షేర్ చాట్: వాట్సప్‌కు భారత్ యాప్ పోటీ

ఫొటో సోర్స్, HARI ADIVAREKAR
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ భారత ప్రతినిధి
ప్రాంతీయ భాషల్లో పాపులర్ అవుతున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'షేర్ చాట్.' లక్షల మంది భారతీయులు ఈ షేర్ చాట్ వేదికగా తమ స్నేహాన్ని, ప్రేమను ప్రకటిస్తున్నారు.
''ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది.. దేశంలో ప్రతిఒక్కరూ బ్రేక్అప్ అవుతున్నారని'' అని షేర్ చాట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఫరీద్ ఎహ్‌సాన్ అన్నారు.
షేర్ చాట్‌ను ఓసారి స్క్రోల్ చేసి చూడండి.. వందల సంఖ్యలో ఫోటోలు, భగ్నప్రేమికుల కోసం కొటేషన్లు, ఇంకా ఎంతో సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్‌లాగ షేర్ చాట్ అందిస్తోంది.
అయితే మీకు కావాల్సిన సమాచా రాన్ని హ్యాష్‌ట్యాగ్‌తో వెతకాలి. ఉదాహరణకు భగ్నప్రేమికుల కోసం #PainfulHeart(పెయిన్‌ఫుల్ హార్ట్) అని వెతికితే, విరిగిన మనసును తెలిపే ఎన్నో ఎమోజీలు మీకు దొరుకుతాయి.
అంతేకాదు.. గాయపడిన హృదయంతో కన్నీరు కార్చే కళ్ల ఫోటోలు, ఓదార్చే కొటేషన్లు, మిణుకుమిణుకుమంటూ వెలిగే క్యాండిల్స్.. ఇలా మీరు ఇతరులకు షేర్ చేయడానికి అవసరమైన ఎంతో సమాచారం షేర్ చాట్‌లో ఉంది.
చిన్నచిన్న నగరాలు, పట్టణాలకు చెందిన దాదాపు 20వేలమంది అమ్మాయిలు #GirlAttitude అనే హ్యాష్‌ట్యాగ్‌తో పురుషలోకంపై ఛలోక్తులతో స్వైరవిహారం చేస్తున్నారు.
'#GirlAttitude ద్వారా.. 'నాకు చాలా ఆటిట్యూడ్ ఉంది. కానీ కారణం లేకుండా ప్రదర్శించను..' అని ఒక అమ్మాయి కామెంట్ చేసింది.
#GirlGang ద్వారా.. 'అమ్మాయిలే తెలివైనవాళ్లు.. అబ్బాయిలు మూర్ఖులు' అని మరో అమ్మాయి కామెంట్! ఈ హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా వస్తున్న మహిళా స్రవంతిని 'ప్రాంతీయ స్త్రీవాదం'గా ఎహ్‌సాన్ అభిప్రాయపడ్డారు.
పాపులర్ అయిన #HusbandWife హ్యాష్‌ట్యాగ్‌లో భార్యాభర్తలు.. పోట్లాటల తర్వాత ఒకర్నొకరు క్షమాపణలు కోరుతూ రోజా పూలను షేర్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''షేర్ చాట్‌లో ఎంతో ఫీడ్ ఉంది. సగటు భారతీయ యువతకు కావాల్సిన అన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. అది కూడా వారివారి భాషల్లోనే!'' అని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంకుశ్ సచ్ఛ్‌దేవ అన్నారు.
షేర్ చాట్ బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన సంస్థ. ఇంజనీరింగ్ చదివిన ముగ్గురు వ్యక్తులు షేర్ చాట్‌ను ప్రారంభించారు. షేర్ చాట్.. మొట్టమొదటి భారతీయ సోషల్ మీడియా నెట్‌వర్క్.
14 భారతీయ భాషల్లో మొత్తం 3 కోట్ల మంది వినియోగదారులున్న ఈ నెట్‌వర్క్ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.
షేర్ చాట్ మెజారిటీ వినియోగదారులు 18-25 మధ్యవారే. వీరంతా మధ్యతరహా, చిన్న నగరాలు, పట్టణాలకు చెందినవారే. గత నాలుగు నెలల కాలంలో వీరి సంఖ్య రెట్టింపు అయ్యింది.
