మహిళలకు జుట్టు లేకపోతే ఏమవుతుంది?

ఆడవాళ్లకు జుట్టే అందమని కొందరంటారు. కానీ ఈ మహిళలకు జుట్టు లేదు. అయితేనేం... కొండంత ఆత్మవిశ్వాసం మా సొంతం అంటున్నారు. వీళ్లు అలొపీషియా అనే వ్యాధి బాధితులు. జుట్టు రాలిపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.
అలొపీషియాతో జీవించడం చాలా కష్టమని, అయినా అది తమకు అలవాటైపోయిందని వీరు చెబుతారు. అందుకే, జుట్టు ఉండటాన్ని ఆస్వాదించాలని అంటారు.
‘‘ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక చాలాసార్లు ఏడ్చేశా. నా జుట్టంటే నాకు చాలా ఇష్టం. దాన్ని చూసి గర్వపడేదాన్ని. కష్టపడి జుట్టును పెద్దగా పెంచా. కానీ ఇప్పుడు అంతా ఊడిపోయింది. 'జీవితాంతం ఇలానే బతకాలి' అనే ఆలోచననే భరించలేకపోయా. ఆడవాళ్లకు జుట్టు చాలా ముఖ్యమని, అదే స్త్రీత్వమని నా అభిప్రాయం.
ఈ వ్యాధి కారణంగా జుట్టు ఊడిపోతుందని నాకు ముందే తెలుసు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. జుట్టు ఉన్నా లేకపోయినా ఆడవాళ్లు అందంగానే ఉంటారు’’ అంటారు క్యాట్ బ్రౌన్ అనే అలొపీషియా బాధితురాలు.
క్యాట్ లానే లూయీ అనే మరో యువతి కూడా చిన్నతనంలోనే అలొపీషియా బారిన పడ్డారు.

‘మనం జీవితాన్ని నియంత్రించలేం. అలానే ఈ అలొపీషియాను కూడా. నాకు ఎనిమిదేళ్లున్నప్పుడు ఓసారి మైదానంలో ఆడుకుంటున్నా. ఉన్నట్టుండి నా టోపీ తలమీద నుంచి ఎగిరిపోయి దూరంగా పడింది. దాంతో అందరి చూపూ నా తలమీదే పడింది. అప్పటికే నా జుట్టు ఊడిపోయింది.
జుట్టు ఉండటం చాలా అందమైన అనుభూతి. కానీ, జుట్టు లేదని నేనేమీ బాధపడట్లేదు. ఇందులోనూ అందాన్ని చూసుకుంటున్నా. నాక్కూడా ఈ పరిస్థితికి అలవాటు పడటం కష్టమే. కానీ, వాస్తవంలో జీవించడానికి ప్రయత్నిస్తున్నా’ అంటారు లూయీ.
అలొపీషియా ప్రభావం ఎక్కువగా తలపైన, ఒక్కోసారి శరీరమంతటా ఉంటుంది. కానీ, అలొపీషియాను చూసి భయపడాల్సిన పనిలేదని, ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుర్కోవచ్చని క్యాట్, లూయీ చెబుతారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









