జీవ గడియారం గుట్టు విప్పినందుకు నోబెల్

ఫొటో సోర్స్, EPA
అమెరికా శాస్త్రవేత్తలు జెఫ్రీ హాల్, మైఖేల్ రోస్‌బ్యాష్, మైఖేల్ యంగ్‌లు ఈ ఏడాది సంయుక్తంగా నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
మనకు ఎందుకు రాత్రే నిద్రపోవాలనిపిస్తుంది? ఎందుకు నిర్ధిష్ట సమయానికి ఆకలి వేస్తుంది? ఈ ప్రశ్నలకు జీవ గడియారం లేదా 'సర్కాడియన్ రిథమ్' కారణం. దీని వల్లే మన ప్రవర్తనలో, శరీర ధర్మాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి.
మానవ శరీరంతో పాటు మొక్కలు, చెట్టు, ఫంగీలోని ప్రతి కణంలో కూడా నిరంతరం ఒక గడియారం పని చేస్తూనే ఉంటుంది.
మన మూడ్, హార్మోన్ లెవెల్స్, శరీర ఉష్ణోగ్రతలు, జీవక్రియలు.. అన్నీ కూడా రోజువారీ క్రమంలో మారిపోతుంటాయి. దీనికి కారణం 'జీవ గడియారం' అని వీరు తేల్చారు.
టిక్.. టిక్.. టిక్
మన జీవ గడియారం ఎంత కచ్చితంగా మన శరీరాన్ని రాత్రింబవళ్లకు అనుగుణంగా మారుస్తుందంటే.. అందులో కొంచెం మార్పులు వచ్చినా, తీవ్రమైన ఫలితాలుంటాయి.
మన శరీరం తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుగుణంగా వెంటనే మారకపోవడం వల్లే జెట్ లాగ్ లాంటి అనుభవం కలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
'జీవ గడియారం' చెడిపోతే జ్ఞాపకశక్తి దెబ్బ తింటుంది. దీర్ఘకాలంలో టైప్-2 మధుమేహం, కేన్సర్, గుండెపోటులాంటి జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కనిపెట్టిన అంశాలు మన ఆరోగ్యం మీద విస్తృత ప్రభావం చూపుతాయని నోబెల్ కమిటీ వెల్లడించింది.
''మన జీవ గడియారానికి అంతరాయం కలిగిస్తే, అది మన జీవక్రియ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది'' అని ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ రస్సెల్ ఫాస్టర్ తెలిపారు.
జీవ ప్రపంచంలో అణు గడియారాలు ఎలా పని చేస్తాయో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ వివరించారని ఆయన పేర్కొన్నారు.
గతంలో జీవ గడియారం అనేది మిస్టరీగా ఉండేది. ఈ పరిశోధనతో ఆ రహస్యాల గుట్టు రట్టైందని ఆయన అభిప్రాయపడ్డారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








