. బ్యాటరీలతో నడుస్తాయి. మాగ్నెట్‌లా ఎక్కడైనా అతికించేలా ఉంటాయి.
లైట్ ఆఫ్ చేసి చూడాలి: మీరు చేంజింగ్ రూమ్, లేదా హోటల్ గదిలో ఉంటే, ఒకసారి లైట్ ఆఫ్ చేసి నాలుగు వైపులా చూడండి. ఎక్కడైనా ఎల్ఈడీ వెలుగు లాంటిది వస్తోందేమో గమనించండి. అలా కనిపిస్తే అది కెమెరా కావచ్చు. నిజానికి కొన్ని నైట్ విజన్ కెమెరాలు కూడా ఉంటాయి. అవి చీకట్లో జరిగే వాటిని కూడా రికార్డ్ చేస్తాయి. ఈ కెమెరాలకు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. చీకట్లో వాటిని గుర్తించవచ్చు.
మిర్రర్ టెస్ట్: చేంజింగ్ రూమ్, బాత్రూంలో మనకు అద్దాలు కనిపిస్తాయి. వాటి ముందు నిలుచుకుని మీరు బట్టలు మార్చుకుంటారు. టాయిలెట్‌కు వెళ్తారు. హోటల్ గదుల్లో కూడా చాలా పెద్ద అద్దాలు ఉంటాయి. ఆ అద్దాలకు అవతల ఉన్న ఎవరైనా మిమ్మల్ని చూస్తుండచ్చు. లేదా వాటి వెనుక కెమెరా అమర్చిన కెమెరా రికార్డ్ చేస్తుండచ్చు. అలాంటప్పుడు ఆ అద్దాలను పరిశీలించడం చాలా అవసరం. ఆ అద్దాలపై వేలు పెట్టి చూడండి. మీ వేలుకు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబానికి మధ్య కాస్త గ్యాప్ కనిపిస్తే అది అద్దమే. కానీ మీ వేలుకు, అద్దంలో ఇమేజ్‌కు మధ్య గ్యాప్ కనిపించకపోతే ఏదో జరుగుతున్నట్టు లెక్క.
ఫ్లాష్ ఆన్ చేసి చూడాలి: లైట్ ఆఫ్ చేసి మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. నాలుగు వైపులా చూడండి. ఎక్కడైనా రిఫ్లెక్షన్ వస్తుంటే, అది కెమెరాపై అద్దం వల్ల వస్తుండచ్చు. ఆ దిశగా వెళ్లి అక్కడ హిడెన్ కెమెరా ఏదైనా పెట్టారేమో జాగ్రత్తగా గమనించండి.
యాప్ అండ్ డిటెక్టర్:ఇప్పుడు హిడెన్ కెమెరా గురించి తెలుసుకోడానికి మనకు చాలా యాప్స్ లభిస్తున్నాయి. కానీ సైబర్ నిపుణుల చెబుతున్న దాని ప్రకారం కొన్ని యాప్స్ ఫేక్ కూడా కావచ్చు. కొన్ని హిడెన్ కెమెరాల గురించి చెప్పడానికి బదులు, మీ ఫోన్లో వైరస్ రిలీజ్ చేస్తాయి. ఇవి కాకుండా మార్కెట్లో కొన్ని డిటెక్టర్ డివైస్‌లూ ఉన్నాయి. వాటిని కొని మీ దగ్గర ఉంచుకోవచ్చు. కానీ వాటి ఖరీదెక్కువ, అందరూ కొనలేని అలాంటి డివైస్‌లు ఎక్కువగా పోలీసులు ఉపయోగిస్తుంటారు.

ఫొటో సోర్స్, AVON AND SOMERSET POLICE
కెమెరా కనిపిస్తే ఏం చేయాలి
మీకు హిడెన్ కెమెరా కనిపిస్తే, కంగారు పడకూడదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కెమెరాను తాకకండి. ఎందుకంటే దానిపై నిందితుల వేలిముద్రలు ఉంటాయి. పోలీసులు వచ్చేవరకూ అక్కడే ఉండండి.
"ఎవరైనా ఒక మహిళ అనుమతి లేకుండా కెమెరాతో వారిని ఫొటో లేదా వీడియో తీయడం, దానిని వేరే వారికి షేర్ చేయడం నేరం. దీనికి ఐటీ యాక్ట్ సెక్షన్ 67A, 66E( గోప్యత, వేధింపులు), ఐపీసీ సెక్షన్ 354A కింద కేసు నమోదు చేయవచ్చు. దానివల్ల నిందితులకు మూడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా ఉండవచ్చు" అని సైబర్ నిపుణురాలు కర్ణిక చెప్పారు.
"ఫిషింగ్, హ్యాకింగ్ తర్వాత ఇలాంటి కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2016లో సైబర్ క్రైమ్‌లో సుమారు 11 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో సగం మందిని ఇలాంటి వీడియోలు తీసినందుకు పట్టుకున్నారు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, PA
ఈ వీడియోలను ఏం చేస్తారు
"కొంతమంది అలాంటి వీడియోలను స్వయంగా చూడడం కోసం రికార్డ్ చేస్తారు. వీటికి చాలా పెద్ద మార్కెట్ ఉండడంతో కొందరు వాటిని అమ్ముకుంటారు. హిడెన్ కెమెరాలతో తీసిన వీడియోలను వెబ్ సైట్స్‌లో పెడతారు. వీటిని చాలా మంది చూస్తుంటారు" అని మరో సైబర్ నిపుణుడు వినీత్ కుమార్ చెప్పారు.
"cybercrime.gov.in పేరుతో ఉన్న భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం పిల్లలకు సంబంధించిన కేసులు నమోదు చేస్తున్నారు. కానీ కొంత కాలం తరవాత ఇందులో మహిళలకు సంబంధించిన కేసులు కూడా తీసుకుంటారు. మహిళలు ప్రస్తుతం మహిళా కమిషన్ సైబర్ సెల్‌లో వీటి గురించి ఫిర్యాదు చేయవచ్చు. దానితోపాటు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సైబర్ సెల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు" అని వినీత్ తెలిపారు.
హిడెన్ కెమెరాలను గుర్తించడానికి సైబర్ నిపుణులు ఎన్నో ట్రిక్స్ చెప్పారు. కానీ అది మనం అత్యంత అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- టీఆర్ఎస్ మేనిఫెస్టో: ఏ వర్గాలకు ఏం ప్రకటించారు
- దేశీ వాట్సప్ షేర్ చాట్ ఎందుకంత పాపులర్ అయింది?
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- లీటరు డీజిలు రూ.120.. ఫ్రాన్స్‌లో భగ్గుమన్న ఆందోళనలు
- హార్ట్ ప్యాచెస్: చనిపోయిన గుండెను తిరిగి బతికించొచ్చా?
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








