కేశ సమస్యలు: కొబ్బరి నూనె వల్ల జుట్టు పెరుగుతుందా? జుట్టు ఎందుకు ఊడిపోతుంది? - నమ్మకాలు నిజాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ రొంపిచెర్ల భార్గవి
- హోదా, బీబీసీ కోసం
అబ్బ... ఎంత పెద్ద జడో! వీధిలో తమ ముందు నడుస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యంతో నోరు తెరుస్తూ, అనుకోకుండా పైకే అనేసింది అమల. "జుట్టు పొడుగ్గా పెరగడానికి, ఏం వాడుతోందో ?అడుగుదామా?" అంది పక్కనే నడుస్తున్న పద్మ.
ఈ లోపు వీళ్ల మాటలు విన్న ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వింది. "ఏమండీ, మీరు వాడే హెయిరాయిల్ పేరేంటి? "ఇద్దరూ ఒక్కసారే అడిగారు, "నేనసలు హెయిరాయిలే వాడను" అందా అమ్మాయి. "ఓహో శుద్ధమయిన కొబ్బరినూనా?" అంది పద్మ ఊరుకోకుండా. "ఊహూ, ఏదీ వాడను" అంది.
అదేవిటో పల్లవి హఠాత్తుగా ఈ మధ్య బరువు పెరిగిపోయింది, బహిష్ఠులు కూడా సక్రమంగా రావడంలా, మూతిమీద వెంట్రుకలు కూడా మొలిచాయి మగవాళ్ల లాగా. డాక్టర్ని సంప్రదిస్తే పాలీ సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పి.సి.ఒ.డి) అన్నాడు. హార్మోన్ల అసమతౌల్యం వలన ఇలా జరుగుతుందనీ, ఆహారనియమాలు పాటించీ, వ్యాయామాలు చేసీ బరువు తగ్గితే సమస్య పరిష్కారమౌతుంది. కానీ వెంట్రుకల సమస్యకి పరిష్కారం షేవింగ్ చేసుకోవడం కానీ, ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ కానీ అని చెప్పాడు.
‘నా జుట్టంతా కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతోంది ,చూడూ నా జడ ఎలా తయారయిందో పిలక లాగా’ అని తల్లితో చెప్పుకొని బాధపడింది భారతి. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసికెళితే మానసిక ఒత్తిడి కారణమనీ, అది తగ్గించుకోవాలనీ, సరైన ఆహారం తీసుకుంటూ వేళకు నిద్రపోతే సరిపోతుందన్నాడు.
గంటసేపటి నుంచీ అద్దం ముందునుండీ కదలకుండా క్రాఫ్ దువ్వుకుంటున్న భర్తను చూస్తూ "ఎంతసేపండీ ఆ అద్దం ముందు? అయినా ఆ బట్టతల మీదున్న నాలుగు వెంట్రుకలూ సర్దడానికింత సేపా?" అంది సరోజ.

ఫొటో సోర్స్, Getty Images
అసలేమిటి ఈ కేశాలు, వాటి కష్టాలు,?
కేశాలు సౌందర్యాన్ని కొలిచే సాధనాలు మాత్రమేనా ఇంకేమన్నా ప్రయోజనముందా? అసలీ జుట్టు కథేమిటో కొంచెం పరిశీలిద్దాం.
జుట్టు సృష్టిలో పాలిచ్చే జంతువులకే ప్రత్యేకమయినది. ఆది కాలంలో ఒళ్లంతా కప్పుతూ వుండేది. అప్పట్లో అది సౌందర్యానికి కొలమానం కాదు. శరీరభాగాలకు రక్షణగా ఉండటంతో పాటు, కొన్ని రకాలైన స్పందనలను చూపేది.
ఉదాహరణకు మనకు ఏదైనా తీవ్రమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఒంటి మీద రోమాలు నిక్కబొడుచు కోవడం చూస్తూ ఉంటాం. అంతేకాక ముఖ్యమైన శరీరభాగాలను కప్పి రక్షించడంతో పాటు,శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది.