రానున్న సంవత్సర కాలంలో వినియోగదారుల సంఖ్య 10 కోట్లకు చేరడమే తమ లక్ష్యమని వ్యవస్థాపకులు చెబుతున్నారు.
10 కోట్లమంది వినియోగదారులను పొందడం అంటే, వాట్సప్ భారతీయ వినియోగదారుల్లో సగం, భారతీయ ఫేస్‌బుక్ వినియోగదారుల్లో మూడోవంతు సాధించినట్లే.
2015లో ప్రారంభమైన షేర్ చాట్ సంస్థలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ఈ సంస్థ 800కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను సాధించగలిగింది.

ఫొటో సోర్స్, HARI ADIVAREKAR
''భారత మార్కెట్లో షేర్ చాట్ అన్నది ఓ గేమ్ చేంజర్. దేశీయమైన విషయాలు, సమాచారం తాహతును సరిగ్గా అంచనావేసి, ధైర్యంగా ముందడుగు వేశారు. పరిస్థితులకు ఎదురీది విజయం సాధించారు'' అని ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన షామీ సంస్థ అభిప్రాయపడింది.
ఇది ఒక్కరోజు ప్రయత్నం కాదు
షేర్ చాట్ ఆలోచనకు ముందు వ్యవస్థాపకుల్లో చాలా ఆలోచనలు పుట్టాయి. ఒక రియల్ఎస్టేట్ యాప్ ప్రారంభిద్దామనుకున్నారు. ఆ తర్వాత డేటా అనలిటిక్స్ కంపెనీ, రియాలిటీ గేమ్.. ఇలా ఎన్నో ఆలోచనలు చేసి చివరికి 'చాటింగ్ యాప్'గా షేర్ చాట్‌ను ప్రారంభించారు.

ఫొటో సోర్స్, AFP
2014 డిసెంబర్‌లో షేర్ చాట్ మొదటి వెర్షన్‌ను ప్రారంభించారు. అప్పట్లో ఇది ఒక చాటింగ్ యాప్ మాత్రమే. ఇంగ్లీష్‌తోపాటు 10 భారతీయ భాషల్లో ఈ యాప్‌ను ప్రారంభించారు.
కానీ ఇంగ్లీష్ భాషతో పెద్ద ఉపయోగం లేకపోవడంతో 2015లో ఇంగ్లీషు భాషను తొలగించారు. హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా యూజర్లు విషయాలను/ సమాచారాన్ని సృష్టించి, షేర్ చేసే అవకాశాన్ని కల్పించి షేర్ చాట్‌ను మళ్లీ కొత్తగా ఆవిష్కరించారు.
''అప్పుడే మా కంపెనీ అసలైన పురోగతిని చూడగలిగాం..'' అని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భాను ప్రతాప్ సింగ్ అన్నారు.
భారత్‌లో 50కోట్ల మంది వినియోగదారులు తొలిసారిగా ఆన్‌లైన్‌లో అడుగుపెడుతున్నారు. ఈ పరిణామాన్ని విశ్లేషించడం పెద్ద కష్టమేమీ కాదు.
చిన్నచిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు తమకు అందుబాటు ధరలోవున్న స్మార్ట్‌ఫోన్లు కొంటున్నారు. దాదాపు 40కోట్లమంది ప్రజలు ఇప్పటికే వాటిని వాడుతున్నారు. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ డేటా ధరలు భారీగా పడిపోయాయి.
గూగుల్, కె.పి.ఎం.జి ప్రకారం.. పదిలో తొమ్మిదిమంది భారతీయులు తమ మాతృభాషలోనే సందేశాలు/సమాచారం పంపుకోవడానికి ఇష్టపడుతున్నారు. (ప్రస్తుతం భారత్‌లో 17.5 కోట్లమంది ఇంగ్లీషు మాట్లాడగలిగిన ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.)
చాలా విషయాల్లో భారత్ ‘హృదయాన్ని’ షేర్ చాట్ ప్రతిబింబిస్తోంది. స్థానిక భాషలు, యాసలలోనే వీడియోలు, కోట్స్, ఫోటోలు అందుబాటులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అభిరుచుల్లో సామీప్యత కలిగిన వ్యక్తులను ఒకదగ్గర కలిపేందుకు షేర్ చాట్ ఆల్గరిధమ్స్ ఉపయోగపడతాయి. షేర్ చాట్‌లోని సమాచారాన్ని వాట్సప్‌లాంటి ఇతర వేదికలపై షేర్ చేయడానికి షేర్ చాట్ అనుమతిస్తుంది.
