డిజైనర్ బేబీస్: జన్యు సవరణ శిశువుల సృష్టి ఆమోదయోగ్యమేనా?

ఫొటో సోర్స్, iStock
మానవుడు మొక్కలు, జంతువులను సృష్టించడమే కాదు, తన సొంత జన్యువులను కూడా రూపొందించుకోగలడు. కానీ భవిష్యత్తులో మనిషి జన్యుపటాన్ని సవరించడంలో ఒక సంప్రదాయబద్ధమైన రేఖ గీసి ఉంది.
ఇప్పుడు జన్యుపరమైన మార్పులు చేసిన మొట్టమొదటి శిశువులను సృష్టించడానికి తాను సాయం చేశానని ఒక చైనా శాస్త్రవేత్త ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలని కోరుకుంటాం. కానీ పుట్టక ముందే వారి జన్యువులను మార్చేసి మనం భయపడే వ్యాధులను వారికి రాకుండా చేయడం సమంజసమేనా?
శాస్త్రవేత్తలు వ్యాధులపై పోరాడేందుకు జన్యుపటాన్ని ఎందుకు సరిచేయకూడదు?

ఫొటో సోర్స్, Getty Images
జీఎం మానవులు
కవలలుగా పుట్టిన ఆడపిల్లల పిండాల నుంచి తీసిన డీఎన్ఏ నుంచి ప్రొఫెసర్ హీ జియాన్కూయ్ ఒక కీలక ప్రొటీన్‌ను తొలగించారు. అలా చేయడం వల్ల ఆ పిండాలకు హెచ్ఐవీ సంక్రమించకుండా చేశారు.
షెన్‌జెన్‌లోని సదరన్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసే జియాన్కూయ్.. యూనివర్సిటీకి తెలీకుండా సీసీఆర్5 ప్రొటీనుపై పరిశోధనలు చేశానని చెప్పారు.
ఆయన పరిశోధనల్లో 8 మంది జంటలు పాల్గొన్నాయి. ఒక్కో జంటలో ఒక హెచ్ఐవీ పాజిటివ్ తండ్రి, హెచ్ఐవీ నెగటివ్ తల్లి ఉన్నారు.
ఆయన పరిశోధనలు చేసిన కవలలు ఇప్పటికే జన్మించారు. ఇప్పుడు తాను జన్యువులు ఎడిట్ చేసిన రెండో పిండం గర్భంలో తొలిదశలో ఉందని కూడా ఈ శాస్త్రవేత్త చెబుతున్నారు.
కానీ తను సాధించానని చెబుతున్న ఈ పరిశోధనల ఫలితాల గురించి ఆయన ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు.
ఇటు, అకడమిక్ అంశాలను ఉల్లంఘించినందుకు యూనివర్సిటీ ఆయనపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
ఆయన చెబుతున్న ఈ ఫలితాలు నిజమని తేలితే, ఈ పరిశోధన విజ్ఞానశాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. తీవ్రమైన నైతిక సమస్యలను పెంచుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తు తరాలు
ఒక వ్యక్తిలో పెరుగుతున్న పిండం డీఎన్ఏను మార్చడం.. 'వంశపారంపర్య జన్యు సవరణ' అనే ఈ పరిశోధనతో మానవుల్లోని జన్యువులను మార్చి, బలహీన పరిచే వ్యాధులు వారికి సంక్రమించక ముందే వాటిని లక్ష్యంగా చేసుకుని జన్యువులను సరిదిద్దవచ్చు.
కానీ ఈ విధానంలో నైతికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంటే ఇలా చేయడం భవిష్యత్తు తరాల జన్యుపటాలకు మాట్లు వేయడమే అవుతుంది. ఇది ఒక వ్యక్తి డీఎన్ఏకు సంబంధించినదే కాదు, అలా మనలో చాలా మందికి జరగవచ్చు.
చాలా దేశాలు ఇలాంటి పరిశోధనలను పూర్తిగా నిషేధించాయి. జన్యు సవరణను పునరుత్పాదకత ఉండని కణాల్లో ఉపయోగించడానికి మాత్రమే అనుమతించాయి.