కాలక్రమేణా మానవ జాతి పరిణామక్రమం వల్లా ,పరిస్థితుల ప్రభావం వల్లా ఆది కాలంలో ఉన్నంత జుట్టు మనిషికి ఇప్పుడు ఉండక పోవచ్చు. అయితే స్త్రీ, పురుషులిద్దరిలోనూ అది ఉండవలసిన చోట్ల, ఉండాల్సినంత లేకపొతే సౌందర్య హీనంగానూ, అనాకర్షణీయంగానూ భావించడం, న్యూనతకు లోనవడం చూస్తూనే వున్నాం.
అలాంటి పరిస్థితులలో స్త్రీ, పురుషులిద్దరూ కేశ పోషణ కోసం అనేక సౌందర్య సాధనాలను ఆశ్రయించడం, దానికోసం ప్రత్యేక విభాగాలుండటం, ప్రత్యేక నిపుణులుండటం(ట్రయిఖాలజిస్ట్ ), కేశాలకి సంబంధించిన ఉత్పత్తులకి చెందిన వ్యాపారాలు కొన్ని వేలకోట్ల టర్నోవర్‌తో నడుస్తూ ఉండటమూ చూస్తే, వాటికి జీవితంలో ఎంత పెద్ద పాత్ర వుందో అర్థమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇదీ జుట్టు కథ
కేశ నిర్మాణమూ, ఎదుగుదలా, అవి రాలిపోవడానికి దారితీసే పరిస్థితులూ ఒకసారి గమనిస్తే , ప్రజలలో ఉన్న చాలా అపోహలు తొలగిపోయే అవకాశముంది.
మన శరీరం మీద ఉండే వెంట్రుకలు చర్మంలోని డెర్మిస్ అనే పొర నుంచీ బయలుదేరుతాయి.
ప్రధానంగా ఒక్కో వెంట్రుకలోనూ పాపిల్లా(కుదురు), షాఫ్ట్ అనే భాగాలుంటాయి. వెంట్రుక మొత్తం కెరటిన్ అనే ప్రోటీన్‌ని కలిగి ఉంటుంది.
వెంట్రుక షాఫ్ట్‌లో ఉన్న మెలనిన్ అనే పదార్థం వలన వెంట్రుకల రంగు నిర్ణయమవుతుంది.
మెలనిన్ ఎక్కువగా ఉంటే నల్లగా వుంటాయి , తక్కువగా వుంటే గోధుమ రంగులోనూ, తెల్లగానూ అవుతాయి. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. వెంట్రుక కుదురు ముఖ్యమైనది. ఈ కుదుళ్లు ఆరోగ్యంగా బాగుంటే రాలిపోయిన వెంట్రుక స్థానంలో కొత్త వెంట్రుకలొస్తాయి.
ఈ వెంట్రుకల కుదుళ్లు శరీరం మొత్తం మీద సుమారు అయిదు మిలియన్లుంటే, తలమీద ఒక మిలియన్ వరకూ వుంటాయి. ఇవి తల్లి కడుపులో ఇరవై రెండు వారాల పిండంగా ఉన్నప్పుడే ఏర్పడతాయి. ఒక జీవిత కాలంలో వీటి సంఖ్య పెరగదు.
మన శరీరంలో ఈ వెంట్రుకలు లేని ప్రదేశాలు చాలా తక్కువ. పెదవులు, అరిచేతులూ, అరిపాదాలూ, బొడ్డూ, మానిన గాయాల మచ్చలూ మినహా శరీర ఉపరితలమంతా వెంట్రుకలు వ్యాపించి ఉంటాయి. కాకపోతే కొన్ని చోట్ల మృదువైన జుట్టుంటే కొన్నిచోట్ల బిరుసైన జుట్టుంటుంది.

జుట్టు ఎదుగుదల-దశలు
ఒక్కొక్క వెంట్రుకా రోజుకి 0.3-0.4 మి.మీ లు పెరుగుతుంది. ఒక సంవత్సరంలో సుమారు ఆరు అంగుళాలు పెరుగుతుంది.