భారతీయ యువత ఆధునికత, సంప్రదాయాల విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని కూడా షేర్ చాట్ వివరిస్తోంది.
భారతీయ రైల్వే సర్వీసు కింది స్థాయి ఉద్యోగాల కోసం పరీక్ష నిర్వహించినపుడు వినియోగదారులు షేర్ చాట్‌లో శ్యాంపుల్ క్వొశ్చన్ పేపర్లను షేర్ చేసుకుని, పరీక్షల్లో విజయం సాధించాలని షేర్ చాట్‌లో ప్రార్థనలు కూడా చేశారు. ఆ సమయంలో #samplepapers, #devotion అన్న హ్యాష్‌ట్యాగ్‌లు ఒకేసారి ట్రెండ్ అయ్యాయి.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మారుమూల గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంకా అప్పుడప్పుడే ఇంటర్నెట్‌కు పరిచయమయ్యాడు.
అతను షేర్ చాట్‌లో ఆడియో, వీడియోలతోపాటు తన క్రికెట్ కామెంటరీస్‌ను పోస్ట్ చేస్తూ, పెద్ద ఫాలోయింగ్ సంపాదించాడు. ఆ తర్వాత ఒక హిందీ వీడియో న్యూస్ వెబ్‌సైట్ అతడికి తమ సంస్థలో ఉద్యోగం ఇచ్చింది.

ఫొటో సోర్స్, HARI ADIVAREKAR
తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానకి కూడా ఈ యాప్‌ను వాడుతున్నారు.. ముఖ్యంగా ఫ్యాషన్ రంగం. అందులో హెన్నా డిజైన్లను షేర్ చేయడం అన్నది ఒక ఉదాహరణ.
25ఏళ్ల యువతికి 12వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి షేర్ చాట్‌లో హెన్నా డిజైన్లను షేర్ చేస్తోంది.
అంతేనా.. జ్యోతిష్యులు, ప్లంబర్లు, టైలర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా ఎంతోమంది ఈ యాప్ ద్వారా తమ వ్యాపారాలను ప్రచారం చేసుకుంటున్నారు.
ఓ వ్యక్తి తన ఇంట్లో తయారుచేసే డిటర్జెంట్ పౌడర్‌ను షేర్ చాట్ ద్వారా ప్రచారం చేస్తూ ఆఫ్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుంటున్నారు.
షేర్ చాట్ ప్రధాన స్రవంతిలో పోర్న్ వీడియోలు, ఫోటోల ప్రవాహాన్ని నివారించడానికి 'నాన్-వెజ్' లేదా 'నాన్-వెజిటేరియన్' పేరుతో ఓ ప్రత్యేకమైన ఆప్షన్ ఏర్పాటు చేశారు.
షేర్ చాట్‌కు రాజకీయనాయకులు మినహాయింపేమీకాదు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ షేర్ చాట్‌లో జాయిన్ అయ్యారు. అలా షేర్ చాట్‌లో చేరిన మొదటి రాజకీయనాయకుడు ఈయనే.
''రాజకీయనాయకులకు షేర్ చాట్ అన్నది ఓ గొప్ప మాధ్యమం. మా ప్రచార వీడియోలను, ఫోటోలను షేర్ చాట్‌లో పోస్ట్ చేస్తే, వాటిని మా అనుచరులు, ఫాలోవర్స్ వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి ఇతర మాధ్యమాల్లో షేర్ చేస్తారు. ఎన్నికల సమయంలో మాలో చాలామంది షేర్ చాట్‌లో జాయిన్ అవుతారు'' అని బీజేపీ దిల్లీ మీడియా రిలేషన్స్ హెడ్ నీల్‌కంఠ్ బక్షి అన్నారు.
కానీ ఇలాంటి నెట్‌వర్క్‌ల ద్వారా ఫేక్ న్యూస్, విద్వేషపూరిత ప్రసంగాలను సులభంగా వ్యాపింపచేసే అవకాశం ఉంది.