ఉదాహరణకు బ్రిటన్ ఈ పరిశోధనలను తొలగించిన ఐవీఎఫ్ పిండాలపై చేయడానికి మాత్రమే అనుమతించింది..
అమెరికాలో సడలించిన మార్గదర్శకాలు ఉంటే, జపాన్‌లో ఇది ఇంకా చర్చల దశలో ఉంది, వీటిపై పరిశోధనలు సాగుతున్నాయి.
జన్యు సవరణతో మార్చిన పిండాలను పెరగడానికి తిరిగి తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టానని చెబుతున్న శాస్త్రవేత్త హీ.. దేశంలోని చట్టాలను ఉల్లంఘించాడేమో కనుగొనేందుకు చైనా దర్యాప్తునకు ఆదేశించింది.
హీ చట్టాన్ని ఉల్లంఘించాడని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ మంత్రి భావిస్తున్నారు.
"ప్రొఫెసర్ చేసిన ప్రయోగం విని షాకయ్యా, చైనా చట్టాల ప్రకారం అలా చేయడాన్ని నిషేధించాం" అని మంత్రి క్సు నాన్పింగ్ తమ దేశ మీడియాకు తెలిపారు.
మిగతా దేశాల్లాగే చైనా కూడా 'ఇన్-విట్రో హ్యూమన్ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ పరిశోధన'కు గరిష్టంగా 14 రోజుల పాటు అనుమతి ఇస్తోందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బాధలు అడ్డుకోవడం కోసమే..
కానీ ప్రొఫెసర్ హీ మాత్రం కవల సోదరిల డీఎన్ఏను సవరించినందుకు గర్వంగా భావిస్తున్నానని చెబుతున్నారు. అలా చేయడం వల్ల వారిలో ఎవరికైనా హెచ్ఐవీ వచ్చినా అవి దాని నుంచి వారిని రక్షిస్తాయని చెబుతున్నారు.
కానీ పిండాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాటి డీఎన్ఏను సవరించాలనే ఆయన నిర్ణయం వల్ల కవలలకు అంతుపట్టని సమస్యలు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
"ఏ అవసరం లేకపోయినా జన్యువులను సవరించడం వల్ల ఆరోగ్యంగా మామూలుగా ఉన్న పిల్లలను ఆ పరిశోధన సమస్యలకు గురిచేస్తుంది" అని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ప్రొఫెసర్ జూలియన్ సవులెస్కూ బీబీసీతో అన్నారు.
"చికిత్స తీసుకోవడం వల్ల హెచ్ఐవీను ఇప్పుడు సులభంగా నియంత్రించ వచ్చు, దానిని శరీరంలో గుర్తించలేని స్థాయికి తీసుకురావచ్చు" అని మరికొందరు చెబుతున్నారు.
కవలల శరీరాల నుంచి సీసీఆర్5 జన్యువును తొలగించడంపై మరికొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
అలా చేయడం వల్ల వెస్ట్ నైల్ వైరస్, ఇన్ఫ్లూయెంజా లాంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
జన్యు సవరణ అనేదే పరిశోధానాత్మకమైనది. దాని వల్ల ఊహించని మార్పులు జరుగుతాయని, దానివల్ల పుట్టిన సమయంలో, వయసైన తర్వాత జన్యుపరమైన సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కూడా రావచ్చని సవులేస్కు అనే శాస్త్రవేత్త అన్నారు.
మనకు దీర్ఘకాల ప్రభావాల గురించి చాలా తక్కువే తెలుసు, మన విజ్ఞానం మెరుగుపరుచుకోడానికి... నిరాకరించే స్థితిలో లేని మనుషులపై పరిశోధనలు చేయడం నైతికంగా ఆమోదయోగ్యం కాదని చాలా మంది అంగీకరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
డిజైనర్ బేబీల సృష్టి
జన్యుపరమైన వివక్షను సృష్టించేందుకు యూజెనిక్స్ కోసం ఉపయోగించే సాంకేతికతను దుర్వినియోగం చేస్తుండడంపై కొంతమంది శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కానీ ప్రొఫెసర్ హీ మాత్రం, అధిక ఐక్యూ, అందంగా కనిపించే డిజైనర్ శిశువులకు బదులు వ్యాధులతో బాధపడని పిల్లలను సృష్టించడం కోసమే తాను ఈ పరిశోధనలు చేస్తున్నానని అంటున్నారు.