జుట్టు ఎదుగుదలలో మూడు దశలుంటాయి.
ఎనాజన్ దశ: ఈ దశలో యాక్టివ్‌గా పెరుగుతూ ఉంటుంది.
కెటాజన్ దశ: ఎదుగుదలకీ, విశ్రాంతికీ మధ్య దశ.
టెలోజన్ దశ: విశ్రాంతి దశ ,ఈ దశలో రాలిపోయే అవకాశాలెక్కువ.
ఎనాజన్ దశ ఒక్కో మనిషికీ ఒక్కో సమయంలో ఒక్కో రకంగా ఉండవచ్చు. కొంతమందికి రెండు నుంచీ ఆరు సంవత్సరాలుండవచ్చు. ఇది ఎక్కువకాలం ఉన్న వారిలో జుట్టు ఎక్కువ పొడుగవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
జుట్టు రాలిపోవడం
రోజుకి సుమారు 30-40వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. వందకంటే ఎక్కువ రాలిపోతే ఎక్కువ జుట్టు ఊడిపోతున్నట్టు లెక్క.
వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలడం ఎక్కువవుతుంది.
జుట్టు కుదురుకింద ఉండే రక్త కేశ నాళికల నుంచీ సరఫరా అయ్యే రక్తమూ, ఇతర న్యూట్రియంట్స్ మీద జుట్టు ఆరోగ్యం ఆధార పడి ఉంటుంది. సరైన ఆహారమూ, పరిశుభ్రతా జుట్టుని ఆరోగ్యంగా ఉంచితే, రక్త సరఫరా తగ్గడమూ, కొన్ని వ్యాధులూ జుట్టుని నిర్వీర్యం చేసి రాలిపోయేట్టు చేస్తాయి. అంతేకాని పైపై పూతల వలన, నూనెల వలనా ఏ ప్రయోజనమూ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
జుట్టు ఊడిపోవడానికి కొన్ని కారణాలు
- వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలడం ఎక్కువవుతుంది.
- జన్యుపరంగా పొడుగు జుట్టుండే కుటుంబాలలో వారికి, జుట్టు పొడుగవుతుంది. మందులవలన సహజంగా ఉన్న పొట్టి జుట్టు పొడువు పెరగదు.
- మానసికమైన, శారీరకమైన ఒత్తిడి జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు.
- హార్మోన్ల అసమతౌల్యం జుట్టు ఎదుగుదల మీదా, అవాంఛిత రోమాలు ఏర్పడటంలోనూ, జుట్టు రాలిపోవడంలోనూ చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆండ్రోజన్స్ అనే హార్మోన్స్ జుట్టు ఎదుగుదల మీద బాగా ప్రభావం చూపుతాయి. పి.సి.ఓ.డి. అనే వ్యాధిలో ఆండ్రోజన్స్ ఎక్కువవడం వలన ఆడవారిలో అవాంఛిత రోమాలు ఏర్పడి శారీరకంగా మానసికంగా ఇబ్బందిని కలిగిస్తాయి.
- ఇవేకాక థైరాయిడ్ హార్మోన్ ఎక్కువయినా, తక్కువయినా జుట్టు ఊడిపోతుంది.
- గర్భిణీ సమయంలోనూ, ప్రసవ సమయంలోనూ కూడా జుట్టు ఊడిపోవడంలో హార్మోన్ల పాత్ర వుంది.
- కొన్ని రకాల జ్వరాల వల్ల (ఉదా: టైఫాయిడ్) జుట్టు రాలిపోతుంది.
- ఇన్ఫెక్షన్లు- వైరల్, బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లలో జుట్టు విపరీతంగా ఊడుతుంది.