షేర్ చాట్, కొత్తగా ప్రారంభమైన 'హెలో' యాప్ లాంటి ప్రాంతీయ భాషల్లోని నెట్‌వర్క్‌ల ద్వారా తప్పుడు సమాచారం, రాజకీయ ప్రచారాలు విస్తృతంగా వ్యాపింపచేయవచ్చని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక చేసిన దర్యాప్తులో తేలింది.

ఫొటో సోర్స్, HARI ADIVAREKAR
''ఫేక్ న్యూస్, అభ్యంతరకర సమాచారం/విషయాల వ్యాప్తి పట్ల మాకు ఆందోళనగా ఉంది. అలాంటి విషయాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంటాం. ఒక మాధ్యమంలో ఆరోగ్యకర వాతావరణం ఉండటం ముఖ్యం'' అని షేర్ చాట్ పబ్లిక్ అఫైర్స్ అధికారి బర్జెస్ వై మలు అన్నారు.
కొన్ని నెలల క్రితం ఇలాంటి విషయాలను వ్యాప్తి చేస్తున్న 50వేల ఖాతాలను తొలగించామని ఆయన అన్నారు.
''అభ్యంతరకర విషయాలను షేర్ చాట్‌లో షేర్ చేస్తే మేం సులభంగా ఆ ఖాతా ఫోన్ నెంబర్ పసిగట్టి, ఆ ఫోన్‌ను కూడా బ్లాక్ చేయగలం. వాళ్లు మళ్లీ షేర్ చాట్ వాడాలంటే కొత్త నంబర్‌తోపాటు కొత్త ఫోన్‌ను కూడా కొనాల్సిందే. షేర్ చాట్‌కు సంబంధించిన సమాచారంపై మా గుర్తు ఉంటుంది'' అన్నారు.
కానీ 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. బర్జెస్ చెబుతున్న జాగ్రత్తలతో ఫేక్ న్యూస్, విద్వేషపూరిత ప్రసంగాలు వ్యాప్తిచేసే వ్యక్తులను ఎంతవరకు నిలువరించవచ్చు అన్నది ప్రశ్నార్థకం.
ఎదుగుతున్నకొద్దీ షేర్ చాట్‌కు పోటీదారుల బెడద కూడా పెరుగుతుంది. తమ డిజైన్లను కాపీ చేసిందంటూ షేర్ చాట్.. ఓ సంస్థను కోర్టుకు లాగి, ఆ కేసులో విజయం సాధించింది.
కానీ చంచలమైన సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంతకన్నా ఆకర్షణీయమైన నెట్‌వర్క్ వస్తే వినియోగదారులు దానివైపే వెళతారు.
''సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మన ఆడియెన్స్‌తోపాటు మనమూ ప్రయాణించాలి. వారికి మంచి అనుభూతిని ఇస్తూ ఉండాలి'' అని అంకుశ్ సచ్ఛ్‌దేవ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
- భారత్‌లో 30 భాషలు, 1600కుపైగా యాసలు ఉన్నాయి.
- భారతీయ భాషల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2011లో 4.2 కోట్లమంది ఉంటే, 2016లో 23.4 కోట్ల మంది ఉన్నారు.
- దేశంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన ఇంటర్నెట్ వినియోగదారులు 17.5 కోట్లమంది ఉంటే, ప్రాంతీయ భాషల ఇంటర్నెట్ వినియోగదారులు 23.4 కోట్ల మంది ఉన్నారు.
- 2021 సంవత్సరానికి ప్రాంతీయ భాషల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 53.6 కోట్లకు చేరుతుందని ఓ అంచనా.
- దేశంలో 96% మంది వినియోగదారులు తమతమ మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.
- దేశంలోనే తమిళులు (42%) అత్యధికంగా ఇంటర్నెట్ వాడుతున్నారు. తర్వాతి స్థానాల్లో హిందీ, కన్నడ ప్రజలు ఉన్నారు.
- ప్రాంతీయ భాషా వినియోగదారుల్లో 90% మంది చాటింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకోసం ఇంటర్నెట్ వాడుతున్నారు.
- దేశంలోని మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో మరాఠీ, బెంగాలీ, తమిళ్, తెలుగు వినియోగదారులే 30% ఉంటారని ఓ అంచనా.
సోర్స్: కె.పి.ఎం.జి, గూగుల్
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