మనిషికి వారసత్వంగా వచ్చే జన్యువులను సవరించే పరిశోధనలు నైతికంగా ఆమోదయోగ్యమేనా అని తెలుసుకోడానికి ఈ ఏడాది బ్రిటన్లో ఒక సర్వే చేశారు. కానీ "జన్యు సవరణ అనేది సమాజంలో ప్రతికూలతలు, వివక్ష, విభజనను పెంచకుండా ఉండేలా ఉపయోగించాలని" ఇందులో వెల్లడైంది.
విప్లవాత్మక పరిశోధన
సీఆర్ఐఎస్‌పీఆర్ అనే జన్యు సవరణ సాంకేతికత మొదట 2012లో వెలుగులోకి వచ్చింది. త్వరలో జన్యుపరంగా మార్పులు చేసిన మనుషుల్ని చూస్తామేమోనని అప్పట్లో చాలా మంది అనుకున్నారు.
చాలా నిర్దిష్టంగా ఉండే ఒక డీఎన్ఏను మార్చడానికి సీఆర్ఐఎస్‌పీఆర్ 'పరమాణు కత్తెర'ను ఉపయోగిస్తుంది. అది ఆ జన్యువును కత్తిరించడం, మార్చడం, లేదా మాట్లు వేయడం చేస్తుంది.
ఇది ఈ రంగాన్ని విప్లవాత్మకం చేసింది. ఎందుకంటే జన్యు పటాన్ని తిరిగి రాయడం, సవరించడం అనేది ఎప్పుడూ అంత సులభం కాదు.
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలోని శాస్త్రవేత్తలు ఎలుక కాలేయం విఫలం కాకుండా అడ్డుకోడానికి ఈ సాంకేతికతను ఉపయోగించారు. ఎలుకలు పుట్టిన తర్వాత కూడా వారి చికిత్స పనిచేస్తున్నట్టు అందులో కనిపించింది.
ఫిలడెల్ఫియాలోని ఒక చిన్నపిల్లల ఆస్పత్రికి చెందిన ఈ పరిశోధకులు జన్యువులను సవరించడం ద్వారా ఎలుకలు పుట్టకముందే వాటిని మార్చవచ్చని ఇప్పుడు చూపిస్తున్నారు.
కానీ తమ పరిశోధనలను మనుషులపై చేయడం వల్ల 'ముఖ్యమైన సవాళ్లు' ఎదురుకావచ్చని వారు చెబుతున్నారు. అంటే అలా చేయడం వల్ల వచ్చే చిక్కులు శాస్త్రీయ మార్గదర్శకాలను అందుకోలేనంతగా ఉంటాయని అర్థం.
ఇవి కూడా చదవండి:
- ప్రసవం: సిజేరియన్ కన్నా సహజకాన్పుతోనే శిశువుకు మేలు
- ఫీకల్ ట్రాన్స్‌ప్లాంట్.. ప్రాణాల్ని కాపాడుతుంది!
- మైండ్ అప్లోడింగ్: మరణాన్ని జయించే దిశగా పరిశోధనలు
- జుట్టు ఎందుకు ఊడిపోతుంది.. పొడవు జుట్టు రహస్యమేంటి
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- హార్ట్ ప్యాచెస్: చనిపోయిన గుండెను తిరిగి బతికించొచ్చా?
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- మనకు వెలుగిచ్చే సూర్యుడికే మరణం వస్తే? ప్రపంచం అంతమైపోతుందా?
- రాహుల్ గాంధీకి 'కౌల్' గోత్రం ఎలా వచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