- క్యాన్సర్ల లోనూ,కేన్సర్ చికిత్సలో వాడే మందులకీ, రేడియేషన్ కీ జుట్టు మొత్తం ఊడిపోయినా, వయసులో ఉన్న వారికి ఆ చికిత్స పూర్తి కాగానే మళ్లీ జుట్టు పెరుగుతుంది. ఒక్క బ్రెయిన్‌కి రేడియేషన్ ఇచ్చే సందర్భాలలో మాత్రం ఈ భరోసా ఉండదు. జుట్టు తిరిగి రాకపోవచ్చు. ఇటువంటి సందర్భాలలో కొందరు తమ జుట్టుని క్యాన్సర్ బాధితుల కోసం డొనేట్ చేస్తుండటం మంచి పరిణామం.
- కొన్ని వాతావరణ పరిస్థితులు అతివేడీ, అతి చల్లదనం జుట్టుకి పనికి రావు. జుట్టుని మాటి మాటికీ బ్లో డ్రయింగ్ చేయించడం కూడా జుట్టు కోల్పోడానికి కారణమవుతుంది.
- జుట్టుకి వేసే వివిధ రకాల రంగులకి చెందిన రసాయనాలు, షాంపూలూ, తలమీద వుండే చర్మాన్ని నాశనం చేయడంతో పాటు, జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. అందుకే డాక్టర్ సలహాతో మాత్రమే చుండ్రుకి సంబంధించిన, ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకి సంబంధించిన షాంపూలూ,లోషన్లూ వాడాలే గానీ వ్యాపార ప్రకటనలు చూసి కాదు.
- కొంత మంది మానసిక రోగులలోనూ, మానసిక ఆందోళనకు గురి అయిన వారిలోనూ జుట్టు పీక్కునే అలవాటు వుంటుంది. దీనినే "టృయిఖో టిల్లో మానియా "అంటారు. వీరిలో కూడా, తల మీద జుట్టు తగ్గి పోయి కనపడుతుంది.
అందమైన తలకట్టు వలన సౌందర్యం ఇనుమడిస్తుందనే భావనతో, కేశసౌందర్య సాధనాల కోసం, కేశ పోషణ కోసం బ్యూటీ క్లినిక్‌లలోనూ,హెయిర్ సెలూన్లలోనూ బోలెడంత డబ్బూ, సమయమూ వెచ్చించే వారు తెలుసుకోవలసిందేంటంటే - పైపైన రాసే నూనెల వలనా, షాంపూల వలనా పొందే ప్రయోజనం చాలా తక్కువ.
మంచి ఆహారము (ఆకు కూరలూ, పప్పులూ, గుడ్లూ, ఇతర ఖనిజాలూ కలిగిన సమతులాహారం) చక్కని నిద్రా, జుత్తు రాలిపోడానికి దారితీసే అనారోగ్యాలు దరిచేరకుండా చూసుకోవడమూ, కాలుష్యం లేని వాతావరణంలో ఉండటమూ చేస్తూ, అనవసరమైన కెమికల్సూ, రంగులూ జుట్టుకి హానిచేస్తాయని గ్రహించి, వయసుకు తగ్గట్టుగా జుట్టులో వచ్చే మార్పులని అంగీకరించి, దానికి ఇవ్వవలసినంత ప్రాముఖ్యత మాత్రమే ఇస్తూ హుందాగా జీవించడంలో అందముంది.
ఇవి కూడా చదవండి
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
- మహిళలకు జుట్టు లేకపోతే ఏమవుతుంది?
- ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేయడం సాధ్యమా?
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
- బట్టతల సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా?
- కీటోడైట్ అంటే ఏంటి? కొవ్వుకు కొవ్వే పరిష్కారమా?
- ఐన్‌స్టీన్‌కు వచ్చిన పేరు ఆయన భార్యకు ఎందుకు రాలేదు?
- సుహాసిని, సురేఖ, రేష్మ... తెలంగాణ ఎన్నికల్లో ఈ మహిళలు ఎందుకంత ప్రత్యేకం?
- మహిళలకు ప్రమాదకరమైన ప్రాంతం ఆమె ఇల్లే
- ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ భవనం: ఆకాశ హర్మ్యాలు ఇలా నిర్మిస్తారు
- #BBCShe: తెల్లటి మోడల్సే ఎందుకు? తమిళ యువతుల సూటి ప్రశ్న?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








